(పసుపు రంగుతో ఉన్న మెషిన్లు) పెయింట్ వేస్తున్న కార్మికుడు
కాపు కార్పొరేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు
రంగు పులుముకుంటున్న కుట్టు మెషిన్లు
ప్రకాశం ,గిద్దలూరు : మొత్తానికి అనుకున్నంత పని చేశారు. కార్పొరేషన్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా అందించేందుకు మంజూరైన కుట్టు మెషిన్లు పసుపుగా లేవంటూ అర్ధాంతరంగా పంపిణీ ప్రక్రియ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతలు ఆదేశించడం.. అధికారులు జీ హుజూర్ అనండం నిమిషాల్లో జరిగిపోయింది. ఇంకేముందీ మెషిన్ల రంగు మారుతోంది. గిద్దలూరు, రాచర్ల మండలాల్లోని 162 మంది కాపు, బలిజ మహిళలకు మహిళాభివృద్ధి సంస్థ జిల్లా ప్రాంగణం ఆధ్వర్యంలో రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చారు.
శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ఈ నెల 11వ తేదీన కుట్టు మెషిన్లు ఇచ్చేందుకు అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిలు మెషిన్లకు పసుపు రంగు లేని కారణంగా పంపిణీని ఆపేశారు. వాటిని మంజూరు చేసిన సమయంలో ప్రభుత్వ జీఓ ప్రకారం పసుపు రంగు లేకుండానే సరఫరా చేయాలని చెప్పడంతో మెషిన్ల సరఫరాకు టెండర్‌లు దక్కించుకున్న సంస్థ వారు సాధారణ కుట్టు మెషిన్లు సరఫరా చేశారు.
పంపిణీ చేసే వరకు బాగానే ఉన్న నాయకులు మాత్రం పసుపు రంగు లేదంటూ పంపిణీ నిలిపేశారు. ప్రస్తుతం జిల్లా ప్రాంగణ మేనేజరు సుధ స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో పెయింటర్ ద్వారా రంగులు వేయిస్తున్నారు. అసలు ఈ రంగు ఎన్ని రోజులు నిలుస్తుందో చెప్పలేం. మెషిన్లపై బట్టలు కుట్టే సమయంలో రంగు లేచిపోవడం వలన లబ్ధిదారులు ఇబ్బందులు పడే అవకాశాలు లేకపోలేదు. మహిళలు ఇబ్బందులు పడినా టీడీపీ నాయకులకు ప్రచారం ఉంటే చాలు అన్న చందంగా వ్యవహరించడంపై అంతా విస్మయం వ్యక్తం చేశారు.