రష్యాకు ఉక్రెయిన్‌ గ్యాస్‌ షాక్‌ | Natural Gas Transit Stopped From Russia To Europe Via Ukraine | Sakshi
Sakshi News home page

రష్యాకు ఉక్రెయిన్‌ గ్యాస్‌ షాక్‌

Published Wed, Jan 1 2025 12:57 PM | Last Updated on Thu, Jan 2 2025 6:08 AM

Natural Gas Transit Stopped From Russia To Europe Via Ukraine

తమ భూభాగం గుండా గ్యాస్‌ సరఫరా ఒప్పందం పొడిగింపునకు ‘నో’

యూరప్‌కు గ్యాస్‌ సరఫరా బంద్‌ 

మాస్కో/కీవ్‌: రష్యా నుంచి చౌకగా గ్యాస్‌ను సరఫరా చేసుకుంటూ లబ్ధి పొందుతున్న యూరప్‌ దేశాలకు కొత్త కష్టాలు వచ్చిపడే అవకాశం కనిపిస్తోంది. రష్యా నుంచి తమ భూభాగం నుంచి గ్యాస్‌ సరఫరాను ఉక్రెయిన్‌ నిలిపివేసింది. ఈ విషయంలో రష్యాతో కుదిరిన ఐదేళ్ల ఒప్పందం బుధవారం ముగిసింది. ఇకపై తమ భూభాగం నుంచి గ్యాస్‌ సరఫరాను అనుమతించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తేల్చిచెప్పారు. ఒకవైపు ఉక్రెయిన్‌ ప్రజల రక్తాన్ని పీలుస్తూ మరోవైపు అదనపు బిలియన్‌ డాలర్లు రష్యా సంపాదిస్తామంటే అనుమతించబోమని అన్నారు. 

మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంలో ఇదొక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఉక్రెయిన్‌ గుండా ఐరోపా ఖండానికి గ్యాస్‌ సరఫరా ఆగిపోవడాన్ని రష్యాపై మరో విజయంగా పోలాండ్‌ ప్రభుత్వం అభివరి్ణంచింది. రష్యా 1991 నుంచి ఉక్రెయిన్‌ భూభాగం ద్వారా యూరప్‌కు గ్యాస్‌ సరఫరా చేస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఒప్పందం పొడిగింపునకు ఉక్రెయిన్‌ అంగీకరించలేదు. ఒప్పందం ముగిసిపోవడం, రష్యా నుంచి సహజవాయువు సరఫరా ఆగిపోవడం చరిత్రాత్మక ఘట్టమని ఉక్రెయిన్‌ ఇంధన శాఖ స్పష్టంచేసింది.
   
→ గ్యాస్‌ సరఫరా ఒప్పందాన్ని ఉక్రెయిన్‌ పొడిగించకపోవడం ఊహించిన పరిణామమే. దీనివల్ల యూరప్‌ దేశాలకు ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లక తప్పదు. రష్యా నుంచి చౌకగా వచ్చే గ్యాస్‌ స్థానంలో ఇకపై ఖరీదైన గ్యాస్‌ను ఇతర దేశాల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది.

→ యూరప్‌ దేశాలకు గ్యాస్‌ సరఫరా ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. దీనివల్ల రష్యాకు నష్టం జరుగుతోంది. రష్యా గ్యాస్‌ దిగ్గజం గాజ్‌ప్రోమ్‌ గత ఏడాది 6.9 బిలియన్‌ డాలర్లు నష్టపోయింది. ఇలా జరగడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. 

→ రష్యా నుంచి ఉక్రెయిన్‌ మార్గం కాకుండా టర్క్‌స్ట్రీమ్‌ లైన్‌ కూడా ఉంది. ఇది తుర్కియే, బల్గేరియా, సెర్బియా, హంగేరీ నుంచి యూరప్‌నకు చేరుతోంది.  

→ యూరప్‌లో గ్యాస్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని యూరేíÙయా గ్రూప్‌ ఎనర్జీ హెడ్‌ హెనింగ్‌ గ్లోస్టీన్‌ చెప్పారు. గ్యాస్‌ ధరల భారంతో విద్యుత్‌ చార్జీలు అమాంతం పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా గ్యాస్‌తో యూరప్‌ దేశాలు విద్యుత్‌ ఉత్పత్తి చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.  

→ 2022లో ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభం కాకముందు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు అతిపెద్ద గ్యాస్‌ సరఫరాదారు రష్యా. 2021లో ఆయా దేశాలు తమ అవసరాల్లో 40 శాతం గ్యాస్‌ను రష్యా నుంచే పైప్‌లైన్‌ ద్వారా దిగుమతి చేసుకున్నాయి. యుద్ధం మొదలైన తర్వాత 2023 నాటికి అది 8 శాతానికి పడిపోయింది. 
→ అయితే యూరప్‌కు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌ ప్రజలకు జెలెన్‌స్కీ కీలక సందేశం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement