ఉప్పెన: కృష్ణా నదీముఖంలో | Kaddura town in the face of the Krishna River | Sakshi
Sakshi News home page

ఉప్పెన: కృష్ణా నదీముఖంలో

Published Sat, May 17 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM

ఉప్పెన: కృష్ణా నదీముఖంలో

ఉప్పెన: కృష్ణా నదీముఖంలో

 కృష్ణా నదీముఖంలో కద్దూర పట్టణం. క్రీ.శ. 200 (నేటి కృష్ణాజిల్లా మచిలీపట్నం వద్ద గూడూరు గ్రామం)

 ‘ఆగు నావికుడా! దురదృష్టం నిన్ను ఉప్పెనలా ముంచబోతుంది. సావధానం!’ అని అరుస్తూ అతడి అడుగులకి అడ్డుపడ్డాడొక సిద్ధ పురుషుడు. విబూది పూసిన ముఖంపై చింతనిప్పుల వంటి  కళ్ళలోకి చూసి నివ్వెరపోయినా మరుక్షణమే తేరుకొన్నాడు పద్మపాణి.
 
అర్ధరాత్రి కావస్తోంది. వంగి దండాలు పెడుతున్న పానశాల కావలివాడి చేతిలో వెండి పణం రాల్చి అప్పుడే వీధిలోకి అడుగుపెట్టాడు. అంత రాత్రి గడిచినా ఆ ఆంధ్రుల రేవుపట్టణంలో సందడి ఏమాత్రమూ తగ్గలేదు. జూదశాలలు, గణికాగృహాల నుండి బయటపడే నాగరికులు, విదేశీ నావికులు కనిపిస్తున్నారు. గౌడ (బెంగాలీ), మాగధ (బీహారీ), ఓఢ్ర (ఒరియా), ద్రవిడ (తమిళం) భాషలే కాక మలయ (మలేసియా), చీనీ (చైనా), యవన (గ్రీక్) భాషలు కూడా అక్కడక్కడా వినిపిస్తాయి. మర్రిచెట్టు కింద పల్లకీలు మోసే బోయీలు, బండ్లవాళ్ళు,  యజమానులకై ఎదురుచూస్తున్న సేవకులు అరుగులపై పూలిజూదం ఆడుతూ ఆ సిద్ధపురుషుడి అరుపుకి ఒకసారి ఉలక్కిపడి మళ్ళీ ఆటలోకి వెళ్లాలా లేదా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు.
 
పద్మపాణి చిన్ననాటి నుంచి సముద్రగర్భంలోని భూతాలతో, భూతాలవంటి ప్రకృతి బీభత్సాలతో ఆటలాడిన వాడు. మహాచీనం (చైనా) నుండి పారశీకం (అరేబియా గల్ఫ్ తీరం) వరకూ అనేకమార్లు నావలు నడిపించిన నావసారధి. కలవరం బయటకి కనపడకుండా నింపాదిగా ఆ సిద్ధపురుషుడి ఎర్రని కళ్ళలోకి చూస్తూ ఏమిటని తలెగరేసాడు.
 
 ‘దురదృష్టం నావికుడా! నిన్ను ఉప్పెనలా ముంచబోతుంది!’ మరోసారి బొంగురుపోయిన గొంతుతో హెచ్చరించాడు.
 
 ‘హహహ్! పోనీయవోయ్. అవలోకితేశ్వరుని అండ ఉన్నంతవరకూ ఇలాంటివి నన్నేమీ చేయలేవ్’ అని దట్టీలోని ఒక నాణెం సిద్ధుడి వంక విసిరి పానశాల వెనుక ద్వారం ఉన్న వీధి వైపు నడిచాడు. ఆ పానశాల నుంచి ఏ క్షణాన్నయినా నాగబుధిక బయటికి రావచ్చు. కాని కలవడం అసాధ్యం. ఎందుకంటే రాత్రి పూట పానశాలల్లో పని చేసే స్త్రీలను సాయుధ రక్షణతో నివాసం వరకూ దిగబెట్టడం నియమం. నాగబుధికని ఎన్నిమార్లు అడిగినా తానుండే నివాసమేదో చెప్పదు. ఈ రాత్రయినా బండిని వెంటాడి ఆమె ఇల్లెక్కడో కనుక్కోవాలి. ఆమెకి తనంటే ఇష్టమే. సందేహం లేదు. కానీ ఎందుకు తటపటాయిస్తుందో అర్థంకాదు! మధుశాల యజమానికి ఆమె బాకీపడిన సొమ్మును సుంకంతో సహా చెల్లించి ఆమెని విముక్తని చేస్తానని మాటయిచ్చినా ప్రయోజనం లేదు. అవుననదు. కాదనదు.
 
పానశాల వెనక ద్వారంలో నుండి నల్లని తెరలతో గూడుబండి వెలువడింది. బరిశెలతో నలుగురు కావలివాళ్ళు దానివెంట నడవసాగారు. మబ్బుల మధ్య చంద్రునిలా తెరల మధ్య నుండి నాగబుధిక ముఖం తొంగి చూసింది. తనను చూసిన క్షణంలో ప్రత్యక్షమైన చిరునవ్వు మరుక్షణం వెలవెలపోయి తెరల వెనుకకి మాయమయింది. కాస్త దూరంగా బండి వెనుకే నడవసాగాడు పద్మపాణి. ‘చేతికందిన అదృష్టాన్ని ఎందుకే కాలదన్నుకుంటావ్? చూడు నీకోసం ఎలా పడిగాపులు పడుతున్నాడో’ అంది మాలసిరి, నాగబుధిక స్నేహితురాలు. స్నేహితురాలి మాటలకి మూడవ అంతస్తు కిటికీలోంచి బయటకి తొంగి చూసి నిట్టూర్చింది నాగబుధిక. అర్ధరాత్రి గడిచినా ఇంకా వీధి మధ్య అరుగుపై ఎదురుతెన్నులు చూస్తున్న పద్మపాణి ముఖం వెన్నెల వెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది.
 
 ‘ఆహా! ఎంత విరహమే! అందగాడు, ధనవంతుడు. తూర్పు సముద్రపు దేశాల్లో అతడిని మించిన నావికుడు లేడని చెబుతారు. సరేనను చాలు, ఈ పాడు జీవితం వదిలి హాయిగా ఉండవచ్చు. అయినా నీకూ అతడంటే ఇష్టమేగా?’ అన్నది మాలసిరి. ‘అవునే’ నీళ్ళు పొంగుతున్న కళ్ళు తుడుచుకుంటూ, ‘అందుకే వద్దనేది. నా దురదృష్టాన్ని అతడికెందుకు అంటిచాలి? నా కథ నీకు తెలుసుగా. నా అంతటి దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే ఉండదు. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో అయినా పుట్టినప్పుడే తల్లిదండ్రులని పొట్టన పెట్టుకున్నాను. కొడుకులు లేకపోవడంతో నా తండ్రి ఆస్తి రాజుగారికి పోయింది. అనాథనని నన్ను చేరదీసి నాయనలా సాకిన రామిశెట్టికీ న ష్టమే. గొడ్డొచ్చిన వేళా! బిడ్బొచ్చిన వేళా! అని శెట్టిసాని చెప్పింది నిజమే’
 
‘బాధపడకే. ఊరుకో,’ వెక్కివెక్కి ఏడుస్తున్న నాగుబుధికను ఓదార్చింది మాలసిరి.
‘నాయన కూడా నీలాగే చెప్పేవాడు. నన్ను చారుదత్తుడనే కుమ్మరి చేతిలో పెట్టి ఆయన కన్నుమూశాడు. కానీ ఏమిలాభం? సంవత్సరం తిరగకుండా నా దురదృష్టం నా మొగుడిని కూడా తీసుకుపోయింది. పెనిమిటి పోయినా బొమ్మల వ్యాపారానికి ఆయన చేసిన అప్పుమాత్రం మిగిలింది. మన యజమాని మంచివాడు కనక మధుశాలలో ఈ పని ఇచ్చాడు. ఇంకో నాలుగేళ్ళలో ఆ అప్పు తీరిపోతుంది. ఆప్పుడీ పాడు జీవితానికే స్వస్తి చెప్పవచ్చు.’ అన్నది నాగుబుధిక.
 
‘ఛీఛీ.. ఏం మాటలే అవి? నా మాట విని పద్మపాణితో పెళ్ళికి ఒప్పుకో. వెళ్ళి అతనితో సరేనని చెప్పు. చూడు పాపం నీకోసం ఎలా ఎదురు చూస్తున్నాడో!’ అని ఒప్పించింది ఆమె శ్రేయోభిలాషి మాలసిరి.
           
పాతికేళ్ళ జీవితంలో పద్మపాణి ఎన్నో దేశాలు తిరిగాడు. ఎందరో స్త్రీలని చూశాడు. కాని మొదటి చూపులోనే నాగబుధిక అతడి హృదయాన్ని కదిలించింది. పైకి ఆహ్లాదంగా కనిపించినా సముద్రంలాంటి ఆమె కళ్లలోతుల్లో ఏదో విషాదం. ఎందుకో పొదివి పట్టి హృద యానికి హత్తుకోవాలనే తపన. ఆమె లేని జీవితం వృధా అనే భావన. ప్రతిరోజూ ఆమె ముఖం చూడనిదే కంటికి కునుకు రాదు.
 
తన అదృష్టం ఎలా ఉందో?
ఆహ్! దురదృష్టమట! చింతనిప్పుల వంటి కళ్ళతో ఆ సిద్ధుడు చేసిన హెచ్చరిక పద్మపాణి మనస్సులో ప్రతిధ్వనించింది. తలెత్తి ఆకాశం వంక చూశాడు. చంద్రుడి చుట్టూ కాంతి వలయం! సన్నని తూర్పుగాలి. సముద్రయానాలలో అనేక ప్రకృతి వైపరీత్యాలని కళ్ళారా చూసిన ఆ నావికుడి భృకుటి ముడిపడింది. ఏదో పెద్ద గాలివాన వచ్చే సూచన.
 
 ఎదురుగా పరుగెత్తుకుంటూ తనవైపే వస్తున్న నాగబుధికని చూశాడు. అతడి ఆనందానికి అంతులేదు. తన హృదయంపై వాలిపోయిన ప్రియురాలిని కౌగిలిలో బిగించి కాలం తెలియకుండా అలానే ఉండిపోయాడు. మరునాడే మధుశాల యజమానికి అప్పు చెల్లించి నాగబుధికని విడిపించుకున్నాడు. నూతన వధువు నాగబుధికతో సముద్రతీరంలోని తన విడిది చేరాడు పద్మపాణి.

 పున్నమిరాత్రి.
 అతడి ఆనందంలో పాలుపంచుకోవటానికా అన్నట్లు ఆ నావికుడి నేస్తం సముద్రం కూడా నూరు అడుగులు ముందుకొచ్చాడు. అతడి గుండెలాగే సముద్రపుటలలు కూడా ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ప్రథమ సమాగమనానికి ఆరాటపడుతున్న ఆ దంపతులకి చిరుజల్లు స్వాగతం పలికింది. కలసిన ఆ శరీరాలకీ కర్ణేంద్రియాలకీ ఒకరికొకరి ధ్యాస తప్ప బయట ప్రపంచంతో ప్రమేయం లేదు.
 ఆ రాత్రి వచ్చిన రెండు తాటిచెట్ల ఎత్తు ఉప్పెన కూడా ఆ జంట ఆలింగనాన్ని విడదీయలేక పోయింది. సముద్రం సృష్టించిన బీభత్సానికి కద్దూర పట్టణం తుడిచి పెట్టుకుపోయింది. కానీ మరుభూమిలా మిగిలిన ఊరి మధ్య ఆ నూతన దంపతులున్న సౌధం మాత్రం చెక్కుచెదరలేదు. మరునాడు ఉదయం మేడపై నుండి ఆ వినాశనాన్ని కలయజూసిన పద్మపాణి కళ్లలో నీళ్లు తిరిగాయి.
 ఈ ప్రకృతి ఉపద్రవం నుండి నన్ను కాపాడిన నా అదృష్ణదేవతవి నువ్వే అని కౌగిలించుకొన్న పద్మపాణిని తనకిచ్చినందుకు అవలోకితేశ్వరునికి నీళ్ళు నిండిన కళ్లతో ధన్యవాదాలర్పించింది నాగబుధిక.     
 
 ఆగ్నేయాసియాలో ఆంధ్ర రాజ్యాలు
 
 ఇండియాలో అత్యంత పొడవైన తీరరేఖ ఆంధ్రులదే. చిలక సరస్సు నుండి పులికాట్ వరకూ అనేక రేవు పట్టణాలు తెలుగువారి అధీనంలో ఉండేవి. వీటిలో ముఖ్యమైనవి కృష్ణా గోదావరీ తీరంలో ఉన్నాయని ‘పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ’ అనే రోమన్ గ్రంథం చెబుతుంది. అవి ఎఫిటెరియాన్ (భట్టిప్రోలు), కొన్టకోస్సిలా (ఘంటశాల), కొడ్డూరా (బందరు వద్ద గూడూరు), అల్లోజ్ఞైని (గోదావరి డెల్టాలోని ఆదుర్రు), మైసోలియా (మోటుపల్లి), పోడుక (ఒంగోలు వద్ద పాదర్తి), మునార్ఫా (కావలి వద్ద మున్నేరు), సొపట్మ (పులికాట్)... మొదలైనవి. టోలెమీ రచించిన గ్రీక్ గ్రంథం ‘జాగ్రఫీ’ ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యం కృష్ణా తీరంలోని రేవు పట్టణాల నుండే సాగిందని చెబుతుంది.
 ఆగ్నేయాసియాలో ఆంధ్రులు నెలకొల్పిన రాజ్యాలు శిలాయుగంలో ఉన్న ఆ ప్రాంతానికి నాగరికతని పంచాయి.

శాసనాలలో కనిపించే ఆయా దేశాల పాత పేర్లే అందుకు నిదర్శనం. బర్మా పేరు త్రిలింగం. అక్కడి రాజవంశాన్ని తెలైంగులు అంటారు. తెలైంగ్ వారి భాష. ఇప్పటి థాయ్‌లాండు సింధుశాఖ ప్రాంతానికి ఒకప్పటి పేరు కాకుళ రాజ్యం. ఇక మలేసియాలో పాలెంబాంగ్ ప్రాంతపు ఒకప్పటి పేరు ఆంధర. ఇండోనేసియాలోని బోరుబదూర్ మహాస్తూపం ఉన్న ప్రదేశాన్ని మగెలాంగ్ (మహాలంక) అంటారు. ఇక అండమాన్ నికోబార్ ద్వీపాల పూర్వ నామాలు ఆంధ్రమణీ- మనక్కవరం. సింహపురి (నెల్లూరు) సింగపూర్ అయింది. అంతెందుకు? వియెత్నాం, లావోస్ దేశాల ఒకప్పటి పేరు అమరావతి రాజ్యం. అక్కడి పట్టణాల పేర్లు- విజయ, పాండుర, కౌథూర. అన్నీ కృష్ణాతీరంలోని ప్రాచీన పట్టణాల పేర్లే.
 జాతక కథలు ఆంధ్ర వణిజులకి ఆగ్నేయాసియాలోని దేశాలకి ఉన్న సంబంధాలు ప్రస్తావిస్తాయి. ఆంధ్ర రాజవంశమైన విష్ణుకుండినులూ కంపూచియా (కాంభోజ) రాజ్య స్థాపకులైన కైండిన్య గోత్రులూ ఒకటేనని శాసనాలంకారం అనే గ్రంథం చెబుతుంది. అంధ్రతీరంలో నౌకానిర్మాణం ఒక ప్రముఖమైన పరిశ్రమగా ఎదిగింది. నరసాపురం (ప.గో.జిల్లా), మోటుపల్లి (గుంటూరు జిల్లా) ముఖ్యమైన కేంద్రాలు. ఆంధ్రులు 75 టన్నుల బరువు మోసే నావలు నిర్మించారని రోమన్ గ్రంథం హిస్టోరియా న్యాచురాలిస్ చెబుతుంది.

 ఆనాటి సమాజం ఎంత అభివృద్ధి చెందినా స్త్రీల పరిస్థితి మాత్రం పతనం చెందసాగింది. మనుధర్మశాస్త్రం ఆ కాలంలోనే రచించబడింది. ఆర్థిక వనరులపైన పురుషుల గుత్తాధిపత్యం మొదలయింది. మితాక్షర కూతుళ్లకి ఆస్తిపై హక్కు కల్పించదు. ఆస్తిని కాపాడుకోవటానికి కొడుకుల అవసరం అయింది. తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు పరులపై ఆధారపడవలసి వచ్చింది. చేసిన అప్పులు తీర్చేందుకు భార్యాపిల్లలని దాస్యానికి అమ్మటం ఆచారమయింది. హరిశ్చంద్రుని కథ దీనికి నిదర్శనం. నిరాధారులయిన స్త్రీలకు రక్షణ కరువైంది. విధవా వివాహం చట్టసమ్మతమే.
 
 అమరకోశం అనే సంస్కృత నిఘంటువు ‘పునర్భూ’ అంటే పునర్వివాహం చేసుకున్న స్త్రీని ప్రస్తావిస్తుంది. రాత్రిపూట పనిచేసే స్త్రీ కార్మికులకు తప్పనిసరిగా తగిన రక్షణతో ఇంటి వద్ద దిగబెట్టే వ్యవస్థ చేయాలని అర్థశాస్త్రం నిర్దేశిస్తుంది. ఈనాడు కాల్‌సెంటర్లలో రాత్రి సమయాల్లో పనిచేసే ఉద్యోగినులకు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించే ఆనవాయితీ మన దేశంలో రెండువేల సంవత్సరాలకి పూర్వమే ఉండేదంటే ఆశ్చర్యం కలుగక మానదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement