![Aquaculture farmers asked by some forest department officials for bribes](/styles/webp/s3/article_images/2025/02/15/bribe.jpg.webp?itok=4KQMg1-H)
ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్
లేదంటే అడ్డుకుంటామంటున్న కొందరు అటవీ అధికారులు
200 మంది నుంచి వసూళ్లు.. మిగతా వారికి వేధింపులు
విసుగెత్తి లంచాల వీడియోలు తీసిన నిడమర్రు రైతులు
డబ్బులు తీసుకుంటున్న సెక్షన్ అధికారి వీడియో విడుదల
సాగుకు అనుమతించకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటున్న రైతులు
నిడమర్రు: కొల్లేరు అభయారణ్యం పరిధిలోని జిరాయితీ భూముల్లో సంప్రదాయ ఆక్వా సాగు చేసుకొనే రైతులను కొందరు అటవీ శాఖ అధికారులు లంచాల కోసం పీడిస్తున్న వైనం బయటపడింది. ఎకరాకు రూ.10 వేలు ఇస్తేనే సాగుకు అనుమతిస్తామని, లేదంటే కేసులు పెడతామంటూ ఏలూరు జిల్లా నిడమర్రు రైతులను నిత్యం వేధిస్తుండటంతో... రైతులు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి బయటపెట్టారు. రైతులు చెప్పిన వివరాల ప్రకారం.. కొల్లేరు అభయారణ్యం పరిధిలో ఉన్న నిడమర్రు పంచాయతీ వెంకటాపురం గ్రామంలో 600 ఎకరాల వరకు పట్టాలు ఉన్న జిరాయితీ భూములు ఉన్నాయి.
ఈ భూములకు డబ్బులు ఇస్తామని చెప్పిన అధికారులు నేటి వరకూ ఇవ్వలేదు. సాగు చేసుకునేందుకు కూడా అనుమతులివ్వలేదు. దీంతో చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 20 ఏళ్లుగా ఇవి బీడు భూములుగానే ఉన్నాయి. ఇటీవల అటవీ శాఖ అధికారుల తరఫున ఏలూరు రేంజ్ కార్యాలయం సెక్షన్ అధికారి నబిగిరి శ్రీనివాస్ రైతులను కలిసి ఎకరాకు రూ.10 వేలు ఇస్తే సాగుకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.
సుమారు 200 మంది రైతుల నుంచి ఎకరాకు రూ.10 వేలు వసూలు చేశారు. నిడమర్రుకు చెందిన మండా పోలయ్యను కూడా 5 ఎకరాలకు రూ.50 వేలు డిమాండ్ చేశారు. పోలయ్య నుంచి ఈ నెల 6న ఇంటి ముందు రోడ్డుపైనే రూ.30 వేలు నగదు తీసుకున్నారు. మిగతా రూ.20 వేలకు అదే పనిగా ఫోన్లు చేస్తుండటంతో ఫోన్‌పే నంబరు ఎవరిదైనా చెప్పండని పోలయ్య అడగ్గా.. తన ఫోన్‌కే వెయ్యండని చెప్పారు. దీంతో 10వ తేదీన శ్రీనివాస్‌కు రూ.10 వేలు పంపించారు.
మిగతా రూ.10 వేల కోసం చెరువుల వద్దకు వచ్చి హడావుడి చేస్తుండటంతో రైతులు విసిగిపోయారు. శ్రీనివాస్‌కు లంచం ఇస్తున్న సీసీ కెమెరా పుటేజ్, దూరం నుంచి సెల్ ఫోన్‌లో రికార్డు చేసిన వీడియో, రూ.10 వేలు ఫోన్ పే చేసిన స్క్రీన్ షాట్, ఆడియో రికార్డులను ‘సాక్షి’కి అందించి, వారి గోడు వెళ్లబోసుకున్నారు. కొల్లేరు అభయారణ్యంలో అన్ సర్వే భూముల్లో దర్జాగా ఆక్వా సాగు చేస్తున్న బడా బాబులను వదిలేసి, తమలాంటి పట్టా భూములున్న చిన్న, సన్నకారు రైతులను అధికారులు పీడిస్తున్నారని తెలిపారు. తమ భూముల్లో వ్యవసాయానికి అనుమతించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం: ఏలూరు డీఎఫ్‌వో డి. విజయ
ఈ లంచాల వ్యవహారంపై ఏలూరు డీఎఫ్‌వో డి. విజయను వివరణ కోరగా.. సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు తన దృష్టికి రాలేదని చెప్పారు. ఈ విషయంలో తగిన విచారణ జరిపి, వాస్తవం అయితే శ్రీనివాస్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/39.jpg)
భూమి ఉన్నా ఆదాయం లేక కూలి పనికి వెళుతున్నా
నాకు ఉన్న 4 ఎకరాలు 5వ కాంటూరు పరిధిలో ఉందంటూ 20 ఏళ్లుగా సంప్రదాయ వ్యవసాయానికి కూడా అధికారులు అనుమతించడంలేదు. దీంతో రైతు అయినా నేను కూలి పనులు చేసుకుంటున్నాను. భూములు తీసుకున్నందుకు అధికారులు పరిహారమూ ఇవ్వడంలేదు. సాగు చేసుకుంటే అటవీ శాఖ సిబ్బంది రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అనుమతులు ఇవ్వకపోతే మా కుటుంబాలకు ఆత్మహత్యలే శరణ్యం. – ఎలిశెట్టి నాగేశ్వరరావు, రైతు, నిడమర్రు
పన్ను కూడా కట్టించుకుంటున్నారు
నాకు 3 ఎకరాల జిరాయితీ పట్టా భూమి ఉంది. దానికి రెవెన్యూ అధికారులు ఇక్కడ పంట పొలం కింది ఏటా రూ. 300 పన్ను కూడా కట్టించుకుంటున్నారు. నా పొలం దిగువన ఉండటంతో పైనుంచి రొయ్య, చేపల చెరువుల నీరు రావడంతో వ్యవసాయం కూడా చేసుకోలేకపోతున్నాం. అందరితో పాటు సంప్రదాయ చేపల సాగుకు గట్టు వేసేందుకు ప్రయత్నిస్తుంటే అటవీ శాఖ అధికారులు మామూళ్లివ్వాలంటూ ఇబ్బందులు పెడుతున్నారు. – జాలే శ్రీను, రైతు, నిడమర్రు
Comments
Please login to add a commentAdd a comment