ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉపఎన్నికలు నిర్వహించిన ప్రతి సందర్భంలోనూ ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలే విజయం సాధిస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికల్లో 80 నుంచి 85 శాతం స్థానాలను ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే గెలుపొందాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా ఉండే అధికార యంత్రాంగం, ఇతర వ్యవస్థలు, అభివృద్ది నినాదాలు ప్రధానంగా కలిసొస్తున్న అంశాలుగా కనబడుతున్నాయి.
ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన కొద్ది కాలానికి రాజీనామాలతో ఖాళీ అవుతున్న స్థానాలకు ఎన్నికలు జరిగినప్పుడు ఆ గాలి అలాగే కొనసాగడం, లేదా ప్రభుత్వాలు ఏర్పడిన కొంతకాలం తర్వాత ఎవరైనా సభ్యులు మరణించడంతో ఖాళీ అవుతున్న స్థానాల్లో ఉపఎన్నికలు జరిగినప్పుడు ఆ సానుభూతి పవనాలు పనిచేయడం కూడా సర్వసాధారణంగా కనబడుతున్న పరిణామాలు. ప్రస్తుతం నంద్యాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న భూమా నాగిరెడ్డి అకాల మరణంతో నంద్యాల ఉపఎన్నిక అనివార్యమైంది.
♦ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల, గోవాలోని వాల్పోయి, పనాజీ, ఢిల్లీలోని బావన (ఎస్సీ) నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగ్గా, అన్నింటిలోనూ అధికార పార్టీయే విజయం సాధించింది. నంద్యాలలో టీడీపీ, గోవాలో బీజేపీలు గెలుచుకోగా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించింది.
ఇటీవలి కాలంలో (ఈ ఆగస్టు నెలలోనే) పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అన్నింటినీ కైవసం చేసుకుంది. ఈ కార్పొరేషన్లలో మొత్తం 148 వార్డులకుగాను మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 140 వార్డులను గెలుచుకుంది.
♦ 2016 నవంబర్ లో అసోం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మధ్యప్రదేశ్, తమిళనాడులతో పాటు పుదుచ్చేరి రాష్ట్రాల్లో మొత్తం నాలుగు లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా దాదాపు అన్ని స్థానాలు ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలే కైవసం చేసుకున్నాయి.
♦ మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడి నేపానగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో గెలుపొందింది. అసోంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో బైథలాంగ్సో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించగా బీజేపీ గెలుచుకుంది. అలాగే, అరుణాచల్ ప్రదేశ్ హాయులియాంగ్ స్థానాన్ని బీజేపీ తిరిగి గెలుకుంది.
♦ అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు లోక్ సభ స్థానాలకు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగ్గా ఆ మూడు స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. దాంతో పాటు మాంటేశ్వర్ అసెంబ్లీ స్థానాన్ని కూడా టీఎంసీ కైవసం చేసుకుంది.
♦ తమిళనాడులో ఉపఎన్నికలు జరిగిన మూడు (తిరుపరంకుండ్రమ్, అరవకురిచి, తంజావూర్) అసెంబ్లీ స్థానాలకు జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకె తిరిగి విజయం సాధించింది. 1980 నుంచి 2012 మధ్య కాలంలో 44 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా, కేవలం 8 సార్లు మాత్రమే విపక్షం (8 చోట్ల) గెలుచుకోగా, మిగిలిన అన్ని చోట్లా అధికార పార్టీలే విజయం సాధించాయి. పుదుచ్చేరిలో నెల్లితోప్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నేత వి. నారాయణస్వామి గెలుచుకున్నారు.
♦ త్రిపుర రాష్ట్రంలో సీపీఎం అధికారంలో ఉండగా, ఆ రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలకు (బర్జాలా, కోవాయ్ అసెంబ్లీ నియోజకవర్గాలు) ఎన్నికలు జరగ్గా రెండింటిలోనూ సీపీఎం అభ్యర్థులు విజయం సాధించారు.
♦ 2015 లో మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో జరిగిన మొత్తం ఆరు స్థానాలకు జరిగిన ఉపఎన్నకల్లోనూ ఈ విధంగానే అధికార పార్టీలు గెలుపొందాయి. 1980 దశకం నుంచి ఉపఎన్నికల్లో అధికార పార్టీల "హవా"నే కొనసాగుతోంది.