శీతాకాలపు విడిది పక్షుల కిలకిలారావాలతో కొల్లేరు కళకళలాడుతోంది. ఇక్కడే పుట్టి.. బతుకు పయనంలో వేల కిలోమీటర్ల మేర వలస పోయిన అతిథి పక్షులు గమనం తప్పకుండా ఏటా మాదిరిగానే విడిది కోసం కొల్లేరు అభయారణ్యానికి వస్తున్నాయి. సంతానాన్ని వృద్ధి చేసుకుని.. పిల్లలతో కలిసి విదేశాలకు వలస పోయేంతవరకు ఇక్కడే గూళ్లు కట్టుకుని సందడి చేస్తుంటాయి.
నిండా పక్షులతో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని కొల్లేరు ప్రాంతం ఈ ఏడాదీ పర్యాటకులకు ఆహ్వా నం పలుకుతోంది. ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొల్లేరు పక్షుల వీక్షణకు అనువైన కాలం. ఈ దృష్ట్యా ఆటపాక, మాధవాపురం పక్షుల విహార కేంద్రాల వద్ద పర్యాటకుల కోసం అటవీ శాఖ మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ ఏడాది ఎక్కువ మంది పర్యాటకులు కొల్లేరుకు విచ్చేస్తారని అంచనా వేస్తోంది. - కైకలూరు
105 రకాల పక్షులున్నాయ్
కొల్లేరు అభయారణ్యంలో వివిధ జాతులకు చెందిన 105 రకాల పక్షి జాతులు ఉన్నట్టు ఏషియన్ వాటర్ బర్ట్స్ సెన్సస్–2023 నివేదిక వెల్లడించింది. ఇక్కడ మొత్తం 81,495 పక్షులు ఉన్నట్టు నిర్థారించారు. వీటిలో అత్యధికంగా 7,875 కోయిలలు ఉండగా.. రెండో స్థానంలో 6,869 పెలికాన్లు (గూడబాతులు) ఉన్నట్టు తేల్చింది. వీటితోపాటు ఎర్రకాళ్ల కొంగ (పెయిండెడ్ స్టార్క్), కంకణాల పిట్ట (గ్లోబీ ఐబీస్), నల్లరెక్కల ఉల్లంకి పిట్ట (బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్) వంటి అనేక పక్షి జాతులు ఇక్కడ సందడి చేస్తున్నాయి.
ఇవికాకుండా కొల్లేరు అభయారణ్యానికి ఏటా 3 లక్షల నుంచి 4 లక్షల పక్షులు విహారానికి వస్తున్నాయి. వీటిలో సుమారు 1.20 లక్షల పక్షలు విదేశాల నుంచి విడిది కోసం వచ్చే పక్షులు ఉంటున్నాయి. కొల్లేరు ప్రాంతాన్ని పక్షులు సంచరించే ప్రయాణంలో ‘సెంట్రల్ ఏషియన్ ఫ్‌లై వే’ అంటారు. కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం కావడంతో వలస పక్షుల ఇక్కడ విడిది చేసేందుకు ఇష్టపడతాయి.
కొల్లేరు ప్రాంతానికి రష్యా, బ్రిటన్, మాల్దీవులు, బంగ్లాదేశ్ తదితర 30 దేశాల నుంచి వివిధ వలస జాతుల పక్షులు విచ్చేస్తాయి. అక్టోబర్ నుంచి వీటి రాక మొదలవుతుంది. మార్చి నాటికి సంతానోత్పత్తి చేసుకుని ఇవి తిరిగి తిరిగి వెళ్లడం అనవాయితీగా వస్తోంది.
ఎకో టూరిజానికి ప్రతిపాదనలు
జిల్లాల పునర్విభజన తర్వాత కొల్లేరు ప్రాంతమంతా ఏలూరు జిల్లా పరిధిలోకి చేరింది. కొల్లేరు ఎకో టూరిజం అభివృద్ధికి రూ.187 కోట్ల ఖర్చు కాగల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో 20 ప్రదేశాలను గుర్తించి బోటు షికారు, సంప్రదాయ గేలాలతో చేపలు పట్టుకోవడం, పక్షుల వీక్షణ వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 10 ప్రదేశాలను పర్యాటక శాఖ గుర్తించింది. రానున్న రోజుల్లో కొల్లేరు ఎకో టూరిజం పర్యాటక శాఖకు ప్రధాన ఆదాయ వనరుగా మారనుంది. ప్రధానంగా పర్యాటకులు విచ్చేసే పక్షుల విహార కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
రండి రండి.. ఇలా చేరుకోండి
విజయవాడ.. ఏలూరు.. భీమవరం ప్రాంతాల నుంచి కైకలూరు–భీమవరం జాతీయ రహదారి మీదుగా ఆటపాక చేరుకోవచ్చు. ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. బస్సు దిగిన తరువాత పక్షుల కేంద్రానికి నడక మార్గంలో చేరుకోవచ్చు. విజయవాడ–విశాఖపట్నం రైలు మార్గంలో కైకలూరు రైల్వే స్టేషన్‌లో దిగి ఆటోలపై మూడు కిలోమీటర్ల దూరంలో పక్షుల కేంద్రానికి చేరవచ్చు. పక్షుల కేంద్రం, మ్యూజియం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తెరిచి ఉంటాయి.
రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు
ఆటపాక పక్షుల కేంద్రం వద్ద రూ.30 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. పక్షుల నివాసాలకు కృత్రిమ ఇనుప స్టాండ్లు, పక్షుల విహార చెరువు గట్లు పటిష్టపర్చడం, గోడలకు పక్షుల చిత్రాలు, పర్యాటకులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతులు చేయనున్నాం. పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల కేంద్రం అభివృద్ధికి అటవీ శాఖ అన్ని విధాలుగా కృషి చేస్తోంది. – జె.శ్రీనివాస్, అటవీశాఖ రేంజర్, కైకలూరు
Comments
Please login to add a commentAdd a comment