అధిక ఉప్పు శాతం నీటి కోసం ఆక్వా రైతుల తవ్వకాలు
అనేకచోట్ల 200–300 అడుగుల్లో బోర్లు
దీంతో 100 అడుగులు దాటగానే ఎగదన్నుతున్న చమురు, సహజవాయువు
ఇవి మినీ బ్లో అవుట్‌లుగా మారడంతో కోనసీమ వాసుల్లో కలవరం
బోరుబావులపై కొరవడిన నియంత్రణ
సాక్షి అమలాపురం : గ్యాస్ పైప్‌లైన్ల లీకేజీలు.. తద్వారా వెదజల్లే చమురు.. అప్పుడప్పుడూ బ్లో అవుట్‌లు.. పచ్చని కోనసీమలో ఇవి సర్వసాధారణం. కృష్ణా–గోదావరి బేసిన్ (కేజీ బేసిన్)లో గ్యాస్, చమురు వెలికితీత కార్యకలాపాలు మొదలైన తరువాత ఈ ప్రాంత వాసులకు ఇది నిత్యకృత్యంగా మారిపోయింది. వీటికి ఇప్పుడు ఆక్వాసాగు తోడైంది.
చప్పనీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఉప్పునీటి కోసం వందల అడుగుల లోతున బోర్లు వేస్తుండడం.. వాటి నుంచి గ్యాస్, చమురు వచ్చి మినీ బ్లో అవుట్‌లుగా మారడం కోనసీమ వాసుల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా.. రాజోలు మండలం చింతపల్లిలో బోరుబావి నుంచి భారీగా గ్యాస్ ఎగదన్నిన విషయం తెలిసిందే.
అసలు కేజీ బేసిన్‌లో చమురు, గ్యాస్ వెలికితీతల సమయంలో పలు దుర్ఘటనలు చోటుచేసుకోవడం.. కొన్ని విషాదకరమైన చేదు జ్ఞాపకాలను కూడా మిగిల్చిన విషయం తెలిసిందే. జిల్లాలో అల్లవరం గ్రామాన్ని ఆనుకుని దేవర్లంక, అమలాపురం మండలం తాండవపల్లి వద్ద భారీ బ్లో అవుట్ చోటుచేసుకున్నాయి. నగరం గ్యాస్ పైప్‌లైన్ లీకవ్వడంవల్ల 19 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇవికాకుండా.. ఏదోక ప్రాంతంలో తరచూ గ్యాస్ పైప్‌లైన్ల లీకులు, చమురు లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి.
మినీ బ్లో అవుట్‌లుగా మారిన ఆక్వా బోర్లు..
ఆక్వా చెరువుల కోసం తవ్వుతున్న బోర్లు ఇప్పుడు మినీ బ్లో అవుట్‌లుగా మారిపోయాయి. అధిక ఉప్పు సాంద్రత (సెలైనిటీ) ఉన్న నీటికోసం వందల అడుగుల లోతున బోర్లు వేస్తున్నారు. వీటి ద్వారా గ్యాస్, చమురు ఎగదన్నుకు వస్తున్నాయి. ఇక్కడ భూమిలోని మట్టి పొరల్లో గ్యాస్ నిక్షిప్తమై ఉంది. రైతులు చప్పనీటి సాగు పేరుతో గ్రామీణ నీటి సరఫరా శాఖ నుంచి అనుమతి పొందుతున్నారు. 30–40 అడుగులు లోతున బోరు బావి తవ్వకాలు చేస్తే సరిపోతుంది.
కానీ, ఆక్వా రైతులు అధిక ఉప్పు శాతం ఉన్న నీటి కోసం ఏకంగా 250 నుంచి 300 అడుగుల లోతున తవ్వేస్తున్నారు. దీంతో చాలాచోట్ల దిగువనున్న గ్యాస్, చమురు ఎగదన్నుకు వస్తోంది. బోరు అనుమతిచ్చే సమయంలోనే ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు బోరు తవ్వకాలపై పక్కాగా నిఘా పెట్టాల్సి ఉంది.
ఇటీవల రాజోలు మండలం శివకోడు వద్ద ఓ ఆక్వా రైతు ఏకంగా 270 అడుగుల లోతున ఉప్పునీటి తవ్వకాలు చేయడంతో గ్యాస్ ఎగదన్ని ప్రమాదానికి కారణమైంది. అక్కడున్న గ్యాస్ లభ్యతను బట్టి ఒకట్రెండు రోజులు గ్యాస్ ఎగిసిపడుతుంది. ఒకప్పుడు సముద్ర తీర ప్రాంతాలు.. గ్రామ శివారుల్లో ఉండే ఆక్వా చెరువులు ఇప్పుడు జనావాసాల మధ్యకు వస్తున్నాయి. ఇటువంటి చోట గనుక బోరుబావుల నుంచి గ్యాస్ ఎగదన్ని మంటలు వ్యాపిస్తే ప్రమాదం తీవ్రత అధికంగా ఉంటుంది.
ఆక్వాసాగుతో పైపులైన్లకు దెబ్బ..
నిజానికి.. ఆక్వాసాగు పెరగడంవల్ల ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలకు చెందిన పైప్‌లైన్లు తుప్పుపడుతున్నాయి. ఈ సాగువల్ల భూమిలో ఉప్పుశాతం పెరిగి 25 ఏళ్లు బలంగా ఉండాల్సిన ఈ గ్యాస్ పైప్‌లైన్లు 15 ఏళ్లకే దెబ్బతింటున్నాయి. అలాగే, సిస్మిక్ సర్వేల పేరుతో జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) వేలాదిచోట్ల భూమి పొరల్లో బాంబింగ్ చేస్తోంది. వీటిని నిబంధనల మేరకు పూడ్చకుండా వదిలేస్తున్నారు. ఇటువంటి చోట నిల్వ ఉన్న గ్యాస్ అప్పుడప్పుడు ఎగదన్నుకు వచ్చి మంటలు చెలరేగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment