Southeast Asia
-
విస్తరణ బాటలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ .. గల్ఫ్, మధ్య ప్రాచ్యంలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు ఆగ్నేయాసియాలోనూ తమ కార్యకలాపాలను విస్తరించనుంది. బ్యాంకాక్, సింగపూర్, కొలంబో తదితర కొత్త రూట్లను పరిశీలిస్తున్నట్లు సంస్థ ఎండీ అలోక్ సింగ్ తెలిపారు. 2025 మార్చి వేసవి షెడ్యూల్లో ఖాట్మండూ రూట్లో సరీ్వసులు మొదలుపెడతామని, వచ్చే ఆర్థిక సంవత్సరం లేదా ఆపై సంవత్సరం వియత్నాంకి ఫ్లయిట్స్‌ను ప్రారంభించే అవకాశం ఉందని ఆయన వివరించారు. ప్రధానంగా 5.5–6 గంటల ప్రయాణ దూరం ఉండే రూట్లు, ద్వితీయ .. తృతీయ శ్రేణి నగరాలకు సరీ్వసులపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా కోల్‌కతా నుంచి ఢాకాకు డైరెక్ట్ ఫ్లయిట్స్ ప్రణాళికను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి నాటికి తమ విమానాల సంఖ్యను ప్రస్తుతమున్న 90 నుంచి 100కి పెంచుకోనున్నట్లు సింగ్ చెప్పారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం దేశీయంగా 36, అంతర్జాతీయంగా 15 గమ్యస్థానాలకు నిత్యం 400 ఫ్లయిట్స్ నడుపుతోంది. -
స్టార్టప్‌ల కోసం సీక్వోయా నిధులు
న్యూఢిల్లీ: స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా సీక్వోయా ఇండియా, సీక్వోయా ఆగ్నేయాసియా 2.85 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 22,000 కోట్లు)ను సమీకరించాయి. వెరసి గత ఫండ్‌తో పోలిస్తే రెట్టింపు నిధులను సిద్ధం చేసింది. సీక్వోయా తొలిసారి 85 కోట్ల డాలర్లతో దక్షిణాసియాకు ప్రత్యేకించిన ఫండ్‌ను ఆవిష్కరిస్తోంది. మరో 2 బిలియన్ డాలర్లను ఇండియన్ వెంచర్, గ్రోత్ ఫండ్స్‌కు కేటాయించింది. గత 16 ఏళ్లలో ఇండియా, ఆగ్నేయాసియాలకు 9 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు కట్టుబడినట్లు ఎస్ఈసీ ఫైలింగ్స్‌లో సీక్వోయా వెల్లడించింది. సీక్వోయా ఇండియా దేశీయంగా వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల్లో దూకుడు చూపుతోంది. ప్రధానంగా ఇండియా, దక్షిణాసియాలలో 400కుపైగా స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేసింది. వీటిలో 36 వరకూ యూనికార్న్‌లున్నాయి. ఈ జాబితాలో బైజూస్, జొమాటో, అన్అకాడమీ, పైన్‌ల్యాబ్స్, రేజర్‌పే తదితరాలు చేరాయి. గత 18 నెలల్లో సీక్వోయా నిధులు అందుకున్న స్టార్టప్‌లలో 9 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను సైతం చేపట్టడం గమనార్హం! -
ఆధిపత్యం.. మా విధానం కాదు: చైనా అధ్యక్షుడు
బీజింగ్: ఆగ్నేయ ఆసియాపై ఆధిపత్యాన్ని తాము కోరుకోవడం లేదని చైనా అధినేత షీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. పొరుగున్న ఉన్న చిన్న దేశాలపై పెత్తనం చెలాయిస్తూ అదుపులో పెట్టుకోవాలని ఆశించడం లేదని వెల్లడించారు. సోమవారం ఆగ్నేయ ఆసియా దేశాల అసోసియేషన్(అసియాన్) సభ్యుల వర్చువల్ సదస్సులో జిన్‌పింగ్ మాట్లాడారు. ఆసియాన్, చైనా మధ్య సంబంధాలకు 30 ఏళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ఆధిపత్యవాదానికి, పవర్ పాలిటిక్స్‌కు చైనా ముమ్మాటికీ వ్యతిరేకమేనని ఉద్ఘాటించారు. పొరుగు దేశాలకు స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆగ్నేయ ఆసియాలోని దేశాలన్నీ కలిసి ఈ ప్రాంతంలో శాంతిని కాపాడుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని వివరించారు. మరో దేశంపై ఆధిపత్యం చెలాయించడం చైనా విధానం కాదని వివరించారు. దక్షిణ చైనా సముద్రంలో ఇటీవలి కాలంలో డ్రాగన్ దేశం నియంతృత్వ పోకడలపై అసియాన్ సభ్యదేశాలైన మలేషియా, వియత్నాం, బ్రూనై, ఫిలిప్పైన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చట్టాలను చైనా గౌరవించాలి: ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో విధుల్లో ఉన్న జవాన్లకు సరుకులు తీసుకెళ్తున్న ఫిలిప్పైన్స్ పడవలను ఇటీవలే చైనా నౌకలు అడ్డగించాయి. శక్తివంతమైన యంత్రాలతో నీటిని విరజిమ్మడంతో ఫిలిప్పైన్స్ పడవలు వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటనను ఆసియాన్ సదస్సులో ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ లేవనెత్తారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను గౌరవించాలని చైనాకు హితవు పలికారు. దక్షిణ చైనా సముద్ర వివాదాలను పరిష్కరించుకోవాలని మలేషియా ప్రధాని యాకోబ్ చెప్పారు. -
ఆగ్నేయాసియా గేట్వేగా మిజోరాం
ఐజ్వాల్/షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు, రవాణా సౌకర్యాల అభివృద్ధికి తమ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా మయన్మార్‌లోని సిత్వే పోర్టును మిజోరాంతో అనుసంధానించే కలడన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి విస్తృత ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. కంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి 10 ఆసియన్ కూటమి దేశాలకు మిజోరాం ముఖద్వారంగా మారనుందని మోదీ తెలిపారు. 60 మెగావాట్ల తుయిరియల్ జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించాక అసోం రైఫిల్స్ గ్రౌండ్లో జరిగిన సభలో ప్రసంగించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం, త్రిపుర తర్వాత మిగులు విద్యుత్ ఉత్పత్తి అవుతున్న రాష్ట్రంగా మిజోరాం అవతరించిందన్నారు.. అనంతరం ఆయన మేఘాలయ రాజధాని షిల్లాంగ్ వెళ్లారు. పశ్చిమ మేఘాలయలోని తురా ప్రాంతాన్ని రాజధాని షిల్లాంగ్తో కలిపే 271 కిలోమీటర్ల డబుల్ లేన్ రోడ్డును జాతికి అంకితం చేశారు. షిల్లాంగ్ ఎయిర్‌పోర్టును భారీ విమానాలు సైతం దిగేలా విస్తరిస్తామన్నారు. ‡1971 ఇండో–పాక్ యుద్ధంలో పోరాడిన భారతీయ సైనికులకు మోదీ అభినందనలు తెలిపారు. విజయానికి గుర్తుగా ఏటా ‘విజయ్‌దివస్’గా జరుపుకుంటున్నారు. -
కార్యకలాపాల విస్తరణలో ‘రేజర్‌పే’
ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాలపై దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పేమెంట్ గేట్‌వే సేవల సంస్థ రేజర్ పే.. త్వరలో ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాల్లోకి కార్యకలాపాలు విస్తరించనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో ఇండొనేసియా, మలేసియా తదితర దేశాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సంస్థ సహవ్యవస్థాపకుడు హర్షిల్ మాథుర్ చెప్పారు. స్టార్టప్ సంస్థలకు తోడ్పాటు కోసం ఉద్దేశించిన రెవప్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారమిక్కడికి వచ్చిన సందర్భంగా విలేకరులకు ఈ విషయాలు తెలిపారు. పేమెంట్ సేవలు, ఇంటర్నెట్ సదుపాయం తదితర అంశాల్లో భారత్ తరహా పరిస్థితులు ఉన్న దేశాల్లోకి విస్తరించాలని భావిస్తున్నట్లు వివరించారు. ఇక దేశీయంగా బీమా, విద్యా సంస్థలకు కూడా పేమెంట్ సేవలు అందించడంపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 35,000, హైదరాబాద్‌లో 500 పైగా వ్యాపార సంస్థలు తమ సర్వీసులు వినియోగించుకున్నట్లు చెప్పిన మాథుర్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ సంఖ్యను 60,000కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. వీడియోకాన్ ఇండస్ట్రీస్, నంబర్‌మాల్ తదితర సంస్థలు తమ క్లయింట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఈసారి లావాదేవీల పరిమాణం, ఆదాయంలో పది రెట్లు వృద్ధి అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటిదాకా 11.5 మిలియన్ డాలర్లు సమీకరించామని, అవసరాన్ని బట్టి వచ్చే ఏడాది ప్రారంభంలో మరో విడత నిధులు సమీకరించే అవకాశం ఉందని చెప్పారు. -
ఆగ్నేయాసియా ముఖద్వారంగా ‘ఈశాన్యం’
- ఈశాన్య రాష్ట్రాల్లో వసతుల కోసం రూ.40 వేల కోట్ల ఖర్చు - పారిశుధ్యం మెరుగుకాకుంటే ఆ కల నెరవేరదు: మోదీ న్యూఢిల్లీ/షిల్లాంగ్: ఈశాన్య భారతాన్ని ఆగ్నేయాసియాకు ముఖద్వారం (గేట్‌వే)గా మారుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొన్నారు. అయితే పారిశుధ్య లోపం ఈ కలకు ప్రతిబంధకం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని భారత్ సేవాశ్రమ్ సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ నగరాల జాబితాలో మొదటి 50 స్థానాల్లో ఈశాన్య ప్రాంతం నుంచి గ్యాంగ్‌టక్ మాత్రమే చోటు సంపాదించిందని, తక్షణం పారిశుధ్యం మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ‘మనం నిర్మించే అద్భుతమైన గేట్‌వే అపరిశుభ్రత, వ్యాధులు, నిరక్షరాస్యత, అసమానతలకు నిలయంగా ఉంటే... దేశాభివృద్ధిలో భాగస్వామి కావడంలో విఫలమవుతుంది. ఇన్ని వనరులు ఉన్నా ఇంకా మనం వెనకబడి ఉండడంలో ఎలాంటి అర్థం లేదు’ అని ప్రధాని పేర్కొన్నారు. స్వచ్ఛత సాధించేందుకు ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరు సవాలుగా తీసుకోవాలని సూచించారు. స్వచ్ఛ నగరాల జాబితాలో ఈశాన్య భారతం నుంచి మొత్తం 12 నగరాలు పాలుపంచుకోగా..100 నుంచి 200 మధ్యలో నాలుగు , 200 నుంచి 300 మధ్య ఏడు నగరాలు నిలిచాయి. షిల్లాంగ్ 276వ స్థానానికి పరిమితమైంది. ‘ఆగ్నేయాసియాకు ఈశాన్య భారతాన్ని గేట్వేగా చేస్తాం. ఈ ప్రాంతం అపరిశుభ్రంగా ఉంటే ఆ కల నెరవేరదు. పారిశుధ్య ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు చేతులు కలపాలి. స్వాతంత్య్రం వచ్చి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఈశాన్య ప్రాంతంలో సంతులిత అభివృద్ధి లేదు. కేంద్రం ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికతో ముందుకెళ్తోంది. రవాణా వ్యవస్థ మెరుగుపర్చడం, పర్యాటకుల్ని ఆకర్షించే లక్ష్యంతో అభివృద్ధి చేయడం అందులో ప్రధాన మైనవ’ని పేర్కొన్నారు. ఇవన్నీ ఈశాన్య భారతాన్ని ఆగ్నేయాసియాకు ముఖ ద్వారం చేయడంలో సాయపడతా యని చెప్పారు. మొత్తం ఈశాన్య భారతంలో మౌలిక వసతుల్ని మెరుగుపర్చేందుకు రూ. 40 వేల కోట్లు ఖర్చుపెడుతున్నామని, 19 భారీ రైల్వే ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభిం చామన్నారు. కాగా, అతిపెద్ద బౌద్ధ ఉత్సవం ‘వేసక్’లో పాల్గొనేందుకు మోదీ మే 11న శ్రీలంకకు వెళ్లనున్నారు. -
రాహుల్ అప్పుడు ఎక్కడున్నారు?
ఈ సంవత్సరం మొదట్లో జరిగిన పార్టమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అజ్ఞాతవాసం పలు విమర్శలకు దారితీసింది. దాదాపు రెండు నెలలు సెలవులో ఉన్నపుడు ఆయన ఎక్కడెక్కడ తిరిగారు? ఏం చేశారు? అన్న విషయాలపై విస్తృతంగా రాజకీయ పార్టీల్లో, మీడియాలో చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 22 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన రాహుల్... థాయ్ ఎయిర్వేస్ విమానంలో భారత్‌కు చేరుకున్నారు. కానీ ఆయన ఎక్కడకు వెళ్లారన్నది మాత్రం ఎవరికీ తెలియరాలేదు. రాహుల్ టూర్ పై తాజాగా ఓ టీవీ ఛానెల్ కొన్ని వివరాలు వెలుగులోకి తెచ్చింది. కాంగ్రెస్ వంశాంకురం 'సూపర్ సీక్రెట్ ఫారెన్ టూర్'లో రెండు నెలల కాలంలో ఆగ్నేయ ఆసియాలోని థాయ్ ల్యాండ్, కాంబోడియా, మయన్మార్, వియత్నాం దేశాలు చుట్టారు. ఇవన్నీ విశ్వవ్యాప్త పర్యటకులను ఆకర్షించే ధ్యానకేంద్రాలు కలిగిన స్థలాలు. అద్భుత వాతావరణం, రుచికరమైన వంటకాలకు గుర్తింపు పొందిన ప్రాంతాలు. రాహుల్ థాయిలాండ్ లో 15 రోజులు, కంబోడియాలో 11 రోజులు గడపడంతోపాటు.. మొత్తం టూర్ లో అత్యంత ఎక్కువ సమయం మయన్మార్ లో 21 రోజులు గడిపారు. ఫిబ్రవరి 17న బ్యాంకాక్ నుంచి ప్రారంభమైన ప్రయాణంలో మయన్మార్‌లో 21 రోజుల పాటు ఉన్నారు. థాయిలాండ్‌లో ఉన్నప్పుడు రాహుల్ ప్రముఖ బౌద్ధ క్షేత్రం అయుత్తయను సందర్శించారు. చివరిగా ఏప్రిల్ 16న బ్యాంకాక్ తిరిగి వచ్చిన రాహుల్ అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారు. రాహుల్ పర్యటన మొత్తం.. కాంగ్రెస్ ఎంపీ సతీష్ శర్మ కుమారుడు.. ఆప్త మిత్రుడైన సమీర్ శర్మతో కలసి ఉన్నట్లు సమాచారం. విదేశాల్లో ఉన్న సమయంలో తనవెంట ఎప్పుడూ ఉండే ప్రత్యేక సాయుధ బృందాన్ని (ఎస్పీజీ) కూడా రాహుల్ వద్దన్నారు. నాలుగు దేశాల్లో రెండునెలలున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. అక్కడ ఏం చేశారన్న వివరాలు మాత్రం నేటికీ రహస్యంగానే ఉండిపోయాయి. -
తీర జలాల నిబంధనలను గౌరవించాలి
నేప్యితా (మయన్మార్): దక్షిణ చైనా తీర జలాల విషయమై జపాన్, వియత్నాం వంటి ఆగ్నేయాసియా దేశాలతో చైనా కయ్యానికి కాలుదువ్వుతున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశానికి పరోక్షంగా చురకలంటించారు. దక్షిణ చైనా సముద్రంలో శాంతి, సుస్థిరత కోసం 1982 నాటి ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాల ఒప్పందం సహా అంతర్జాతీయ తీర నిబంధనలు, చట్టాలను అన్ని దేశాలు గౌరవించాలని బుధవారం ఇక్కడ జరిగిన 12వ భారత్-ఆసియాన్ సదస్సులో సూచించారు. ఆగ్నేయాసియాలో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత్, ఆసియాన్ దేశాలు సహకరించుకోవాలన్నారు. ఇందుకు తీరవర్తకం, భద్ర త ముఖ్యమన్నారు. భారత్-ఆసియాన్ సదస్సులో పాల్గొన్న మోదీ బుధవారం ఆరుగురు ప్రపంచ నేతలతోనూ సమావేశమయ్యారు. సంగీతానికి అచ్చెరువొంది: మయన్మార్ అంతర్జాతీయ కన్వెన్షన్ కేంద్రంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు పాక్ గ్వెన్‌హేతో భేటీ అనంతరం తాను బస చేసిన హోటల్‌కు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైన మోదీ అక్కడి ఓ వాయిద్యకారుడి సంగీతానికి అచ్చెరువొందారు. లయబద్ధంగా జైలోఫోన్‌ను వాయిస్తున్న అతని వద్దకు వెళ్లి కాసేపు ఆ సంగీతాన్ని ఆస్వాదించారు. మోదీ కార్యదక్షుడు: ఒబామా కితాబు భారత ప్రధాని నరేంద్ర మోదీ పనితీరును అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మెచ్చుకున్నారు. మోదీ కార్యదక్షుడంటూ కితాబిచ్చారు. ఆసియాన్, తూర్పు ఆసియా దేశాల సదస్సుకు హాజరైన ప్రపంచ నేతల గౌరవార్థం మయన్మార్ అధ్యక్షుడు థీన్ సీన్ బుధవారం రాత్రి ఇచ్చిన విందు సందర్భంగా మోదీని ఒబామా ఈ మేరకు ప్రశంసించినట్లు భారత విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ‘ట్వీట్’ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ: సామాజిక మీడియా వినియోగంలో ఎంతో ముందుండే ప్రధాని మోదీ... తాజాగా ‘ఇన్స్టాగ్రామ్’లోనూ అడుగుపెట్టారు. ఫేస్బుక్ తరహాలో ఫొటోలు, వీడియోలను పంచుకోవడానికి వీలు కల్పించే ఈ వెబ్సైట్లో.. మోదీ బుధవారం మొదటి ఫొటో ను పోస్ట్ చేశారు. ఆసియాన్, ఈస్ట్ ఆసియా సదస్సుల ప్రాంగణాన్ని చిత్రించి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. తన ట్విట్టర్ ఖాతాలో ‘హలో వరల్డ్. ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నాను. ఇది నా మొదటి చిత్రం.. నేపిడాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సు సందర్భంగా తీసిన చిత్రమిది..’’ అంటూ ట్వీట్ చేశారు. ‘భారత్ నా రెండో పుట్టిల్లు’ భారత్ తనకు రెండో పుట్టిల్లు వంటిదని మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకర్త, ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్‌సాన్ సూకీ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో బుధవారం ఇక్కడ సమావేశమైన సూకీ ఈ సందర్భంగా భారత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. స్వదేశం నుంచి తాను పర్యటించిన తొలి దేశం భారతేనన్నారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కొనసాగేందుకు స్థిరత్వం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. మరోవైపు సూకీతో తొలిసారి సమావేశమైన మోదీ మాట్లాడుతూ మయన్మార్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సూకీ సాగించిన కృషిని కొనియాడారు. ఆమెను ప్రజాస్వామ్య ప్రతీకగా అభివర్ణించారు. మహాత్మా గాంధీ వ్యాఖ్యానంతో ఉన్న భగవద్గీత ప్రత్యేక ప్రతిని సూకీకి అందజేశారు. -
ఉప్పెన: కృష్ణా నదీముఖంలో
కృష్ణా నదీముఖంలో కద్దూర పట్టణం. క్రీ.శ. 200 (నేటి కృష్ణాజిల్లా మచిలీపట్నం వద్ద గూడూరు గ్రామం) ‘ఆగు నావికుడా! దురదృష్టం నిన్ను ఉప్పెనలా ముంచబోతుంది. సావధానం!’ అని అరుస్తూ అతడి అడుగులకి అడ్డుపడ్డాడొక సిద్ధ పురుషుడు. విబూది పూసిన ముఖంపై చింతనిప్పుల వంటి కళ్ళలోకి చూసి నివ్వెరపోయినా మరుక్షణమే తేరుకొన్నాడు పద్మపాణి. అర్ధరాత్రి కావస్తోంది. వంగి దండాలు పెడుతున్న పానశాల కావలివాడి చేతిలో వెండి పణం రాల్చి అప్పుడే వీధిలోకి అడుగుపెట్టాడు. అంత రాత్రి గడిచినా ఆ ఆంధ్రుల రేవుపట్టణంలో సందడి ఏమాత్రమూ తగ్గలేదు. జూదశాలలు, గణికాగృహాల నుండి బయటపడే నాగరికులు, విదేశీ నావికులు కనిపిస్తున్నారు. గౌడ (బెంగాలీ), మాగధ (బీహారీ), ఓఢ్ర (ఒరియా), ద్రవిడ (తమిళం) భాషలే కాక మలయ (మలేసియా), చీనీ (చైనా), యవన (గ్రీక్) భాషలు కూడా అక్కడక్కడా వినిపిస్తాయి. మర్రిచెట్టు కింద పల్లకీలు మోసే బోయీలు, బండ్లవాళ్ళు, యజమానులకై ఎదురుచూస్తున్న సేవకులు అరుగులపై పూలిజూదం ఆడుతూ ఆ సిద్ధపురుషుడి అరుపుకి ఒకసారి ఉలక్కిపడి మళ్ళీ ఆటలోకి వెళ్లాలా లేదా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. పద్మపాణి చిన్ననాటి నుంచి సముద్రగర్భంలోని భూతాలతో, భూతాలవంటి ప్రకృతి బీభత్సాలతో ఆటలాడిన వాడు. మహాచీనం (చైనా) నుండి పారశీకం (అరేబియా గల్ఫ్ తీరం) వరకూ అనేకమార్లు నావలు నడిపించిన నావసారధి. కలవరం బయటకి కనపడకుండా నింపాదిగా ఆ సిద్ధపురుషుడి ఎర్రని కళ్ళలోకి చూస్తూ ఏమిటని తలెగరేసాడు. ‘దురదృష్టం నావికుడా! నిన్ను ఉప్పెనలా ముంచబోతుంది!’ మరోసారి బొంగురుపోయిన గొంతుతో హెచ్చరించాడు. ‘హహహ్! పోనీయవోయ్. అవలోకితేశ్వరుని అండ ఉన్నంతవరకూ ఇలాంటివి నన్నేమీ చేయలేవ్’ అని దట్టీలోని ఒక నాణెం సిద్ధుడి వంక విసిరి పానశాల వెనుక ద్వారం ఉన్న వీధి వైపు నడిచాడు. ఆ పానశాల నుంచి ఏ క్షణాన్నయినా నాగబుధిక బయటికి రావచ్చు. కాని కలవడం అసాధ్యం. ఎందుకంటే రాత్రి పూట పానశాలల్లో పని చేసే స్త్రీలను సాయుధ రక్షణతో నివాసం వరకూ దిగబెట్టడం నియమం. నాగబుధికని ఎన్నిమార్లు అడిగినా తానుండే నివాసమేదో చెప్పదు. ఈ రాత్రయినా బండిని వెంటాడి ఆమె ఇల్లెక్కడో కనుక్కోవాలి. ఆమెకి తనంటే ఇష్టమే. సందేహం లేదు. కానీ ఎందుకు తటపటాయిస్తుందో అర్థంకాదు! మధుశాల యజమానికి ఆమె బాకీపడిన సొమ్మును సుంకంతో సహా చెల్లించి ఆమెని విముక్తని చేస్తానని మాటయిచ్చినా ప్రయోజనం లేదు. అవుననదు. కాదనదు. పానశాల వెనక ద్వారంలో నుండి నల్లని తెరలతో గూడుబండి వెలువడింది. బరిశెలతో నలుగురు కావలివాళ్ళు దానివెంట నడవసాగారు. మబ్బుల మధ్య చంద్రునిలా తెరల మధ్య నుండి నాగబుధిక ముఖం తొంగి చూసింది. తనను చూసిన క్షణంలో ప్రత్యక్షమైన చిరునవ్వు మరుక్షణం వెలవెలపోయి తెరల వెనుకకి మాయమయింది. కాస్త దూరంగా బండి వెనుకే నడవసాగాడు పద్మపాణి. ‘చేతికందిన అదృష్టాన్ని ఎందుకే కాలదన్నుకుంటావ్? చూడు నీకోసం ఎలా పడిగాపులు పడుతున్నాడో’ అంది మాలసిరి, నాగబుధిక స్నేహితురాలు. స్నేహితురాలి మాటలకి మూడవ అంతస్తు కిటికీలోంచి బయటకి తొంగి చూసి నిట్టూర్చింది నాగబుధిక. అర్ధరాత్రి గడిచినా ఇంకా వీధి మధ్య అరుగుపై ఎదురుతెన్నులు చూస్తున్న పద్మపాణి ముఖం వెన్నెల వెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది. ‘ఆహా! ఎంత విరహమే! అందగాడు, ధనవంతుడు. తూర్పు సముద్రపు దేశాల్లో అతడిని మించిన నావికుడు లేడని చెబుతారు. సరేనను చాలు, ఈ పాడు జీవితం వదిలి హాయిగా ఉండవచ్చు. అయినా నీకూ అతడంటే ఇష్టమేగా?’ అన్నది మాలసిరి. ‘అవునే’ నీళ్ళు పొంగుతున్న కళ్ళు తుడుచుకుంటూ, ‘అందుకే వద్దనేది. నా దురదృష్టాన్ని అతడికెందుకు అంటిచాలి? నా కథ నీకు తెలుసుగా. నా అంతటి దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే ఉండదు. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో అయినా పుట్టినప్పుడే తల్లిదండ్రులని పొట్టన పెట్టుకున్నాను. కొడుకులు లేకపోవడంతో నా తండ్రి ఆస్తి రాజుగారికి పోయింది. అనాథనని నన్ను చేరదీసి నాయనలా సాకిన రామిశెట్టికీ న ష్టమే. గొడ్డొచ్చిన వేళా! బిడ్బొచ్చిన వేళా! అని శెట్టిసాని చెప్పింది నిజమే’ ‘బాధపడకే. ఊరుకో,’ వెక్కివెక్కి ఏడుస్తున్న నాగుబుధికను ఓదార్చింది మాలసిరి. ‘నాయన కూడా నీలాగే చెప్పేవాడు. నన్ను చారుదత్తుడనే కుమ్మరి చేతిలో పెట్టి ఆయన కన్నుమూశాడు. కానీ ఏమిలాభం? సంవత్సరం తిరగకుండా నా దురదృష్టం నా మొగుడిని కూడా తీసుకుపోయింది. పెనిమిటి పోయినా బొమ్మల వ్యాపారానికి ఆయన చేసిన అప్పుమాత్రం మిగిలింది. మన యజమాని మంచివాడు కనక మధుశాలలో ఈ పని ఇచ్చాడు. ఇంకో నాలుగేళ్ళలో ఆ అప్పు తీరిపోతుంది. ఆప్పుడీ పాడు జీవితానికే స్వస్తి చెప్పవచ్చు.’ అన్నది నాగుబుధిక. ‘ఛీఛీ.. ఏం మాటలే అవి? నా మాట విని పద్మపాణితో పెళ్ళికి ఒప్పుకో. వెళ్ళి అతనితో సరేనని చెప్పు. చూడు పాపం నీకోసం ఎలా ఎదురు చూస్తున్నాడో!’ అని ఒప్పించింది ఆమె శ్రేయోభిలాషి మాలసిరి. పాతికేళ్ళ జీవితంలో పద్మపాణి ఎన్నో దేశాలు తిరిగాడు. ఎందరో స్త్రీలని చూశాడు. కాని మొదటి చూపులోనే నాగబుధిక అతడి హృదయాన్ని కదిలించింది. పైకి ఆహ్లాదంగా కనిపించినా సముద్రంలాంటి ఆమె కళ్లలోతుల్లో ఏదో విషాదం. ఎందుకో పొదివి పట్టి హృద యానికి హత్తుకోవాలనే తపన. ఆమె లేని జీవితం వృధా అనే భావన. ప్రతిరోజూ ఆమె ముఖం చూడనిదే కంటికి కునుకు రాదు. తన అదృష్టం ఎలా ఉందో? ఆహ్! దురదృష్టమట! చింతనిప్పుల వంటి కళ్ళతో ఆ సిద్ధుడు చేసిన హెచ్చరిక పద్మపాణి మనస్సులో ప్రతిధ్వనించింది. తలెత్తి ఆకాశం వంక చూశాడు. చంద్రుడి చుట్టూ కాంతి వలయం! సన్నని తూర్పుగాలి. సముద్రయానాలలో అనేక ప్రకృతి వైపరీత్యాలని కళ్ళారా చూసిన ఆ నావికుడి భృకుటి ముడిపడింది. ఏదో పెద్ద గాలివాన వచ్చే సూచన. ఎదురుగా పరుగెత్తుకుంటూ తనవైపే వస్తున్న నాగబుధికని చూశాడు. అతడి ఆనందానికి అంతులేదు. తన హృదయంపై వాలిపోయిన ప్రియురాలిని కౌగిలిలో బిగించి కాలం తెలియకుండా అలానే ఉండిపోయాడు. మరునాడే మధుశాల యజమానికి అప్పు చెల్లించి నాగబుధికని విడిపించుకున్నాడు. నూతన వధువు నాగబుధికతో సముద్రతీరంలోని తన విడిది చేరాడు పద్మపాణి. పున్నమిరాత్రి. అతడి ఆనందంలో పాలుపంచుకోవటానికా అన్నట్లు ఆ నావికుడి నేస్తం సముద్రం కూడా నూరు అడుగులు ముందుకొచ్చాడు. అతడి గుండెలాగే సముద్రపుటలలు కూడా ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ప్రథమ సమాగమనానికి ఆరాటపడుతున్న ఆ దంపతులకి చిరుజల్లు స్వాగతం పలికింది. కలసిన ఆ శరీరాలకీ కర్ణేంద్రియాలకీ ఒకరికొకరి ధ్యాస తప్ప బయట ప్రపంచంతో ప్రమేయం లేదు. ఆ రాత్రి వచ్చిన రెండు తాటిచెట్ల ఎత్తు ఉప్పెన కూడా ఆ జంట ఆలింగనాన్ని విడదీయలేక పోయింది. సముద్రం సృష్టించిన బీభత్సానికి కద్దూర పట్టణం తుడిచి పెట్టుకుపోయింది. కానీ మరుభూమిలా మిగిలిన ఊరి మధ్య ఆ నూతన దంపతులున్న సౌధం మాత్రం చెక్కుచెదరలేదు. మరునాడు ఉదయం మేడపై నుండి ఆ వినాశనాన్ని కలయజూసిన పద్మపాణి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ ప్రకృతి ఉపద్రవం నుండి నన్ను కాపాడిన నా అదృష్ణదేవతవి నువ్వే అని కౌగిలించుకొన్న పద్మపాణిని తనకిచ్చినందుకు అవలోకితేశ్వరునికి నీళ్ళు నిండిన కళ్లతో ధన్యవాదాలర్పించింది నాగబుధిక. ఆగ్నేయాసియాలో ఆంధ్ర రాజ్యాలు ఇండియాలో అత్యంత పొడవైన తీరరేఖ ఆంధ్రులదే. చిలక సరస్సు నుండి పులికాట్ వరకూ అనేక రేవు పట్టణాలు తెలుగువారి అధీనంలో ఉండేవి. వీటిలో ముఖ్యమైనవి కృష్ణా గోదావరీ తీరంలో ఉన్నాయని ‘పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ’ అనే రోమన్ గ్రంథం చెబుతుంది. అవి ఎఫిటెరియాన్ (భట్టిప్రోలు), కొన్టకోస్సిలా (ఘంటశాల), కొడ్డూరా (బందరు వద్ద గూడూరు), అల్లోజ్ఞైని (గోదావరి డెల్టాలోని ఆదుర్రు), మైసోలియా (మోటుపల్లి), పోడుక (ఒంగోలు వద్ద పాదర్తి), మునార్ఫా (కావలి వద్ద మున్నేరు), సొపట్మ (పులికాట్)... మొదలైనవి. టోలెమీ రచించిన గ్రీక్ గ్రంథం ‘జాగ్రఫీ’ ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యం కృష్ణా తీరంలోని రేవు పట్టణాల నుండే సాగిందని చెబుతుంది. ఆగ్నేయాసియాలో ఆంధ్రులు నెలకొల్పిన రాజ్యాలు శిలాయుగంలో ఉన్న ఆ ప్రాంతానికి నాగరికతని పంచాయి. శాసనాలలో కనిపించే ఆయా దేశాల పాత పేర్లే అందుకు నిదర్శనం. బర్మా పేరు త్రిలింగం. అక్కడి రాజవంశాన్ని తెలైంగులు అంటారు. తెలైంగ్ వారి భాష. ఇప్పటి థాయ్‌లాండు సింధుశాఖ ప్రాంతానికి ఒకప్పటి పేరు కాకుళ రాజ్యం. ఇక మలేసియాలో పాలెంబాంగ్ ప్రాంతపు ఒకప్పటి పేరు ఆంధర. ఇండోనేసియాలోని బోరుబదూర్ మహాస్తూపం ఉన్న ప్రదేశాన్ని మగెలాంగ్ (మహాలంక) అంటారు. ఇక అండమాన్ నికోబార్ ద్వీపాల పూర్వ నామాలు ఆంధ్రమణీ- మనక్కవరం. సింహపురి (నెల్లూరు) సింగపూర్ అయింది. అంతెందుకు? వియెత్నాం, లావోస్ దేశాల ఒకప్పటి పేరు అమరావతి రాజ్యం. అక్కడి పట్టణాల పేర్లు- విజయ, పాండుర, కౌథూర. అన్నీ కృష్ణాతీరంలోని ప్రాచీన పట్టణాల పేర్లే. జాతక కథలు ఆంధ్ర వణిజులకి ఆగ్నేయాసియాలోని దేశాలకి ఉన్న సంబంధాలు ప్రస్తావిస్తాయి. ఆంధ్ర రాజవంశమైన విష్ణుకుండినులూ కంపూచియా (కాంభోజ) రాజ్య స్థాపకులైన కైండిన్య గోత్రులూ ఒకటేనని శాసనాలంకారం అనే గ్రంథం చెబుతుంది. అంధ్రతీరంలో నౌకానిర్మాణం ఒక ప్రముఖమైన పరిశ్రమగా ఎదిగింది. నరసాపురం (ప.గో.జిల్లా), మోటుపల్లి (గుంటూరు జిల్లా) ముఖ్యమైన కేంద్రాలు. ఆంధ్రులు 75 టన్నుల బరువు మోసే నావలు నిర్మించారని రోమన్ గ్రంథం హిస్టోరియా న్యాచురాలిస్ చెబుతుంది. ఆనాటి సమాజం ఎంత అభివృద్ధి చెందినా స్త్రీల పరిస్థితి మాత్రం పతనం చెందసాగింది. మనుధర్మశాస్త్రం ఆ కాలంలోనే రచించబడింది. ఆర్థిక వనరులపైన పురుషుల గుత్తాధిపత్యం మొదలయింది. మితాక్షర కూతుళ్లకి ఆస్తిపై హక్కు కల్పించదు. ఆస్తిని కాపాడుకోవటానికి కొడుకుల అవసరం అయింది. తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు పరులపై ఆధారపడవలసి వచ్చింది. చేసిన అప్పులు తీర్చేందుకు భార్యాపిల్లలని దాస్యానికి అమ్మటం ఆచారమయింది. హరిశ్చంద్రుని కథ దీనికి నిదర్శనం. నిరాధారులయిన స్త్రీలకు రక్షణ కరువైంది. విధవా వివాహం చట్టసమ్మతమే. అమరకోశం అనే సంస్కృత నిఘంటువు ‘పునర్భూ’ అంటే పునర్వివాహం చేసుకున్న స్త్రీని ప్రస్తావిస్తుంది. రాత్రిపూట పనిచేసే స్త్రీ కార్మికులకు తప్పనిసరిగా తగిన రక్షణతో ఇంటి వద్ద దిగబెట్టే వ్యవస్థ చేయాలని అర్థశాస్త్రం నిర్దేశిస్తుంది. ఈనాడు కాల్సెంటర్లలో రాత్రి సమయాల్లో పనిచేసే ఉద్యోగినులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించే ఆనవాయితీ మన దేశంలో రెండువేల సంవత్సరాలకి పూర్వమే ఉండేదంటే ఆశ్చర్యం కలుగక మానదు.