Natural gas price
-
రిలయన్స్, ఓఎన్జీసీ గ్యాస్ కు అధిక ధరపై కసరత్తు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ తదితర సంస్థలకు ప్రయోజనాలు చేకూర్చేలా క్లిష్టమైన బ్లాకుల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను దాదాపు 60 శాతం పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్ మిగులు దేశాల్లో సగటు రేటును బట్టి దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్‌కు ధరను నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు దేశీ గ్యాస్ ధర యూనిట్‌కు 3.82 డాలర్లుగా ఉండగా, ఏప్రిల్ కల్లా 3.15 డాలర్లకు తగ్గనుంది. అత్యంత లోతైన సముద్ర గర్భం నుంచి గ్యాస్‌ను వెలికితీయాలంటే ఈ రేటు గిట్టుబాటు కాదు. దీంతో నాఫ్తా, ఫ్యుయల్ ఆయిల్, దిగుమతి చేసుకున్న ఎల్ఎన్జీ వంటి వాటి ప్రత్యామ్నాయ ఇంధనాల ప్రాతిపదికగా రేటును నిర్ణయించాలని యోచిస్తున్నట్లు ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. ఈ విధానం ప్రకారం ఎల్ఎన్జీ, ఫ్యుయల్ ఆయిల్, నాఫ్తా ప్రస్తుత రేట్ల సగటును బట్టి లెక్కిస్తే దేశీ ఎంబీటీయుకు దాదాపు 6 డాలర్లుగా ఉండొచ్చని అంచనా. కేజీ బేసిన్లో దాదాపు ఇరవై పైచిలుకు నిక్షేపాలు సరైన ధర లభించక.. గ్యాస్ ఉత్పత్తికి నోచుకోవడం లేదు. -
గ్యాస్ ధరపై జీఎస్పీసీ అసంతృప్తి
న్యూఢిల్లీ: మోదీ సర్కారు నిర్ణయించిన సహజవాయువు ధరపై గుజరాత్ ప్రభుత్వానికి చెందిన గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్(జీఎస్పీసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. కేజీ బేసిన్లో ఉత్పత్తి చేసే గ్యాస్‌కు మార్కెట్ ధర కావాలని డిమాండ్ చేసింది. ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకు గ్యాస్‌ను అమ్మాలంటూ ఒత్తిడి చేయడం సరికాదని చమురు శాఖకు రాసిన లేఖలో జీఎస్పీసీ పేర్కొంది. మార్కెట్ ధర కల్పిస్తే.. ఇక్కడున్న తమ దీన్‌దయాల్ వెస్ట్(డీడీడబ్ల్యూ) క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు కూడా లేఖలో తెలిపింది. తద్వారా కొత్త ధరల విధానంపై తొలిసారి అసంతృప్తి గళం వినిపించినట్లయింది. దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు ధరను ఇప్పుడున్న 4.2 డాలర్ల(ఒక్కో యూనిట్‌కు) నుంచి 5.61 డాలర్లకు పెంచుతూ కేంద్రం గత నెల 18న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, గత యూపీఏ సర్కారు రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం గ్యాస్ రేటును రెట్టింపు చేయగా(8.4 డాలర్లు).. దీన్ని సమీక్షించిన మోదీ ప్రభుత్వం రేటును 33 శాతం మాత్రమే పెంచడం గమనార్హం. -
అక్టోబర్‌కు ముందే గ్యాస్ రేటుపై నిర్ణయం
న్యూఢిల్లీ: సహజ వాయువు (నాచురల్ గ్యాస్) ధరల సవరణ అంశంపై అక్టోబర్ 1 కన్నా ముందే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తెలిపారు. పరిశ్రమ వర్గాలు, నిపుణులతో చర్చించేందుకే ఈ అంశాన్ని గతంలో వాయిదా వేసినట్లు వివరించారు. ప్రతిపాదిత రంగరాజన్ ఫార్ములాలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వీటిని సరిచేస్తామన్నారు. ప్రస్తుతం యూనిట్‌కి 4.2 డాలర్లుగా ఉన్న గ్యాస్ ధర.. రంగరాజన్ ఫార్ములా అమలు చేస్తే రెట్టింపై దాదాపు 8.8 డాలర్లకు పెరుగుతుంది. ఫలితంగా గ్యాస్‌ను ముడిసరుకుగా ఉపయోగించే ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోనున్నాయి. గ్యాస్ ధర డాలర్ పెరిగితే ఎరువుల ఉత్పత్తి వ్యయం టన్నుకు రూ. 1,370, విద్యుత్ టారిఫ్‌లు యూనిట్‌కు 45 పైసల మేర పెరుగుతాయని అంచనా. వంటగ్యాస్ రేటు పెంచం.. వంటగ్యాస్, కిరోసిన్ రేట్లను తక్షణమే పెంచే యోచనేదీ లేదని ప్రధాన్ స్పష్టం చేశారు. డీజిల్ రేటు ప్రతి నెలా లీటరుకు 50 పైసల మేర పెంపు కొనసాగుతుందన్నారు. డీజిల్ విక్రయాలపై ఆదాయ నష్టాలు పూర్తిగా భర్తీ అయిపోయిన తర్వాత పెట్రోల్ తరహాలోనే ఈ ఇంధనం రేట్లపై కూడా నియంత్రణ ఎత్తివేస్తామని ప్రధాన్ చెప్పారు. కష్టాల్లో ఆర్థిక రంగం: రాజ్‌నాథ్ కాగా, లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత్ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందన్నారు. పరిస్థితి చక్కదిద్దడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇందుకు మరికొంత సమయం పడుతుందని వివరించారు. -
సహజ వాయువు ధర 7 డాలర్లు?
రేటు కుదింపుపై ఆర్థిక, చమురు శాఖ మంత్రుల సమాలోచనలు న్యూఢిల్లీ: సహజ వాయువు ధరల పెంపుపై ఉన్నతస్థాయి చర్చలు సోమవారం వరుసగా రెండో రోజు కూడా ముమ్మరంగా కొనసాగాయి. ధర పెంపు గ్యాస్ ఉత్పత్తికి ఊతమిచ్చేదిగా ఉండాలనీ, అదే సమయంలో వినియోగదారులపై పెద్దగా భారం పడకూడదనీ అధికారులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఆదివారం సమావేశమైన ఆర్థిక, చమురు శాఖల మంత్రులు అరుణ్ జైట్లీ, ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రధానమంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రస్తుతం మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్స్(ఎంబీటీయూ)కు 4.2 డాలర్లుగా ఉన్న గ్యాస్ రేటును జూలై నుంచి 8.8 డాలర్లకు పెంచాలన్న రంగరాజన్ ఫార్ములాకు సవరణలు చేయడంపై చర్చించారు. మునుపటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆమోదించిన ఈ ఫార్ములాను అమలు చేస్తే విద్యుత్తు, యూరియా, సీఎన్జీ, పైపుద్వారా సరఫరా చేసే వంటగ్యాస్ ధరలు భారీగా పెరుగుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గ్యాస్ ధర పెంచితే ...: గ్యాస్ ధరపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే అధిక స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోసే చర్యలు చేపట్టరాదని యోచిస్తోంది. గ్యాస్ ధర ఒక డాలరు పెరిగితే టన్ను యూరియా ఉత్పత్తి వ్యయం రూ.1,370 పెరుగుతుంది. విద్యుత్తు ఉత్పత్తి ఖర్చు యూనిట్‌కు 45 పైసలు, సీఎన్జీ ధర కిలోకు రూ.2.81, పైపు ద్వారా సరఫరా చేసే వంట గ్యాస్ ఘనపు మీటరుకు రూ.1.89 పెరుగుతాయి. రంగరాజన్ ఫార్ములాలోని కొన్ని అంశాలను సవరించడమో, తొలగించడమో చేయాలనీ, మధ్యేమార్గంగా గ్యాస్ ధరను 7 లేదా 7.5 డాలర్లకు సవరించాలని అధికార వర్గాలు యోచిస్తున్నాయి. ప్రస్తుత ఉత్పత్తి స్థాయికి మించి ఉత్పత్తి చేసే గ్యాస్‌కే ధరను పెంచాలనీ, నూతన అన్వేషణ లెసైన్సింగ్ విధానం(ఎన్ఈఎల్పీ)లో కనుగొన్న కొత్త క్షేత్రాల్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌కు మాత్రమే అధిక ధరలు నిర్ణయించాలనే అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.