అది అప్రజాస్వామిక గెలుపు
- ఆ తరహా విజయాలను చూసి బెదిరేది లేదు
- చంద్రబాబుపై ధ్వజమెత్తిన భూమన కరుణాకర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి దక్కింది అప్రజాస్వామిక గెలుపు మాత్రమేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఈ తరహా విజయాలను చూసి బెదిరిపోవడం, ఢీలా పడటం వంటివి తమకు లేనేలేవని స్పష్టం చేశారు. నంద్యాల ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే ద్విగుణీకృత ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకుపోతామని భూమన చెప్పారు. సోమవారం ఉదయం తిరుపతి టీఎంఆర్ కల్యాణ మండపంలో నవరత్నాలసభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూమన నంద్యాల ఎన్నికల ఫలితాలపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం చంద్రబాబు పన్నిన కుట్రలను వివరించారు. నంద్యాల ఎన్నికల్లో అధికార పార్టీ అడ్డదారుల్లో విజయాన్ని దక్కించుకుందన్నారు. రూ. 1,500 కోట్ల ప్రభుత్వ సొమ్మును, రూ. 500 కోట్ల అవినీతి డబ్బును నంద్యాల సెగ్మెంట్‌లో అ«ధికార పార్టీ వెదజల్లిందన్నారు. ఒక వైపు పోలీసులు, మరో వైపు అన్ని విభాగాల అధికార యంత్రాంగంతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. రూ. 2వేల నోట్ల కట్టలను లారీలతో తెచ్చి వెదజల్లారని, చంద్రాబాబు దుర్మార్గమైన రాజకీయాన్ని నడిపారని భూమన ధ్వజమెత్తారు.