కొల్లేటికోట శ్రీ పెద్దింట్లమ్మ దేవస్ధానంకు వంతెనపై వెళుతున్న భక్తులు, వాహనాలు
మానవ తప్పిదాల కారణంగా పెరిగిపోతోన్న మరణాలను నివారించేందుకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. అధికార పార్టీ నేతల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను సైతం బలితీసుకుంటున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా వస్తున్నాయి. కొల్లేరు అభయారణ్యంలో నిర్మించిన వంతెనపై అధికార పార్టీ నేతలు అనధికార టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రమాదకరమని తెలిసినా కార్లు, ఆటోలు వంటి వాహనాలనూ పంపిస్తున్నారు.
కైకలూరు : కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేయడానికి పూర్వం గ్రామస్తులు కొల్లేటి అభయారణ్యంలోని సర్కారు కాల్వపై కర్రల వంతెన నిర్మించుకున్నారు. మూడేళ్ల కిందట టీడీపీ నాయకులు ఇనుప వంతెన నిర్మించారు. ఆ సమయంలో అటవీశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా లెక్కచేయకుండా నిర్మాణం పూర్తి చేశారు. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పెద్దింట్లమ్మ తల్లి దేవస్థానం కొల్లేటికోటలో ఉంది. అమ్మవారిని చేరుకోడానికి వంతెన దాటి వెళ్లాలి. నిత్యం వందలాది మంది భక్తులు, ఆదివారమైతే 2000 మందికిపైగా, జాతర సమయంలో రోజుకు 20 వేల మంది, మొత్తం మీద ఏడాదికి 4 లక్షల మంది భక్తులు ఈ వంతెన దాటి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తుల అవసరాన్ని ఆసరగా చేసుకొని అనధికార వసూళ్లకు తెరదీశారు.
వంతెన వద్ద అనధికార టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారు. కేవలం పాదాచారులు, ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు మాత్రమే వంతెనపై అవకాశం ఉంటుంది. కానీ అక్రమ సంపాదనలో ఆరితేరిన ఓ నాయకుడు ప్రస్తుతం వంతెనపై నుంచి ఏకంగా ఆటోలు, కార్లకు అడ్డగోలుగా అనుమతులిచ్చేశాడు. ఈ చర్యతో ఇప్పుడు ఆ వంతెన ప్రమాదకర స్థితికి చేరుకుంది. భక్తులు భయపడుతూ వంతెన దాటుతున్నారు. ప్రమాదకరస్థాయిలో వాహనాలు వెళ్లడంతో పొరపాటున వంతెన కూలిపోతే ఊహించని విధంగా ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఇంత దారుణం కళ్ల ముందు కన్పిస్తున్నా ప్రభుత్వ అధికారులకు కనీసం చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమనిభక్తులు అంటున్నారు.
అందినకాడికి దోచుకోవడమే....
అనధికార పాటదారుడు పందిరిపల్లిగూడెం గ్రామానికి డబ్బులు చెల్లిస్తాడు. ఇక ప్రయాణికుల నుంచి రోజూ అందినకాడికి దోచేయడం ఇక్కడ కామన్‌గా మారింది. ఏ ప్రభుత్వ శాఖకు చెందిన అధికారి కూడా ఇటువైపు కన్నెత్తి చూడరు. అటవీ, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు తదితర శాఖలేవీ తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదనట్లు వ్యవహరిస్తున్నాయి.
ఏడాదికి రూ.కోటి ఆదాయం..
ఏటా సర్కారు కాల్వ వంతెన నుంచి రూ.కోటి ఆదాయం వస్తుంది. పందిరిపల్లిగూడెం గ్రామానికి చెందిన కొండలు అనే వ్యక్తి రూ.40 లక్షలకు ఏడాది పాట దక్కించుకున్నాడు. డబ్బును పందిరిపల్లిగూడెం పెద్దలకు చెల్లించాడు. వంతెనపై కారు వెళితే రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నాడు. ఆటోకు రూ.100, వాహనానికి రూ.20, మనిషికి రూ.5 ఇలా పబ్లిక్‌గా వసూలు పర్వం సాగిస్తున్నాడు. ఎవరైనా భక్తులు ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతున్నారు. పోలీసులు దగ్గరున్నప్పటికీ ఏం చేయలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment