Kolleru Sanctuary
-
కొల్లేరులో వి‘హంగామా’
శీతాకాలపు విడిది పక్షుల కిలకిలారావాలతో కొల్లేరు కళకళలాడుతోంది. ఇక్కడే పుట్టి.. బతుకు పయనంలో వేల కిలోమీటర్ల మేర వలస పోయిన అతిథి పక్షులు గమనం తప్పకుండా ఏటా మాదిరిగానే విడిది కోసం కొల్లేరు అభయారణ్యానికి వస్తున్నాయి. సంతానాన్ని వృద్ధి చేసుకుని.. పిల్లలతో కలిసి విదేశాలకు వలస పోయేంతవరకు ఇక్కడే గూళ్లు కట్టుకుని సందడి చేస్తుంటాయి. నిండా పక్షులతో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని కొల్లేరు ప్రాంతం ఈ ఏడాదీ పర్యాటకులకు ఆహ్వా నం పలుకుతోంది. ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొల్లేరు పక్షుల వీక్షణకు అనువైన కాలం. ఈ దృష్ట్యా ఆటపాక, మాధవాపురం పక్షుల విహార కేంద్రాల వద్ద పర్యాటకుల కోసం అటవీ శాఖ మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ ఏడాది ఎక్కువ మంది పర్యాటకులు కొల్లేరుకు విచ్చేస్తారని అంచనా వేస్తోంది. - కైకలూరు 105 రకాల పక్షులున్నాయ్ కొల్లేరు అభయారణ్యంలో వివిధ జాతులకు చెందిన 105 రకాల పక్షి జాతులు ఉన్నట్టు ఏషియన్ వాటర్ బర్ట్స్ సెన్సస్–2023 నివేదిక వెల్లడించింది. ఇక్కడ మొత్తం 81,495 పక్షులు ఉన్నట్టు నిర్థారించారు. వీటిలో అత్యధికంగా 7,875 కోయిలలు ఉండగా.. రెండో స్థానంలో 6,869 పెలికాన్లు (గూడబాతులు) ఉన్నట్టు తేల్చింది. వీటితోపాటు ఎర్రకాళ్ల కొంగ (పెయిండెడ్ స్టార్క్), కంకణాల పిట్ట (గ్లోబీ ఐబీస్), నల్లరెక్కల ఉల్లంకి పిట్ట (బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్) వంటి అనేక పక్షి జాతులు ఇక్కడ సందడి చేస్తున్నాయి. ఇవికాకుండా కొల్లేరు అభయారణ్యానికి ఏటా 3 లక్షల నుంచి 4 లక్షల పక్షులు విహారానికి వస్తున్నాయి. వీటిలో సుమారు 1.20 లక్షల పక్షలు విదేశాల నుంచి విడిది కోసం వచ్చే పక్షులు ఉంటున్నాయి. కొల్లేరు ప్రాంతాన్ని పక్షులు సంచరించే ప్రయాణంలో ‘సెంట్రల్ ఏషియన్ ఫ్లై వే’ అంటారు. కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం కావడంతో వలస పక్షుల ఇక్కడ విడిది చేసేందుకు ఇష్టపడతాయి. కొల్లేరు ప్రాంతానికి రష్యా, బ్రిటన్, మాల్దీవులు, బంగ్లాదేశ్ తదితర 30 దేశాల నుంచి వివిధ వలస జాతుల పక్షులు విచ్చేస్తాయి. అక్టోబర్ నుంచి వీటి రాక మొదలవుతుంది. మార్చి నాటికి సంతానోత్పత్తి చేసుకుని ఇవి తిరిగి తిరిగి వెళ్లడం అనవాయితీగా వస్తోంది. ఎకో టూరిజానికి ప్రతిపాదనలు జిల్లాల పునర్విభజన తర్వాత కొల్లేరు ప్రాంతమంతా ఏలూరు జిల్లా పరిధిలోకి చేరింది. కొల్లేరు ఎకో టూరిజం అభివృద్ధికి రూ.187 కోట్ల ఖర్చు కాగల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో 20 ప్రదేశాలను గుర్తించి బోటు షికారు, సంప్రదాయ గేలాలతో చేపలు పట్టుకోవడం, పక్షుల వీక్షణ వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 10 ప్రదేశాలను పర్యాటక శాఖ గుర్తించింది. రానున్న రోజుల్లో కొల్లేరు ఎకో టూరిజం పర్యాటక శాఖకు ప్రధాన ఆదాయ వనరుగా మారనుంది. ప్రధానంగా పర్యాటకులు విచ్చేసే పక్షుల విహార కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రండి రండి.. ఇలా చేరుకోండి విజయవాడ.. ఏలూరు.. భీమవరం ప్రాంతాల నుంచి కైకలూరు–భీమవరం జాతీయ రహదారి మీదుగా ఆటపాక చేరుకోవచ్చు. ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. బస్సు దిగిన తరువాత పక్షుల కేంద్రానికి నడక మార్గంలో చేరుకోవచ్చు. విజయవాడ–విశాఖపట్నం రైలు మార్గంలో కైకలూరు రైల్వే స్టేషన్లో దిగి ఆటోలపై మూడు కిలోమీటర్ల దూరంలో పక్షుల కేంద్రానికి చేరవచ్చు. పక్షుల కేంద్రం, మ్యూజియం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తెరిచి ఉంటాయి. రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు ఆటపాక పక్షుల కేంద్రం వద్ద రూ.30 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. పక్షుల నివాసాలకు కృత్రిమ ఇనుప స్టాండ్లు, పక్షుల విహార చెరువు గట్లు పటిష్టపర్చడం, గోడలకు పక్షుల చిత్రాలు, పర్యాటకులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతులు చేయనున్నాం. పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల కేంద్రం అభివృద్ధికి అటవీ శాఖ అన్ని విధాలుగా కృషి చేస్తోంది. – జె.శ్రీనివాస్, అటవీశాఖ రేంజర్, కైకలూరు -
కొల్లేరు పక్షుల లెక్క తేలింది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పక్షి ప్రేమికుల స్వర్గధామమైన కొల్లేరు అభయారణ్యంలో ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్–2023 ముగిసింది. అటవీశాఖ సిబ్బంది 12 బృందాలుగా ఏర్పడి ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ నెలాఖరు వరకు ఏలూరు జిల్లాలో విస్తరించిన కొల్లేరు సరస్సు పరీవాహక ప్రాంతాల్లో పక్షుల గణన చేశారు. అభయారణ్యం పరిధిలో వివిధ జాతులకు చెందిన 105 రకాల పక్షి జాతులను, 81,495 పక్షులను గుర్తించారు. వీటిలో మొదటి స్థానంలో కోయిలలు, రెండోస్థానంలో పెలికాన్ పక్షులు ఉండగా... అరుదైన పిన్‌టయల్ స్నిప్ (సూది తోక పుర్రెది) పక్షి ఒకటి, సిట్రిన్ వాగ్‌టయల్ (పసుపు తల జిట్టంగి) పక్షులు నాలుగు కనిపించాయి. పక్షుల గణన ఎలా చేశారంటే... పొడిసిపెడి ఫారమ్స్ (గ్రేబ్స్, నీటి ప్రయాణ పక్షులు), అన్సెరి ఫారŠమ్స్ (బాతులు), చరాద్రి ఫారమ్స్ (నీటి దగ్గర నివసించే పక్షులు), సికోని ఫారŠమ్స్ (కొంగజాతి పక్షులు), చిత్తడి నేలలపై ఆధారపడే పక్షులు... ఇలా ఐదు కుటుంబ కేటగిరీలుగా తీసుకుని పక్షుల గణన చేశారు. పక్షి నిపుణుడు, రికార్డింగ్ చేసే వ్యక్తి, ఫొటోగ్రాఫర్, గైడ్‌తోపాటు మరో ముగ్గురు కలిసి మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన 12 బృందాలు ఈ సర్వే చేశాయి. 105 కొల్లేరు అభయారణ్యంలో గుర్తించిన పక్షిజాతులు 7,875 అత్యధికంగా గుర్తించిన కోయిలల సంఖ్య 81,495 ప్రస్తుతం ఉన్న మొత్తం పక్షులు 6,869 రెండోస్థానంలో ఉన్న పెలికాన్ పక్షుల సంఖ్య తక్కువగా కనిపించిన పక్షులు ఈ సర్వేలో పిన్‌టయల్ స్నిప్ (సూది తోక పుర్రెది) పక్షి ఒకటి, సిట్రిన్ వాగ్‌టయల్ (పసుపు తల జిట్టంగి) పక్షులు నాలుగు, మరికొన్ని జాతుల పక్షులు చాలా తక్కువగా కనిపించాయి. పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం కొల్లేరులోని సహజసిద్ధ వాతావరణం పక్షులను ఆకర్షిస్తోంది. దేశ విదేశాల నుంచి ఏటా విడిది కోసం కొల్లేరుకు వేలాదిగా పక్షులు వస్తుంటాయి. వీటి సంరక్షణ కోసం అటవీశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. కొల్లేరు అభయారణ్యంలో పక్షుల గణన వల్ల రానున్న రోజుల్లో పక్షుల సంరక్షణకు విధివిధానాలు రూపొందించే అవకాశం ఉంటుంది. – ఎస్వీకే కుమార్, వైల్ట్‌లైఫ్ ఫారెస్ట్ రేంజర్, ఏలూరు -
భక్తుల ప్రాణాలతో చెలగాటం
మానవ తప్పిదాల కారణంగా పెరిగిపోతోన్న మరణాలను నివారించేందుకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. అధికార పార్టీ నేతల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను సైతం బలితీసుకుంటున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా వస్తున్నాయి. కొల్లేరు అభయారణ్యంలో నిర్మించిన వంతెనపై అధికార పార్టీ నేతలు అనధికార టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రమాదకరమని తెలిసినా కార్లు, ఆటోలు వంటి వాహనాలనూ పంపిస్తున్నారు. కైకలూరు : కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేయడానికి పూర్వం గ్రామస్తులు కొల్లేటి అభయారణ్యంలోని సర్కారు కాల్వపై కర్రల వంతెన నిర్మించుకున్నారు. మూడేళ్ల కిందట టీడీపీ నాయకులు ఇనుప వంతెన నిర్మించారు. ఆ సమయంలో అటవీశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా లెక్కచేయకుండా నిర్మాణం పూర్తి చేశారు. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పెద్దింట్లమ్మ తల్లి దేవస్థానం కొల్లేటికోటలో ఉంది. అమ్మవారిని చేరుకోడానికి వంతెన దాటి వెళ్లాలి. నిత్యం వందలాది మంది భక్తులు, ఆదివారమైతే 2000 మందికిపైగా, జాతర సమయంలో రోజుకు 20 వేల మంది, మొత్తం మీద ఏడాదికి 4 లక్షల మంది భక్తులు ఈ వంతెన దాటి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తుల అవసరాన్ని ఆసరగా చేసుకొని అనధికార వసూళ్లకు తెరదీశారు. వంతెన వద్ద అనధికార టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారు. కేవలం పాదాచారులు, ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు మాత్రమే వంతెనపై అవకాశం ఉంటుంది. కానీ అక్రమ సంపాదనలో ఆరితేరిన ఓ నాయకుడు ప్రస్తుతం వంతెనపై నుంచి ఏకంగా ఆటోలు, కార్లకు అడ్డగోలుగా అనుమతులిచ్చేశాడు. ఈ చర్యతో ఇప్పుడు ఆ వంతెన ప్రమాదకర స్థితికి చేరుకుంది. భక్తులు భయపడుతూ వంతెన దాటుతున్నారు. ప్రమాదకరస్థాయిలో వాహనాలు వెళ్లడంతో పొరపాటున వంతెన కూలిపోతే ఊహించని విధంగా ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఇంత దారుణం కళ్ల ముందు కన్పిస్తున్నా ప్రభుత్వ అధికారులకు కనీసం చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమనిభక్తులు అంటున్నారు. అందినకాడికి దోచుకోవడమే.... అనధికార పాటదారుడు పందిరిపల్లిగూడెం గ్రామానికి డబ్బులు చెల్లిస్తాడు. ఇక ప్రయాణికుల నుంచి రోజూ అందినకాడికి దోచేయడం ఇక్కడ కామన్‌గా మారింది. ఏ ప్రభుత్వ శాఖకు చెందిన అధికారి కూడా ఇటువైపు కన్నెత్తి చూడరు. అటవీ, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు తదితర శాఖలేవీ తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదనట్లు వ్యవహరిస్తున్నాయి. ఏడాదికి రూ.కోటి ఆదాయం.. ఏటా సర్కారు కాల్వ వంతెన నుంచి రూ.కోటి ఆదాయం వస్తుంది. పందిరిపల్లిగూడెం గ్రామానికి చెందిన కొండలు అనే వ్యక్తి రూ.40 లక్షలకు ఏడాది పాట దక్కించుకున్నాడు. డబ్బును పందిరిపల్లిగూడెం పెద్దలకు చెల్లించాడు. వంతెనపై కారు వెళితే రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నాడు. ఆటోకు రూ.100, వాహనానికి రూ.20, మనిషికి రూ.5 ఇలా పబ్లిక్‌గా వసూలు పర్వం సాగిస్తున్నాడు. ఎవరైనా భక్తులు ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతున్నారు. పోలీసులు దగ్గరున్నప్పటికీ ఏం చేయలేకపోతున్నారు. -
కొల్లేరు పరిధిలో మరోసారి ఉద్రిక్తత
ఏలూరు: కొల్లేరు అభయారణ్యం పరిధిలో.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం పైడిచింతపాడు గ్రామ పరిసరాల్లో చెరువు గట్లు ఏర్పాటు చేసుకుని స్థానికులు చేపల పెంపకానికి ఉద్యుక్తులు కావడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం వారి చర్యలను అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు అధికారుల వాహనాన్ని చుట్టుముట్టి ఘోరావ్ చేశారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో పర్యావరణ పరిరక్షణ కోసం గతంలో చెరువు గట్లను తొలగించిన విషయం తెలిసిందే.