విలేకర్లతో మాట్లాడుతున్న బొత్స
గుంటూరు రూరల్: రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తోందని, 400 మండలాల్లో వర్షాభావం ఉన్నా, ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేకపోగా, దీనిని అడ్డం పెట్టుకుని రెయిన్‌గన్స్ పేరుతో రూ.1600 కోట్ల దోపిడీకి రంగం సిద్ధం చేస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌నేత, గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గుంటూరు నగర శివారుల్లోని ఏవీఆర్ ఫంక్షన్ హాలులో గురువారం జరగనున్న వంచనపై గర్జన నిరసన దీక్షా ప్రాంగణాన్ని బుధవారం ఆయన పరిశీలించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఇద్దరు మంత్రులు, స్పీకర్ కోడెల శివప్రసాద్ అందిన కాడికి జిల్లాను దోచుకుని తింటున్నారని ధ్వజమెత్తారు. వీరితో పాటు మరో ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే దాన్ని ఆసరాగా తీసుకుని రెయిన్‌గన్‌లపేరుతో వర్షాలు సృష్టిస్తామని ప్రభుత్వ పెద్దలు రూ.1600 కోట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల ఎకరాల్లో సాగు నిలిచిపోయిందని, ఇప్పటికే విత్తనాలు విత్తిన 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతూ రైతు నష్టాల్లో కూరుకుపోయాడన్నారు. ఇంత జరుగుతున్నా రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం సిగ్గుచేటన్నారు.
ప్రజలను దోచుకుంటున్న గుంటూరు టీడీపీ నవరత్నాలు...
రాష్ట్రాభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీ అధినేత జననేత జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల్లాంటి పథకాలను ప్రకటించారని, గుంటూరు జిల్లాలో టీడీపీ వారు మాత్రం తొమ్మిదిమంది శాసన సభ్యులు సెటిల్‌మెంట్‌లు, దందాలు, కల్తీలు, ఇసుక, మట్టిమాఫియాల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చుకుంటున్నారన్నారు. అందులో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ మాఫియా పేరుతో పేదల క్వారీలను కబ్జాలు చేసి వందల కోట్లు దండుకున్నాడన్నారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సైతం ఆగ్రహం వ్యక్తం చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం మన ఖర్మన్నారు.
Comments
Please login to add a commentAdd a comment