pulicat
-
పులికాట్‌కు ఎర్ర కళ
సూళ్లూరుపేట: గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలోనూ ఎర్రకాళ్ల కొంగలతో పాటు ఫ్లెమింగోలు పులికాట్ సరస్సులో వేటసాగిస్తూ పర్యాటకలకు కనులవిందు చేస్తున్నాయి. సముద్రంలోని ఆటుపోట్లతో ఓ మోస్తరుగా చేరిన నీటితో వేల సంఖ్యలో పక్షులు గుంపులు గుంపులుగా చేరి అందరినీ కట్టిపడేస్తున్నాయి. పక్షుల రాకను తెలుసుకున్న చెన్నైకి చెందిన పర్యాటకులు బుధవారం శ్రీహరికోట రోడ్డులో ఎర్రకాళ్ల కొంగల అందాలను కెమెరాల్లో బంధించారు. ఓ పర్యాటకుడు తీసిన ఫొటోలు ఇవి. -
ఉప్పెన: కృష్ణా నదీముఖంలో
కృష్ణా నదీముఖంలో కద్దూర పట్టణం. క్రీ.శ. 200 (నేటి కృష్ణాజిల్లా మచిలీపట్నం వద్ద గూడూరు గ్రామం) ‘ఆగు నావికుడా! దురదృష్టం నిన్ను ఉప్పెనలా ముంచబోతుంది. సావధానం!’ అని అరుస్తూ అతడి అడుగులకి అడ్డుపడ్డాడొక సిద్ధ పురుషుడు. విబూది పూసిన ముఖంపై చింతనిప్పుల వంటి కళ్ళలోకి చూసి నివ్వెరపోయినా మరుక్షణమే తేరుకొన్నాడు పద్మపాణి. అర్ధరాత్రి కావస్తోంది. వంగి దండాలు పెడుతున్న పానశాల కావలివాడి చేతిలో వెండి పణం రాల్చి అప్పుడే వీధిలోకి అడుగుపెట్టాడు. అంత రాత్రి గడిచినా ఆ ఆంధ్రుల రేవుపట్టణంలో సందడి ఏమాత్రమూ తగ్గలేదు. జూదశాలలు, గణికాగృహాల నుండి బయటపడే నాగరికులు, విదేశీ నావికులు కనిపిస్తున్నారు. గౌడ (బెంగాలీ), మాగధ (బీహారీ), ఓఢ్ర (ఒరియా), ద్రవిడ (తమిళం) భాషలే కాక మలయ (మలేసియా), చీనీ (చైనా), యవన (గ్రీక్) భాషలు కూడా అక్కడక్కడా వినిపిస్తాయి. మర్రిచెట్టు కింద పల్లకీలు మోసే బోయీలు, బండ్లవాళ్ళు, యజమానులకై ఎదురుచూస్తున్న సేవకులు అరుగులపై పూలిజూదం ఆడుతూ ఆ సిద్ధపురుషుడి అరుపుకి ఒకసారి ఉలక్కిపడి మళ్ళీ ఆటలోకి వెళ్లాలా లేదా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. పద్మపాణి చిన్ననాటి నుంచి సముద్రగర్భంలోని భూతాలతో, భూతాలవంటి ప్రకృతి బీభత్సాలతో ఆటలాడిన వాడు. మహాచీనం (చైనా) నుండి పారశీకం (అరేబియా గల్ఫ్ తీరం) వరకూ అనేకమార్లు నావలు నడిపించిన నావసారధి. కలవరం బయటకి కనపడకుండా నింపాదిగా ఆ సిద్ధపురుషుడి ఎర్రని కళ్ళలోకి చూస్తూ ఏమిటని తలెగరేసాడు. ‘దురదృష్టం నావికుడా! నిన్ను ఉప్పెనలా ముంచబోతుంది!’ మరోసారి బొంగురుపోయిన గొంతుతో హెచ్చరించాడు. ‘హహహ్! పోనీయవోయ్. అవలోకితేశ్వరుని అండ ఉన్నంతవరకూ ఇలాంటివి నన్నేమీ చేయలేవ్’ అని దట్టీలోని ఒక నాణెం సిద్ధుడి వంక విసిరి పానశాల వెనుక ద్వారం ఉన్న వీధి వైపు నడిచాడు. ఆ పానశాల నుంచి ఏ క్షణాన్నయినా నాగబుధిక బయటికి రావచ్చు. కాని కలవడం అసాధ్యం. ఎందుకంటే రాత్రి పూట పానశాలల్లో పని చేసే స్త్రీలను సాయుధ రక్షణతో నివాసం వరకూ దిగబెట్టడం నియమం. నాగబుధికని ఎన్నిమార్లు అడిగినా తానుండే నివాసమేదో చెప్పదు. ఈ రాత్రయినా బండిని వెంటాడి ఆమె ఇల్లెక్కడో కనుక్కోవాలి. ఆమెకి తనంటే ఇష్టమే. సందేహం లేదు. కానీ ఎందుకు తటపటాయిస్తుందో అర్థంకాదు! మధుశాల యజమానికి ఆమె బాకీపడిన సొమ్మును సుంకంతో సహా చెల్లించి ఆమెని విముక్తని చేస్తానని మాటయిచ్చినా ప్రయోజనం లేదు. అవుననదు. కాదనదు. పానశాల వెనక ద్వారంలో నుండి నల్లని తెరలతో గూడుబండి వెలువడింది. బరిశెలతో నలుగురు కావలివాళ్ళు దానివెంట నడవసాగారు. మబ్బుల మధ్య చంద్రునిలా తెరల మధ్య నుండి నాగబుధిక ముఖం తొంగి చూసింది. తనను చూసిన క్షణంలో ప్రత్యక్షమైన చిరునవ్వు మరుక్షణం వెలవెలపోయి తెరల వెనుకకి మాయమయింది. కాస్త దూరంగా బండి వెనుకే నడవసాగాడు పద్మపాణి. ‘చేతికందిన అదృష్టాన్ని ఎందుకే కాలదన్నుకుంటావ్? చూడు నీకోసం ఎలా పడిగాపులు పడుతున్నాడో’ అంది మాలసిరి, నాగబుధిక స్నేహితురాలు. స్నేహితురాలి మాటలకి మూడవ అంతస్తు కిటికీలోంచి బయటకి తొంగి చూసి నిట్టూర్చింది నాగబుధిక. అర్ధరాత్రి గడిచినా ఇంకా వీధి మధ్య అరుగుపై ఎదురుతెన్నులు చూస్తున్న పద్మపాణి ముఖం వెన్నెల వెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది. ‘ఆహా! ఎంత విరహమే! అందగాడు, ధనవంతుడు. తూర్పు సముద్రపు దేశాల్లో అతడిని మించిన నావికుడు లేడని చెబుతారు. సరేనను చాలు, ఈ పాడు జీవితం వదిలి హాయిగా ఉండవచ్చు. అయినా నీకూ అతడంటే ఇష్టమేగా?’ అన్నది మాలసిరి. ‘అవునే’ నీళ్ళు పొంగుతున్న కళ్ళు తుడుచుకుంటూ, ‘అందుకే వద్దనేది. నా దురదృష్టాన్ని అతడికెందుకు అంటిచాలి? నా కథ నీకు తెలుసుగా. నా అంతటి దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే ఉండదు. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో అయినా పుట్టినప్పుడే తల్లిదండ్రులని పొట్టన పెట్టుకున్నాను. కొడుకులు లేకపోవడంతో నా తండ్రి ఆస్తి రాజుగారికి పోయింది. అనాథనని నన్ను చేరదీసి నాయనలా సాకిన రామిశెట్టికీ న ష్టమే. గొడ్డొచ్చిన వేళా! బిడ్బొచ్చిన వేళా! అని శెట్టిసాని చెప్పింది నిజమే’ ‘బాధపడకే. ఊరుకో,’ వెక్కివెక్కి ఏడుస్తున్న నాగుబుధికను ఓదార్చింది మాలసిరి. ‘నాయన కూడా నీలాగే చెప్పేవాడు. నన్ను చారుదత్తుడనే కుమ్మరి చేతిలో పెట్టి ఆయన కన్నుమూశాడు. కానీ ఏమిలాభం? సంవత్సరం తిరగకుండా నా దురదృష్టం నా మొగుడిని కూడా తీసుకుపోయింది. పెనిమిటి పోయినా బొమ్మల వ్యాపారానికి ఆయన చేసిన అప్పుమాత్రం మిగిలింది. మన యజమాని మంచివాడు కనక మధుశాలలో ఈ పని ఇచ్చాడు. ఇంకో నాలుగేళ్ళలో ఆ అప్పు తీరిపోతుంది. ఆప్పుడీ పాడు జీవితానికే స్వస్తి చెప్పవచ్చు.’ అన్నది నాగుబుధిక. ‘ఛీఛీ.. ఏం మాటలే అవి? నా మాట విని పద్మపాణితో పెళ్ళికి ఒప్పుకో. వెళ్ళి అతనితో సరేనని చెప్పు. చూడు పాపం నీకోసం ఎలా ఎదురు చూస్తున్నాడో!’ అని ఒప్పించింది ఆమె శ్రేయోభిలాషి మాలసిరి. పాతికేళ్ళ జీవితంలో పద్మపాణి ఎన్నో దేశాలు తిరిగాడు. ఎందరో స్త్రీలని చూశాడు. కాని మొదటి చూపులోనే నాగబుధిక అతడి హృదయాన్ని కదిలించింది. పైకి ఆహ్లాదంగా కనిపించినా సముద్రంలాంటి ఆమె కళ్లలోతుల్లో ఏదో విషాదం. ఎందుకో పొదివి పట్టి హృద యానికి హత్తుకోవాలనే తపన. ఆమె లేని జీవితం వృధా అనే భావన. ప్రతిరోజూ ఆమె ముఖం చూడనిదే కంటికి కునుకు రాదు. తన అదృష్టం ఎలా ఉందో? ఆహ్! దురదృష్టమట! చింతనిప్పుల వంటి కళ్ళతో ఆ సిద్ధుడు చేసిన హెచ్చరిక పద్మపాణి మనస్సులో ప్రతిధ్వనించింది. తలెత్తి ఆకాశం వంక చూశాడు. చంద్రుడి చుట్టూ కాంతి వలయం! సన్నని తూర్పుగాలి. సముద్రయానాలలో అనేక ప్రకృతి వైపరీత్యాలని కళ్ళారా చూసిన ఆ నావికుడి భృకుటి ముడిపడింది. ఏదో పెద్ద గాలివాన వచ్చే సూచన. ఎదురుగా పరుగెత్తుకుంటూ తనవైపే వస్తున్న నాగబుధికని చూశాడు. అతడి ఆనందానికి అంతులేదు. తన హృదయంపై వాలిపోయిన ప్రియురాలిని కౌగిలిలో బిగించి కాలం తెలియకుండా అలానే ఉండిపోయాడు. మరునాడే మధుశాల యజమానికి అప్పు చెల్లించి నాగబుధికని విడిపించుకున్నాడు. నూతన వధువు నాగబుధికతో సముద్రతీరంలోని తన విడిది చేరాడు పద్మపాణి. పున్నమిరాత్రి. అతడి ఆనందంలో పాలుపంచుకోవటానికా అన్నట్లు ఆ నావికుడి నేస్తం సముద్రం కూడా నూరు అడుగులు ముందుకొచ్చాడు. అతడి గుండెలాగే సముద్రపుటలలు కూడా ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ప్రథమ సమాగమనానికి ఆరాటపడుతున్న ఆ దంపతులకి చిరుజల్లు స్వాగతం పలికింది. కలసిన ఆ శరీరాలకీ కర్ణేంద్రియాలకీ ఒకరికొకరి ధ్యాస తప్ప బయట ప్రపంచంతో ప్రమేయం లేదు. ఆ రాత్రి వచ్చిన రెండు తాటిచెట్ల ఎత్తు ఉప్పెన కూడా ఆ జంట ఆలింగనాన్ని విడదీయలేక పోయింది. సముద్రం సృష్టించిన బీభత్సానికి కద్దూర పట్టణం తుడిచి పెట్టుకుపోయింది. కానీ మరుభూమిలా మిగిలిన ఊరి మధ్య ఆ నూతన దంపతులున్న సౌధం మాత్రం చెక్కుచెదరలేదు. మరునాడు ఉదయం మేడపై నుండి ఆ వినాశనాన్ని కలయజూసిన పద్మపాణి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ ప్రకృతి ఉపద్రవం నుండి నన్ను కాపాడిన నా అదృష్ణదేవతవి నువ్వే అని కౌగిలించుకొన్న పద్మపాణిని తనకిచ్చినందుకు అవలోకితేశ్వరునికి నీళ్ళు నిండిన కళ్లతో ధన్యవాదాలర్పించింది నాగబుధిక. ఆగ్నేయాసియాలో ఆంధ్ర రాజ్యాలు ఇండియాలో అత్యంత పొడవైన తీరరేఖ ఆంధ్రులదే. చిలక సరస్సు నుండి పులికాట్ వరకూ అనేక రేవు పట్టణాలు తెలుగువారి అధీనంలో ఉండేవి. వీటిలో ముఖ్యమైనవి కృష్ణా గోదావరీ తీరంలో ఉన్నాయని ‘పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ’ అనే రోమన్ గ్రంథం చెబుతుంది. అవి ఎఫిటెరియాన్ (భట్టిప్రోలు), కొన్టకోస్సిలా (ఘంటశాల), కొడ్డూరా (బందరు వద్ద గూడూరు), అల్లోజ్ఞైని (గోదావరి డెల్టాలోని ఆదుర్రు), మైసోలియా (మోటుపల్లి), పోడుక (ఒంగోలు వద్ద పాదర్తి), మునార్ఫా (కావలి వద్ద మున్నేరు), సొపట్మ (పులికాట్)... మొదలైనవి. టోలెమీ రచించిన గ్రీక్ గ్రంథం ‘జాగ్రఫీ’ ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యం కృష్ణా తీరంలోని రేవు పట్టణాల నుండే సాగిందని చెబుతుంది. ఆగ్నేయాసియాలో ఆంధ్రులు నెలకొల్పిన రాజ్యాలు శిలాయుగంలో ఉన్న ఆ ప్రాంతానికి నాగరికతని పంచాయి. శాసనాలలో కనిపించే ఆయా దేశాల పాత పేర్లే అందుకు నిదర్శనం. బర్మా పేరు త్రిలింగం. అక్కడి రాజవంశాన్ని తెలైంగులు అంటారు. తెలైంగ్ వారి భాష. ఇప్పటి థాయ్‌లాండు సింధుశాఖ ప్రాంతానికి ఒకప్పటి పేరు కాకుళ రాజ్యం. ఇక మలేసియాలో పాలెంబాంగ్ ప్రాంతపు ఒకప్పటి పేరు ఆంధర. ఇండోనేసియాలోని బోరుబదూర్ మహాస్తూపం ఉన్న ప్రదేశాన్ని మగెలాంగ్ (మహాలంక) అంటారు. ఇక అండమాన్ నికోబార్ ద్వీపాల పూర్వ నామాలు ఆంధ్రమణీ- మనక్కవరం. సింహపురి (నెల్లూరు) సింగపూర్ అయింది. అంతెందుకు? వియెత్నాం, లావోస్ దేశాల ఒకప్పటి పేరు అమరావతి రాజ్యం. అక్కడి పట్టణాల పేర్లు- విజయ, పాండుర, కౌథూర. అన్నీ కృష్ణాతీరంలోని ప్రాచీన పట్టణాల పేర్లే. జాతక కథలు ఆంధ్ర వణిజులకి ఆగ్నేయాసియాలోని దేశాలకి ఉన్న సంబంధాలు ప్రస్తావిస్తాయి. ఆంధ్ర రాజవంశమైన విష్ణుకుండినులూ కంపూచియా (కాంభోజ) రాజ్య స్థాపకులైన కైండిన్య గోత్రులూ ఒకటేనని శాసనాలంకారం అనే గ్రంథం చెబుతుంది. అంధ్రతీరంలో నౌకానిర్మాణం ఒక ప్రముఖమైన పరిశ్రమగా ఎదిగింది. నరసాపురం (ప.గో.జిల్లా), మోటుపల్లి (గుంటూరు జిల్లా) ముఖ్యమైన కేంద్రాలు. ఆంధ్రులు 75 టన్నుల బరువు మోసే నావలు నిర్మించారని రోమన్ గ్రంథం హిస్టోరియా న్యాచురాలిస్ చెబుతుంది. ఆనాటి సమాజం ఎంత అభివృద్ధి చెందినా స్త్రీల పరిస్థితి మాత్రం పతనం చెందసాగింది. మనుధర్మశాస్త్రం ఆ కాలంలోనే రచించబడింది. ఆర్థిక వనరులపైన పురుషుల గుత్తాధిపత్యం మొదలయింది. మితాక్షర కూతుళ్లకి ఆస్తిపై హక్కు కల్పించదు. ఆస్తిని కాపాడుకోవటానికి కొడుకుల అవసరం అయింది. తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు పరులపై ఆధారపడవలసి వచ్చింది. చేసిన అప్పులు తీర్చేందుకు భార్యాపిల్లలని దాస్యానికి అమ్మటం ఆచారమయింది. హరిశ్చంద్రుని కథ దీనికి నిదర్శనం. నిరాధారులయిన స్త్రీలకు రక్షణ కరువైంది. విధవా వివాహం చట్టసమ్మతమే. అమరకోశం అనే సంస్కృత నిఘంటువు ‘పునర్భూ’ అంటే పునర్వివాహం చేసుకున్న స్త్రీని ప్రస్తావిస్తుంది. రాత్రిపూట పనిచేసే స్త్రీ కార్మికులకు తప్పనిసరిగా తగిన రక్షణతో ఇంటి వద్ద దిగబెట్టే వ్యవస్థ చేయాలని అర్థశాస్త్రం నిర్దేశిస్తుంది. ఈనాడు కాల్సెంటర్లలో రాత్రి సమయాల్లో పనిచేసే ఉద్యోగినులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించే ఆనవాయితీ మన దేశంలో రెండువేల సంవత్సరాలకి పూర్వమే ఉండేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. -
విహంగమై వాలిపోదాం
పచ్చని చెట్లు తెల్లటి దుప్పటి కప్పుకున్నాయా! నీలాల ఝరులు ముత్యాల దండలను అలంకరించుకున్నాయా..! అన్నంతగా ఈ సరస్సులు సంభ్రమాన్ని కలిగించే విహార క్షేత్రాలు. విదేశాల నుంచి అరుదెంచిన అరుదైన పక్షిజాతులకు ఆవాసాలు. ఇవన్నీ ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే ఉన్నాయి.వలస వచ్చేసిన ఈ పక్షులు ఐదారు నెలల పాటు ఇక్కడే ఉల్లాసంగా గడిపి, సంతానాన్ని పెంపొందించుకొని... మరో రెండు నెలల్లో తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లబోతున్నాయి. ఆ లోపే వీటిని తిలకించడానికి పయనమవుదాం రండి. కొల్లేరు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించి ఉన్న మంచినీటి సరస్సు కొల్లేరు. విదేశీ విహంగాలకు విడిదిగా పేరొందిన ఈ కేంద్రం పెలికాన్ పక్షులకు ప్రఖ్యాతి గాంచినది. సైబీరియా, ఫిజీ దీవుల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పెలికాన్ (గూడబాతు)తో పాటు దేశ, విదేశాల నుంచి ఎర్రకాళ్ల కొంగ, నత్తగుళ్ల కొంగ, కంకణాల పిట్ట వంటి 189 కి పైగా రకాల పక్షులు ఇక్కడకు వలస వస్తాయి. కేంద్రప్రభుత్వం అటవీశాఖకు 2007లో ఈ పక్షికేంద్ర బాధ్యతలను అప్పజెప్పడంతో మొదట్లో పదుల్లోనే వచ్చే పెలికాన్ల సంఖ్య ఇప్పుడు మూడు వేలకు పైగా పెరిగింది. ఈ వందల జాతుల పక్షులను వీక్షించడానికి మార్చి వరకు అనువైన సమయం. పక్షులను దగ్గరగా వీక్షించడానికి కొల్లేరు సరస్సులో బోటు సదుపాయం కూడా ఉంది. ఈ పక్షి కేంద్రానికి దగ్గరలోనే పిల్లల కోసం ప్రత్యేకమైన పార్క్‌ను ఏర్పాటు చేశారు. పెలికాన్ కాకుండా 189 రకాల పక్షులను, ఇవి కాకుండా 41 రకాల వలస పక్షులను ఇక్కడ గుర్తించారు అధికారులు. పక్షి కేంద్రాన్ని సందర్శించిన తర్వాత పక్షుల వివరాలు తెలిపే ఎలక్ట్రానిక్ బర్డ్స్ మ్యూజియం, అక్కడి పిల్లల పార్క్, కొల్లేటి కోటలో పెద్దింట్లమ్మ అమ్మవారి దేవాలయం, వెస్ట్ గోదావరిలో త్వరలో ప్రారంభం కానున్న రిసార్ట్లు, ఆటపాక పర్యావరణ అభ్యాస కేంద్రం సందర్శించవచ్చు. ఆటపాకలో బోటు, లాంచి షికారు ఉంటుంది. కొల్లేరు పక్షి కేంద్రాన్ని సందర్శించిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్లాలనుకునేవారు ఏలూరు నుంచి 40 కి.మీ దూరంలో ఉన్న ద్వారకా తిరుమలకు చేరుకోవచ్చు. పులికాట్ ప్రకృతి సౌందర్యంలో పక్షుల సోయగాలను చూడటానికి అనువైన సమయం ఉదయం - సాయంత్రాలు. ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న, దేశంలోనే రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్! 60 కిలోమీటర్ల పొడవు, ప్రదేశాన్ని బట్టి 17.5 కిలోమీటర్ల వెడల్పున ఉంటుంది ఈ సరస్సు. అటవీ ప్రాంతం కూడా ఉండటంతో పర్యాటకులు అటు నీటి ఝరులను, ఇటు పచ్చని వృక్ష సిరులను తిలకిస్తూ ప్రకృతి ఒడిలో మైమరచిపోవచ్చు. ప్రకృతి సహజసిద్ధ సుందర దృశ్యాలకు నెలవైన ఈ సరస్సు వలస విహంగాలకు సరిపడినంత స్థలాన్ని, అనువైన వాతావరణాన్ని కలిగి ఉండటంతో సమూహాలుగా ఇక్కడికి వలస పక్షులు వస్తుంటాయి. వీటిలో ఫ్లెమింగోలు ప్రధానమైనవి. అయితే ఇక్కడి నీటి కాలుష్యం కారణంగా పక్షులు ఇక్కడ నుంచి నేలపట్టుకు, సౌత్ చెన్నై వైపుకు తరలి వెళుతున్నాయి. వేసవిలో ఎండిన చేపల కోసం కాళ్ల కొంగలు విరివిగా ఇక్కడకు చేరుకుంటాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి నుంచి 27 కి.మీ దూరం ప్రయాణిస్తే ఈ సరస్సును చేరుకోవచ్చు. నేలపట్టు నేలపట్టు నెల్లూరు జిల్లాలోని చిన్న గ్రామం. సూళ్లూరు పేట నుంచి 10 కి.మీ, ఉత్తర పులికాట్ నుంచి 20 కి.మీ దూరంలో ఉంటుంది నేలపట్టు. దీనిని దొరవారి సత్రం అని కూడా అంటారు. శీతాకాలంలో ఇక్కడకు ఆఫ్రికా, అమెరికా, చైనా దేశాల నుంచి వలస పక్షులు అధికంగా వస్తుంటాయి. వాటిలో ప్రధానంగా గూడబాతులు (స్పాట్ బిల్డ్ పెలికాన్), తెడ్డు ముక్కు కొంగలు, (స్పూన్ బిల్), వైట్ ఇబిస్ (తెల్ల కొంగలు) నైట్ హారన్(శబరి కొంగ)లకు ఈ పక్షి కేంద్రం పేరుగాంచింది. అక్టోబర్‌లో వచ్చిన ఈ వలస పక్షులు నాలుగైదు నెలల పాటు సంతానోత్పత్తి గావించి, వేసవి మొదట్లో తిరిగి వచ్చిన చోటుకే వెళ్లిపోతాయి. ఇవే గాకుండా నారాయణ పక్షులు, నీటి కాకి, సముద్రపు కొంగ, గుళ్ల కొంగ, నల్లకంకణాలు, పరజ, నీలిరెక్కల పరజ, సూది తోక బాతు, ఎర్రతల బాతు, చుక్కకోడి, చుక్కమూతి బాతు... మరో 21 రకాల పక్షులు, ఇక్కడే ఉన్న ఇంకో 50 రకాల పక్షులు సందడితో నేలపట్టు ప్రతి ఉదయం మేలుకొంటుంది. సందర్శన సమయం: అక్టోబర్ నుంచి మార్చి వరకు విరివిగా ఉండే ఈ పక్షుల సోయగాలను తిలకించడానికి అనువైన సమయం. ఉప్పలపాడు రాష్ట్రంలో మరో పేరెన్నికగన్న పక్షి స్థావరం ఉప్పలపాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో ఉంది ఈ గ్రామం. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో సైబీరియా, ఆస్ట్రేలియాల నుంచి గూడబాతుల గుంపులు, ఎర్రకాళ్ల కొంగల వరసలు, నత్తకొట్టు కొంగలు సమూహాలు.. వీటితో పాటు మరో 70 రకాల జాతి పక్షులతో ఈ ప్రాంతం కిక్కిరిసిపోయి ఉంటుంది. పక్షిస్థావరానికి వెళ్లే దారికిరువైపులా పచ్చని చేలు, ఆ చేలపై ఎగురుతున్న మైనగోరలు, కత్తిరిపిట్టలు, అక్కడక్కడ పాలపిట్టలు, కొంగలు... పొలాలను ఆశిస్తున్న మిడతలను, పురుగులను లాఘవంగా వేటాడుతూ కనువిందు చేస్తాయి. గాలిలో ఎగురుతున్న పురుగులను నేర్పరులైన నల్లంచులు వేటాడటం చూడవలసిందే! దారిలో సందడిగా ఉన్న ఊళ్ల గుండా ప్రయాణిస్తూ ఈ గ్రామాన్ని చేరుకుంటాం. గ్రామాన్ని చేరుకొని పక్షల స్థావరాన్ని చేరుకోగానే కలిగే అనుభూతి చెప్పనలవి కాదు. అది ఒక అందమైన దృశ్యకావ్యం. కాలాలననుసరించి వివిధ రకాల పక్షులరాక ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. పక్షులు వాటి గూళ్లలో పిల్లలకు ఆహారాన్ని అందిస్తుంటే చూడడం ఒక ఆనందానుభూతి. పక్షి ప్రేమికులకయితే చెప్పనవసరం లేదు. గంటలతరబడి చూస్తూ అనేకమార్లు వచ్చి వాటి అలవాట్లు గమనిస్తూ నోట్సులు తయారుచేసుకుంటారు. పక్షి శాస్త్రజ్ఞులు ఇక్కడ తమ పరిశోధనలు జరిపి పరిశోధనా పత్రాలు, గ్రంథాలు తయారుచేస్తారు. ఈ పక్షి కేంద్రానికి నత్తకొట్టుకొంగలు, తెల్ల కంకణాలు, ఎర్రకాళ్ల కొంగలు, చుక్కల ముక్కు గూడ బాతులు, చిత్త ఒక్కలు, చుక్కమూతి బాతులు, నల్ల బోలి కోడి, కలికి పక్షులు, జకానాలూ... మొదలైన 70 జాతులకు పైగా పక్షులు వస్తుంటాయి. గుంటూరు నుండి నందివెలుగు మీదుగా తెనాలికి వెళ్లే మార్గంలో 7 కి.మీ దూరంలో ఉంది ఈ పక్షి కేంద్రం. గుంటూరు నుండి ఆర్.టి.సి బస్సులు, ఆటోల ద్వారా ఈ గ్రామాన్ని చేరుకోవచ్చు. చెన్నై-హోరా రైలు మార్గాన ప్రయాణించేవారు తెనాలిలో దిగి నందివెలుగు మీదుగా 18 కి.మీ దూరంలో ఈ గ్రామానికి చేరుకోవచ్చు. సందర్శన సమయం: కిక్కిరిసిన ఈ పక్షులను, వాటి సోయగాలను చూడడానికి ఫిబ్రవరి చివరి వారం మార్చి మొదటి వారం వరకు అనువైనది. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన పక్షి కేంద్రాలను సందర్శించా లనుకునేవారు... ఏలూరు నుంచి కొల్లేరు - గుంటూరులోని ఉప్పలపాడు - నెల్లూరులోని నేలపట్టు - పులికాట్ లను సందర్శించవచ్చు. కొల్లేరు సరస్సు చేరడానికి... గుడివాడ - కైకలూరు, ఏలూరు మీదుగా కొల్లేరుకు చేరుకోవచ్చు. కొల్లేరు టౌన్‌కు నాలుగు వైపులా ఆటపాక 2.5 కి.మీ, భుజబలపట్నం 6 కి.మీ, కొవ్వాడ లంక7 కి.మీ దూరంలో ఉన్నాయి. రోడ్డు మార్గాన ... విజయవాడ నుంచి 60 కి.మీ, ఏలూరు నుంచి 15 కి.మీ, కైకలూరు నుంచి 1.5 కి.మీ, నిడమనూరు నుంచి 8 కి.మీ, గుడివాడకలంక నుంచి 3 కి.మీ దూరంలో ఉన్న కొల్లేరుకు చేరుకోవచ్చు. రైలు మార్గాన వెళ్లాలనుకుంటే విజయవాడ నుంచి 60 కి.మీ దూరంలో ఉంది కొల్లేరు. ఉప్పలపాడు పక్షి కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు చూడాలనుకునేవారు.. గుంటూరు టౌన్ నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న అమరావతికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. బస్‌స్టేషన్ ఎదురుగా అమరావతి మ్యూజియం ఉంటుంది. శుక్రవారం మినహా మిగతా అన్ని రోజుల్లోనూ ఈ మ్యూజియాన్ని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చు. నేలపట్టు అందాలను ఒడిసిపట్టుకోవాలంటే... ఆంధ్రప్రదేశ్-తమిళనాడు రాష్ట్రాల్లో సుమారు 404 చ.కి.మీ విస్తీర్ణంలో నేలపట్టు పక్షి కేంద్రం కొలువుదీరింది. సైబీరియన్ కొంగల జాతులు 160 ఉన్నట్టు గర్వంగా చెప్పుకుంటుంది నేలపట్టు. నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ నేలపట్టుకు అక్టోబర్‌లో పెలికాన్ పక్షులు ఎక్కువగా వస్తుంటాయి. సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ నుంచి 23కి.మీ. నేలపట్టు ఫ్లెమింగోలకు, పెలికాన్ పక్షులకు దక్షిణాసియాలో ఇదే అతిపెద్ద ఆవాసంగా చెబుతారు. పులికాట్ సరస్సులో... మంచినీరు, సముద్రపునీరు కలిసిన సరస్సు ఇది. 60 కిలోమీటర్ల పొడవు పదిహేడున్నర కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఈ సరస్సు ఉంది. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ నుంచి పులికాట్‌కు 10 కి.మీ దూరం. పర్యాటకులు చేయకూడనివి వలస పక్షులు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటాయి. ఏ మాత్రం అనుకూలంగా లేనట్టు అవి పసిగట్టినా అవి ఎప్పటికీ ఆ ప్రాంతాలకు రావు. పక్షులు ఉన్న చోటుకు ఇష్టం వచ్చినట్టుగా వెళ్లకూడదు. సరదా కోసం రాళ్లను విసరకూడదు. అగ్నిప్రమాదాలకు కారణమయ్యే చుట్ట, బీడి, సిగరెట్ పీకలను ఆ ప్రాంతాలలో వదిలేయకూడదు. నీటి కాలుష్యానికి కారకమయ్యే ఆహారపదార్థాలు, ప్లాస్టిక్, పాలిథిన్ బ్యాగ్స్.. వంటివి చెరువులు, సరస్సులలో వేయకూడదు. వలసపక్షులున్న చెరువులు, సరస్సులలో ఈతకు వెళ్లరాదు. శబ్దాలు చేయకూడదు. ఇన్పుట్స్ - గ్రేసెస్,అటవీశాఖాధికారి, కొల్లేరు - కోకా మృత్యుంజయ రావు, ఉప్పలపాడు - శ్రీనివాస్, నెల్లూరు, సాక్షి ఫొటోలు: ఆకుల శ్రీనివాస్, ఏలూరు