రాహుల్ అప్పుడు ఎక్కడున్నారు?
ఈ సంవత్సరం మొదట్లో జరిగిన పార్టమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అజ్ఞాతవాసం పలు విమర్శలకు దారితీసింది. దాదాపు రెండు నెలలు సెలవులో ఉన్నపుడు ఆయన ఎక్కడెక్కడ తిరిగారు? ఏం చేశారు? అన్న విషయాలపై విస్తృతంగా రాజకీయ పార్టీల్లో, మీడియాలో చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 22 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన రాహుల్... థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో భారత్‌కు చేరుకున్నారు. కానీ ఆయన ఎక్కడకు వెళ్లారన్నది మాత్రం ఎవరికీ తెలియరాలేదు.
రాహుల్ టూర్ పై తాజాగా ఓ టీవీ ఛానెల్ కొన్ని వివరాలు వెలుగులోకి తెచ్చింది. కాంగ్రెస్ వంశాంకురం 'సూపర్ సీక్రెట్ ఫారెన్ టూర్'లో రెండు నెలల కాలంలో ఆగ్నేయ ఆసియాలోని థాయ్ ల్యాండ్, కాంబోడియా, మయన్మార్, వియత్నాం దేశాలు చుట్టారు. ఇవన్నీ విశ్వవ్యాప్త పర్యటకులను ఆకర్షించే ధ్యానకేంద్రాలు కలిగిన స్థలాలు. అద్భుత వాతావరణం, రుచికరమైన వంటకాలకు గుర్తింపు పొందిన ప్రాంతాలు. రాహుల్ థాయిలాండ్ లో 15 రోజులు, కంబోడియాలో 11 రోజులు గడపడంతోపాటు.. మొత్తం టూర్ లో అత్యంత ఎక్కువ సమయం మయన్మార్ లో 21 రోజులు గడిపారు.
ఫిబ్రవరి 17న బ్యాంకాక్ నుంచి ప్రారంభమైన ప్రయాణంలో మయన్మార్‌లో 21 రోజుల పాటు ఉన్నారు. థాయిలాండ్‌లో ఉన్నప్పుడు రాహుల్ ప్రముఖ బౌద్ధ క్షేత్రం అయుత్తయను సందర్శించారు. చివరిగా ఏప్రిల్ 16న బ్యాంకాక్ తిరిగి వచ్చిన రాహుల్ అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారు. రాహుల్ పర్యటన మొత్తం.. కాంగ్రెస్ ఎంపీ సతీష్ శర్మ కుమారుడు.. ఆప్త మిత్రుడైన సమీర్ శర్మతో కలసి ఉన్నట్లు సమాచారం. విదేశాల్లో ఉన్న సమయంలో తనవెంట ఎప్పుడూ ఉండే ప్రత్యేక సాయుధ బృందాన్ని (ఎస్పీజీ) కూడా రాహుల్ వద్దన్నారు. నాలుగు దేశాల్లో రెండునెలలున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. అక్కడ ఏం చేశారన్న వివరాలు మాత్రం నేటికీ రహస్యంగానే ఉండిపోయాయి.