జీ20 సదస్సుకు కయ్యాలమారి చైనా అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదా ?. అందుకే అధ్యక్షుడు జిన్‌పింగ్ తనకు బదులు ప్రధాని లీ కియాంగ్‌ను పంపించారా ?. ఇలాంటి ప్రశ్నలకు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు తలో విశ్లేషణ చెబుతున్నారు. జీ20 కూటమి ఆవిర్భావం తర్వాత చైనా అధ్యక్షులు ఒకరు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సదస్సుకు హాజరుకాకుండా జిన్‌పింగ్ చైనాలోని ఉండి ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
2020 మే నెల నుంచి భారత్‌తో సరిహద్దు వెంట ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి దిగడం, భారీగా సైన్యం మొహరింపు వంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతుండటం వల్లే జిన్‌పింగ్ ఆగ్రహంతో సదస్సుకు రావట్లేదని చాలా మంది భావిస్తున్నారు. అసలు కారణం అది కాదని మరో వాదన బలంగా వినిపిస్తోంది. అదే అదుపు తప్పుతున్న చైనా ఆర్థిక పరిస్థితి.
జిన్‌పింగ్ ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. అప్పుడే వచ్చిన సాంస్కృతిక విప్లవం ధాటికి ఆయన తండ్రి పేదవాడిగా మిగిలిపోయాడు. దీంతో జిన్‌పింగ్ బాల్యంలో కష్టాలు చూశాడు. పొలంలో సాధారణ కూలీగా పనిచేశాడు. ఆరేళ్లు ఇబ్బందులు పడ్డాడు. అయితే బలీయమైన చైనాకు అధ్యక్షుడిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలతో పోలిస్తే ఆనాటి కష్టాలు గడ్డిపరకతో సమానమే.
‘చైనా రాజ్య విస్తరణ వాదం, దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం, ప్రపంచ వస్తూత్పత్తి మార్కెట్‌కు ఏకైక దిక్కుగా మారాలన్న వ్యూహాలతో చైనా చాలా ప్రపంచ దేశాలకు శత్రువుగా మారింది. ఇలాంటి తరుణంలో చైనాతో కలిసి జీ20 వేదికను కలిసి పంచుకునేందుకు తోటి దేశాలు విముఖత చూపుతున్నాయి’ అని మేథో సంస్థ కార్నీగ్ చైనా డైరెక్టర్ పాల్ హెనెల్ వ్యాఖ్యానించారు.
ఆ అప్రతిష్ట పోగొట్టుకునేందుకే ‘ సదస్సు విజయవంతం అవడానికి అందరితో కలిసి పనిచేస్తాం’ అని బీజింగ్ తాజాగా ప్రకటించింది. ‘విదేశీ పర్యటనకు పక్కనబెట్టి స్వదేశ సమస్యలపై జిన్‌పింగ్ దృష్టిపెట్టారు. దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పొరుగు దేశాలతో కయ్యానికి దిగారు. ఆర్థిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకోవడంతో జిన్‌పింగ్‌కు తలనొప్పి పెరిగింది’ అని సింగపూర్‌లోని నేషనల్ యూనివ ర్సిటీ ప్రొఫెసర్ ఆల్‌ఫ్రెడ్ వూ వ్యాఖ్యానించారు.
దెబ్బకొట్టిన హౌజింగ్ రంగం
ఇటీవల దశాబ్దాల కాలంలో ఎన్నడూలేనంతగా పలు సమస్యలు చైనాలో తిష్టవేశాయి. కుటుంబాలు తమ ఖర్చులను తగ్గించుకున్నాయి. కర్మాగారాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. వ్యాపారవేత్తలు నూతన పెట్టుబడులకు ముందుకు రావట్లేదు. ఎగుమతులు దిగజారాయి. ఆగస్టులో ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.8 శాతం తగ్గాయి. దిగుమతులు 7.3 శాతంపెరిగాయి. నిరుద్యోగిత భారీగా పెరగడంతో ప్రభుత్వం తాజా గణాంకాలు బహిర్గతంచేయడం మానేసింది.
ఆస్తుల మార్కెట్ విలువ భారీగా పతనమైంది. ప్రధాన డెవలపర్లు చేతులెత్తేసి దివాలాను ప్రకటించారు. దీంతో రియల్ ఎసేŠట్‌ట్ రంగం సంక్షోభంలో చిక్కింది. 40 ఏళ్ల భవిష్యత్ అభివృద్ది మోడల్‌ను ఈ అంశాలు తలకిందులుచేసేలా ఉన్నాయి. ప్రాపర్టీ రంగంపై అతిగా ఆధారపడటం, అత్యంత కఠినమైన కోవిడ్ ఆంక్షల విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని నిపుణులు భావిస్తున్నారు. రుణాల పునాదిపై నెలకొల్పిన అభివృద్ధి మోడల్ ఈ పరిస్థితికి మరో కారణం.
దేశం అప్పులు పెరిగిపోయాయి. 2023 తొలి త్రైమాసికంలో అప్పులు–జీడీపీ నిష్పత్తి రికార్డు స్థాయిలో 279 శాతంగా నమోదైందని బ్లూమ్‌బర్గ్ విశ్లేషించింది. రుణాలు అతిగా తీసుకొచ్చి మౌలిక వసతులపై ఖర్చుచేసిన పాపం ఇప్పుడు పండిందని మరో వాదన. హౌజింగ్ బుడగ బద్ధలైంది. చైనా ఆర్థిక వ్యవస్థ 25 శాతం ప్రాపర్టీ మార్కెట్‌పైనే ఆధారపడింది.
ఇన్నాళ్లూ కేవలం చైనాపై ఆధారపడిన విదేశీ బ్రాండ్లు ఇప్పుడు చైనాతోసహా ఇతర(చైనా ప్లస్ స్ట్రాటజీ) దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దీని వల్ల ప్రధానంగా లాభపడేది ఇండియానే. ఆపిల్, టెస్లా మొదలుకొని నైక్ వరకు అన్ని ప్రధాన సంస్థల తయారీకేంద్రాలు చైనాలోనే ఉన్నాయి. కార్మికులకు అధిక జీతభత్యాలు, అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో విదేశీ సంస్థలు చైనాకు బదులు వేరే దేశాల వైపు చూస్తున్నాయి.
ఆర్మీలో అవిధేయత?
చైనా ఆర్మీలో పెరిగిన అవినీతి, పాలక పార్టీ పట్ల తగ్గిన విధేయతపై జిన్‌పింగ్ భయపడుతున్నారని ఆసియా పాలసీ సొసైటీ ఇన్‌స్టిట్యూట్‌లో జాతీయ భద్రతా విశ్లేషకుడు లైల్ మోరిస్ చెప్పారు. చైనా సైన్యంలో అణ్వస్త్ర సామర్థ్య రాకెట్ విభాగంలోని జనరల్, డెప్యూటీ జనరల్‌లను తొలగించడాన్ని ఆయన ఉటంకించారు. తనకు నమ్మకస్తుడైన విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌ను జిన్‌పింగ్ తప్పించడంతో పార్టీ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి రేగింది.
జిన్‌పింగ్ పాలనా సామర్థ్యానికి ఈ ఘటనలు మాయని మచ్చలని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి సమస్యలు ఇంకొన్ని పెరిగితే డ్రాగన్ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పాలనకు తెరపడే ప్రమాదముందని కొందరు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. ఇన్ని సమస్యలు ఇంట్లో పెట్టుకునే జిన్‌పింగ్ చైనాను వదలి బయటకు రావట్లేదనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment