సహజవాయువు ధర 9% కట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు (గ్యాస్) ధర లు ఏప్రిల్ 1 నుంచి 9 శాతం మేర తగ్గనున్నాయి. మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ) ధర ప్రస్తుతం 5.05 డాలర్లుగా ఉండగా ఇకపై 4.56 డాలర్లకు తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విధంగా గ్యాస్ రేట్లు తగ్గించడం ఇదే తొలిసారి కానుంది. దీని వల్ల విద్యుత్, ఎరువుల రంగాల కంపెనీలకు ప్రయోజనం చేకూరనుండగా గ్యాస్ ఉత్పత్తి చేసే ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడనుంది.
గతేడాది ప్రకటించిన ఫార్ములా ప్రకారం ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయని, ప్రభుత్వం నిర్దిష్టంగా రేటును నిర్ణయించడం ఉండదని ఆయా వర్గాలు వివరించాయి. గ్యాస్ ధర ను తగ్గించడం వల్ల సహజ వాయువు నిక్షేపాలను కనుగొనేందుకు చేయబోయే పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఓఎన్‌జీసీ సీఎండీ దినేష్ కే సరాఫ్ చెప్పారు.
సబ్సిడీలపై ఓఎన్‌జీసీ, ఆయిల్‌కు ఊరట..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా సబ్సిడీ చెల్లించనక్కర్లేంకుండా మినహాయింపునిస్తున్నట్లు పెట్రోలియం శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. క్యూ4లో చమురు ఉత్పత్తి కంపెనీలపై సబ్సిడీ భారం ఉండబోదంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి మౌఖికంగా తమకు హామీ లభించినట్లు ఆయన వివరించారు. ఎల్‌పీజీ, కిరోసిన్‌లను నిర్దేశిత రేట్లకు విక్రయించడం వల్ల చమురు, గ్యాస్ మార్కెటింగ్ సంస్థలు కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వం, చమురు ఉత్పత్తి సంస్థలు సబ్సిడీ రూపంలో భర్తీ చే స్తాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రిటైలర్ల అండర్ రికవరీలు రూ. 74,773 కోట్లు ఉంటాయని అంచనా. తొమ్మిది నెలల్లో ఇప్పటికే రూ. 67,091 కోట్లు సబ్సిడీ అందించడం జరిగింది. మిగతాది భరించనున్న ప్రభుత్వం .. కొంత మొత్తాన్ని వచ్చే 2015-16 ఆర్థిక సంవత్సరానికి బలదాయించే అవకాశం ఉంది.