ఆగ్నేయాసియా ముఖద్వారంగా ‘ఈశాన్యం’
- ఈశాన్య రాష్ట్రాల్లో వసతుల కోసం రూ.40 వేల కోట్ల ఖర్చు
- పారిశుధ్యం మెరుగుకాకుంటే ఆ కల నెరవేరదు: మోదీ
న్యూఢిల్లీ/షిల్లాంగ్: ఈశాన్య భారతాన్ని ఆగ్నేయాసియాకు ముఖద్వారం (గేట్‌వే)గా మారుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొన్నారు. అయితే పారిశుధ్య లోపం ఈ కలకు ప్రతిబంధకం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని భారత్ సేవాశ్రమ్ సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ నగరాల జాబితాలో మొదటి 50 స్థానాల్లో ఈశాన్య ప్రాంతం నుంచి గ్యాంగ్‌టక్ మాత్రమే చోటు సంపాదించిందని, తక్షణం పారిశుధ్యం మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
‘మనం నిర్మించే అద్భుతమైన గేట్‌వే అపరిశుభ్రత, వ్యాధులు, నిరక్షరాస్యత, అసమానతలకు నిలయంగా ఉంటే... దేశాభివృద్ధిలో భాగస్వామి కావడంలో విఫలమవుతుంది. ఇన్ని వనరులు ఉన్నా ఇంకా మనం వెనకబడి ఉండడంలో ఎలాంటి అర్థం లేదు’ అని ప్రధాని పేర్కొన్నారు. స్వచ్ఛత సాధించేందుకు ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరు సవాలుగా తీసుకోవాలని సూచించారు. స్వచ్ఛ నగరాల జాబితాలో ఈశాన్య భారతం నుంచి మొత్తం 12 నగరాలు పాలుపంచుకోగా..100 నుంచి 200 మధ్యలో నాలుగు , 200 నుంచి 300 మధ్య ఏడు నగరాలు నిలిచాయి. షిల్లాంగ్ 276వ స్థానానికి పరిమితమైంది.
‘ఆగ్నేయాసియాకు ఈశాన్య భారతాన్ని గేట్‌వేగా చేస్తాం. ఈ ప్రాంతం అపరిశుభ్రంగా ఉంటే ఆ కల నెరవేరదు. పారిశుధ్య ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు చేతులు కలపాలి. స్వాతంత్య్రం వచ్చి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఈశాన్య ప్రాంతంలో సంతులిత అభివృద్ధి లేదు. కేంద్రం ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికతో ముందుకెళ్తోంది. రవాణా వ్యవస్థ మెరుగుపర్చడం, పర్యాటకుల్ని ఆకర్షించే లక్ష్యంతో అభివృద్ధి చేయడం అందులో ప్రధాన మైనవ’ని పేర్కొన్నారు. ఇవన్నీ ఈశాన్య భారతాన్ని ఆగ్నేయాసియాకు ముఖ ద్వారం చేయడంలో సాయపడతా యని చెప్పారు. మొత్తం ఈశాన్య భారతంలో మౌలిక వసతుల్ని మెరుగుపర్చేందుకు రూ. 40 వేల కోట్లు ఖర్చుపెడుతున్నామని, 19 భారీ రైల్వే ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభిం చామన్నారు. కాగా, అతిపెద్ద బౌద్ధ ఉత్సవం ‘వేసక్’లో పాల్గొనేందుకు మోదీ మే 11న శ్రీలంకకు వెళ్లనున్నారు.