southeast asian countries
-
ఆధిపత్యం.. మా విధానం కాదు: చైనా అధ్యక్షుడు
బీజింగ్: ఆగ్నేయ ఆసియాపై ఆధిపత్యాన్ని తాము కోరుకోవడం లేదని చైనా అధినేత షీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. పొరుగున్న ఉన్న చిన్న దేశాలపై పెత్తనం చెలాయిస్తూ అదుపులో పెట్టుకోవాలని ఆశించడం లేదని వెల్లడించారు. సోమవారం ఆగ్నేయ ఆసియా దేశాల అసోసియేషన్(అసియాన్) సభ్యుల వర్చువల్ సదస్సులో జిన్‌పింగ్ మాట్లాడారు. ఆసియాన్, చైనా మధ్య సంబంధాలకు 30 ఏళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ఆధిపత్యవాదానికి, పవర్ పాలిటిక్స్‌కు చైనా ముమ్మాటికీ వ్యతిరేకమేనని ఉద్ఘాటించారు. పొరుగు దేశాలకు స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆగ్నేయ ఆసియాలోని దేశాలన్నీ కలిసి ఈ ప్రాంతంలో శాంతిని కాపాడుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని వివరించారు. మరో దేశంపై ఆధిపత్యం చెలాయించడం చైనా విధానం కాదని వివరించారు. దక్షిణ చైనా సముద్రంలో ఇటీవలి కాలంలో డ్రాగన్ దేశం నియంతృత్వ పోకడలపై అసియాన్ సభ్యదేశాలైన మలేషియా, వియత్నాం, బ్రూనై, ఫిలిప్పైన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చట్టాలను చైనా గౌరవించాలి: ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో విధుల్లో ఉన్న జవాన్లకు సరుకులు తీసుకెళ్తున్న ఫిలిప్పైన్స్ పడవలను ఇటీవలే చైనా నౌకలు అడ్డగించాయి. శక్తివంతమైన యంత్రాలతో నీటిని విరజిమ్మడంతో ఫిలిప్పైన్స్ పడవలు వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటనను ఆసియాన్ సదస్సులో ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ లేవనెత్తారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను గౌరవించాలని చైనాకు హితవు పలికారు. దక్షిణ చైనా సముద్ర వివాదాలను పరిష్కరించుకోవాలని మలేషియా ప్రధాని యాకోబ్ చెప్పారు. -
నేటి నుంచి ‘ఆగ్నేయాసియా’ సదస్సు
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయాసియా దేశాల సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. సోమవారం నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రారంభిస్తారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్డీ) ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఆగ్నేయాసియా దేశాలకు చెందిన సివిల్ సర్వెంట్లకు ఈ పేమెంట్లు, ఆర్థిక చేకూర్పు, సామాజిక భద్రత అంశాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎఫ్ఓ సంజయ్ సక్సేనా, ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఇందూభూషణ్, చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బి.చంద్రశేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
గణతంత్ర వేడుకకు10 దేశాల అధినేతలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: భారత 69వ గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు పది ఆగ్నేయాసియా దేశాల అధినేతలు ఢిల్లీకి రానున్నారు. సాధారణంగా ప్రతి గణతంత్ర దినోత్సవానికీ ఓ దేశాధినేతను భారత్‌కు ఆహ్వానించడం గత 60 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ ఏడాది ఏకంగా పది దేశాల అధినేతలు రాజ్‌పథ్‌కు రానున్నారు. బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాధినేతలు భారత్‌లో పర్యటించనున్నారు. ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యాన్ని నిరోధించడంలో భాగంగానే భారత్ ఈ ఏడాది ఇంత మంది అతిథులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆగ్నేయాసియా దేశాలతో భారత్ సంబంధాలను ఏర్పరచుకుని 25 వసంతాలు పూర్తికావొస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 25న స్మారకోత్సవాలను నిర్వహిస్తామనీ, అందరూ ఆ వేడుకలకు హాజరు కావాలంటూ నవంబరులోనే ప్రధాని మోదీ ఆసియాన్–భారత్ సదస్సులో కోరారు. -
ఆ దేశాల్లో భార్యను కొట్టడం సబబే!
ప్రపంచదేశాల్లో ఎక్కడా మహిళలపై ఎలాంటి హింస కూడదని 40 ఏళ్ల క్రితమే ఐక్యరాజ్యసమితి ఓ తీర్మానం చేసింది. ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. ఇప్పుడు అదే ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఆగ్నేయ ఆసియాలోని తూర్పు టీమొఎల్ దేశంలో ఆడవాళ్లను గృహ హింసకు గురిచేయడం సబబేనని 81 శాతం టీనేజీ అమ్మాయిలే అంగీకరించారట. ఆ తర్వాతి స్థానాల్లో కిరిబాటి, సాల్మన్ ఐలాండ్స్, ఇథియోపియా, భూటాన్ లాంటి దేశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో గృహహింస తప్పుకాదని యాభై శాతానికి పైగా ప్రజలు భారత్, పాకిస్తాన్ దేశాల్లో కూడా అంగీకరిస్తున్నారు. భార్యలపై 71శాతం గృహ హింస కొనసాగుతున్న ఇథియోపియా దేశంలో భర్తను, భార్యను కొట్టడం తప్పేమీ కాదని 64.8 శాతం మంది మహిళలు అభిప్రాయపడుతున్నారు. వంట చేసేటప్పుడు కూర మాడిస్తే కొట్టరా? అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఆసియా పసిఫిక్ దేశాల్లో భార్యను కొట్టడం కొన్ని సందర్భాల్లో సమంజసమేనని టీనేజీ అమ్మాయిలతోపాటు 51 శాతం నుంచి 25 శాతం టీనేజీ అబ్బాయిలు అంగీకరించడం నేటి ఆధునిక ప్రపంచంలో ఆశ్చర్యకరమే. పురుషాధిక్య సమాజం నుంచి సంక్రమించిన గృహ హింస కొన్నిదేశాల్లో ఇప్పటికీ కొనసాగడమే కాకుండా దానికి సమాజం ఆమోదం లభించడం విచారకరమని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వ్యాఖ్యానించింది. అవిద్య, నిరుద్యోగం, వంశపారంపర్యంగా కుటుంబంలో కొనసాగుతున్న హింస తదితర కారణాల వల్లనే పలు ఆసియా పసిఫిక్ దేశాల్లో గృహ హింసకు ఆమోదం లభిస్తోందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాది కన్నా మహిళలపై గృహ హింస తగ్గిందని, ఆమోదం ఉన్న ఆసియా పసిఫిక్ దేశాల్లో కూడా తగ్గుముఖం పడుతోందని, భవిష్యత్తులో ఇది మరింత తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.