రిలయన్స్ గ్యాస్ ధర పెంపునకు పచ్చజెండా..
గ్యాస్ అక్రమ నిల్వ(హోర్డింగ్), ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగా తగ్గించారనే అంశాలకు సంబంధించి బ్యాంకు గ్యారంటీ ఇచ్చే పక్షంలో వచ్చే ఏప్రిల్ నుంచి సహజ వాయువు ధరను దాదాపు రెట్టింపు పెంచడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను అనుమతించాలని సీసీఈఏ గురువారం నిర్ణయించింది. కొత్త ధర(యూనిట్‌కు 8.4 డాలర్లు-ప్రస్తుత ధర 4.2 డాలర్లు) ప్రకారం ఆర్‌ఐఎల్‌కు పెరిగే ఆదాయానికి సమాన స్థాయిలో బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది.
కేజీ-డీ6 బ్లాకులోని డీ1, డీ3 క్షేత్రాల్లో 2010-11 నుంచి గ్యాస్‌ను హోర్డింగ్ చేశారని, ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తిని తగ్గించారని రుజువైన పక్షంలో బ్యాంకు గ్యారంటీని ప్రభుత్వం నగదుగా మార్చుకుంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆర్‌ఐఎల్ గ్యాస్ ధర పెంపును తిరస్కరించాలని చమురు శాఖ ముందుగా భావించింది. గత మూడేళ్లలో ఉత్పత్తి లోటును ఆర్‌ఐఎల్ భర్తీ చేసేవరకు లేదా ఉత్పత్తి లక్ష్యఛేదనలో వైఫల్యానికి తమ బాధ్యత ఏమీ లేదని సంస్థ రుజువు చేసేంతవరకు ధర పెంపును అంగీకరించకూడదని ప్రతిపాదించింది. అయితే, ఈ వివాద పరిష్కారానికి మధ్యేమార్గంగా బ్యాంకు గ్యారంటీని తెరపైకి తెచ్చారు.