నేప్యితా (మయన్మార్): దక్షిణ చైనా తీర జలాల విషయమై జపాన్, వియత్నాం వంటి ఆగ్నేయాసియా దేశాలతో చైనా కయ్యానికి కాలుదువ్వుతున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశానికి పరోక్షంగా చురకలంటించారు. దక్షిణ చైనా సముద్రంలో శాంతి, సుస్థిరత కోసం 1982 నాటి ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాల ఒప్పందం సహా అంతర్జాతీయ తీర నిబంధనలు, చట్టాలను అన్ని దేశాలు గౌరవించాలని బుధవారం ఇక్కడ జరిగిన 12వ భారత్-ఆసియాన్ సదస్సులో సూచించారు. ఆగ్నేయాసియాలో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత్, ఆసియాన్ దేశాలు సహకరించుకోవాలన్నారు. ఇందుకు తీరవర్తకం, భద్ర త ముఖ్యమన్నారు. భారత్-ఆసియాన్ సదస్సులో పాల్గొన్న మోదీ బుధవారం ఆరుగురు ప్రపంచ నేతలతోనూ సమావేశమయ్యారు.
సంగీతానికి అచ్చెరువొంది: మయన్మార్ అంతర్జాతీయ కన్వెన్షన్ కేంద్రంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు పాక్ గ్వెన్‌హేతో భేటీ అనంతరం తాను బస చేసిన హోటల్‌కు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైన మోదీ అక్కడి ఓ వాయిద్యకారుడి సంగీతానికి అచ్చెరువొందారు. లయబద్ధంగా జైలోఫోన్‌ను వాయిస్తున్న అతని వద్దకు వెళ్లి కాసేపు ఆ సంగీతాన్ని ఆస్వాదించారు.
మోదీ కార్యదక్షుడు: ఒబామా కితాబు
భారత ప్రధాని నరేంద్ర మోదీ పనితీరును అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మెచ్చుకున్నారు. మోదీ కార్యదక్షుడంటూ కితాబిచ్చారు. ఆసియాన్, తూర్పు ఆసియా దేశాల సదస్సుకు హాజరైన ప్రపంచ నేతల గౌరవార్థం మయన్మార్ అధ్యక్షుడు థీన్ సీన్ బుధవారం రాత్రి ఇచ్చిన విందు సందర్భంగా మోదీని ఒబామా ఈ మేరకు ప్రశంసించినట్లు భారత విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ‘ట్వీట్’ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ: సామాజిక మీడియా వినియోగంలో ఎంతో ముందుండే ప్రధాని మోదీ... తాజాగా ‘ఇన్‌స్టాగ్రామ్’లోనూ అడుగుపెట్టారు. ఫేస్‌బుక్ తరహాలో ఫొటోలు, వీడియోలను పంచుకోవడానికి వీలు కల్పించే ఈ వెబ్‌సైట్‌లో.. మోదీ బుధవారం మొదటి ఫొటో ను పోస్ట్ చేశారు. ఆసియాన్, ఈస్ట్ ఆసియా సదస్సుల ప్రాంగణాన్ని చిత్రించి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. తన ట్విట్టర్ ఖాతాలో ‘హలో వరల్డ్. ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నాను. ఇది నా మొదటి చిత్రం.. నేపిడాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సు సందర్భంగా తీసిన చిత్రమిది..’’ అంటూ ట్వీట్ చేశారు.
‘భారత్ నా రెండో పుట్టిల్లు’
భారత్ తనకు రెండో పుట్టిల్లు వంటిదని మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకర్త, ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్‌సాన్ సూకీ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో బుధవారం ఇక్కడ సమావేశమైన సూకీ ఈ సందర్భంగా భారత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. స్వదేశం నుంచి తాను పర్యటించిన తొలి దేశం భారతేనన్నారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కొనసాగేందుకు స్థిరత్వం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. మరోవైపు సూకీతో తొలిసారి సమావేశమైన మోదీ మాట్లాడుతూ మయన్మార్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సూకీ సాగించిన కృషిని కొనియాడారు. ఆమెను ప్రజాస్వామ్య ప్రతీకగా అభివర్ణించారు. మహాత్మా గాంధీ వ్యాఖ్యానంతో ఉన్న భగవద్గీత ప్రత్యేక ప్రతిని సూకీకి అందజేశారు.
తీర జలాల నిబంధనలను గౌరవించాలి
Published Thu, Nov 13 2014 4:23 AM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM
Advertisement