రిలయన్స్ వ్యూహాత్మకంగానే మా గ్యాస్ లాగేసింది
♦ 18% వడ్డీతో పరిహారం చెల్లించాలి
♦ ఏపీ షా కమిటీ ముందు ఓఎన్‌జీసీ వాదనలు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ప్రణాళికా బద్ధంగా, వ్యూహాత్మకంగానే తమ క్షేత్రం నుంచి ఆరేళ్ల పాటు 1.4 బిలియన్ డాలర్ల విలువ చేసే గ్యాస్‌ను లాగేసిందని ఓఎన్‌జీసీ ఆరోపించింది. దీనికి సంబంధించి 2009 నుంచి 18 శాతం వడ్డీ రేటుతో కంపెనీ పూర్తి పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇరు కంపెనీల మధ్య వివాదంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఏపీ షా కమిటీకి ఈ మేరకు తమ వాదనలు తెలియజేసింది. 2001 ఆ తర్వాత 2007లోను ఆర్‌ఐఎల్ సొంత బ్లాకుతో పాటు తమ బ్లాకులో నిక్షేపాల గురించి కూడా అధ్యయనాలు జరిపిందని, దీనిపై తమకు సమాచారమూ ఇవ్వలేదని ఓఎన్‌జీసీ పేర్కొంది.
డేటా ఆధారంగా ఆర్‌ఐఎల్ .. తమ బ్లాకు నుంచి గ్యాస్‌ను గరిష్టంగా లాగేసేలా వ్యూహాత్మకంగా, నిర్దిష్ట కోణాల్లో బావులను తవ్విందని ఆరోపించింది. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) కొన్ని అంశాలను పట్టించుకోకపోవడం కూడా దీనికి తోడ్పడిందని ఓఎన్‌జీసీ పేర్కొంది. మరోవైపు, ఈ ఆరోపణలను ఆర్‌ఐఎల్ ఖండించింది. తాము ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీ కేజీ-డీ5, ఆర్‌ఐఎల్ కేజీ-డీ6 గ్యాస్ క్షేత్రాలు పక్కపక్కనే ఉన్నాయి. ముందుగా ఉత్పత్తి ప్రారంభించిన ఆర్‌ఐఎల్ , తమ నిక్షేపంలో నుంచి కూడా గ్యాస్‌ను వెలికితీసి, విక్రయించుకుందంటూ ఓఎన్‌జీసీ ఆరోపిస్తోంది.