
ప్రసంగిస్తున్న రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్. చిత్రంలో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు
రూ.245 కోట్ల మేర మెక్కేసింది
బీసీ మహిళలను కుట్టు మెషీన్ల పంపిణీ, శిక్షణ పేరుతో వంచించింది
రూ.4,300 విలువ చేసే కుట్టు మెíషీన్‌ను రూ.23,500కి పెంచింది
కుట్టు మెషీన్ల కుంభకోణంపై కోనసీమ మహిళల నిరసన
హాజరైన వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు
అమలాపురం టౌన్: బీసీ మహిళలకు కుట్టు మెషీన్ల పంపిణీ, శిక్షణ పేరుతో కూటమి ప్రభుత్వం రూ.245 కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మహిళలు రోడ్డెక్కారు. కుట్టు మెషీన్లను వెంటబెట్టుకుని మరీ జిల్లా కేంద్రమైన అమలాపురం చేరుకుని నిరసన తెలిపారు. గడియారం స్తంభం సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ.. రూ.4,300 విలువైన కుట్టు మెషిన్‌ను కమీషన్ల కక్కుర్తితో రూ.23,500కు కూటమి ప్రభుత్వం అడ్డదారుల్లో పెంచిందని ధ్వజమెత్తారు.
ఇన్నాళ్లూ బీసీ కులగణన లేకే ఇలాంటి స్కామ్‌లకు అవకాశం ఏర్పడుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. కుట్టు మెషీన్ల పేరుతో రూ.245 కోట్ల మేర మహిళలకు కుచ్చుటోపీ పెట్టిన కుంభకోణంపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై రైతులకు అండగా నిలుస్తామన్నారు. ఈ వారంలోనే రిలే నిరాహార దీక్ష, పోరాటాలు చేసి ప్రభుత్వం మెడలు వంచి దిగి వచ్చేలా చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బాటలో కూటమి ప్రభుత్వ కుట్టు మెషీన్ల స్కామ్‌పై కూడా పోరాటం మొదలు పెట్టామన్నారు.
కూటమి ప్రభుత్వం స్కీమ్‌ల పేరుతో సాగించిన కుంభకోణాల దందాను జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, రాజోలు, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కో–ఆర్డినేటర్లు గొల్లపల్లి సూర్యారావు, డాక్టర్ పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ తదితరులు వివరించారు.