
చెరువుల సంఖ్యతో పాటు ఆక్రమణల్లోనూ అగ్రస్థానం రాష్ట్రానిదే..
కబ్జా కోరల్లో 3,920 నీటి వనరులు
రిజర్వాయర్లు, చెక్ డ్యామ్‌లకు సైతం తప్పని ఆక్రమణల బెడద
కేంద్ర జల్ శక్తి శాఖ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధికంగా చెరువులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. అత్యధికంగా చెరువులు ఆక్రమణలకు గురైన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే అని కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 1,13,425 చెరువులను పరిశీలించగా.. వాటిలో 2,032 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని తెలిపింది. దేశంలో నీటి వనరులపై మొదటి సారిగా కేంద్ర జల్ శక్తి శాఖ విస్తృతంగా అధ్యయనం చేసింది.
2018–19లో ప్రారంభమైన ఈ అధ్యయనం రెండేళ్ల పాటు కొనసాగింది. ఇటీవల అధ్యయనం వెల్లడైన అంశాలపై నివేదిక విడుదల చేసింది. రాష్ట్రంలో చెరువులతో పాటు కుంటలు, రిజర్వాయర్లు, సరస్సులు(లేక్‌లు), చెక్‌డ్యామ్‌లు, ఊట కుంటలు వంటి మొత్తం 1,90,777 నీటి వనరులను పరిశీలించగా వాటిలో 3,920 కబ్జాకు గురైనట్లు తెలిపింది. కబ్జాకు గురైన వాటిలో 51.8 శాతం చెరువులేనని వెల్లడించింది.
నీటి వనరులలో 75 శాతానికి పైగా ఆక్రమణకు గురైనవి 199 ఉండగా, 50 నుంచి 75 శాతం ఆక్రమణకు గురైనవి 186, 25 నుంచి 50 శాతం వరకు ఆక్రమణకు గురైనవి 249, 25 శాతం లోపు ఆక్రమణకు గురైనవి 1,828 ఉన్నట్లు చెప్పింది. నీటి వనరులు దేశవ్యాప్తంగా సగటున 1.6 శాతం ఆక్రమణకు గురైతే.. ఆంధ్రప్రదేశ్‌లో 2.06 శాతం కబ్జాకు గురయ్యాయని వెల్లడించింది. నీటి వనరుల ఆక్రమణలపై జల వనరుల శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పోలీసులకు చేసిన ఫిర్యాదులు వందల్లో ఉన్నాయని తెలిపింది.
నిరుపయోగంగా ఉన్న నీటి వనరులు తక్కువేం కాదు..
రాష్ట్రంలోని నీటి వనరుల్లో 1,49,279 ఉపయోగంలో ఉన్నాయని, వీటిలో 8,475 కుంటలు, 1,03,952 చెరువులు, 60 సరస్సులు, 667 రిజర్వాయర్లు, 32,011 చెక్ డ్యామ్‌లు, ఊట కుంటలు, ఇతర వనరులు 4,114 ఉన్నాయని తెలిపింది. 41,498 నీటి వనరులు నిరుపయోగంగా ఉన్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది.
వీటిలో అత్యధికంగా చెరువులు 9,473 ఉండటం గమనార్హం. ఫీడర్ చానళ్లు (వంకలు, వాగులు) కబ్జాకు గురవడం వల్ల వర్షం నీరు చేరకపోవడంతో 9,473 చెరువులు ఎండిపోయి, నిరుపయోగంగా మారినట్లు చెప్పింది. ఇలా నిరుపయోగంగా మారిన చెరువులు ఏపీలోనే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొంది.
రాష్ట్రంలో ఏటా పూర్తి స్థాయిలో నిండే నీటి వనరులు 79,320 ఉండగా.. సాధారణంగా నీటిని మళ్లించడం ద్వారా నిండేవి 18,198గా తెలిపింది. అరుదుగా నిండేవి 28,633, ఎప్పుడూ నిండని వనరులు 2,171 ఉన్నాయని పేర్కొంది.