టీడీపీని నంద్యాల ప్రజలు నమ్మరు: బొత్స
కర్నూలు: మళ్లీ నంద్యాల ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెడీ అయ్యారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాకు చంద్రబాబు 33 వాగ్దానాలు చేశారని, ఆయన ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా ఆచరణ సాధ్యమైందా? అని ఆయన ప్రశ్నించారు. చెప్పిన మాటను ఎప్పుడైనా చంద్రబాబు నెరవేర్చారా అని ఆయన నిలదీశారు. నంద్యాల ఉప ఎన్నికలో అధికార టీడీపీ పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురిచేస్తున్న నేపథ్యంలో బొత్స గురువారం నంద్యాలలో మీడియాతో మాట్లాడారు.
చిత్తశుద్ధిలేకనే ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చడం లేదన్నారు. ఉప ఎన్నికలు రాష్ట్రంలో చాలా సందర్భాల్లో వచ్చాయని, నంద్యాల ఉప ఎన్నికకు ఎందుకింత ప్రాధాన్యమిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధంగా నంద్యాల ఉప ఎన్నిక జరుగుతోందని, అక్రమాలు, అరాచకాలతో ఉప ఎన్నికలో గెలువాలని టీడీపీ భావిస్తోందని బొత్స ధ్వజమెత్తారు
నంద్యాలలో పోలీసులతో బలహీన వర్గాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బొత్స మండిపడ్డారు. జిల్లా మంత్రి పోలీసుల చర్యకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. 'పదేళ్లు నేను మంత్రిగా ఉన్నాను. ఎప్పుడైనా ఇలా జరిగిందా? టీడీపీ తాటాకు చప్పుళ్లకు నంద్యాల ప్రజలు భయపడరు' అని తేల్చి చెప్పారు. మంత్రులే తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడ్డారని, ఇంకా ఏ ముఖం పెట్టుకొని వచ్చి నంద్యాలలో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ప్రజల ఆవేదన, కన్నీళ్లు కనిపించడం లేదా? అని నిలదీశారు. ప్రభుత్వ పెద్దలు అంతా అమాయకులు అనుకుంటున్నారని, డబ్బులిచ్చి ఓట్లు కొనేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని విమర్శించారు. దోచుకున్న డబ్బుతో ఓటుకు ఐదువేలు ఇవ్వగలనని చంద్రబాబు అనుకుంటున్నారని, ఆయన కంటికి అంతా భిక్షగాళ్లలా కనిపిస్తున్నారని మండిపడ్డారు. సీఎం చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా మారాయని, టీడీపీ దుష్టశక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని బొత్స అన్నారు.
'నంద్యాల ప్రజలు అమాయకులు కాదు. తప్పుడు వాగ్దానాలు చేస్తున్న టీడీపీని నమ్మరు. నంద్యాల నుంచే దుష్టశక్తులకు గుణపాఠం చెప్పాలి. వైఎస్‌ఆర్ పాలన తిరిగి తెచ్చేందుకు నంద్యాల ఎన్నిక నాంది కావాలి' అని బొత్స వ్యాఖ్యానించారు.