సహజ వాయువు ధర 7 డాలర్లు?
రేటు కుదింపుపై ఆర్థిక, చమురు శాఖ మంత్రుల సమాలోచనలు
న్యూఢిల్లీ: సహజ వాయువు ధరల పెంపుపై ఉన్నతస్థాయి చర్చలు సోమవారం వరుసగా రెండో రోజు కూడా ముమ్మరంగా కొనసాగాయి. ధర పెంపు గ్యాస్ ఉత్పత్తికి ఊతమిచ్చేదిగా ఉండాలనీ, అదే సమయంలో వినియోగదారులపై పెద్దగా భారం పడకూడదనీ అధికారులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఆదివారం సమావేశమైన ఆర్థిక, చమురు శాఖల మంత్రులు అరుణ్ జైట్లీ, ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రధానమంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు.
ప్రస్తుతం మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్స్(ఎంబీటీయూ)కు 4.2 డాలర్లుగా ఉన్న గ్యాస్ రేటును జూలై నుంచి 8.8 డాలర్లకు పెంచాలన్న రంగరాజన్ ఫార్ములాకు సవరణలు చేయడంపై చర్చించారు. మునుపటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆమోదించిన ఈ ఫార్ములాను అమలు చేస్తే విద్యుత్తు, యూరియా, సీఎన్‌జీ, పైపుద్వారా సరఫరా చేసే వంటగ్యాస్ ధరలు భారీగా పెరుగుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
గ్యాస్ ధర పెంచితే ...: గ్యాస్ ధరపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే అధిక స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోసే చర్యలు చేపట్టరాదని యోచిస్తోంది. గ్యాస్ ధర ఒక డాలరు పెరిగితే టన్ను యూరియా ఉత్పత్తి వ్యయం రూ.1,370 పెరుగుతుంది. విద్యుత్తు ఉత్పత్తి ఖర్చు యూనిట్‌కు 45 పైసలు, సీఎన్‌జీ ధర కిలోకు రూ.2.81, పైపు ద్వారా సరఫరా చేసే వంట గ్యాస్ ఘనపు మీటరుకు రూ.1.89 పెరుగుతాయి.
రంగరాజన్ ఫార్ములాలోని కొన్ని అంశాలను సవరించడమో, తొలగించడమో చేయాలనీ, మధ్యేమార్గంగా గ్యాస్ ధరను 7 లేదా 7.5 డాలర్లకు సవరించాలని అధికార వర్గాలు యోచిస్తున్నాయి. ప్రస్తుత ఉత్పత్తి స్థాయికి మించి ఉత్పత్తి చేసే గ్యాస్‌కే ధరను పెంచాలనీ, నూతన అన్వేషణ లెసైన్సింగ్ విధానం(ఎన్‌ఈఎల్‌పీ)లో కనుగొన్న కొత్త క్షేత్రాల్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌కు మాత్రమే అధిక ధరలు నిర్ణయించాలనే అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.