నంద్యాల ఎన్నిక చాలా చిన్నది: సుజనా చౌదరి
విశాఖపట్నం: నంద్యాల ఉప ఎన్నిక ఫలితం టీడీపీ ప్రభుత్వానికి రెఫరెండం కాదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. నంద్యాల ఎన్నిక చాలా చిన్నదని, దీన్ని రెఫరెండంగా తీసుకోవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నిక చిన్నదైనా, పెద్దదైనా రాజకీయ పార్టీగా గెలుపు కోసం తాము గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఉప ఎన్నికల్లో గెలిచామని, మరికొన్ని ఓడామని చెప్పారు. నంద్యాలలో అభివృద్ధి అవసరమని భావించి అక్కడ నిధులను ఖర్చు చేస్తున్నారన్నారు. ఉప ఎన్నిక జరుగుతున్నందున అభివృద్ధి అవసరమని భావించారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. ప్రధాన నగరాలు, పట్టణాల్లో గత మూడేళ్లుగా అభివృద్ధి జరుగుతోందన్నారు. ఒక్క నంద్యాలలోనే కాదు.. రాష్ట్రంలో అవసరమనుకున్న నియోజకవర్గాల్లో అవసరాన్నిబట్టి టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు. నంద్యాలలో టీడీపీ నాయకులు ఓటర్లకు భారీగా డబ్బులు పంచుతున్నారన్న వైఎస్సార్‌సీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదన్నారు. వాస్తవాలను ఎన్నికల సంఘం చూసుకుంటుందని సుజనా చెప్పారు.