సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వ దోపిడీపై పుస్తకం తీసుకొచ్చి దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు అందజేస్తామని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ముస్లింలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం బొత్స మాట్లాడుతూ దోపిడీ వల్ల రాష్ట్రానికి ఏ మేరకు నష్టం చేశారు.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందుల్లోకి నెట్టారనే వాస్తవ విషయాలను పుస్తకరూపంలో స్పష్టంగా వివరిస్తామని చెప్పారు. టీడీపీ నేతలు చేసే అవినీతిని చూస్తూ కళ్లు మూసుకుని కూర్చోలేమన్నారు. ‘‘మమ్మల్ని వాచ్‌డాగ్‌లాగా ప్రతిపక్షంగా ఉండమని ప్రజలు ఎన్నుకున్నారు.
వారికి ఇబ్బందులు కలిగే కార్యక్రమాలు జరిగితే.. వాటిని ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి చెప్పాలి. తగిన ఏజెన్సీలకు తెలియజేయాలి. ప్రజలకు ఆసరాగా ఉండాలనేదే ప్రతిపక్షం బాధ్యత. మీలా పిరికిపందల్లా వ్యవహరించం’’ బహిరంగంగా ప్రజలకు వాస్తవాలు చెబుతామన్నారు. కేంద్రం వత్తాసుతో టీడీపీ ఎంత దోపిడీ చేసిందో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పుడేమో బీజేపీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయంటూ కొత్త నాటకానికి తెరలేపి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఏర్పడి 8 ఏళ్లయిందని, పార్టీ పుట్టినప్పటి నుంచి ఒంటరిగానే పోటీ చేసి ప్రజల మన్ననలు పొందిందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
ప్రజల ఆదరాభిమానాలతో, అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది...మాకంటే ముందు రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం వెంకటేశ్వరస్వామిని మొక్కుతున్నారని’’ బొత్స సత్యనారాయణ తెలిపారు. పీఏసీ అధ్యక్షుడు, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను కలిసి భోజనం చేసి...తర్వాత అక్కడి నుంచి కారులో మార్గమధ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని దించేసి వెళ్తే.. టీడీపీ నేతలు భూతద్దంలో చూడడం ఏమిటని ప్రశ్నించారు.బుగ్గన ఢిల్లీకి వెళ్తే టీడీపీ నేతలు ఎందుకు భయపడాల్సి వస్తోందన్నారు.
లాలూచీ రాజకీయాలు ఎవరివి బాబు..
‘‘బీజేపీకి చెందిన నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి...ఆమె భర్త పరకాల ప్రభాకర్ మాత్రం సీఎం చంద్రబాబు పక్కనే ఉంటారు. మహారాష్ట్రకు చెందిన ఓ మంత్రి భార్యకు టీటీడీలో మెంబర్‌గా అవకాశం ఇస్తారు...కేంద్రంతో సన్నిహిత సంబంధాలకు సంధానకర్తగా ఉండడం కోసమే రాజకీయాలు చేస్తూ’’.. మాపైనే బురద చల్లుతావా అంటూ బొత్స చంద్రబాబును ప్రశ్నించారు. లాలూచీ రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. అవినీతిలో చంద్రబాబు పీకల్లోతు కూరుకునిపోయారని ధ్వజమెత్తారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు దోచుకుని పారిపోదామని అనుకుంటున్నారని విమర్శించారు. అందుకే ప్రజలకు రక్షణగా ఉండాల్సిన సీఎం.. తనకు రక్షణ కావాలని అడుగుతున్నారని బొత్స విమర్శించారు.
రాష్ట్రంలో 1763 అలాట్మెంట్స్ కోసం 13,360 ఎకరాలు ఇస్తే 83 మాత్రమే ఇంప్లిమెంట్ వర్క్స్ నడుస్తున్నాయని.. టీడీపీ నేతలు ఏర్పాటు చేసే బస్సుల్లో వెళ్లి ఈ బ్రహ్మాండాన్ని చూడాలా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌తో పాటు విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేయడమే కాకుండా నిరాహార దీక్షలు చేస్తే హేళన చేస్తూ.. ప్యాకేజీ వస్తుందని రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి ఇప్పుడేమో హోదా అంటూ యూ టర్న్ తీసుకుని సభలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. పోర్టుకు ఫీజుబులిటీ లేకపోతే ఎకనామిక్ జోన్ ఇవ్వమని ప్రధానిని చంద్రబాబు అడగడం ఏమిటని, నాలుగేళ్లుగా పోర్టు మాట చంద్రబాబు నోట రాలేదేం అని ప్రశ్నించారు. ప్రజలంతా టీడీపీకి ఎప్పుడు బుద్ధి చెప్పాలా అని ఎదురు చూస్తున్నారన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు అయన సమాధానం ఇస్తూ హెరిటేజ్‌కు షేర్లు ఏ రకంగా పెరిగాయో, సింగపూర్‌కు విదేశీ ధనం ఎలా తరలిస్తున్నారో..ఎక్కడెక్కడ ఏఏ ఖాతాలున్నాయో ప్రజలందరికీ తెలుసని చెప్పారు.
అగ్రిగోల్డ్ రామారావును ఎందుకు కలిశావో చెప్పు..
‘‘కేంద్రంపై అవిశ్వాసం సందర్భంగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అగ్రిగోల్డ్ వ్యవహారంలో అమర్‌సింగ్‌ను కలిసింది నిజమా? కాదా? అని ప్రశ్నిస్తే అవును కలిశామని, హోదా కోసమని చెప్పారు. మరి అగ్రిగోల్డ్ రామారావును ఎందుకు కలిశారో చంద్రబాబు చెప్పాలని’’ బొత్స డిమాండ్ చేశారు. తొలుత మేం చెబితే నో అన్నారని,ఆధారాలు బయట పెడతామనగానే అవునన్నారని, ఇదీ చంద్రబాబు దుష్ట నైజమని బొత్స దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment