ఆ దేశాల్లో భార్యను కొట్టడం సబబే!
ప్రపంచదేశాల్లో ఎక్కడా మహిళలపై ఎలాంటి హింస కూడదని 40 ఏళ్ల క్రితమే ఐక్యరాజ్యసమితి ఓ తీర్మానం చేసింది. ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. ఇప్పుడు అదే ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఆగ్నేయ ఆసియాలోని తూర్పు టీమొఎల్ దేశంలో ఆడవాళ్లను గృహ హింసకు గురిచేయడం సబబేనని 81 శాతం టీనేజీ అమ్మాయిలే అంగీకరించారట. ఆ తర్వాతి స్థానాల్లో కిరిబాటి, సాల్మన్ ఐలాండ్స్, ఇథియోపియా, భూటాన్ లాంటి దేశాలు ఉన్నాయి.
కొన్ని సందర్భాల్లో గృహహింస తప్పుకాదని యాభై శాతానికి పైగా ప్రజలు భారత్, పాకిస్తాన్ దేశాల్లో కూడా అంగీకరిస్తున్నారు. భార్యలపై 71శాతం గృహ హింస కొనసాగుతున్న ఇథియోపియా దేశంలో భర్తను, భార్యను కొట్టడం తప్పేమీ కాదని 64.8 శాతం మంది మహిళలు అభిప్రాయపడుతున్నారు. వంట చేసేటప్పుడు కూర మాడిస్తే కొట్టరా? అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఆసియా పసిఫిక్ దేశాల్లో భార్యను కొట్టడం కొన్ని సందర్భాల్లో సమంజసమేనని టీనేజీ అమ్మాయిలతోపాటు 51 శాతం నుంచి 25 శాతం టీనేజీ అబ్బాయిలు అంగీకరించడం నేటి ఆధునిక ప్రపంచంలో ఆశ్చర్యకరమే. పురుషాధిక్య సమాజం నుంచి సంక్రమించిన గృహ హింస కొన్నిదేశాల్లో ఇప్పటికీ కొనసాగడమే కాకుండా దానికి సమాజం ఆమోదం లభించడం విచారకరమని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వ్యాఖ్యానించింది.
అవిద్య, నిరుద్యోగం, వంశపారంపర్యంగా కుటుంబంలో కొనసాగుతున్న హింస తదితర కారణాల వల్లనే పలు ఆసియా పసిఫిక్ దేశాల్లో గృహ హింసకు ఆమోదం లభిస్తోందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాది కన్నా మహిళలపై గృహ హింస తగ్గిందని, ఆమోదం ఉన్న ఆసియా పసిఫిక్ దేశాల్లో కూడా తగ్గుముఖం పడుతోందని, భవిష్యత్తులో ఇది మరింత తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.