నీటితో కలిసి 15 అడుగుల మేర ఎగసిన గ్యాస్
మంటలు వ్యాపించకపోవడంతో తప్పిన ముప్పు
బోరు పూడ్చి వేసిన ఫైర్ సిబ్బంది
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘటన
రాజోలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఓ ఆక్వా చెరువు వద్ద బోరు బావి నుంచి నీటితో కలిసి 15 అడుగుల మేర గ్యాస్ పైకి ఎగజిమ్మింది. అయితే, మంటలు వ్యాపించకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... రాజోలు మండలంలోని చింతలపల్లి–అరవపాలెం రోడ్డులో కె.విజయేంద్రవర్మ అనే వ్యక్తికి చెందిన ఆక్వా చెరువు వద్ద ఉన్న బోరు బావి నుంచి శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆకస్మికంగా నీరు ఎగసిపడింది.
విద్యుత్ మోటారు, ఆయిల్ ఇంజన్ వంటివి ఏమీ లేకుండానే బోరు బావి నుంచి నీరు 15 అడుగుల మేర ఎగసిపడుతుండటంతో సమీపంలోని కూలీలు వెళ్లి చూశారు. అయితే, గ్యాస్ వాసన రావడంతో భయాందోళనలకు గురైన కూలీలు వెంటనే రాజోలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక అధికారి సీహెచ్ అనిల్‌కుమార్, సిబ్బంది గ్యాస్ లీక్ అవుతున్న బోరు బావి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
బోరు బావి లోపల తీవ్రమైన ఒత్తిడి పెరిగి, నీటితో కలసి గ్యాస్ ఉధృతంగా పైకి వస్తోందని గుర్తించారు. నీటిలో సుమారు ఆరు శాతం గ్యాస్ ఉందని నిర్ధారించారు. బోరు బావిని ఇసుకతో పూడ్చివేసి గ్యాస్ పైకి రాకుండా చేశారు. కొత్తగా బోర్లు వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉప్పు నీటి కోసం 200 మీటర్ల మేర భూమి లోపలకు బోర్లు వేయడం వల్ల గ్యాస్ పైకి వస్తుందని అనిల్‌కుమార్ చెప్పారు. కొన్నిసార్లు గ్యాస్ శాతం ఎక్కువగా ఉండడంతో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment