మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నంధ్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపెంటలో మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేసింది. మహిళలు మరొకరి మీద ఆధారపడకుండా వాళ్లు స్వయం ఉపాధి పొందేందుకు కావాల్సిన సహకారాన్ని నాట్స్ అందిస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. సున్నిపెంట గ్రామంలో పదిమంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు శిక్షణ శిబిరాన్ని బాపు నూతి ప్రారంభించారు.
కుటుంబంలో మహిళ పాత్ర చాలా కీలకమని అలాంటి మహిళ ఏదో ఒక స్వయం ఉపాధి సాధించడం ద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయని తెలిపారు. ఎక్కడో అమెరికాలో ఉన్న బాపయ్య చౌదరి లాంటి వారు మానవత దృక్పథంతో తమ సేవా కార్యక్రమాలను నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామమైన సున్నిపెంటలో చేయటం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. భవిష్యత్తులో నాట్స్ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసి తెలుగు రాష్ట్రాల్లో తమ సేవలు విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment