ఉప పోరుకు సర్వం సిద్ధం
ఉప పోరుకు సర్వం సిద్ధం
Published Wed, Aug 23 2017 4:11 AM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM
- నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్
- 6 గంటల్లోపు వరుసలో నిల్చున్న వారందరికీ ఓటు వేసేందుకు అనుమతి
- 82 ప్రత్యేక స్క్వాడ్‌లు.. అభ్యర్థుల వెంట షాడో పార్టీల నియామకం
- 15 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న 2,18,858 మంది ఓటర్లు
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నేడు(బుధవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికను అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పోలింగ్‌ను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కర్నూలు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. గతంలో ఏ ఉప ఎన్నికకూ లేనివిధంగా నంద్యాల ఉప ఎన్నికకు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి హిమాన్స్ జ్యోతి చౌదరిని సాధారణ పరిశీలకుడిగా నియమించింది. అలాగే వ్యయ పరిశీలకుడిగా మూకాంబికేయన్‌ను, పోలీసు పరిశీలకుడిగా డేవిడ్‌సన్‌ను నియమించింది. పోలింగ్ కేంద్రంలో జరిగే ప్రతి అంశాన్ని గమనించేందుకు ఒక్కో కేంద్రానికి ఒక సూక్ష్మ పరిశీలకుడిని నియమించారు. వీరు సాధారణ పరిశీలకుడి ఆధ్వర్యంలో పనిచేస్తారు.
82 ప్రత్యేక స్క్వాడ్‌లు
కర్నూలు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఉప ఎన్నిక ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఎన్నికల కమిషన్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పోలింగ్ ప్రక్రియను లైవ్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాల వద్ద వరుసలో నిల్చున్న వారందరినీ ఓటు వేసేందుకు అనుమతిస్తారు. నియోజకవర్గాన్ని 20 రూట్లుగా విభజించి.. రూట్ అధికారులను నియమించారు. 20 మంది జిల్లా అధికారులు సెక్టోరల్ అధికారులుగా ఉన్నారు. 82 ప్రత్యేక స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులను అనుసరించేందుకు ప్రత్యేకంగా షాడో పార్టీలను ఏర్పాటు చేశారు. మొబైల్ స్క్వాడ్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్‌లను రంగంలోకి దించారు. 141 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలను మోహరించారు. ఎలాంటి సమస్య తలెత్తినా 92231 66166 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చు. వెంటనే సంబంధిత రూట్ అధికారులను అప్రమత్తం చేస్తారు.
247 పోలింగ్ కేంద్రాలకు లైవ్ వెబ్‌కాస్టింగ్
నంద్యాల ఉప ఎన్నిక నిర్వహణకు 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు లైవ్ వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించాల్సి ఉండగా.. ఎనిమిది కేంద్రాలకు ఈ అవకాశం లేదని అధికారులు తేల్చారు. భీమవరంలో 2, బిల్లలాపురంలో 2, పార్వతీపురంలో 2, ఎస్.నాగులవరంలో 1, బీవీ నగర్‌లో 1 పోలింగ్ కేంద్రాలకు ఏ నెట్‌వర్క్ అందని కారణంగా వెబ్‌కాస్టింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. దీంతో 247 పోలింగ్ కేంద్రాలకు లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అవకాశం లేని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 247 పోలింగ్ కేంద్రాల్లో 195 కేంద్రాలకు బీఎస్‌ఎన్‌ఎల్, 52 కేంద్రాలకు జియో నెట్‌వర్క్‌తో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించనున్నారు.
Advertisement
Advertisement