Sewing machines
-
అంతా మనకే.. నీకింత.. నాకింత!
ఎప్పుడూ లేనిది ఇప్పుడే జరుగుతున్నట్లు హడావిడి చేయడం.. ఆ ముసుగులో అందినకాడికి దండుకునేందుకు మంత్రాంగంతో యంత్రాంగాన్ని పురమాయించడం.. ఆపై అనుకూల సంస్థలకే టెండర్లు దక్కేలా తిమ్మినిబమ్మి చేస్తూ నిబంధనలు మార్చడం.. ఆ తర్వాత ఇష్టానుసారం ఎస్టిమేషన్లతో సర్కారు ఖజానాకు కన్నం వేయడం కూటమి ప్రభుత్వ పెద్దలకు పరిపాటిగా మారింది. ఏ మంత్రిత్వ శాఖలో ఏ పనికి టెండర్ పిలవాల్సి వచ్చినా, తొలుత ముఖ్య నేత దిశా నిర్దేశం తప్పనిసరిగా మారింది. ఆ నేత సూచనల మేరకే సదరు మంత్రి మధ్యవర్తిత్వంతో కాంట్రాక్టు సంస్థ ఏదన్నది ముందుగానే ఫైనలైపోతోంది.ఆ తర్వాత ఆ సంస్థకే కాంట్రాక్టు దక్కేలా చేసేందుకు అనుకూల యంత్రాంగం ద్వారా చకచకా పావులు కదులుతున్నాయి. ఇందులో సంస్థ గత అనుభవంతో పని లేదు.. ఎంత బాగా పని చేసిందన్నది అక్కర్లేదు.. అసలు ఆ సంస్థకు అర్హత ఉందా అన్నది అసలే అవసరం లేదు. దిక్కుమాలిన షరతులతో టెండర్లు పిలవడం.. ఇతర సంస్థలన్నింటిపై అనర్హత వేటు వేయడం.. అనుకున్న సంస్థకే టెండర్ కట్టబెట్టడమే ప్రధానం. ఇందుకు ఎవరైనా అడ్డు తగిలితే.. తప్పుడు కేసులు పెట్టి అయినా వారి నోరు మూపించడం మామూలైపోయింది. రాష్ట్రంలో ఏడు నెలలుగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి మచ్చుకు మూడు ఉదాహరణలు ఇలా ఉన్నాయి. – సాక్షి, అమరావతి/సాక్షి ప్రత్యేక ప్రతినిధి పెద్ద కంపెనీలే ముద్దు రాష్ట్రంలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడేళ్లకు రూ.1,300 కోట్ల విలువైన సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ పనుల కోసం వైద్య శాఖ టెండర్లు పిలిచింది. మొత్తం ఆస్పత్రులను మూడు జోన్లుగా విభజించి టెండర్లు పిలిచారు. ఈ పనులను ఇప్పటి వరకు ఎక్కడికక్కడ చిన్న చిన్న కంపెనీలు చేసేవి. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న యువ మంత్రి జోక్యంతో సీన్ మారిపోయింది. చిన్న కంపెనీలు టెండర్లలో పాల్గొనకుండా నిబంధనలు మార్చేశారు. ఎక్కువ టర్నోవర్ ఉండే పెద్ద కంపెనీకే కాంట్రాక్ట్ దక్కేలా చక్రం తిప్పారు.గతంలో రాష్ట్ర వైద్య శాఖలో అత్యవసర వైద్య సేవల కాంట్రాక్టు నిర్వహించిన సంస్థతోపాటు, ఉత్తరాదికి చెందిన బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడి సెక్యూరిటీ నిర్వహణ సంస్థకు కాంట్రాక్టులు దక్కేలా ఓ మంత్రి, జనసేనకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ముందుండి నడిపిస్తున్నట్లు సమాచారం. జోన్–1లో కాంట్రాక్ట్‌లు జనసేన కోటాగా కేటాయించారు. చిన్నా చితకా కంపెనీలు కన్షార్షియంగా టెండర్లు వేసినప్పటికీ, వారికి పనులు దక్కకుండా ఆపరేషనల్ ఎక్స్పెండేచర్ 3.85 శాతం నుంచి 5 శాతం మధ్యే ఉండాలంటూ మరో నిబంధన పెట్టారు. ఈ నేపథ్యంలో టెండర్లు వేసిన వారందరూ 3.85 శాతం ఎలాగూ వేస్తారని, అయితే ఎక్కువ టర్నోవర్ ఉన్న వారినే ఎల్1గా పరిగణిస్తారని చిన్న కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ‘కుట్టు’ టెండర్లో కనికట్టు! రాష్ట్రంలో బీసీ మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ టెండర్లలో భారీ అవినీతికి రంగం సిద్ధమైంది. అస్మదీయులు ఒకరిద్దరికి టెండర్ కట్టబెట్టేలా దేశంలో మరెక్కడా లేని షరతులు ముందుకొచ్చేశాయి. ఏపీ బీసీ సహకార సంస్థ లిమిటెడ్ ద్వారా 46,044 మంది బీసీ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లను పంపిణీ చేసేందుకు గత నెల 18న ప్రభుత్వం టెండర్‌ను ఆహ్వానించింది. ఒక్కో లబ్ధిదారుకు రూ.25 వేల చొప్పున రూ.115 కోట్లు టెండరు మొత్తంగా పేర్కొంది. గత నెల 31వ తేదీ తుది గడువు కాగా ప్రీబిడ్ మీటింగ్ ఈ నెల 23న నిర్వహించనున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు 360 గంటలు ఉచిత శిక్షణ ఇవ్వాలి. ఒక్కో బ్యాచ్‌లో 50 మందికి తక్కువ కాకుండా ఉండాలి.బయోమెట్రిక్, మాన్యువల్ హాజరు నమోదు చేయాలి. షార్ట్ టెండర్ అయినప్పటికీ వివిధ రాష్ట్రాలకు చెందిన 80 మందికి పైగా టెండర్లు దాఖలు చేశారు. గత పది ఆర్థి క సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఒక్క ఏడాదైనా పది వేల మందికి కుట్టు పనుల్లో శిక్షణ ఇచ్చి ఉండాలనేది టెండరులో ముఖ్య నిబంధన. దీనిపై ప్రీ బిడ్ సమయంలో టెండర్‌దారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ‘సర్దుబాటు ఒప్పందాల’కు ఇబ్బంది లేకుండా ముఖ్య నేత సూచనతో లబ్ధిదారుల సంఖ్య 92,088కు, టెండర్ విలువ రూ.230 కోట్లకు పెంచేశారు. దేశ వ్యాప్తంగా ఎక్కడైనా శిక్షణ ఇచ్చి ఉండవచ్చని చెబుతూ తాజాగా టెండర్‌ను ఆహా్వనించారు. అస్మదీయులకు టెండర్ కట్టబెట్టడానికే ఇలా చేశారని టెండరుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకే సంస్థకు ఆలయాల్లో ‘క్లీనింగ్’! రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల్లో పారిశుధ్య నిర్వహణ పనులను ఒకే సంస్థకు అప్పగించేందుకు వీలుగా ‘ముఖ్య’ నేత డైరెక్షన్లో దేవదాయ శాఖ అధికారులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఏ ఆలయానికి ఆ ఆలయమే పారదర్శకంగా టెండర్లు పిలిచి కాంట్రాక్టులు అప్పగించి పనులు చేయించుకునే విధానాన్ని నిలిపి వేసి, నెలానెలా కాంట్రాక్టును పొడిగిస్తూ వస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఏకీకృత విధానం పేరుతో శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం ఆలయాల్లో పనులు ఒక్కరికే అప్పగించేలా స్కెచ్ వేశారు. ఏటా ఈ ఆలయాలకు రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఒక్కోదానికి ఆదాయం ఉంటుంది. ఇంత భారీగా ఆదాయం ఉన్నందున ఒకే సంస్థకు పారిశుధ్య నిర్వహణ అప్పగిస్తే అనుకున్న రీతిలో దండుకోవచ్చని స్కెచ్ రూపొందించారు.2015–19 మధ్య చంద్రబాబుకు బంధువుగా చెబుతున్న భాస్కరనాయుడు అనే వ్యక్తికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్విసు సంస్థకు ఏడు ఆలయాల క్లీనింగ్ కాంట్రాక్టును కట్టబెట్టారు. అప్పట్లో క్లీనింగ్ పనులు సరిగా చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ సంస్థలకు ఆయా ఆలయాలు రెట్టింపు డబ్బు చెల్లించినట్లు ఆ శాఖ అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఉమ్మడి టెండర్ విధానానికి స్వస్తి పలకడంతో ఈ దందా ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు పగ్గాలు చేపట్టడంతో భాస్కర్‌నాయుడితో పాటు అలాంటి వాళ్లు తెరపైకి వచ్చి దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. -
శ్రీశైలంలో మహిళలకు నాట్స్ ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ
మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నంధ్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపెంటలో మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేసింది. మహిళలు మరొకరి మీద ఆధారపడకుండా వాళ్లు స్వయం ఉపాధి పొందేందుకు కావాల్సిన సహకారాన్ని నాట్స్ అందిస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. సున్నిపెంట గ్రామంలో పదిమంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు శిక్షణ శిబిరాన్ని బాపు నూతి ప్రారంభించారు. కుటుంబంలో మహిళ పాత్ర చాలా కీలకమని అలాంటి మహిళ ఏదో ఒక స్వయం ఉపాధి సాధించడం ద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయని తెలిపారు. ఎక్కడో అమెరికాలో ఉన్న బాపయ్య చౌదరి లాంటి వారు మానవత దృక్పథంతో తమ సేవా కార్యక్రమాలను నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామమైన సున్నిపెంటలో చేయటం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. భవిష్యత్తులో నాట్స్ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసి తెలుగు రాష్ట్రాల్లో తమ సేవలు విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: అనంతపురంలో నాట్స్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ) -
ప్రలోభాలకు తెరతీసిన టీడీపీ
-
ఆరు మాసాలకే సరి..
విజయనగరం: మహిళల అభ్యన్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. నిధులు వెచ్చించడంలో ఉన్న శ్రద్ధ వాటిని సద్వినియోగపరుచుకుని, లక్ష్యాలు నెరవేర్చుకోవడంలో చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ఉపాధి కల్పనలో భాగంగా మూడేళ్ల కిందట జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి వంతున తొమ్మిది కుట్టు శిక్షణకేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.14.40 లక్షలతో 270 కుట్టుమిషన్లు కూడా అప్పట్లో కొనుగోలు చేశారు. జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి 30 నుంచి 40 కుట్టుమిషన్లు కేటాయించి శిక్షణ కేంద్రాలు తెరిచారు. పేదరిక నిర్మూలన సంస్థ కేటాయించిన నిధులతో గ్రామీణాభివృద్ది సంస్థ ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే మూడు సంవత్సరాలలో కేవలం ఆరుమాసాలు నిర్వహించి శిక్షణ కేంద్రాలు నిలిపివేశారు. దీంతో ఆ కేంద్రాల్లో కుట్టు మిషన్లు నిరుపయోగంగా ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి రూ. 30 వేలు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాల నిర్వహణకు పేదరిక నిర్మూలన సంస్థ నిధులు కేటాయించాల్సి ఉంది. ఒక్కో కేంద్రానికి నెలకు రూ.30 వేల చొప్పున మండల సమాఖ్యలకు డీఆర్డీలు విడుదల వేయాలి. ఆ నిధులతో శిక్షణకు అవసరమైన సామగ్రి కొనుగోలుతో పాటు శిక్షణ ఇచ్చే వారికి వేతనాలు ఇవ్వాలి. ఒక్కో కేంద్రంలో ఆరు నెలలపాటు నాలుగు బృందాలకు శిక్షణ అందించే అవకాశం ఉంది. ఏడాదికి కనీసం 2,600 మందికి ఉపాధి శిక్షణ ఇవ్వవచ్చు. శిక్షణ అనంతరం మహిళలకు 50 శాతం రాయితీపై కుట్టు యంత్రాలను అందించాలి. కేంద్రాలు సక్రమంగానే నడుస్తున్న సమయంలో పేదరిక నిర్మూలన సంస్థ వద్ద నిధులు లేవనే కారణంతో పాటు ఇతర జిల్లాల్లో కేంద్రాలు నిలిపివేశారన్న సాకుతో జిల్లాలో కేంద్రాలను మూసివేశారు. మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చే కుట్టు శిక్షణ కేంద్రాలను తెరిపించే విషయంలో అటు పాలకులు, ఇటు అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 9 కుట్టు శిక్షణ కేంద్రాల నిర్వాహణకు నెలకు రూ.2.82 లక్షలు చొప్పున సంవత్సరానికి రూ.33 లక్షల నిధులు అవసరమవుతాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏడాదికి 2,600 మందికి శిక్షణ ఇవ్వవచ్చు. ఎన్నో పథకాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసే అధికారులు 33 లక్షల రూపాయలు లేవనే సాకుతో కేంద్రాలు మూసివేయడం తగదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కేంద్రాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
హలో.. మెషిన్లు ఎల్లో!
కాపు కార్పొరేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రంగు పులుముకుంటున్న కుట్టు మెషిన్లు ప్రకాశం ,గిద్దలూరు : మొత్తానికి అనుకున్నంత పని చేశారు. కార్పొరేషన్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా అందించేందుకు మంజూరైన కుట్టు మెషిన్లు పసుపుగా లేవంటూ అర్ధాంతరంగా పంపిణీ ప్రక్రియ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతలు ఆదేశించడం.. అధికారులు జీ హుజూర్ అనండం నిమిషాల్లో జరిగిపోయింది. ఇంకేముందీ మెషిన్ల రంగు మారుతోంది. గిద్దలూరు, రాచర్ల మండలాల్లోని 162 మంది కాపు, బలిజ మహిళలకు మహిళాభివృద్ధి సంస్థ జిల్లా ప్రాంగణం ఆధ్వర్యంలో రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ఈ నెల 11వ తేదీన కుట్టు మెషిన్లు ఇచ్చేందుకు అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిలు మెషిన్లకు పసుపు రంగు లేని కారణంగా పంపిణీని ఆపేశారు. వాటిని మంజూరు చేసిన సమయంలో ప్రభుత్వ జీఓ ప్రకారం పసుపు రంగు లేకుండానే సరఫరా చేయాలని చెప్పడంతో మెషిన్ల సరఫరాకు టెండర్లు దక్కించుకున్న సంస్థ వారు సాధారణ కుట్టు మెషిన్లు సరఫరా చేశారు. పంపిణీ చేసే వరకు బాగానే ఉన్న నాయకులు మాత్రం పసుపు రంగు లేదంటూ పంపిణీ నిలిపేశారు. ప్రస్తుతం జిల్లా ప్రాంగణ మేనేజరు సుధ స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో పెయింటర్ ద్వారా రంగులు వేయిస్తున్నారు. అసలు ఈ రంగు ఎన్ని రోజులు నిలుస్తుందో చెప్పలేం. మెషిన్లపై బట్టలు కుట్టే సమయంలో రంగు లేచిపోవడం వలన లబ్ధిదారులు ఇబ్బందులు పడే అవకాశాలు లేకపోలేదు. మహిళలు ఇబ్బందులు పడినా టీడీపీ నాయకులకు ప్రచారం ఉంటే చాలు అన్న చందంగా వ్యవహరించడంపై అంతా విస్మయం వ్యక్తం చేశారు. -
కుట్టు.. కనికట్టు
అధికార పార్టీ ప్రలోభపర్వం ఎన్నికల తర్వాత కుట్టు మిషన్లు ఇస్తామంటూ ప్రచారం ఏకంగా 30 వేల టోకెన్ల పంపిణీ ఉన్నవి 3 వేలు మాత్రమే ఎన్నికల కోడ్ వచ్చిందంటూ ముక్తాయింపు సాక్షి ప్రతినిధి, కర్నూలు : అధికార పార్టీ కుట్టు మిషన్లతో కనికట్టు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఉప ఎన్నిక తర్వాత భారీగా కుట్టుమిషన్లు ఇస్తామంటూ నంద్యాలలో ప్రచారం మొదలుపెట్టింది. ఇందుకోసం ఇప్పుడే టోకెన్లు ఇస్తామని, ఎన్నికల తర్వాత మిషన్లు అందజేస్తామని ఆ పార్టీ నేతలు ఓటర్లను మభ్యపెడుతున్నారు. ప్రస్తుతమున్న కుట్టుమిషన్లు మూడు వేలు మాత్రమే కాగా.. ఏకంగా 30 వేల టోకెన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో హడావుడిగా పనులు మొదలుపెట్టారు. సగం కేబినెట్‌ను నంద్యాలలోనే కేంద్రీకరించారు. స్వయంగా సీఎం చంద్రబాబు నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు పర్యటించారు. అయినా గెలుపుపై నమ్మకం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో కుట్టుమిషన్లతో కనికట్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ కంటే ముందుగానే మిషన్లు పంపిణీ చేయాలనుకున్నారు. మూడు వేల మిషన్లు మాత్రమే రావడం, వాటిని పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తే ఇతర మహిళల్లో వ్యతిరేకత వస్తుందని భావించడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే..ఇప్పుడు టోకెన్లు ఇచ్చి, ఎన్నికల తర్వాత టోకరా వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. టోకెన్ల సరఫరా చంద్రబాబు సీఎం హోదాలో ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే నంద్యాల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టుమిషన్లను ఆశగా చూపి.. సీఎం సభకు తరలించారు. తీరా సభకు వచ్చాక వాటిని పంపిణీ చేయరని తెలియడంతో మహిళలు మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన అధికార పార్టీ నేతలు అప్పటికప్పుడు ఎవరికీ పంపిణీ చేయకుండా నిలిపివేసినట్టు సమాచారం. ప్రస్తుతం రూటు మార్చి.. కేవలం టోకెన్లు ఇస్తున్నారు. కోడ్ ఉన్నందున ఎన్నికల తర్వాత మిషన్లను అందజేస్తామని చెబుతున్నారు. అయితే, ఏకంగా 30 వేల టోకెన్లు ఇస్తుండడం గమనార్హం. -
కుట్టు మెషిన్లు ఇప్పిస్తానంటూ బురిడీ
దేవరపల్లి (ద్వారకాతిరుమల) : గ్లోబల్ గివింగ్ సంస్థ పేరుతో మహిళలకు కుట్టుమెషిన్లు ఇస్తామని రూ.లక్షల పైబడి సొమ్ములు వసూలు చేసి బురిడీ కొట్టించారు. దీనిపై బాధిత మహిళలు శుక్రవారం స్థానిక పోలీస్స్టేన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. బాధిత మహిళలు తెలిపిన వివరాలిలా.. కృష్టాజిల్లాకు చెందిన చేకూరి ధన శిరీష కొద్దిరోజుల క్రితం ద్వారకాతిరుమల వచ్చి రూ.మూడు వేలిస్తే కొత్త కుట్టు మెషిన్లు ఇస్తామని, అలాగే 6 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని నమ్మ బలికింది. గ్రామంలో 54 మంది మహిళల నుంచి ఒక్కక్కరి నుంచి రూ.2 వేల చొప్పున మొత్తం రూ.1.08 లక్షలు వసూలు చేసింది. గ్లోబల్ గివింగ్ సంస్థ పేరుతో మహిళలకు రశీదు ఇచ్చింది. అయితే ఇంతవరకూ కుట్టు మెషిన్లు రాలేదని బాధిత మహిళలు వాపోయారు. తామంతా కూలి పనులు చేసుకుని జీవించేవారమని, తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కుట్టుమిషన్ల పేరుతో కుచ్చుటోపి
కృష్ణాజిల్లా : విజయవాడలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కుట్టుమిషన్లు ఇస్తామని రూ.కోట్లలో కుచ్చుటోపి పెట్టిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. గ్లోబల్ గివింగ్ సంస్థ కుట్టుమిషన్లు ఇస్తామని ప్రజల నుంచి రూ.కోట్లలో వసూలు చేసింది. ఎన్ని రోజులైనా మిషన్లు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మోసం చేసిన సంస్థపై చర్యలు తీసుకోవడంతో పాటు తమ డబ్బును తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.