అధికార బలంతోనే నంద్యాలలో విజయం
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స
కొత్తపల్లి (పిఠాపురం): నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అధికార బలంతోనే విజయం సాధించిందని, ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన సోమవారం పార్టీ నాయకులతో కలిసి తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లిలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి దొరబాబు గృహంలో విలేకరులతో మాట్లాడారు. నంద్యాల ఎన్నికలో కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడి విజయం సాధించారని విమర్శించారు.
రోడ్లపై నడవనిచ్చేది లేదని, పింఛన్లు నిలిపివేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముద్రగడ ఉద్యమాన్ని అణచివేసే ధోరణి విడనాడాలన్నారు. సమావేశంలో పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, పిఠాపురం నియోజక వర్గ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు, రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు, మండల పార్టీ అధ్యక్షుడు ఆనాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
అది సానుభూతి గెలుపు: తమ్మినేని
శ్రీకాకుళం అర్బన్: నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో కాకుండా భూమా దంపతుల సానుభూతితో గెలుపొందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం చెప్పారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నంద్యాలలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా అధికార పార్టీ వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. చంద్రబాబు బావమరిది, సినీ నటుడు బాలకృష్ణ స్వయంగా డబ్బులు పంపిణీ చేస్తూ మీడియాకు అడ్డంగా దొరికిపోయారన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధితోనే గెలిచామని చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు చెప్పగలరా? అని ప్రశ్నించారు. అలాగైతే వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.
ప్రలోభాల గెలుపు: ఎమ్మెల్యే కంబాల జోగులు
రాజాం: నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి గెలిచిందని శ్రీకాకుళం జిల్లా రాజాం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులు తెలిపారు. ఆయన రాజాంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. నంద్యాల ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. 2009–2014 మధ్య పలు పర్యాయాలు ఉప ఎన్నికలు జరిగిన సందర్భాల్లో అన్ని చోట్లా టీడీపీ ఘోరపరాజయం చవిచూసిందని, చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని గుర్తుచేశారు.