సాక్షి, అమరావతి: దేశంలో ఇంకా 36.6 శాతం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనానికి (గ్యాస్) దూరంగా ఉన్నాయి. పట్టణాల్లో 92.9 శాతం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సగానికిపైగా కుటుంబాలు స్వచ్ఛ ఇంధనానికి నోచుకోలేదని సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే 2022–23 వెల్లడించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 49.3 శాతం గృహాలు మాత్రమే వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి.
మిగతా 50.7 శాతం కుటుంబాలు కట్టెలు, బొగ్గులనే వాడుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో కలిపి దేశంలో 63.4శాతం గృహాలు మాత్రమే వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి. మిగతా 36.6 శాతం కట్టెలు, బొగ్గు వంటి వాటిపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఏపీలో జాతీయ స్థాయికి మించి గ్రామీణ, పట్టణాల్లో కలిపి 88.0 శాతం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయని సర్వే వెల్లడించింది.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 84.1 శాతం గృహాలు స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తుండగా, పట్టణాల్లో 96.7 శాతం గృహాలు స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సగం గృహాలు కూడా వంట కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడం లేదని సర్వే వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్, అసోం, బిహార్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సగం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడం లేదని సర్వే తెలిపింది.
స్వచ్ఛ ఇంధనం అంటే..
వంట కోసం ఎల్‌పీజీ, ఇతర సహజ వాయువులు, గోబర్ గ్యాస్, ఇతర బయోగ్యాస్ విద్యుత్, సోలార్ కుక్కర్ వంటివి వినియోగించడం
Comments
Please login to add a commentAdd a comment