శ్రీ సత్యసాయి జిల్లా హిందూçపూర్‌లోని అభివృద్ధి చేస్తున్న సూరపుకుంట చెరువు
(నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి)
నిర్లక్ష్యానికి నిలయాలుగా.. అపరిశుభ్రతకు ఆలవాలంగా.. కాలుష్యపు కాసారాలుగా మారిన పట్టణాల్లోని చెరువులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తరూపు తీసుకొస్తోంది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా చూడముచ్చటగా అభివృద్ధి చేస్తోంది. పార్క్ వాతావరణం, గట్లపై వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, చుట్టూ రక్షణ కంచె, ఓపెన్ జిమ్, పిల్లలకు ప్లే స్టేషన్ వంటి సౌకర్యాలను ఏర్పాటుచేస్తోంది.
వరద నీరు సరైన మార్గంలో అందులోకి చేరేలా, నిండిన తర్వాత ఎలాంటి ఆటంకం లేకుండా బయటకు వెళ్లేలా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా మురుగునీరు వాటిల్లోకి చేరకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. మొదటి దశలో 101 జలాశయాలను, రెండో దశలో మరో 95 చెరువులను సుందరీకరించే పనిని ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (ఏపీయూజీబీసీ) ఇప్పటికే చేపట్టింది.
రాష్ట్రంలోని చెరువులను పునరుద్ధరించి, తిరిగి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్బీలు–అర్బన్ లోకల్ బాడీలు) 196 చెరువులను ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.522 కోట్లను వెచ్చిస్తోంది.
మొదటి దశలోని 101 జలాశయాల్లో ఇప్పటికే 50 చెరువుల్లో సుందరీకరణ పనులు దాదాపు పూర్తిచేశారు. ఆయా పనులకు అవసరమైన ప్రణాళికను పురపాలక శాఖ రూపొందించి, ఇప్పటికే అమలుచేస్తోంది. ఈ నవంబర్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తోంది. మొదటి దశలోని చెరువుల్లో సగం చెరువుల పనులు పూర్తిగా, మిగతావి దాదాపు 80 శాతం పూర్తయ్యాయి.
వరద నష్టాన్ని నివారించేలా మార్పులు..
వరదలు వచ్చినప్పుడల్లా పట్టణాల్లో వీధులు నీటమునగడం పరిపాటిగా మారి, ప్రజా జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం సైతం పట్టణాల్లోని చెరువులను అమృత్ 2.0 పథకంలో అభివృద్ధి చేస్తోంది. ఇదే క్రమంలో ఏపీలోని పట్టణ జలాశయాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం కొత్తరూపు తీసుకొచ్చేందుకు నడుంబిగించింది. మొదటి దశలోని 101 చెరువులను రూ.189.07 కోట్లతోను, రెండో దశలో 95 చెరువులకు రూ.332.97 కోట్లతోను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
ఈ ప్రాజెక్టులో చెరువులను వినియోగంలోకి తీసుకొచి్చ, వరద నీరు సరైన మార్గంలో అందులోకి చేరేలా, నిండిన తర్వాత ఎలాంటి ఆటంకం లేకుండా బయటకు వెళ్లేలా చెరువులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రధానంగా వర్షపు నీరు తప్ప మురుగునీరు చెరువుల్లోకి చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే వాటిల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, మురుగును శుద్ధిచేసి నీటిని స్వచ్ఛంగా మారుస్తున్నారు. జలాశయాల గట్లను రాళ్లతో పటిష్టం చేసి గట్లపై మొక్కలు నాటుతున్నారు. దీనివల్ల వరదలు సంభవించినప్పుడు ఆయా పట్టణాలకు ఈ చెరువులు సహజ రక్షణ వలయాలుగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నాడు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది గుంటూరు మున్సిపాలిటీలోని అంకిరెడ్డిపాలెం చెరువు. దాదాపు 12 ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు ముఫ్పై ఏళ్ల క్రితం వరకు తాగునీటిని అందించింది. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో మురుగునీరు, జారిపోయిన గట్లు, ముళ్ల చెట్లతో నిండిపోయింది. దీనినిప్పుడు ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కొత్తగా తీర్చిదిద్దుతోంది. పటిష్టమైన గట్లు, సెంట్రల్ లైటింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో సందర్శకులకు నిలయమైంది. పక్కనే ఓపెన్ జిమ్, పిల్లలకు ప్లే స్టేషన్ సైతం ఏర్పాటుచేస్తున్నారు. వచ్చేనెలలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
నేడు
చెరువుల అభివృద్ధి ఇలా..
- మురుగుతో నిండిపోయిన జలాశయాలను శుద్ధి చేస్తారు.
- గట్లను పటిష్టం చేయడం, వీలైనంత ఎక్కువగా పచ్చదనాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కుల్లా తీర్చిదిద్దుతారు.
- గట్లపై వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, చుట్టూ రక్షణ కంచె ఏర్పాటుచేస్తారు.
- ఓపెన్ జిమ్, పిల్లలకు ప్లే స్టేషన్ వంటి సౌకర్యాలను కలి్పస్తారు.
- ఆక్రమణలు జరగకుండా చుట్టూ రక్షణగా ఇనుప కంచె వేస్తున్నారు.
తాగునీటి చెరువులుగా మార్పు
జలాశయాల పునరుజ్జీవంలో మొదటి విడతగా 101 చెరువులను తీసుకున్నాం. ఇవి సుమారు 5 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో 50 జలాశయాల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ప్రతి చెరువును శుద్ధమైన నీటితో ఉండేలా ప్రక్షాళన చేయడంతో పాటు, గట్లను పటిష్టం చేసి, పార్కులు, వాకింగ్ ట్రాక్, సెంట్రల్ లైటింగ్, ఓపెన్ జిమ్, పిల్లలకు ఆటస్థలం, వస్తువులతో పాటు చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేస్తున్నాం. పట్టణంలో కురిసిన వర్షపునీరు చెరువులోకి చేరేలా.. అక్కడ నుంచి బయటకు వెళ్లేలా ఇంజినీరింగ్ పనులు చేస్తున్నాం. తాగునీటి చెరువులను సైతం అభివృద్ధి చేస్తున్నాం. నవంబర్‌కి మొదటి దశ చెరువుల అభివృద్ధి పనులు పూర్తిచేస్తాం. – బొమ్మిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఏపీయూజీబీసీ ఎండీ
స్థలాల రేట్లు పెరిగాయి
ఈ ఊరిలో ఇక్కడే పుట్టి పెరిగాం. ఈ చెరువు నీటితోనే గ్రామం దాహం తీర్చుకునేది. కానీ, గత 30 ఏళ్లుగా నిరుపయోగంగా మారిపోయింది. ఊరు గుంటూరులో కలిసిపోయినా ఇటువైపు ఎవరూ వచ్చేవారు కాదు. ప్రభుత్వం ఈ చెరువును పార్కులా మారుస్తుండడంతో చుట్టుపక్కల స్థలాల రేట్లు పెరిగాయి. చుట్టూ వెంచర్లు కూడా వస్తున్నాయి. వచ్చే ఐదేళ్లల్లో ఈ ప్రాంతమంతా కొత్త పట్టణంగా మారిపోతుంది. – అప్పిరెడ్డి, అంకిరెడ్డిపాలెం (గుంటూరు)
మా ప్రాంతానికి ఐకాన్
గతంలో ఈ చెరువులో చేపలు పెంచేవాళ్లం. కలుషిత నీరు చేరడంవల్ల చేపలు చనిపోతుండడంతో మానేశాం. వాకింగ్‌కు భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెజెల్స్ లిమిటెడ్ (బీహెచ్‌వీపీ)కి వెళ్లా ల్సి వస్తోంది. కానీ, ఇప్పుడు మా చెరువును ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండడంతో ఇకపై వాకింగ్‌కు, పిల్లలు ఆడుకునేందుకు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. ఈ ప్రాంతానికి ఇప్పుడీ చెరువు ఐకాన్‌లా మారుతోంది. – వి.వెంకటరమణ, అక్కిరెడ్డిపాలెం (విశాఖ)
ఆక్రమణలు తొలగించి ఆహ్లాదకరంగా..
విశాఖపట్నం లంకెలపాలెం చెరువు మూడెకరాలకు పైగా ఉండేది. 20 ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు పెరిగిపోయి అసాంఘిక పనులకు అడ్డాగా మారిపోయింది. ఇన్నేళ్లకు అధికారులు ఆక్రమణలను తొలగించి అద్భుతంగా మారుస్తున్నారు. గతంలో వాకింగ్‌కు స్టీల్ ప్లాంట్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఈ చెరువు గట్టుపైనే చేస్తున్నాం. జిమ్, పార్కు కూడా అభివృద్ధి చేస్తున్నారు. – సాలపు విజయకుమార్, లంకెలపాలెం (విశాఖపట్నం)
బోటింగ్ కూడా పెడుతున్నారు
హిందూపూర్‌లోని 113 ఎకరాల సూరపుకుంట చెరువు గత నెల వరకు గట్లు అడవిలా, పాములు, పందులకు నిలయంగా ఉండేవి. నీరు కూడా మురికిగా ఉండేది. అధికారులు పదిరోజుల్లో ఎంతో మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు చెరువు గట్టుపై వాకింగ్ చేస్తున్నాం. అధికారులు బోటింగ్ పెట్టాలని కూడా నిర్ణయించారు. బెంగళూరు, ఎలహంకలో ఇలా చెరువుల అభివృద్ధిని చూశాను. – సింగిరెడ్డిపల్లి ప్రసాదరెడ్డి, హిందూపూర్
Comments
Please login to add a commentAdd a comment