అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : నగర, పురపాలక ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం శుక్రవారం సాయంత్రం ముగిసింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఇక నుంచి అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఏ విధమైన పద్ధతిలోనూ ప్రచారం నిర్వహించకూడదు. నియమావళిని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తారు. అనంతపురం కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని 11 మునిసిపాలిటీల పరిధిలోని 373 వార్డుల నుంచి 1,630 మంది బరిలో ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. మునిసిపల్ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు వైఎస్‌ఆర్‌సీపీతో పొత్తు పెట్టుకున్నాయి.
పొత్తులో భాగంగా సీపీఐ, సీపీఎం పార్టీలకు కేటాయించిన 373 వార్డుల్లో మినహా 362 వార్డుల నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 369 వార్డుల నుంచి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 146 వార్డుల నుంచి పోటీ చేస్తున్నారు. కార్పొరేషన్, అన్ని మునిసిపాలిటీల్లోని అత్యధిక వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కొన్ని వార్డుల్లో మాత్రం వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. సమైక్యాంధ్ర కోసం ఉద్యమించిన వైఎస్‌ఆర్‌సీపీ వైపు ప్రజలు అభిమానం చూపిస్తున్నారు. మహానేత అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, సామాజిక భద్రత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు అండగా నిలిచాయి.
వీటినే ప్రచార అస్త్రాలుగా చేసుకుని అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి ఓటు అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన విషయంలో ఈ రోజుకీ రెండు నాలుకల ధోరణితోనే ఉన్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో నిర్వహించే సభల్లో తాము లేఖ ఇచ్చిన కారణంగానే రాష్ట్ర విభజన జరిగిందని చెబుతున్నారు. సీమాంధ్రలో టీడీపీ నిర్వహించే సభల్లో ‘కొబ్బరి చిప్పల న్యాయం’ జరగలేదంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. దీంతో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు విభజన విషయంలో వారి పార్టీ అధినేత సిద్ధాంతం అడ్డంకిగా మారింది.
ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఒనగూరిన సంక్షేమం ఏమీ లేకపోగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పేద వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛను కూడా సక్రమంగా అందలేదు. ఇచ్చే రూ.75 పింఛను కోసం నెలల తరబడి ఎదురు చూసిన రోజులు అవి. ఇలాంటి ఘతన ఉన్న తమ నాయకుడి గొప్పతనం గురించి చెప్పుకునేందుకు అభ్యర్థులకు ఏమీ లేకపోవడంతో కేవలం తమ గురించి చెప్పుకుంటూ ఓటు వేసి గెలిపించాలంటూ ప్రజలను కోరుతూ ప్రచారం చేశారు.
రేపే పోలింగ్ : మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే మౌలిక సదుపాయాలను కల్పించారు. పోలింగ్ రోజున కేంద్రాల వద్ద ఎన్నికల ఆంక్షలు అమలులో ఉంటాయి. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రాలకు 100 మీటర్ల మేర వాహనాల, ప్రజల రాకపోకలు నిలిపివేస్తారు. ఓటర్లు మాత్రమే కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. ప్రజలు గుంపులుగా ఉండకూడదు. అభ్యర్థులు లేదా వారి ఎన్నికల ఏజంట్ మాత్రమే బూత్‌ల వద్ద ఉండాలి. బూత్ వద ్ద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అభ్యర్థులు ప్రచారం చేసుకోకూడదు. ఎన్నికల గుర్తులను బూత్‌ల వద్ద ప్రదర్శించకూడదు. ఎవరైనా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు.
ముగిసిన ప్రచారపర్వం
Published Sat, Mar 29 2014 4:14 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement