బీజింగ్: ఆగ్నేయ ఆసియాపై ఆధిపత్యాన్ని తాము కోరుకోవడం లేదని చైనా అధినేత షీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. పొరుగున్న ఉన్న చిన్న దేశాలపై పెత్తనం చెలాయిస్తూ అదుపులో పెట్టుకోవాలని ఆశించడం లేదని వెల్లడించారు. సోమవారం ఆగ్నేయ ఆసియా దేశాల అసోసియేషన్(అసియాన్) సభ్యుల వర్చువల్ సదస్సులో జిన్‌పింగ్ మాట్లాడారు. ఆసియాన్, చైనా మధ్య సంబంధాలకు 30 ఏళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ఆధిపత్యవాదానికి, పవర్ పాలిటిక్స్‌కు చైనా ముమ్మాటికీ వ్యతిరేకమేనని ఉద్ఘాటించారు. పొరుగు దేశాలకు స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆగ్నేయ ఆసియాలోని దేశాలన్నీ కలిసి ఈ ప్రాంతంలో శాంతిని కాపాడుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని వివరించారు. మరో దేశంపై ఆధిపత్యం చెలాయించడం చైనా విధానం కాదని వివరించారు. దక్షిణ చైనా సముద్రంలో ఇటీవలి కాలంలో డ్రాగన్ దేశం నియంతృత్వ పోకడలపై అసియాన్ సభ్యదేశాలైన మలేషియా, వియత్నాం, బ్రూనై, ఫిలిప్పైన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
చట్టాలను చైనా గౌరవించాలి: ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో విధుల్లో ఉన్న జవాన్లకు సరుకులు తీసుకెళ్తున్న ఫిలిప్పైన్స్ పడవలను ఇటీవలే చైనా నౌకలు అడ్డగించాయి. శక్తివంతమైన యంత్రాలతో నీటిని విరజిమ్మడంతో ఫిలిప్పైన్స్ పడవలు వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటనను ఆసియాన్ సదస్సులో ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ లేవనెత్తారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను గౌరవించాలని చైనాకు హితవు పలికారు. దక్షిణ చైనా సముద్ర వివాదాలను పరిష్కరించుకోవాలని మలేషియా ప్రధాని యాకోబ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment