కుట్టు.. కనికట్టు
అధికార పార్టీ ప్రలోభపర్వం
ఎన్నికల తర్వాత కుట్టు మిషన్లు ఇస్తామంటూ ప్రచారం
ఏకంగా 30 వేల టోకెన్ల పంపిణీ
ఉన్నవి 3 వేలు మాత్రమే
ఎన్నికల కోడ్ వచ్చిందంటూ ముక్తాయింపు
సాక్షి ప్రతినిధి, కర్నూలు : అధికార పార్టీ కుట్టు మిషన్లతో కనికట్టు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఉప ఎన్నిక తర్వాత భారీగా కుట్టుమిషన్లు ఇస్తామంటూ నంద్యాలలో ప్రచారం మొదలుపెట్టింది. ఇందుకోసం ఇప్పుడే టోకెన్లు ఇస్తామని, ఎన్నికల తర్వాత మిషన్లు అందజేస్తామని ఆ పార్టీ నేతలు ఓటర్లను మభ్యపెడుతున్నారు. ప్రస్తుతమున్న కుట్టుమిషన్లు మూడు వేలు మాత్రమే కాగా.. ఏకంగా 30 వేల టోకెన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో హడావుడిగా పనులు మొదలుపెట్టారు. సగం కేబినెట్‌ను నంద్యాలలోనే కేంద్రీకరించారు.
స్వయంగా సీఎం చంద్రబాబు నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు పర్యటించారు. అయినా గెలుపుపై నమ్మకం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో కుట్టుమిషన్లతో కనికట్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ కంటే ముందుగానే మిషన్లు పంపిణీ చేయాలనుకున్నారు. మూడు వేల మిషన్లు మాత్రమే రావడం, వాటిని పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తే ఇతర మహిళల్లో వ్యతిరేకత వస్తుందని భావించడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే..ఇప్పుడు టోకెన్లు ఇచ్చి, ఎన్నికల తర్వాత టోకరా వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
టోకెన్ల సరఫరా
చంద్రబాబు సీఎం హోదాలో ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే నంద్యాల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టుమిషన్లను ఆశగా చూపి.. సీఎం సభకు తరలించారు. తీరా సభకు వచ్చాక వాటిని పంపిణీ చేయరని తెలియడంతో మహిళలు మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన అధికార పార్టీ నేతలు అప్పటికప్పుడు ఎవరికీ పంపిణీ చేయకుండా నిలిపివేసినట్టు సమాచారం. ప్రస్తుతం రూటు మార్చి.. కేవలం టోకెన్‌లు ఇస్తున్నారు. కోడ్ ఉన్నందున ఎన్నికల తర్వాత మిషన్లను అందజేస్తామని చెబుతున్నారు. అయితే, ఏకంగా 30 వేల టోకెన్లు ఇస్తుండడం గమనార్హం.