సాక్షి, హైదరాబాద్: ప్రజల్ని నిలువునా ముంచేసిన వెంకట్రాయ చిట్‌ఫండ్ మోసం వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ యంత్రాంగం దొడ్డిదారి వ్యవహారాలకు తెరలేపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపిచారు. మోసం చేసిన సంస్థకు సంబంధించిన ఆస్తుల వేలాన్ని కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని, తద్వారా టీడీపీ నాయకుల అక్రమాలకు ముఖ్యమంత్రి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బాధితులకు ప్రభుత్వమే డిపాజిట్లు ఇస్తుందా?: ‘‘అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ఆ సంస్థ ఆస్తులను అమ్మేసి, తద్వారా వచ్చిన డబ్బును బాధితులకు ఇస్తున్నారు. మరి వెంకట్రాయ చిట్‌ఫండ్ కేసులో మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు? డీజీపీ ఉత్తర్వుల ద్వారా వెంకట్రాయ ఆస్తుల వేలాన్ని ప్రభుత్వం ఎందుకు నిలుపుదల చేయించింది? వెంకట్రాయ సంస్థ టీడీపీ నాయకులకు చెందిందనే కదా! ఖాతాదారుల ఫిర్యాదు మేరకు అప్పటి ప్రభుత్వం వెంకట్రాయ చిట్‌ఫండ్ కుంభకోణంపై కమిటీ వేసింది.. దొడ్డి దారిన తన ఆస్తుల్ని అమ్ముకుంటున్నట్లు గుర్తించిన వెంటనే సంస్థ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. కానీ ఇప్పుడు.. ఆ ఆస్తుల వేలానికి టీడీపీ ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఇలా చేస్తే ఖాతాదారులకు డిపాజిట్లను ఎవరు చెల్లించాలి, ప్రభుత్వమే చెల్లిస్తుందా, జనం గోస మీకు పట్టదా?’’ అని బొత్స నిలదీశారు. వెంకట్రాయ, అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్‌సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తోడుదొంగలు టీడీపీ-బీజేపీ ఇంకా కలిసే ఉన్నారు: బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని టీడీపీ పైకి చెబుతున్నా వారింకా కలిసే ఉన్నారనడానికి బోలెడు ఉదాహరణలున్నాయని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ‘‘కర్ణాటక ఎన్నికలు అయిపోగానే చంద్రబాబుపై బీజేపీ కేసులు పెడుతుందని, ప్రజలంతా అండగా ఉండాలని టీడీపీ ప్రచారం చేసుకుంది. కర్ణాటక ఎన్నికలు ముగిసి 40 రోజులు కావొస్తోంది. మరి ఆ కేసులేమైనట్లు? ఇది ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయానికి నిదర్శనం కాదా? ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వంగివంగి దండాలు పెట్టి దాదాపు 10రోజులైంది. దానిపై వివరణలేకపోగా, కేంద్రానికి లేఖలంటూ చంద్రబాబు కొత్త నాటకాలు మొదలుపెట్టారు. పదవీకాలం వారంలో ముగుస్తుందనగా కేంద్ర మంత్రి భర్త.. ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు, మరి టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా ఉన్న మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్య రాజీనామా చేయకపోవడానికి గల కారణాలేమిటి? టీడీపీ సర్కార్ అసమర్థత, కమిషన్ల కక్కుర్తి వల్లే కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకాలేదన్నది పచ్చి వాస్తవం. టీడీపీ-బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లాయి. వీళ్ల డ్రామాలను ప్రజలకు తెలియజెప్పడానికే ఈ నెల 30న అనంతపూర్‌లో వైఎస్సార్‌సీపీ దీక్ష చేయబోతున్నాం’’ అని బొత్స వివరించారు. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా సాధన దిశగా ప్రజలను సమాయత్తం చేయడంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అన్ని జిల్లాల్లో దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.
వెంకట్రాయ బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం: కారుమూరి
వేలమంది డిపాజిటర్లను మోసం చేసిన వెంకట్రాయ చిట్‌ఫండ్ కంపెనీ ఆస్తులను వేలం వేయనీయకుండా ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని తణుకు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చిట్‌ఫండ్ బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నదని వాపోయారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే వెంకట్రాయ ఆస్తుల విక్రయాలను ప్రభుత్వం నిలిపేసిందని.. అగ్రిగోల్డ్ పట్ల ఒక రకంగా, వెంకట్రాయ చిట్ ఫండ్ పట్ల ఇంకో రకంగా వ్యవహరిస్తున్నారని, అనుకూలంగా ఉండే వ్యక్తులను మాత్రమే విచారించి కేసును మూసేయడం కుట్రపూరితంగా జరిగిందేనని ఆరోపించారు. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని కారుమూరి డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన వైఎస్సార్‌సీపీ నిరంతరాయంగా పోరాడుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment