న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ తదితర సంస్థలకు ప్రయోజనాలు చేకూర్చేలా క్లిష్టమైన బ్లాకుల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను దాదాపు 60 శాతం పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్ మిగులు దేశాల్లో సగటు రేటును బట్టి దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్‌కు ధరను నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు దేశీ గ్యాస్ ధర యూనిట్‌కు 3.82 డాలర్లుగా ఉండగా, ఏప్రిల్ కల్లా 3.15 డాలర్లకు తగ్గనుంది. అత్యంత లోతైన సముద్ర గర్భం నుంచి గ్యాస్‌ను వెలికితీయాలంటే ఈ రేటు గిట్టుబాటు కాదు. దీంతో నాఫ్తా, ఫ్యుయల్ ఆయిల్, దిగుమతి చేసుకున్న ఎల్‌ఎన్‌జీ వంటి వాటి ప్రత్యామ్నాయ ఇంధనాల ప్రాతిపదికగా రేటును నిర్ణయించాలని యోచిస్తున్నట్లు ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. ఈ విధానం ప్రకారం ఎల్‌ఎన్‌జీ, ఫ్యుయల్ ఆయిల్, నాఫ్తా ప్రస్తుత రేట్ల సగటును బట్టి లెక్కిస్తే దేశీ ఎంబీటీయుకు దాదాపు 6 డాలర్లుగా ఉండొచ్చని అంచనా. కేజీ బేసిన్‌లో దాదాపు ఇరవై పైచిలుకు నిక్షేపాలు సరైన ధర లభించక.. గ్యాస్ ఉత్పత్తికి నోచుకోవడం లేదు.