సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతోన్న అనేక సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతుండటం ఓ విశేషం కాగా..దేశంలో అమలు చేసే ఏ పథకానికైనా రాష్ట్రం ఎంపిక అవుతుండటం మరో విశేషం. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రాం (ఎన్‌ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రాం (ఈఈఎఫ్‌పీ) పథకాలకు ఏపీ ఎంపికైంది.
కుకింగ్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల ఇండక్షన్ కుక్‌స్టవ్‌లను ఈఈఎస్‌ఎల్ సరఫరా చేయనుంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో చురుకుగా వ్యవహరిస్తున్న యూపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ వీటిని పంపిణీ చేయనున్నట్లు ఈఈఎస్‌ఎల్ తెలిపింది.
ఈ–కుక్కర్‌తో ఆరోగ్యం..
‘ఎన్‌ఈసీపీ’ ద్వారా ఇచ్చే ఈ స్టవ్‌లు వంటకు ఉపయోగించే సంప్రదాయ సహజ వాయువు (ఎల్‌పీజీ), బయోమాస్ వంటి ఇంధనాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనున్నాయి. వంటకు వినియోగించే ఇంధనాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి్సన అవసరం, అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన ఆగత్యం తప్పుతుంది. సాంప్రదాయ వంట పద్ధతుల కంటే 25–30% ఖర్చును దీనివల్ల ఆదా చేయవచ్చు.
ఈ–కుకింగ్ ద్వారా చేసిన వంటకు, గ్యాస్ ఉపయోగించి వండిన ఆహారానికి ఎలాంటి తేడా ఉండదు. పైగా వంట పొయ్యి వద్ద పొగతో అనారోగ్యానికి గురికావాలి్సన అవసరం రాదు. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం వీలవుతుంది. హానికరమైన బయోమాస్ ఆధారిత వంటకు దూరంగా పరిశుభ్రమైన వంట పద్ధతులను ప్రజలకు అలవాటు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.
ఫ్యాన్లతో ఇళ్లలో విద్యుత్ ఆదా..
‘ఈఈఎఫ్‌పీ’ ద్వారా జగనన్న ఇళ్లలో విద్యుత్ ఆదా ఫ్యాన్లను పంపిణీ చేసేందుకు ఇటీవల గోవాలో జరిగిన జీ20 సదస్సులో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్‌ఎల్ సీఈవో విశాల్ కపూర్ సంతకాలు చేసి, ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మిస్తోన్న ఇళ్లకు 6 లక్షల ఎల్‌ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్‌ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ మోటర్(బీఎల్‌డీసీ) సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేయనున్నారు. ఒక్కో ఇంటికీ 4 ఎల్‌ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్‌లను రాయితీపై అందించనున్నారు.
రూ.400 కోట్లతో పంపిణీ చేసే ఈ ఉపకరణాల వల్ల ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుంది. తొలి దశలో 15.6 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలను వినియోగించడం వల్ల ఏడాదికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మిగులుతుందని అంచనా. విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది.
ఏపీ ముందుకు రావడం అభినందనీయం
వంటశాలలలో ఆధునిక ఎలక్ట్రిక్ వంట పరికరాలను వినియోగించడం ద్వారా ఎల్‌పీజీ, కిరోసిన్ ఆధారిత వంటపై ఆధారపడటాన్ని తగ్గించడం మా లక్ష్యం. ఇందుకోసం మోడరన్ ఎనర్జీ కుకింగ్ సర్వీసెస్ (ఎంఈసీఎల్)తో కలిసి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ–స్టవ్‌లను పంపిణీ చేయనున్నాం. పాండిచ్చేరి, కేరళ, లడ్హాక్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించాం. జగనన్న ఇళ్లలో బీఎల్‌డీసీ ఫ్యాన్లు అందించేందుకు ఏపీ ముందుకు రావడం అభినందనీయం. – విశాల్ కపూర్, సీఈవో, ఈఈఎస్‌ఎల్
Comments
Please login to add a commentAdd a comment