రిలయన్స్ పరిహారం ఇవ్వాల్సిందే!
ఏడేళ్లుగా ఓఎన్‌జీసీ గ్యాస్‌ను రిలయన్స్ తోడుకుంది...
* కేంద్రానికి జస్టిస్ ఏపీ షా కమిటీ సమగ్ర నివేదిక
* భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా సూచనలు
* ఓఎన్‌జీసీ కోల్పోయిన గ్యాస్ విలువ రూ.11 వేల కోట్లు..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీతో గ్యాస్ వివాదంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు ఎదురుదెబ్బ తగిలింది. కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీకి చెందిన బ్లాక్‌ల నుంచి రిలయన్స్ ఆర్‌ఐఎల్ గత ఏడేళ్లుగా గ్యాస్‌ను తోడేసుకున్నట్లు జస్టిస్ ఏపీ షా కమిటీ తేల్చిచెప్పింది. ఇందుకుగాను ఓఎన్‌జీసీకి నష్టపరిహారాన్ని ఆర్‌ఐఎల్ చెల్లించాలని బుధవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సమర్పించిన సమగ్ర నివేదికలో పేర్కొంది.
అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన సూచనలను కూడా నివేదికలో కమిటీ పొందుపరిచింది. కేజీ బేసిన్‌లో ఆర్‌ఐఎల్ తమ బ్లాక్‌ల నుంచి అక్రమంగా గ్యాస్‌ను తరలించేస్తోందంటూ ఓఎన్‌జీసీ ఆరోపణలు చేయడంతో కేంద్రం ఈ వివాదంపై ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా నేతృత్వంలో ఏక సభ్య కమిటీని నియమించడం తెలిసిందే.
కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీకి ఉన్న గోదావరి-పీఎంఎల్, కేజీ-డీడబ్ల్యూఎన్-98/2 బ్లాక్‌లు ఆర్‌ఐఎల్‌కు ఉన్న కేజీ-డీ6 ప్రధాన క్షేత్రం పక్కనే ఉన్నాయి. వీటి నుంచి 2009, ఏప్రిల్ 1 నుంచి 2015, మార్చి 31 మధ్య కాలంలో ఆర్‌ఐఎల్ కేజీ-డీ6కు 11.122 బిలియన్ ఘనపు మీటర్ల మేర గ్యాస్ తరలిపోయినట్లు స్వతంత్ర అధ్యయన సంస్థ డీఅండ్‌ఎం గతేడాది నవంబర్‌లో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అప్పటి సహజ వాయువు రేట్ల(యూనిట్‌కు 4.2 డాలర్లు) ప్రకారం దీని విలువ 1.7 బిలియన్ డాలర్లు(సుమారు రూ.11,055 కోట్లు)గా లెక్కగట్టింది.
తమ బ్లాక్‌ల నుంచి ఆర్‌ఐఎల్ క్షేత్రాలకు గ్యాస్ తరలిపోతోందని 2013లో గుర్తించిన ఓఎన్‌జీసీ.. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిహారం ఇప్పించాలని కేంద్రాన్ని కోరింది. అయితే, తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఓఎన్‌జీసీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు ఈ వివాదంపై స్వతంత్ర కన్సల్టెంట్ సంస్థ నివేదిక ఇచ్చిన ఆరు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి నిర్దేశించింది. అయితే, పీఎస్‌సీ ప్రకారమే తాము నడుచుకున్నామని, కేజీ-డీ6 బ్లాక్ పరిధిలోనే బావుల తవ్వి ఉత్పత్తి చేపట్టినట్లు ఆర్‌ఐఎల్ చెబుతూవస్తోంది.
నెలరోజుల్లో తగిన నిర్ణయం: ప్రధాన్
నివేదికలో అంశాలపై మాట్లాడేందుకు నిరాకరించిన జస్టిస్ షా... అన్ని అంశాలతో సమగ్రంగా దీన్ని కేంద్రానికి ఇచ్చినట్లు చెప్పారు. పెట్రోలియం శాఖ భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను కూడా ఇందులో సూచించామన్నారు. ‘గ్యాస్ తరలింపు అంశంపై జస్టిస్ షా సమగ్ర నివేదికను ఇచ్చారు. నెల రోజుల్లో దీనిపై పెట్రోలియం శాఖ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది’ అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
కాగా, ఇదే అంశానికి సంబంధించి స్వతంత్ర సంస్థ డీఅండీఎం ఇచ్చిన నివేదిక(ఇది కూడా ఓఎన్‌జీడీ గ్యాస్ ఆర్‌ఐఎల్ బావుల్లోకి తరలిపోయిందని తేల్చింది) మాదిరిగానే షా కమిటీ కూడా తరలింపు జరిగినట్లు తేల్చిందా అన్న ప్రశ్నకు ప్రధాన్ అవుననే సమాధానమిచ్చారు. ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు(పీఎస్‌సీ) ప్రకారం గ్యాస్ తరలింపు కారణంగా తలెల్తే ఆర్థిక, న్యాయపరమైన అంశాలన్నింటినీ షా కమిటీ నివేదికలో వివరించిందని, తాము దీన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత బయటపెడతామని ఆయన వెల్లడించారు.