విహంగమై వాలిపోదాం | Famous Pelican birds | Sakshi
Sakshi News home page

విహంగమై వాలిపోదాం

Published Fri, Jan 24 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

Famous Pelican birds

పచ్చని చెట్లు తెల్లటి దుప్పటి కప్పుకున్నాయా!
నీలాల ఝరులు ముత్యాల దండలను అలంకరించుకున్నాయా..! అన్నంతగా ఈ సరస్సులు సంభ్రమాన్ని కలిగించే విహార క్షేత్రాలు. విదేశాల నుంచి అరుదెంచిన అరుదైన పక్షిజాతులకు ఆవాసాలు. ఇవన్నీ ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే ఉన్నాయి.వలస వచ్చేసిన ఈ పక్షులు ఐదారు నెలల పాటు ఇక్కడే ఉల్లాసంగా గడిపి, సంతానాన్ని పెంపొందించుకొని... మరో రెండు నెలల్లో తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లబోతున్నాయి. ఆ లోపే వీటిని తిలకించడానికి పయనమవుదాం రండి.

 
కొల్లేరు
కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించి ఉన్న మంచినీటి సరస్సు కొల్లేరు. విదేశీ విహంగాలకు విడిదిగా పేరొందిన ఈ కేంద్రం పెలికాన్ పక్షులకు ప్రఖ్యాతి గాంచినది. సైబీరియా, ఫిజీ దీవుల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పెలికాన్ (గూడబాతు)తో పాటు దేశ, విదేశాల నుంచి ఎర్రకాళ్ల కొంగ, నత్తగుళ్ల కొంగ, కంకణాల పిట్ట వంటి 189 కి పైగా రకాల పక్షులు ఇక్కడకు వలస వస్తాయి. కేంద్రప్రభుత్వం అటవీశాఖకు 2007లో ఈ పక్షికేంద్ర బాధ్యతలను అప్పజెప్పడంతో మొదట్లో పదుల్లోనే వచ్చే పెలికాన్‌ల సంఖ్య ఇప్పుడు మూడు వేలకు పైగా పెరిగింది. ఈ వందల జాతుల పక్షులను వీక్షించడానికి మార్చి వరకు అనువైన సమయం. పక్షులను దగ్గరగా వీక్షించడానికి కొల్లేరు సరస్సులో బోటు సదుపాయం కూడా ఉంది. ఈ పక్షి కేంద్రానికి దగ్గరలోనే పిల్లల కోసం ప్రత్యేకమైన పార్క్‌ను ఏర్పాటు చేశారు.  పెలికాన్ కాకుండా 189 రకాల పక్షులను, ఇవి కాకుండా 41 రకాల వలస పక్షులను ఇక్కడ గుర్తించారు అధికారులు. పక్షి కేంద్రాన్ని సందర్శించిన తర్వాత పక్షుల వివరాలు తెలిపే ఎలక్ట్రానిక్ బర్డ్స్ మ్యూజియం, అక్కడి పిల్లల పార్క్, కొల్లేటి కోటలో పెద్దింట్లమ్మ అమ్మవారి దేవాలయం, వెస్ట్ గోదావరిలో త్వరలో ప్రారంభం కానున్న రిసార్ట్‌లు, ఆటపాక పర్యావరణ అభ్యాస కేంద్రం సందర్శించవచ్చు. ఆటపాకలో బోటు, లాంచి షికారు ఉంటుంది. కొల్లేరు పక్షి కేంద్రాన్ని సందర్శించిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్లాలనుకునేవారు ఏలూరు నుంచి 40 కి.మీ దూరంలో ఉన్న ద్వారకా తిరుమలకు చేరుకోవచ్చు.
 
 పులికాట్
 ప్రకృతి సౌందర్యంలో పక్షుల సోయగాలను చూడటానికి అనువైన సమయం ఉదయం - సాయంత్రాలు.
 ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న, దేశంలోనే రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్! 60 కిలోమీటర్ల పొడవు, ప్రదేశాన్ని బట్టి 17.5 కిలోమీటర్ల వెడల్పున ఉంటుంది ఈ సరస్సు. అటవీ ప్రాంతం కూడా ఉండటంతో పర్యాటకులు అటు నీటి ఝరులను, ఇటు పచ్చని వృక్ష సిరులను తిలకిస్తూ ప్రకృతి ఒడిలో మైమరచిపోవచ్చు. ప్రకృతి సహజసిద్ధ సుందర దృశ్యాలకు నెలవైన ఈ సరస్సు వలస విహంగాలకు సరిపడినంత స్థలాన్ని, అనువైన వాతావరణాన్ని కలిగి ఉండటంతో సమూహాలుగా ఇక్కడికి వలస పక్షులు వస్తుంటాయి. వీటిలో ఫ్లెమింగోలు ప్రధానమైనవి. అయితే ఇక్కడి నీటి కాలుష్యం కారణంగా పక్షులు ఇక్కడ నుంచి నేలపట్టుకు, సౌత్ చెన్నై వైపుకు తరలి వెళుతున్నాయి. వేసవిలో ఎండిన చేపల కోసం కాళ్ల కొంగలు విరివిగా ఇక్కడకు చేరుకుంటాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి నుంచి 27 కి.మీ దూరం ప్రయాణిస్తే ఈ సరస్సును చేరుకోవచ్చు.
 
 నేలపట్టు
 నేలపట్టు నెల్లూరు జిల్లాలోని చిన్న గ్రామం. సూళ్లూరు పేట నుంచి 10 కి.మీ, ఉత్తర పులికాట్ నుంచి 20 కి.మీ దూరంలో ఉంటుంది నేలపట్టు. దీనిని దొరవారి సత్రం అని కూడా అంటారు. శీతాకాలంలో ఇక్కడకు ఆఫ్రికా, అమెరికా, చైనా దేశాల నుంచి వలస పక్షులు అధికంగా వస్తుంటాయి. వాటిలో ప్రధానంగా గూడబాతులు (స్పాట్ బిల్డ్ పెలికాన్), తెడ్డు ముక్కు కొంగలు, (స్పూన్ బిల్), వైట్ ఇబిస్ (తెల్ల కొంగలు) నైట్ హారన్(శబరి కొంగ)లకు ఈ పక్షి కేంద్రం పేరుగాంచింది. అక్టోబర్‌లో వచ్చిన ఈ వలస పక్షులు నాలుగైదు నెలల పాటు సంతానోత్పత్తి గావించి, వేసవి మొదట్లో తిరిగి వచ్చిన చోటుకే వెళ్లిపోతాయి. ఇవే గాకుండా నారాయణ పక్షులు, నీటి కాకి, సముద్రపు కొంగ, గుళ్ల కొంగ, నల్లకంకణాలు, పరజ, నీలిరెక్కల పరజ, సూది తోక బాతు, ఎర్రతల బాతు, చుక్కకోడి, చుక్కమూతి బాతు... మరో 21 రకాల పక్షులు, ఇక్కడే ఉన్న ఇంకో 50 రకాల పక్షులు సందడితో నేలపట్టు ప్రతి ఉదయం మేలుకొంటుంది. సందర్శన సమయం: అక్టోబర్ నుంచి మార్చి వరకు విరివిగా ఉండే ఈ పక్షుల సోయగాలను తిలకించడానికి అనువైన సమయం.
 
 ఉప్పలపాడు
 రాష్ట్రంలో మరో పేరెన్నికగన్న పక్షి స్థావరం ఉప్పలపాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో ఉంది ఈ గ్రామం. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో సైబీరియా, ఆస్ట్రేలియాల నుంచి గూడబాతుల గుంపులు, ఎర్రకాళ్ల కొంగల వరసలు, నత్తకొట్టు కొంగలు సమూహాలు.. వీటితో పాటు మరో 70 రకాల జాతి పక్షులతో ఈ ప్రాంతం కిక్కిరిసిపోయి ఉంటుంది. పక్షిస్థావరానికి వెళ్లే దారికిరువైపులా పచ్చని చేలు, ఆ చేలపై ఎగురుతున్న మైనగోరలు, కత్తిరిపిట్టలు, అక్కడక్కడ పాలపిట్టలు, కొంగలు... పొలాలను ఆశిస్తున్న మిడతలను, పురుగులను లాఘవంగా వేటాడుతూ కనువిందు చేస్తాయి. గాలిలో ఎగురుతున్న పురుగులను నేర్పరులైన నల్లంచులు వేటాడటం చూడవలసిందే! దారిలో సందడిగా ఉన్న ఊళ్ల గుండా ప్రయాణిస్తూ ఈ గ్రామాన్ని చేరుకుంటాం. గ్రామాన్ని చేరుకొని పక్షల స్థావరాన్ని చేరుకోగానే కలిగే అనుభూతి చెప్పనలవి కాదు. అది ఒక అందమైన దృశ్యకావ్యం. కాలాలననుసరించి వివిధ రకాల పక్షులరాక ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. పక్షులు వాటి గూళ్లలో పిల్లలకు ఆహారాన్ని అందిస్తుంటే చూడడం ఒక ఆనందానుభూతి. పక్షి ప్రేమికులకయితే చెప్పనవసరం లేదు. గంటలతరబడి చూస్తూ అనేకమార్లు వచ్చి వాటి అలవాట్లు గమనిస్తూ నోట్సులు తయారుచేసుకుంటారు. పక్షి శాస్త్రజ్ఞులు ఇక్కడ తమ పరిశోధనలు జరిపి పరిశోధనా పత్రాలు, గ్రంథాలు తయారుచేస్తారు.
 ఈ పక్షి కేంద్రానికి నత్తకొట్టుకొంగలు, తెల్ల కంకణాలు, ఎర్రకాళ్ల కొంగలు, చుక్కల ముక్కు గూడ బాతులు, చిత్త ఒక్కలు, చుక్కమూతి బాతులు, నల్ల బోలి కోడి, కలికి పక్షులు, జకానాలూ... మొదలైన 70 జాతులకు పైగా పక్షులు  వస్తుంటాయి. గుంటూరు నుండి నందివెలుగు మీదుగా తెనాలికి వెళ్లే మార్గంలో 7 కి.మీ దూరంలో ఉంది ఈ పక్షి కేంద్రం. గుంటూరు నుండి ఆర్.టి.సి బస్సులు, ఆటోల ద్వారా ఈ గ్రామాన్ని చేరుకోవచ్చు. చెన్నై-హోరా రైలు మార్గాన ప్రయాణించేవారు తెనాలిలో దిగి నందివెలుగు మీదుగా 18 కి.మీ దూరంలో ఈ గ్రామానికి చేరుకోవచ్చు.
 సందర్శన సమయం:  కిక్కిరిసిన ఈ పక్షులను, వాటి సోయగాలను చూడడానికి ఫిబ్రవరి చివరి వారం మార్చి మొదటి వారం వరకు అనువైనది.
 
 ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన
 పక్షి కేంద్రాలను సందర్శించా లనుకునేవారు...
 
 ఏలూరు నుంచి కొల్లేరు - గుంటూరులోని ఉప్పలపాడు - నెల్లూరులోని నేలపట్టు - పులికాట్ లను సందర్శించవచ్చు.
 
 కొల్లేరు సరస్సు చేరడానికి...
 గుడివాడ - కైకలూరు, ఏలూరు మీదుగా కొల్లేరుకు చేరుకోవచ్చు. కొల్లేరు టౌన్‌కు నాలుగు వైపులా ఆటపాక 2.5 కి.మీ, భుజబలపట్నం 6 కి.మీ, కొవ్వాడ లంక7 కి.మీ దూరంలో ఉన్నాయి.
 
 రోడ్డు మార్గాన ... విజయవాడ నుంచి 60 కి.మీ, ఏలూరు నుంచి 15 కి.మీ, కైకలూరు నుంచి 1.5 కి.మీ, నిడమనూరు నుంచి 8 కి.మీ, గుడివాడకలంక నుంచి 3 కి.మీ దూరంలో ఉన్న కొల్లేరుకు చేరుకోవచ్చు.
 
 రైలు మార్గాన వెళ్లాలనుకుంటే విజయవాడ నుంచి 60 కి.మీ దూరంలో ఉంది కొల్లేరు.
 
 ఉప్పలపాడు పక్షి కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు చూడాలనుకునేవారు..
 గుంటూరు టౌన్ నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న అమరావతికి
     
 బస్సు ద్వారా చేరుకోవచ్చు. బస్‌స్టేషన్ ఎదురుగా అమరావతి మ్యూజియం ఉంటుంది. శుక్రవారం మినహా మిగతా అన్ని
     
 రోజుల్లోనూ ఈ మ్యూజియాన్ని ఉదయం 10 నుంచి
     
 సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చు.
 
 నేలపట్టు అందాలను ఒడిసిపట్టుకోవాలంటే...
 ఆంధ్రప్రదేశ్-తమిళనాడు రాష్ట్రాల్లో సుమారు 404 చ.కి.మీ విస్తీర్ణంలో నేలపట్టు పక్షి కేంద్రం కొలువుదీరింది. సైబీరియన్ కొంగల జాతులు 160 ఉన్నట్టు గర్వంగా చెప్పుకుంటుంది నేలపట్టు. నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ నేలపట్టుకు అక్టోబర్‌లో పెలికాన్ పక్షులు ఎక్కువగా వస్తుంటాయి.
     
 సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ నుంచి 23కి.మీ. నేలపట్టు ఫ్లెమింగోలకు, పెలికాన్ పక్షులకు దక్షిణాసియాలో ఇదే అతిపెద్ద ఆవాసంగా చెబుతారు.
 
 పులికాట్ సరస్సులో...
 మంచినీరు, సముద్రపునీరు కలిసిన సరస్సు ఇది.
 60 కిలోమీటర్ల పొడవు పదిహేడున్నర కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఈ సరస్సు ఉంది. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ నుంచి పులికాట్‌కు 10 కి.మీ దూరం.
 
 పర్యాటకులు చేయకూడనివి
 వలస పక్షులు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటాయి.
     
 ఏ మాత్రం అనుకూలంగా లేనట్టు అవి పసిగట్టినా అవి ఎప్పటికీ ఆ ప్రాంతాలకు రావు.
     
 పక్షులు ఉన్న చోటుకు ఇష్టం వచ్చినట్టుగా వెళ్లకూడదు.
     
 సరదా కోసం రాళ్లను విసరకూడదు.
     
 అగ్నిప్రమాదాలకు కారణమయ్యే చుట్ట, బీడి, సిగరెట్ పీకలను ఆ ప్రాంతాలలో వదిలేయకూడదు.
     
 నీటి కాలుష్యానికి కారకమయ్యే ఆహారపదార్థాలు, ప్లాస్టిక్, పాలిథిన్ బ్యాగ్స్.. వంటివి చెరువులు, సరస్సులలో వేయకూడదు.
     
 వలసపక్షులున్న చెరువులు, సరస్సులలో ఈతకు వెళ్లరాదు.  శబ్దాలు చేయకూడదు.
 
 ఇన్‌పుట్స్
 - గ్రేసెస్,అటవీశాఖాధికారి, కొల్లేరు
 - కోకా మృత్యుంజయ రావు, ఉప్పలపాడు
 - శ్రీనివాస్, నెల్లూరు, సాక్షి

 
 ఫొటోలు:
 ఆకుల శ్రీనివాస్, ఏలూరు

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement