సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందుకే రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబు మళ్లీ నోరెత్తడం లేదన్నారు. టీడీపీ వత్తాసుతోనే రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు గానీ టీడీపీ నేతలు గానీ బీజేపీని ఏమీ అనడం లేదన్నారు. విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చకపోవడంపై ఎందుకు మాట్లాడటం లేదని చంద్రబాబును నిలదీశారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం పైన, చంద్రబాబు చేస్తున్న వంచనపైన తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రతి రోజూ బహిరంగ సభల్లో మాట్లాడుతూనే ఉన్నారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పులను నిలదీస్తూనే ఉన్నారని బొత్స గుర్తు చేశారు.
ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మోదీకి వంగివంగి దండాలు పెట్టడం తప్ప నాలుగేళ్లుగా చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. నీతి ఆయోగ్ సమావేశం నుంచి పులిలా వస్తానంటూ ప్రచారం చేయించుకున్న చంద్రబాబు.. చివరకు పిల్లి కంటే ఘోరంగా వచ్చారని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తనపై తప్పుడు కేసులు పెడతారని, ప్రజలు తనకు రక్షణ వలయంగా నిలబడాలని చంద్రబాబు అన్నారని.. మరి ఎన్నికలు పూర్తయి నెలలు గడుస్తున్నా కేసులు ఎందుకు పెట్టలేదని బొత్స ప్రశ్నించారు. చీకటి ఒప్పందం వల్లే మీపై కేసులు పెట్టడం లేదా అని బాబును ప్రశ్నించారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. వైఎస్ జగన్ నేతృత్వంలో నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, ఉక్కు ఫ్యాక్టరీ, దుగరాజపట్నం పోర్టు కోసం పోరాటం చేస్తున్నామని.. టీడీపీ నేతలు ఒక్క రోజైనా పార్లమెంటులో ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని లేవనెత్తారా? అని బొత్స ప్రశ్నించారు.
ప్రజలు పాలించమంటే.. మోసాలు చేస్తారా?
పాలించే అవకాశం ఇస్తే చంద్రబాబు మాత్రం ప్రజలను మోసం చేస్తున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. తణుకులో ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ కుటుంబీకులకు చెందిన వెంకటరాయ ఎంటర్‌ప్రైజెస్ చిట్‌ఫండ్‌కు చెందిన అటాచ్‌మెంట్ ఆస్తులను సీఎం చీకటి జీవోల ద్వారా డిటాచ్‌మెంట్ చేశారని ఆరోపించారు. ముళ్లపూడి కుటుంబీకులు టీడీపీలో ఉన్నందునే.. కంపెనీ ఆస్తులను విడుదల చేశారన్నారు. తద్వారా ఖాతాదారుల పొట్టగొట్టారని విమర్శించారు. మోసపోయిన డిపాజిట్‌దారులను ఎవరు ఆదుకుంటారనని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులపైనా ఇలాగే చేస్తారా? అని అనుమానం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులపై చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ల కన్ను పడిందన్నారు. ఆ ఆస్తులను కాజేసేందుకే ముందస్తుగా ఈ జీవో జారీ చేసినట్లున్నారని అనుమానం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా హింసించి.. ఇప్పుడు ఓట్లేయమంటే అంగన్‌వాడీ మహిళలు ఎలా వేస్తారని ప్రశ్నించారు.
బీజేపీతో చంద్రబాబు చీకటి ఒప్పందం
Published Tue, Jun 26 2018 2:39 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment