సహజవాయువు ధర అక్కడే.. | Centre defers decision on natural gas prices by three months | Sakshi
Sakshi News home page

సహజవాయువు ధర అక్కడే..

Published Thu, Jun 26 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

సహజవాయువు ధర అక్కడే..

సహజవాయువు ధర అక్కడే..

- పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసిన కేంద్ర కేబినెట్
- మరో 3 నెలల వరకూ ప్రస్తుత రేట్లే...

న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర గ్యాస్ ఉత్పత్తి కంపెనీల ఎదురుచూపులు ఫలించలేదు. దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు ధర పెంపుపై నిర్ణయాన్ని కేంద్రం మరో మూడు నెలలు వాయిదా వేసింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) భేటీలో ధరల పెంపు అంశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో గతేడాది ఆమోదించిన వివాదాస్పద గ్యాస్ ధరల పెంపు ఫార్ములాపై విస్తృతస్థాయిలో సమీక్ష జరపడం కోసం ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు ఆయన చెప్పారు. రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ ధరను ప్రస్తుతం ఉన్న 4.2 డాలర్ల స్థాయి(ఒక్కో బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు) నుంచి 8.8 డాలర్లకు పెంచాల్సి ఉంది.

వాస్తవానికి దీన్ని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమలు చేయాల్సిఉన్నప్పటికీ... ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో జూలై 1 నుంచి పెంపు అమలుచేయవచ్చని కంపెనీలు భావించాయి. అయితే, గ్యాస్ ధర పెంపు విషయంలో గతంలో యూపీఏపై ఎదురుదాడి చేసిన బీజేపీ... ఇప్పుడు ఎకాఎకిన గత ప్రభుత్వం నిర్ణయాన్నే అమలుచేస్తే తమపై ప్రతికూలతకు దారితీయొచ్చనే కారణంతో వాయిదా మంత్రాన్ని జపించింది.
 
ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటాం...
 ‘కేబినెట్ భేటీలో గ్యాస్ ధరను సెప్టెంబర్ చివరివరకూ ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించాం. ఈ అంశంపై అన్ని పక్షాలతోనూ మరింత విస్తృతంగా సంప్రదింపులు జరపాలని కేబినెట్ భావించింది. ముఖ్యంగా ధర పెంపు విషయంలో ప్రజాప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ప్రధాన్ చెప్పారు.

గత శుక్రవారం నుంచి ఈ విషయంపై ప్రధాని మోడీతో మూడుసార్లు ప్రధాన్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కాగా, మరోసారి సమీక్ష కోసం నిపుణుల కమీటీ లేదా మంత్రుల బృందం వంటివి ఏర్పాటు చేస్తారాలేదా అనేది ప్రధాన్ చెప్పలేదు. అయితే, ప్రధాని కార్యాలయం(పీఎంఓ), చమురు శాఖలు ఈ సమీక్ష యంత్రాంగాన్ని నిర్ణయిస్తాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అయితే, పూర్తిగా కొత్త ఫార్ములాను ప్రతిపాదిస్తారా లేదంటే రంగరాజన్ ఫార్ములాలోనే మార్పులు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

ధర పెంపును 7-7.5 డాలర్లకు పరిమితం చేయడం, కొత్త బ్లాక్‌ల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌కు మాత్రమే ధర పెంపును వర్తింపజేయడం ఇతరత్రా కొన్ని ప్రతిపాదనలను ఇందుకోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుత  గ్యాస్ ధరలతో కొత్త క్షేత్రాల అభివృద్ధి తమకు లాభసాటికాదని.. తక్షణం రేట్లు పెంచాల్సిందేనంటూ గట్టిగా పట్టుబడుతున్న రిలయన్స్.. దాని భాగాస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)లకు మోడీ సర్కారు వాయిదా నిర్ణయం మింగుడుపడని అంశమే. ఏప్రిల్ 1 నుంచి ధర పెంపును అమలు చేయనందుకుగాను రిలయన్స్ ఇప్పటికే ప్రభుత్వానికి ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వం) నోటీసును కూడా జారీ చేసింది.
 
ధర పెంపుతో ప్రజలపై తీవ్ర ప్రభావం
రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం సహజవాయువు ధరను 8.8 డాలర్లకు గనుక పెంచితే అది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా విద్యుత్ చార్జీలు ఒక్కో యూనిట్‌కు రూ.2 వరకూ ఎగబాకవచ్చని అంచనా. దీంతోపాటు వాహనాలకు వాడే సీఎన్‌జీ రేట్లు కూడా ఒక్కో కేజీకి రూ.12 వరకూ(ఢిల్లీలో) పెరిగే అవకాశాలున్నాయి. పైపుల ద్వారా సరఫరా చేసే వంటగ్యాస్ ధర కూడా పెరిగిపోనుంది. ఎరువుల కంపెనీలకు గ్యాస్ ధర భారం కావడంతో వాటికి ప్రభుత్వం ఇస్తున్న ఎరువుల సబ్సిడీలు కూడా ఎగబాకేందుకు దారితీయనుంది. ఒక్కో డాలరు గ్యాస్ ధర పెంపుతో యూరియా ఉత్పత్తి ధర టన్నుకు రూ.1,370 చొప్పున ఎగబాకుతుంది. ఈ పరిణామాలతో ద్రవ్యోల్బణం దూసుకెళ్తుందనే ఆందోళనలు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement