Bankruptcy
-
మరింత పటిష్టంగా ‘దివాలా’ పరిష్కార వ్యవస్థ!
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార వ్యవస్థను మరింత పటిష్టవంతం చేయడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ ప్రక్రియలను వేగవంతం చేయడంలో సహాయపడేలా తగిన వాతావారణం నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) జాయింట్ సెక్రటరీ అనితా షా అకెల్లా తెలిపాయి.ఎనిమిది సంవత్సరాల క్రితం– 2016లో అమల్లోకి వచ్చిన దివాలా కోడ్ (ఐబీసీ) సంబంధిత ఆస్తులకు మార్కెట్–లింక్డ్ అలాగే టైమ్–బౌండ్ (మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, సకాలంలో సమస్య పరిష్కారం జరిగేలా చర్యలు) పరిష్కారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పరిష్కార ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది.ఐబీసీ రికవరీ మెకానిజం కాదు: అనితా షా అకెల్లా అనితా షా అకెల్లా ఈ విషయంపై మాట్లాడుతూ, ఐబీసీ రికవరీ మెకానిజం కాదని, రెస్క్యూ మెకానిజం అని ఉద్ఘాటించారు. ఐసీఏఐకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఎనిమిదో వార్షిక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధానిలో జరిగిన ఒక సదస్సులో ఆమె మాట్లాడుతూ, ఐబీసీ పరిష్కార యంత్రాంగాన్ని మరింత మెరుగుపరచడానికి తీసుకున్న వివిధ చర్యలను ప్రస్తావించారు. అయితే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దివాలా పరిష్కార యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడానికి ఒక సమగ్ర ‘ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్’ ఏర్పాటుకు కృషి చేస్తోందన్నారు. ప్లాట్పామ్ ఇలా... ప్రతిపాదత ఇంటిగ్రేడెడ్ ఫ్లాట్‌ఫామ్.. ఒక ఫెడరేటెడ్ ఆర్కిటెక్చర్ అనీ, ఇది అవసరమైనప్పుడు తగిన డేటాను అందించగలుగుతుందని అనితా షా అకెల్లా తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్‌తో పాటు సంబంధిత అన్ని వర్గాలనూ ఒకే వేదికలాగా కలిపి ఉంచుతుందన్నారు. యాప్‌లో ఆలస్యం, హెచ్చరికల వంటి సందర్భాల్లో రెడ్ ఫ్లాగ్‌లు వంటి వివిధ ఫీచర్లు ఇందులో ఉంటాయని ఆమె తెలిపారు. ప్రస్తుత దివాలా కేసుల తీరిది... కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల లోక్‌సభ తెలిపిన సమాచారం ప్రకారం, మొత్తం 1,963 సీఐఆర్‌పీ (కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్) కేసులు కొనసాగుతున్నాయి. వాటిలో 1,388 కేసులు నిర్దేశిత (కేసుల పరిష్కారానికి) 270 రోజుల కాల పరిమితిని మించిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబరు వరకు దివాలా చట్టం కింద 1,068 కేసుల పరిష్కారం అయ్యాయి. తద్వారా బ్యాంకింగ్ సుమారు రూ. 3.55 లక్షల కోట్లను రికవరీ చేసింది. -
దివాలా తీసిన టప్పర్‌వేర్.. ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో తెలుసా?
న్యూయార్క్: నాణ్యమైన ప్లాస్టిక్వేర్కి పర్యాయపదంగా, ఫుడ్ స్టోరేజీలో కొత్త మార్పులు తెచ్చిన అమెరికన్ దిగ్గజం టప్పర్‌వేర్ బ్రాండ్స్ తాజాగా రుణభారంతో దివాలా ప్రకటించింది. కార్యకలాపాలను యథాప్రకారం కొనసాగిస్తూ, విక్రయానికి వెసులుబాటునిచ్చేలా చాప్టర్ 11 కింద రక్షణ కల్పించాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.1946లో ఎర్ల్ టప్పర్ అనే కెమిస్ట్ ప్రారంభించిన టప్పర్‌వేర్ భారత్‌లో కూడా గణనీయంగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. పోటీ తీవ్రమవుతుండటంతో 2018 నుంచి కంపెనీ అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్–19 తొలినాళ్లలో విక్రయాలు కాస్త మెరుగుపడినప్పటికీ ఆర్థిక కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. మొత్తం రుణాల భారం 1.2 బిలియన్ డాలర్లుగా, అసెట్స్ 679.5 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు దివాలా పిటీషన్లో టప్పర్‌వేర్ పేర్కొంది. సంస్థ షేరు ఈ ఏడాది 75 శాతం మేర పతనమైంది.Also Read: హమ్మయ్య.. అనిల్ అంబానీకి ఇక అన్ని మంచి రోజులేనా?టప్పర్వేర్కి 41 దేశాల్లో 5,450 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. అలాగే సుమారు 70 దేశాల్లో ఫ్రీలాన్స్ ప్రాతిపదికన ఉత్పత్తులను విక్రయించే కన్సల్టెంట్లు దాదాపు 4,65,000 మంది ఉన్నారు. -
దివాలా అంచున దిగ్గజ కంపెనీ!
గృహోపకరణాలు, ఆహార నిల్వ కోసం ఉపయోగించే వస్తువులను విక్రయించే అమెరికన్ కంపెనీ 'టప్పర్‌వేర్' (Tupperware) దివాలా అంచున ఉన్నట్లు సమాచారం. ఒకప్పుడు ప్లాసిక్ బాక్సుల తయారీలో విప్లవం సృష్టించిన కంపెనీ నేడు కష్టకాలంలో ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.ఈ విషయం తెలిసిన తరువాత న్యూయార్క్‌లో మధ్యాహ్నం కంపెనీ షేర్లు 50 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. 1946లో రసాయన శాస్త్రవేత్త ఎర్ల్ టప్పర్ స్థాపించిన ఈ కంపెనీ 1950లలో అధిక ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా మంచి అమ్మకాలను పొందిన ఈ సంస్థ అమ్మకాలు 2024 త్రైమాసికంలో క్షీణించాయి.టప్పర్‌వేర్ దాని రుణ నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత కోర్టు రక్షణలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. అంతే కాకుండా 700 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ రుణాలను ఎలా నిర్వహించాలనే దానికి సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలుగత కొంత కాలం నుంచి ఆశించిన స్థాయిలో అమ్మకాలతో ముందుకు సాగకపోవడంతో.. కంపెనీ ఆర్థిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని జూన్‌లో 150 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతే కాకుండా కంపెనీకి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిగ్యుల్ ఫెర్నాండెజ్, పలువురు బోర్డు సభ్యులను భర్తీ చేసింది. అయినప్పటికీ పరిస్థితులు తారుమారయ్యాయి. దివాళాకు సంబంధించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన వెల్లడించలేదు. -
బైజూస్‌పై దివాలా పిటిషన్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)–బెంగళూరులో దివాలా పిటిషన్ దాఖలైంది. కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల మేర టర్మ్ లోన్–బీ (టీఎల్‌బీ) ఇచి్చన రుణదాతల్లో 80 శాతం సంస్థలు కలిసి గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ద్వారా దీన్ని దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దివాలా పిటిషన్ విషయం ఇంకా బహిరంగంగా వెల్లడి కాలేదు. బైజూస్ ఈ వ్యవహారమంతా నిరాధారమైనదని పేర్కొంది. రుణదాతల చర్యలపై అమెరికా కోర్టుల్లో పలు కేసులు నడుస్తుండగా ఎన్సీఎల్టీని ఆశ్రయించడం సరికాదని వ్యాఖ్యానించింది. అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో రుణాలను తీర్చేసుకునేందుకు టీఎల్‌బీ రుణదాతలతో చర్చలు జరుపుతున్నట్లు బైజూస్ చెబుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకులు కాకుండా సంస్థాగత ఇన్వెస్టర్లు ఇచ్చిన రుణాన్ని టీఎల్‌బీ లోన్‌గా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టీఎల్‌బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును ఆశ్రయించారు. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
20 ఖాతాలను సమీక్షించండి.. బ్యాంకులకు ఆర్థిక శాఖ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్పీఏ) నిర్వహణలో భాగంగా ఇన్సాల్వెన్సీ– దివాలా కోడ్ కింద దాఖలైన టాప్ 20 ఖాతాలను నెలవారీగా పర్యవేక్షించాలని, సమీక్షించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) అధిపతులను కోరింది. పీఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓలతో జరిగిన సమావేశంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషి మాట్లాడుతూ, నెలవారీగా టాప్ 20 దివాలా కేసులను సమీక్షించాలని కోరారు. ఈ సమావేశంలో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) పని తీరును కూడా సమీక్షించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మెజారిటీ వాటాతో ఎన్ఏఆర్సీఎల్ 2021లో ఏర్పాటయి న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే.. కెనరా బ్యాంక్ స్పాన్సర్ బ్యాంక్‌గా ఉంది. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్, 2002 కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీగా రిజిస్టర్ అయ్యింది. -
వుయ్‌వర్క్ దివాలా!
న్యూయార్క్: ఆఫీస్ స్పేస్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అంతర్జాతీయ దిగ్గజం వుయ్‌వర్క్ దివాలా ప్రకటించింది. వ్యాపారాన్ని యథాప్రకారం కొనసాగిస్తూ, కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకునే దిశగా అమెరికాలో చాప్టర్ 11 దివాలా పిటిషన్ దాఖలు చేసింది. వ్యాపార పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. కమర్షియల్ ఆఫీస్ లీజుల పోర్ట్‌ఫోలియోను మరింత క్రమబద్దికరించుకోనున్నట్లు పేర్కొంది. రుణభారాన్ని గణనీయంగా తగ్గించుకునే దిశగా పునర్వ్యవస్థీకరణ విషయంలో తోడ్పాటు అందించేలా సంబంధిత వాటాదారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. అమెరికా, కెనడా వెలుపలి దేశాల్లోని తమ కార్యకలాపాలపై ఈ పరిణామ ప్రభావం ఉండబోదని వుయ్‌వర్క్ వివరించింది. సమస్యలను పరిష్కరించుకుని, వ్యాపారాన్ని మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగడంపై దృష్టి పెడుతున్నట్లు సంస్థ సీఈవో డేవిడ్ టోలీ ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ ఈ ఏడాది ప్రథమార్ధంలో 696 మిలియన్ డాలర్ల నష్టం నమోదు చేసింది. జూన్ 30 నాటికి వుయ్‌వర్క్‌కు 39 దేశాల్లో 777 చోట్ల కార్యకలాపాలు ఉన్నాయి. అప్పట్లో 50 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ .. గతంలో దాదాపు 50 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో వెలుగొందిన వుయ్‌వర్క్ దివాలా తీయడానికి అనేక కారణాలు ఉన్నాయి. అతి దూకుడుగా విస్తరించడం, వ్యవస్థాపకుడు ఆడమ్ న్యూమాన్ పోకడలు మొదలైనవి ఇందుకు దారితీశాయి. వాస్తవానికి కొన్నాళ్ల క్రితం నుంచే దివాలా సంకేతాలు కనిపించడం మొదలైంది. 2019లో తొలి పబ్లిక్ ఇష్యూ ప్రయత్నం ఘోరంగా విఫలం కాగా ఆ తర్వాత 2021లో ఐపీవోకి వచ్చినా వేల్యుయేషన్ అనేక రెట్లు తగ్గి 9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతకన్నా ముందే కంపెనీ, వ్యవస్థాపకుడి పనితీరుపై ఇన్వెస్టర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో.. న్యూమాన్ ఉద్వాసనకు గురయ్యారు. సంస్థలో మెజారిటీ వాటాలు తీసుకున్న జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్.. కంపెనీని నిలబెట్టేందుకు ప్రయత్నించింది. నిర్వహ ణ వ్యయాలను తగ్గించుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం వంటి ప్రయత్నాలు జరిగినా పెద్దగా ఫలితం లేకపోయింది. వ్యాపారాన్ని కొనసాగించే సామర్థ్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయంటూ వుయ్‌వర్క్ ఆగస్టులోనే వెల్లడించింది. ఆ తర్వాత లీజులన్నింటినీ పునఃసమీక్షించుకునే యోచనలో ఉన్నట్లు సెప్టెంబర్‌లో ప్రకటించింది. నష్టాల్లో ఉన్న లొకేషన్ల నుంచి వైదొలగనున్నట్లు తెలిపింది. భారత్‌లో ప్రభావం ఉండదు.. వుయ్‌వర్క్ గ్లోబల్ దివాలా ప్రభావం భారత విభాగంపై ఉండదని వుయ్‌వర్క్ ఇండియా సీఈవో కరణ్ విర్వాణి స్పష్టం చేశారు. దివాలా ప్రక్రియలో భారత వ్యాపారం భాగంగా లేదని తెలిపారు. వుయ్‌వర్క్ ఇండియాలో రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్‌నకు 73 శాతం, వుయ్‌వర్క్ గ్లోబల్‌కు 27 శాతం వాటాలు ఉన్నాయి. భారత్‌లో ఏడు నగరాల్లో వుయ్‌వర్క్ ఇండియాకు 50 కేంద్రాలు ఉన్నాయి. 2021 జూన్‌లో వుయ్‌వర్క్ ఇండియాలో వుయ్‌వర్క్ గ్లోబల్ 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. -
‘Wework’ : ఓ మతిలేని నిర్ణయంతో పాతాళానికి!
15,724 ఇవేవో అంకెలనుకుంటే పొరబడినట్లే. అమెరికాలో దివాళా తీసిన సంస్థల సంఖ్య. ఆ జాబితాలో తాజాగా వివర్క్ చేరింది. పైన పేర్కొన్న సంస్థలు ప్రాజెక్ట్‌ల కొరత, ఆర్ధిక మాంద్యం కారణంగా అప్పులు పాలైతే.. వివర్క్ మాత్రం అలా కాదు. ఆ కంపెనీ కో-ఫౌండర్, మాజీ సీఈఓ ఆడమ్ న్యూమాన్ 4 ఏళ్ల క్రితం తీసుకున్న మతిలేని నిర్ణయం వల్ల లక్షల కోట్ల కంపెనీ కాస్త అప్పుల కుప్పగా మారింది. ఇంతకి వివర్క్లో ఏం జరిగింది? ఆ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం పదండి. అమెరికాకు చెందిన ప్రముఖ కోవర్కింగ్ స్టార్టప్ 'వివర్క్' అమెరికాలో దివాలా పిటిషన్ దాఖలు చేసింది న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివర్క్ ఒకానొక దశలో రూ. 3. 91 లక్షల కోట్లు (47 బిలియన్ల) విలువైన స్టార్టప్‌గా అవతరించింది. కానీ ఇప్పుడు ఆ సంస్థ విలువ భారీగా పడిపోవడంతో చేసేది లేక ఉన్న అప్పుల్ని తీర్చలేమంటూ న్యూజెర్సీ న్యాయ స్థానంలో చాప్టర్ 11 దివాళా పిటిషన్ దాఖలు చేసింది. వివర్క్ సీఈఓ డేవిడ్ టోల్లే తరుపున ప్రముఖ లా సంస్థ కాడ్వాలాడర్, వికర్షామ్ అండ్ టాఫ్ట్ దివాలా ఫైలింగ్‌ను నమోదు చేసింది. వివర్క్ అమెరికా, కెనడాలలో 10 బిలియన్ల నుంచి 50 బిలియన్ల అప్పులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేకాదు తాము గతంలో చేపట్టిన నాన్ ఆపరేషనల్ లీజింగ్ ఒప్పొందాలను తగ్గించుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించింది. సిలికాన్ వ్యాలీలో సంచలనం అయితే లక్షల కోట్ల కంపెనీ ఎదిగి ఓకానొక దశలో సిలికాన్ వ్యాలీలో సంచలనానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ స్టార్టప్ అప్పుల కుప్పగా మారడానికి కారణం వివర్క్ మాజీ కో-ఫౌండర్,సీఈఓ ఆడమ్ న్యూమాన్ తీసుకున్న మతిలేని నిర్ణయమే కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే? అది ఆగస్ట్ 14 2019, న్యూయార్క్ నగరం. సమయం ఉదయం 7:12 గంటలు. అప్పుడే వివర్క్ ఐపీవోకి వెళుతుందంటూ ఆ సంస్థ సీఈవో ఆడమ్ న్యూమన్ ఐపీవో కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ వెబ్సైట్ట్లో దాఖలు చేశారు. ఓవైపు విజృంభిస్తున్న మాయదారి కరోనా మహమ్మారి. పైగా లాక్డౌన్. ఆపై తినడానికి తిండి లేక సామాన్యుల అవస్థలు. ఆక్సీజన్ అందక ప్రాణాలు పోతున్నాయని గగ్గొలు పెట్టిన ప్రభుత్వం స్పందించలేని దుస్థితి. ఇలాంటి క్లిస్ట పరిస్థితుల్లో సామాన్యులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారా? ప్రపంచాన్ని మారుస్తా కానీ ఆడమ్ న్యూమాన్ మాత్రం రూ. 3. 91 లక్షల కోట్లు కంపెనీ ఐపీవోకి వెళుతుంది. మా లక్ష్యం డబ్బు సంపాదించడం లేదా కార్యాలయ స్థలాన్ని అద్దెకు ఇవ్వడం మాత్రమే కాదు ‘ప్రపంచాన్ని మార్చడం’ అని పేర్కొన్నాడు. ఈ ప్రకటనే.. సముద్రంలో గులకరాయి ఎంతటి అలజడని సృష్టిస్తుందో..ఆడమ్ నిర్ణయంతో అమెరికన్ స్టాక్ మార్కెట్లో తీవ్ర అలజడిని రేపింది. దీంతో దిగ్గజ కంపెనీలు ఆడమ్ నిర్ణయంపై ముక్కున వేలేసుకుంటే.. ఆర్ధిక వేత్తలు వివర్క్ సీఈఓది మతిలేని చర్య అంటూ మండి పడ్డారు. వెనక్కి తగ్గలేదు అయినా, ఆడమ్ వెనక్కి తగ్గలేదు. ఐపీవోకి వెళ్లే ముందు ఆయా కంపెనీలు వాటి స్థితిగతుల గురించి పబ్లిక్‌గా అనౌన్స్ చేస్తాయి. ఆడమ్ సైతం అదే పనిచేశారు. అందులో కంపెనీ 2019 జనవరి నుంచి జూన్ వరకు సుమారు 900 మిలియన్లు నష్టపోగా ఆదాయం 1.54 బిలియన్లని పేర్కొంది. లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉండడంతో షేర్లు భారీగా పతనమయ్యాయి. చేసేది లేక సెప్టెంబరు 17, 2019న, వివర్క్ మాతృ సంస్థ దివి కంపెనీ ఐపీవోని ఏడాది చివరి నాటికి వాయివా వేయాలని నిర్ణయించింది. ఫలితంగా వివర్క్ బుడగ టప్ మని పేలింది. కంపెనీ సైతం విలువ అమాంతం కరిగింది. ఆడమ్ మాత్రం భారీ లాభాల్ని అర్జించారు. ఆయన ఆస్తి రెండింతలైంది. ముందుగా చెప్పినట్లుగానే సెప్టెంబరు 24, 2019 ఐపీవోని నిలిపివేసింది. కో-ఫౌండర్ సీఈఓ ఆడమ్ న్యూమాన్ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థ నుంచి వెళ్లిపోయారు. అలా.. నాటి నుంచి వివర్క్ పడ్తూ లేస్తూ కొనసాగింది. సాఫ్ట్‌బ్యాంక్ లాంటి దిగ్గజ సంస్థలు ఎంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినా లాభం లేకపోయింది. తాజాగా అప్పులు పెరిగిపోయి వాటిని తీర్చలేక దివాలా తీస్తూ కోర్టును ఆశ్రయించడం స్టార్టప్ పరిశ్రమలో మాయని మచ్చగా నిలిచిపోయింది. మొత్తం 15,724 కంపెనీల దివాలా అమెరికా సంస్థల దివాలా ఫైలింగ్ డేటాను అందించే ఎపిక్ దివాలా (Epiq Bankruptcy) డేటా ప్రకారం.. ఈ ఆగస్టులో మొత్తం 2,328 మొత్తం సంస్థలు దివాలా ఫైలింగ్ చేశాయి. గత ఏడాది జులై 14 శాతం నుంచి ఆగస్ట్ నెలలో 17 శాతం పెరిగినట్లు డేటా హైలెట్ చేసింది. ఇక ఈ ఏడాది జూన్ 30, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 15,724 దివాలాలు దాఖలైనట్లు అమెరికా దివాలా కోర్టు నివేదించింది. ఇది గత సంవత్సరం కంటే 23శాతం పెరిగినట్లు చెప్పింది. -
చైనా ఈవీ స్టార్టప్ దివాలా
షాంఘై: తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) వర్ధమాన కంపెనీ డబ్ల్యూఎం మోటార్స్ దివాలా ప్రకటించింది. సబ్సిడీలలో కోత, అందుబాటు ధరలకు ప్రాధాన్యతగల మార్కెట్ నేపథ్యంలో ఈవీ స్టార్టప్.. పలు సవాళ్లను ఎదుర్కొంది. వెరసి కార్యకలాపాలను కొనసాగించడంలో విఫలమైంది. నిజానికి ఈవీ అమ్మకాలలో చైనా ప్రపంచంలోనే నాయకత్వ స్థాయిలో ఉంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వివరాల ప్రకారం అంతర్జాతీయ అమ్మకాలలో(2023 తొలి క్వార్టర్) 56 శాతం వాటాను ఆక్రమిస్తోంది. ఈ కాలంలో ఈవీ అమ్మకాలు వార్షికంగా 32 శాతం ఎగశాయి. వీటిలో బ్యాటరీ ఈవీల వాటా 73 శాతంగా నమోదైంది. మిగిలిన 27 శాతం వాటాను ప్లగిన్ హైబ్రిడ్ ఈవీలు అందిపుచ్చుకున్నాయి. కంపెనీ ఎదిగిన తీరిలా డబ్ల్యూఎం మోటార్స్‌ను 2015లో ఫ్రీమ్యాన్ షేన్ ఏర్పాటు చేశారు. తొలి దశలో టెక్ దిగ్గజాలు బైడు, టెన్సెంట్, పీసీసీడబ్ల్యూ(హాంకాంగ్), హాంగ్షాన్, షున్ టక్ హోల్డింగ్స్ తదితరాలు పెట్టుబడులు అందించాయి. ఇతర ప్రత్యర్ధి సంస్థల బాటలోనే చైనీస్ క్లిష్టతరహా బ్యాటరీ సప్లై చైన్ ఎకోసిస్టమ్ ఆధిపత్యం ద్వారా కంపెనీ లబ్ది పొందింది. అయితే, ప్రత్యర్ధి సంస్థల నుంచి తీవ్రపోటీ, ముడివ్యయాల పెరుగుదల, సబ్సిడీలలో కోత, అమ్మకాలు పడిపోవడం వంటి అంశాలు రెండేళ్లుగా కంపెనీకి సవాళ్లు విసురుతున్నాయి. దీంతో 2021కల్లా వార్షిక నష్టం రెట్టింపై 1.13 బిలియన్ డాలర్లను తాకింది. -
చైనా నిండా దెయ్యాల కొంపలే!
న్యూఢిల్లీ: చైనా తీవ్ర రియల్టీ సంక్షోభంలో నానాటికీ పీకల్లోతున కూరుకుపోతోందా? దేశవ్యాప్తంగా ఇప్పటికే జనాభాకు మించి గృహలున్నాయా? అవి చాలవని ఇంకా ఎటు చూస్తే అటు భారీ సంఖ్యలో గృహ నిర్మాణ ప్రాజెక్టులే కనిపిస్తున్నాయా? అవుననే అంటున్నారు చైనా ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగి ఒకరు! తన ఆర్థిక వ్యవస్థ కళకళలాడుతోందని చైనా ప్రభుత్వం బయటికి ఎన్ని మాటలు చెబుతున్నా, రియల్టీ సంక్షోభం నానాటికీ ఆందోళన కలిగించేంతగా విస్తరిస్తోందని చెబుతున్నారు! చైనాలో నివాస గృహాల సంఖ్య కనీసం 100 కోట్లు దాటి ఉంటుందని భావిస్తున్నారు. అవి కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయట! దేశ స్టాటిస్టిక్స్ బ్యూరో మాజీ డెప్యూటీ హెడ్ హే కేంగ్ స్వయంగా చెప్పిన వివరాలివి. ‘చైనాలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్యపై ఒక్కో నిపుణుడు ఒక్కో మాట చెబుతున్నారు. కానీ, ఎవరి నమ్మినా, నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్మాణం పూర్తయి అందుబాటులో ఉన్న ఖాళీ ఇండ్లు కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయి’ అని హేంగ్ను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ వార్తా సంస్థ పేర్కొంది. రియల్టీ సంస్థల దివాలా బాట చైనాలో 2021 నుంచీ రియల్టీ రంగం సంక్షోభ బాట పట్టింది. క్రమంగా ఒకటి తర్వాత ఒకటిగా దిగ్గజ సంస్థలన్నీ దివాలా బాట పడుతుండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. చైనాలో నెలకొన్న ఈ రియల్టీ సంక్షోభానికి దేశమంతటా ఎక్కడ చూస్తే అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొచి్చన అపార్ట్ మెంట్లే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి... ► ఇవి చాలవన్నట్టు దేశం మొత్తంమీద ఇంకా అసంఖ్యాకమైన అపార్ట్ మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ► అయితే కొనుగోలు చేసేవాళ్లు లేక నిర్మాణ సంస్థలు కొన్నాళ్లుగా అల్లాడుతున్నాయి. ► రుణ భారానికి తాళలేక 2021లో చైనా రియల్టీ దిగ్గజం ఎవర్ గ్రాండ్ గ్రూప్ నిలువునా దివాలా తీసింది. ► అంతకంటే పెద్ద నిర్మాణ సంస్థ కంట్రీ గార్డెన్ వంటివి దివాలా అంచులో కొట్టుమిట్టాడుతున్నాయి! ► గత ఆగస్టు నాటికే చైనాలో ఏకంగా 700 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణానికి సమానమైన ఇళ్లు అమ్ముడుకాకుండా ఖాళీగా మిగిలిపోయినట్టు ఆ దేశ జాతీయ గణాంక బ్యూరో తాజా అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ► ఇది దాదాపు ఒక్కోటీ 90 చదరపు మీటర్ల పరిమాణంలో ఉండే 72 లక్షల ఇళ్లకు సమానమని రాయిటర్స్ అంచనా వేసింది. ► ఇవిగాక ఇప్పటికే అమ్ముడుపోయి నిర్మాణ సంస్థలు ఎదుర్కొంటున్న నగదు ప్రవాహ సమస్యల కారణంగా ఇంకా పూర్తికాని ఇండ్ల ప్రాజెక్టులు దేశమంతటా అసంఖ్యాకంగా ఉన్నాయి. అవి శ్మశాన నగరాలు! ► అత్యధిక ఇళ్లను ప్రధానంగా మార్కెట్ స్పెక్యులేటర్లు 2016 సమయంలో మార్కెట్లు కళకళలాడుతున్న సమయంలో ఎగబడి కొన్నారు. ఇప్పుడు వాళ్ళూ, రియల్టీ సంస్థల యజమానులూ ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు! ► ఆర్థిక సంక్షోభం బారి నుంచి దేశాన్ని ఎలాగోలా బయట పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చైనా కమ్యునిస్టు ప్రభుత్వానికి ఈ రియల్టీ సంక్షోభం పెను సవాలుగా పరిణమించింది. ► చైనా జీడీపీలో దాదాపు 30 శాతం వాటా రియల్టీ రంగానిదే. ► ఒకప్పుడు దేశానికి వెన్నెముకగా ఉన్న రియల్టీ రంగమే ఇప్పుడు పెను భారంగా మారింది. ► 1970ల నుంచి గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణం ఊపందుకుంది. ► దాంతో ఒకప్పుడు 18 శాతమున్న పట్టణ జనాభా ఇప్పుడు ఏకంగా 60 శాతం దాటింది. ► ఆ సమయంలో సంపన్నులు విచ్చలవిడిగా ఇళ్లు, గృహ సముదాయాలనే కొని అట్టిపెట్టుకున్నారు. దాంతో ఇప్పుడు పట్టణాలకు పట్టణాలే ఖాళీగా ఉన్న పరిస్థితి! క్వింగ్ హుయి, జెంగ్ డాంగ్, చెన్ గాంగ్, బిన్ హయీ వంటివి శ్మశాన నగరాలుగా మారాయి!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
G20 Summit: జిన్‌పింగ్ ఎందుకు రావట్లేదు ?
జీ20 సదస్సుకు కయ్యాలమారి చైనా అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదా ?. అందుకే అధ్యక్షుడు జిన్‌పింగ్ తనకు బదులు ప్రధాని లీ కియాంగ్‌ను పంపించారా ?. ఇలాంటి ప్రశ్నలకు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు తలో విశ్లేషణ చెబుతున్నారు. జీ20 కూటమి ఆవిర్భావం తర్వాత చైనా అధ్యక్షులు ఒకరు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సదస్సుకు హాజరుకాకుండా జిన్‌పింగ్ చైనాలోని ఉండి ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2020 మే నెల నుంచి భారత్‌తో సరిహద్దు వెంట ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి దిగడం, భారీగా సైన్యం మొహరింపు వంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతుండటం వల్లే జిన్‌పింగ్ ఆగ్రహంతో సదస్సుకు రావట్లేదని చాలా మంది భావిస్తున్నారు. అసలు కారణం అది కాదని మరో వాదన బలంగా వినిపిస్తోంది. అదే అదుపు తప్పుతున్న చైనా ఆర్థిక పరిస్థితి. జిన్‌పింగ్ ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. అప్పుడే వచ్చిన సాంస్కృతిక విప్లవం ధాటికి ఆయన తండ్రి పేదవాడిగా మిగిలిపోయాడు. దీంతో జిన్‌పింగ్ బాల్యంలో కష్టాలు చూశాడు. పొలంలో సాధారణ కూలీగా పనిచేశాడు. ఆరేళ్లు ఇబ్బందులు పడ్డాడు. అయితే బలీయమైన చైనాకు అధ్యక్షుడిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలతో పోలిస్తే ఆనాటి కష్టాలు గడ్డిపరకతో సమానమే. ‘చైనా రాజ్య విస్తరణ వాదం, దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం, ప్రపంచ వస్తూత్పత్తి మార్కెట్‌కు ఏకైక దిక్కుగా మారాలన్న వ్యూహాలతో చైనా చాలా ప్రపంచ దేశాలకు శత్రువుగా మారింది. ఇలాంటి తరుణంలో చైనాతో కలిసి జీ20 వేదికను కలిసి పంచుకునేందుకు తోటి దేశాలు విముఖత చూపుతున్నాయి’ అని మేథో సంస్థ కార్నీగ్ చైనా డైరెక్టర్ పాల్ హెనెల్ వ్యాఖ్యానించారు. ఆ అప్రతిష్ట పోగొట్టుకునేందుకే ‘ సదస్సు విజయవంతం అవడానికి అందరితో కలిసి పనిచేస్తాం’ అని బీజింగ్ తాజాగా ప్రకటించింది. ‘విదేశీ పర్యటనకు పక్కనబెట్టి స్వదేశ సమస్యలపై జిన్‌పింగ్ దృష్టిపెట్టారు. దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పొరుగు దేశాలతో కయ్యానికి దిగారు. ఆర్థిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకోవడంతో జిన్‌పింగ్‌కు తలనొప్పి పెరిగింది’ అని సింగపూర్‌లోని నేషనల్ యూనివ ర్సిటీ ప్రొఫెసర్ ఆల్ఫ్రెడ్ వూ వ్యాఖ్యానించారు. దెబ్బకొట్టిన హౌజింగ్ రంగం ఇటీవల దశాబ్దాల కాలంలో ఎన్నడూలేనంతగా పలు సమస్యలు చైనాలో తిష్టవేశాయి. కుటుంబాలు తమ ఖర్చులను తగ్గించుకున్నాయి. కర్మాగారాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. వ్యాపారవేత్తలు నూతన పెట్టుబడులకు ముందుకు రావట్లేదు. ఎగుమతులు దిగజారాయి. ఆగస్టులో ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.8 శాతం తగ్గాయి. దిగుమతులు 7.3 శాతంపెరిగాయి. నిరుద్యోగిత భారీగా పెరగడంతో ప్రభుత్వం తాజా గణాంకాలు బహిర్గతంచేయడం మానేసింది. ఆస్తుల మార్కెట్ విలువ భారీగా పతనమైంది. ప్రధాన డెవలపర్లు చేతులెత్తేసి దివాలాను ప్రకటించారు. దీంతో రియల్ ఎసేŠట్ట్ రంగం సంక్షోభంలో చిక్కింది. 40 ఏళ్ల భవిష్యత్ అభివృద్ది మోడల్‌ను ఈ అంశాలు తలకిందులుచేసేలా ఉన్నాయి. ప్రాపర్టీ రంగంపై అతిగా ఆధారపడటం, అత్యంత కఠినమైన కోవిడ్ ఆంక్షల విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని నిపుణులు భావిస్తున్నారు. రుణాల పునాదిపై నెలకొల్పిన అభివృద్ధి మోడల్ ఈ పరిస్థితికి మరో కారణం. దేశం అప్పులు పెరిగిపోయాయి. 2023 తొలి త్రైమాసికంలో అప్పులు–జీడీపీ నిష్పత్తి రికార్డు స్థాయిలో 279 శాతంగా నమోదైందని బ్లూమ్‌బర్గ్ విశ్లేషించింది. రుణాలు అతిగా తీసుకొచ్చి మౌలిక వసతులపై ఖర్చుచేసిన పాపం ఇప్పుడు పండిందని మరో వాదన. హౌజింగ్ బుడగ బద్ధలైంది. చైనా ఆర్థిక వ్యవస్థ 25 శాతం ప్రాపర్టీ మార్కెట్‌పైనే ఆధారపడింది. ఇన్నాళ్లూ కేవలం చైనాపై ఆధారపడిన విదేశీ బ్రాండ్లు ఇప్పుడు చైనాతోసహా ఇతర(చైనా ప్లస్ స్ట్రాటజీ) దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దీని వల్ల ప్రధానంగా లాభపడేది ఇండియానే. ఆపిల్, టెస్లా మొదలుకొని నైక్ వరకు అన్ని ప్రధాన సంస్థల తయారీకేంద్రాలు చైనాలోనే ఉన్నాయి. కార్మికులకు అధిక జీతభత్యాలు, అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో విదేశీ సంస్థలు చైనాకు బదులు వేరే దేశాల వైపు చూస్తున్నాయి. ఆర్మీలో అవిధేయత? చైనా ఆర్మీలో పెరిగిన అవినీతి, పాలక పార్టీ పట్ల తగ్గిన విధేయతపై జిన్‌పింగ్ భయపడుతున్నారని ఆసియా పాలసీ సొసైటీ ఇన్స్టిట్యూట్లో జాతీయ భద్రతా విశ్లేషకుడు లైల్ మోరిస్ చెప్పారు. చైనా సైన్యంలో అణ్వస్త్ర సామర్థ్య రాకెట్ విభాగంలోని జనరల్, డెప్యూటీ జనరల్‌లను తొలగించడాన్ని ఆయన ఉటంకించారు. తనకు నమ్మకస్తుడైన విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌ను జిన్‌పింగ్ తప్పించడంతో పార్టీ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి రేగింది. జిన్‌పింగ్ పాలనా సామర్థ్యానికి ఈ ఘటనలు మాయని మచ్చలని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి సమస్యలు ఇంకొన్ని పెరిగితే డ్రాగన్ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పాలనకు తెరపడే ప్రమాదముందని కొందరు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. ఇన్ని సమస్యలు ఇంట్లో పెట్టుకునే జిన్‌పింగ్ చైనాను వదలి బయటకు రావట్లేదనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంక్షోభం: చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే సంచలనం
China Evergrande Group bankruptcy protection: చైనీస్ ప్రాపర్టీ దిగ్గజం ఎవర్‌గ్రాండే గ్రూప్ సంచనల విషయాన్ని ప్రకటించింది. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న చైనా రియల్టీ రంగాన్ని ప్రతిబింబిస్తూ దేశంలోని రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ దివాలా తీసినట్టు ప్రకటించింది. ఈ మేరకున్యూయార్క్ కోర్టులో దివాలా కోసం దాఖలు చేసింది. చైనాలో అగ్రశ్రేణి కంపెనీలు నిర్మాణాలను పూర్తి చేయడానికి డబ్బు కోసం కష్టపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ఆందోళన రేపింది. (అదానీలో పెట్టుబడుల జోష్: అబుదాబి ఆయిల్ మేజర్ వేల కోట్ల ప్లాన్!) ప్రపంచంలోనే అత్యధికంగా అప్పుల్లో కూరుకుపోయిన ప్రాపర్టీ డెవలపర్ ఎవర్‌గ్రాండే న్యూయార్క్ కోర్టులో చాప్టర్-15 కింద దివాలా రక్షణను దాఖలు చేసింది. వివిధ బ్యాంకులతో పలు మల్టీ మిలియన్ డాలర్ల రుణాల కోసం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అమెరికా తన ఆస్తులను రక్షించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎవర్‌గ్రాండే ప్రస్తుత అప్పులు విలువ 300 బిలియన్ డాలర్లకు పైమాటే. 2021లో కంపెనీల రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థలో భారీ ఆస్తి సంక్షోభాన్ని రేకెత్తించింది. పెరుగుతున్న గృహాల ధరలను అదుపు చేసే ప్రయత్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికంగా రుణాలు తీసుకోవడంపై చైనా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన తర్వాత సంస్థ డిఫాల్ట్ వచ్చింది. (అదిరిపోయే లుక్‌లో మహీంద్ర థార్ ఎలక్ట్రిక్ వెర్షన్) ఈ పరిణామాల నేపథ్యంలో 2022 మార్చి నుంచి కంపెనీ హాంకాంగ్-లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్ నిలిచి పోయింది. అంతేకాదు గతరెండేళ్లలో కంపెనీ ఏకంగా 80 బిలియన్ డాలర్లు నష్ట పోయినట్లు స్వయంగాఎవర్గ్రాండే జూలైలో నివేదించిన సంగతి తెలిసిందే. కంపెనీ వెబ్సైట్ ప్రకారం, ఎవర్‌గ్రాండే 280 కంటే ఎక్కువ నగరాల్లో 1,300 లకు పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది.మరోవైపు చైనా ఆర్థిక వృద్ధి మందగమనంతో ఎగుమతులు కూడా క్షీణించాయి. చైనా యువత నిరుద్యోగం రేటు కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. డాలరు మారకంలో కరెన్సీ పతనమవుతోంది. దీంతో ఇటీవల ద్రవ్యోల్బణాన్ని కట్టి చేసే చర్యల్లో భాగంగా చైనా కేంద్ర బ్యాంకు అనూహ్యంగా కీలక వడ్డీరేట్లను రికార్డు స్థాయికి తగ్గించడం ప్రపంచ దేశాల ఆర్థిక నిపుణులను ఆందోళనలో పడేసింది. -
అమెరికా రుణ పరిమితి బిల్లుకు సెనేట్ ఆమోదం
వాషింగ్టన్/కొలరాడో: దివాలా(డిఫాల్ట్) ముప్పు నుంచి అగ్రరాజ్యం అమెరికా బయటపడినట్లే. రుణ పరిమితి పెంపునకు సంబంధించిన బిల్లుపై (ద్వైపాక్షిక ఒప్పందం) సెనేట్ తుది ఆమోద ముద్ర వేసింది. సుదీర్ఘమైన చర్చల అనంతరం గురువారం రాత్రి ఓటింగ్ నిర్వహించారు. 63–36 ఓట్లతో బిల్లు ఆమోదం పొందింది. సంతకం కోసం అధ్యక్షుడు జో బైడెన్ డెస్క్‌కు పంపించారు. ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాల్చనుంది. దేశ రుణ పరిమితిని 31.4 ట్రిలియన్ డాలర్లకు పెంచుతూ బిల్లును రూపొందించారు. అంటే మొత్తం అప్పులు 31.4 ట్రిలియన్ డాలర్లు దాటకూడదు. బిల్లుకు సెనేట్ ఆమోదం లభించడంతో కొత్త అప్పులు తీసుకొని, పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బడ్జెట్ కట్స్ ప్యాకేజీకి సైతం సెనేట్ ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం పొందడంలో అమెరికా ఇక ఊపిరి పీల్చుకోవచ్చని సెనెట్ మెజార్టీ నాయకుడు చుక్ షూమర్ చెప్పారు. ఇది అతిపెద్ద విజయం: బైడెన్ అమెరికా తన బాధ్యతలు నెరవేర్చే దేశం, బిల్లులు చెల్లించే దేశం అని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు మరోసారి నిరూపించారని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అమెరికా తన బాధ్యతలను ఎప్పటికీ చక్కగా నెరవేరుస్తుందని చెప్పారు. బిల్లుపై త్వరగా సంతకం చేస్తానన్నారు. చర్చల్లో ఎవరికీ కోరుకున్నది మొత్తం దక్కకపోవచ్చని, అయినప్పటికీ తాము ఎలాంటి పొరపాటు చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు లఅతిపెద్ద విజయమని బైడెన్ అభివర్ణించారు. -
గో ఫస్ట్ నుంచి విమానాల కోసం లీజర్ల పట్టు!
న్యూఢిల్లీ: దివాలా పిటిషన్ దాఖలు చేసిన విమానయాన సంస్థ గో ఫస్ట్ నుంచి తమ విమానాలను తిరిగి పొందే విషయంలో లీజర్లు వెనక్కు తగ్గడం లేదు. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తమ విమానాలను డీరిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఇప్పటికే నిరాకరించిన డీజీసీఏను తప్పు పడుతూ ఈ నిర్ణయం ఎంతమాత్రం సమర్థనీయం కాదని తెలిపారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్ తారా వితస్తా గంజు ఈ పిటిషన్ విచారణను వాదనల నిమిత్తం మే 30న లిస్ట్ చేయాలని ఆదేశించారు. ఆలోగా లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలని ప్రతిపాదులను ఆదేశించారు. హైకోర్టును ఆశ్రయించిన లీజర్లలో ఆక్సిపిటర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎయిర్‌క్రాఫ్ట్ 2 లిమిటెడ్, ఈఓఎస్ ఏవియేషన్ 12 (ఐర్లాండ్) లిమిటెడ్, పెంబ్రోక్ ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ 11 లిమి టెడ్, ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ లిమిటెడ్ ఉన్నాయి. ► ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్‌కు మే నెల 10వ తేదీన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కాస్త ఊరటనిస్తూ, కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. ► తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్ దివాలా పిటీషన్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ లభించనట్లయ్యింది. సంక్షోభంలో పడిన వాడియా గ్రూప్ సంస్థ– గో ఫస్ట్ నుండి తమ విమానాలను వెనక్కి తీసుకునేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ లీజర్లు చేసిన ప్రయత్నాలకు తక్షణం అడ్డుకట్ట పడింది. ► దీనితో ఎన్సీఎల్టీ రూలింగ్‌ను సవాలు చేస్తూ, విమాన లీజర్లు ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్, జీవై ఏవియేషన్, ఎస్‌ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్స్, ఇంజిన్ లీజింగ్ ఫైనాన్స్ బీవీ (ఈఎల్ఎఫ్సీ) సంస్థలు.. ఎన్సీఎల్ఏటీలో అప్పీల్ చేశాయి. అయితే ఈ అప్పీళ్లను చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల అప్పిలేట్ బెంచ్ తోసిపుచ్చింది. ► దీనిని ఆయా సంస్థలు సుప్రీంలో అప్పీల్ చేయవచ్చన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే గో ఫస్ట్ అత్యున్నత న్యాయస్థానంలో నాలుగు కేవియెట్లను దాఖలు చేసింది. ► గో ఫస్ట్‌కు రూ. 11,463 కోట్ల ఆర్థిక భారం ఉండగా, 7,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. మే 3వ తేదీ నుంచి గో ఫస్ట్ సేవలు నిలిచిపోయాయి. ► మరోవైపు 30 రోజుల్లో పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వాలని గో ఫస్ట్‌కు డీజీసీఏ సూచించడం మరో విషయం. గోఫస్ట్ సేవల సన్నద్ధతపై డీజీసీఏ ఆడిట్ గోఫస్ట్ సేవల పునరుద్ధరణకు అనుమతించే ముందు, సన్నద్ధతపై పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆడిట్ చేయనుంది. ఆర్థిక సంక్షోభంతో గోఫస్ట్ మే 3 నుంచి విమానయాన కార్యకలాపాలు నిలిపివేసి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందు దివాలా పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ దివాలా పరిష్కార చర్యల పరిధిలో ఉంది. ఇలా సేవలను అర్థంతరంగా నిలిపివేయడంపై గోఫస్ట్‌కు డీజీసీఏ షోకాజు నోటీసు జారీ చేయగా.. దీనికి స్పందనగా వీలైనంత త్వరగా ఫ్లయిట్ సేవలు ప్రారంభించే ప్రణాళికపై పనిచేస్తున్నట్టు బదులిచ్చింది. ఈ విషయాన్ని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు గోఫస్ట్ కూడా తన ఉద్యోగులకు ఇదే విషయమై సమాచారం పంపింది. రానున్న రోజుల్లో మన సేవల సన్నద్ధతపై డీజీసీఏ ఆడిట్ నిర్వహిస్తుందని, నియంత్రణ సంస్థ ఆమోదం లభిస్తే వెంటనే కార్యకాలపాలు ప్రారంభిస్తామని వారికి తెలియజేసింది. కార్యకలాపాలు ప్రారంభానికంటే ముందే ఏప్రిల్ నెల వేతనాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని సంస్థ సీఈవో భరోసా ఇచ్చారు. అలాగే, వచ్చే నెల నుంచి ప్రతీ నెలా మొదటి వారంలో వేతనాలను చెల్లించనున్నట్టు గోఫస్ట్ ఆపరేషన్స్ హెడ్ రంజింత్ రంజన్ ఉద్యోగులకు తెలిపారు. జెట్ ఎయిర్వేస్ కేసులో కన్సార్షియంకు ఊరట ఇదిలావుండగా, సేవలను నిలిపిచేసిన జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ దిశలో అప్పీలేట్ ట్రిబ్యునల్– ఎన్సీఎల్ఏటీ కీలక రూలింగ్ ఇచ్చింది. ఎయిర్వేస్ విజేత బిడ్డర్ జలాన్ కల్రాక్ కన్సార్షియం చెల్లింపు బాధ్యతలను నెరవేర్చడానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఇప్పటికే కన్సార్షియం అందించిన రూ. 175 కోట్ల ఫెర్మార్మెన్స్ బ్యాంక్ గ్యారెంటీని ఎన్‌క్యాష్ చేయవద్దని రుణదాతలను ఆదేశించింది. ఇప్పటికే రెండుసార్లు 2022 నవంబర్ 16, 2023 మార్చి 3వ తేదీల్లో కన్సార్షియం రుణ చెల్లింపుల కాలపరిమితిని రెండుసార్లు అప్పిలేట్ ట్రిబ్యునల్ పొడిగించింది. కేసు తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. కాగా, జెట్ ఎయిర్వేస్ కేసులో చెల్లించనున్న రూ. 150 కోట్ల పెర్ఫార్మెర్స్ బ్యాంక్ గ్యారెంటీలను ఎన్‌క్యాష్ చేయకుండా ప్రధాన రుణ దాత ఎస్బీఐని నిరోధించాలని కోరుతూ విన్నింగ్ బిడ్డర్ జలాన్ కల్రాక్ కన్సార్షియం దాఖలు చేసిన పటిషన్‌పై మే 30న ఉత్తర్వులు జారీ చేస్తామని అప్పీలేట్ ట్రిబ్యునల్ తెలిపింది. జెట్ ఎయిర్వేస్ కన్సార్షియం – రుణదాతల మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో అప్పీలేట్ ట్రిబ్యునల్ కీలక సూచనలు చేస్తూ పరిష్కార ప్రణాళికను అమలు చేయడానికి పరస్పరం సహకరించుకోవాలని రెండు పక్షాలనూ కోరింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్ 18న కార్యకలాపాలను నిలిపివేసింది. క్యారియర్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ జూన్ 2019లో ప్రారంభమైంది. 2021 జూన్‌లో కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించింది. అయితే, ప్రణాళిక ఇంకా అమలు కాలేదు. దీని ఫలితంగా క్యారియర్ భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడింది. -
మంచులా కరిగిన ఆస్తులు.. దివాళా తీసిన అత్యంత ధనవంతుడు!
వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారు. తాను దివాళా తీసినట్లు.. ప్రస్తుత ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేందుకు నిధులు కావాలని కోరుతూ యునైటెడ్ స్టేట్స్ దివాలా (bankruptcy court) కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరిలో రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన శాటిలైట్ లాంచ్ సంస్థ ‘వర్జిన్ ఆర్బిట్’ యూకే కేంద్రంగా ఆర్బిట్ (కక్ష్య)లోకి శాటిలైట్లను పంపేందుకు మాడిఫైడ్ 747 జెట్‌ను ఉపయోగించింది. బాహుబలి జెట్‌లో ‘స్టార్ట్ అప్ మీ’ పేరుతో లూనార్ వన్స్ అనే రాకెట్‌ను యూకేలోని కార్న్‌వాల్ ఎయిర్పోర్ట్ న్యూక్వే విమానాశ్రయం నుంచి ప్రయోగించారు. అతిపెద్ద పొడవైన సముద్ర ఆకాశ మార్గం నుంచి జెట్ లూనార్ వన్స్ రాకెట్‌ను విడుదల చేయగా.. అది కక్ష్యలోకి వెళితే ప్రయోగం విజయవంతం అవుతుంది. అలా లూనార్ వన్స్ ప్రయోగం ప్రారంభమైంది. కొద్ది సేపటికి లూనార్ వన్స్ రాకెట్ విజయవంతంగా కక్ష్యకు చేరుకుందంటూ వర్జిన్ ఆర్బిట్ ట్వీట్ చేసింది. అయితే అనూహ్యంగా అరగంట తర్వాత ప్రయోగం విఫలమైంది. ప్రయోగం రెండో దశలో ఉండగా రాకెట్ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో తొమ్మిది ఉపగ్రహాలు కక్ష్యను చేరుకోలేవని కంపెనీ ప్రకటించింది. 747 జెట్, దాని సిబ్బంది సురక్షితంగా తిరిగి వచ్చి నైరుతి ఇంగ్లాండ్‌లోని స్పేస్‌పోర్ట్ కార్న్‌వాల్‌లో దిగారు. ఈ ప్రయోగం విఫలం కావడంతో రిచర్డ్ బ్రాన్సన్ ఆస్తులు మంచులా కరిగిపోయాయి. గత వారం దాదాపు 85 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత ఆస్తులను విక్రయించాలని కోరుతున్నట్లు యుఎస్ దివాలా కోర్టులో కంపెనీ చేసిన దాఖలలో పేర్కొన్నట్లు రాయిటర్స్ నివేదించింది. వర్జిన్ ఆర్బిట్ సీఈఓ డాన్ హార్ట్ మాట్లాడుతూ ఆస్తుల విక్రయాన్ని ఖరారు చేయడమే ఉత్తమమైన మార్గమని అన్నారు. ప్రయోగం విఫలం కావడంతో తర్వాత నిధులను పొందడంలో కంపెనీ విఫలమైంది. వర్జిన్ ఆర్బిట్ మార్చి 15న తన కార్యకలాపాలను నిలిపి వేయాల్సి వచ్చింది. నగదును ఆదా చేసేందుకు ఉద్యోగులందరినీ తొలగించింది. రాకెట్ డిజైన్ మెరుగుదలపై దృష్టి సారించడానికి నిధుల కోసం ప్రయత్నించి విఫలమైంది. చదవండి👉 షాకింగ్ ఘటన: అందరూ చూస్తుండగానే అగ్నికి ఆహుతైన కారు! -
దివాలా పరిష్కారాలు అంతంతే
ముంబై: కంపెనీ చట్ట ట్రిబ్యునళ్లలో దాఖలైన దివాలా కేసులు ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికం(క్యూ3)లో అంతంతమాత్రంగానే పరిష్కారమయ్యాయి. వెరసి క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో దివాలా పరిష్కారాలు(రిజల్యూషన్లు) 15 శాతంగా నమోదయ్యాయి. ఇన్సాల్వెన్సీ, దివాలా బోర్డు(ఐబీబీఐ) గణాంకాల ప్రకారం 267 దివాలా కేసులలో 15 శాతమే రిజల్యూషన్ల స్థాయికి చేరాయి. ఇక క్లెయిమ్ చేసిన రుణాలలో 27 శాతమే రికవరీ అయినట్లు గణాంకాలు వెల్లడించాయి. 45 శాతం కేసులు లిక్విడేషన్ ద్వారా ముగిసినట్లు ఐబీబీఐ గణాంకాలను విశ్లేషించిన కొటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. త్రైమాసికవారీగా చూస్తే ఈ ఏడాది క్యూ2(జులై–సెప్టెంబర్)లో కేసులు 256కు దిగివచ్చాయి. 2019–20లో నమోదైన 2,000 కేసుల రన్‌రేట్‌తో పోలిస్తే భారీగా తగ్గాయి. కాగా.. ఎలాంటి రిజల్యూషన్ ప్రణాళికలు లభించకపోవడంతో లిక్విడేషన్లలో మూడో వంతు కేసులు ముగిసినట్లు కొటక్ విశ్లేషణ వెల్లడించింది. మొత్తం 1,901 కేసులు పరిష్కారంకాగా.. 1,229 కేసులు లిక్విడేషన్కే బ్యాంకర్లు ఓటేశారు. మరో 600 కేసులలో ఎలాంటి పరిష్కార ప్రణాళికలూ దాఖలు కాలేదు. 56 కేసుల విషయంలో నిబంధలకు అనుగుణంగాలేక తిరస్కరణకు గురికాగా.. 16 కేసుల్లో పరిష్కార ప్రొవిజన్లకు రుణదాతలు అనుమతించలేదు. ఇక లిక్విడేషన్ కేసులలో 76 శాతం కంపెనీ మూతపడటం లేదా ఆర్థిక పునర్వ్యవస్థీకరణ(బీఐఎఫ్ఆర్) వల్ల నమోదుకాగా.. మిగిలినవి ఇతర కారణాలతో జరిగినట్లు కొటక్ వివరించింది. కేసుల పరిష్కారం ఆలస్యమవుతున్నప్పటికీ 2021 క్యూ2 (కరోనా మహమ్మారి కాలం)తో పోలిస్తే తగ్గినట్లే. 270 రోజులకుపైగా ఈ ఏడాది క్యూ3లో దాఖలైన కేసులలో 64% 270 రోజులను దాటేశాయి. మరో 14% కేసులు నమోదై 180 రోజులైంది. వెరసి లిక్విడేషన్ కేసులు అధికమయ్యే వీలున్నట్లు కొటక్ విశ్లేషించింది. రుణ పరిష్కార సగటు 590 రోజులుగా తెలియజేసింది. కొత్త కేసుల విషయంలో 50 శాతంవరకూ నిర్వాహక రుణదాతలు చేపడుతుంటే, 40 శాతం ఫైనాన్షియల్ క్రెడిటర్లకు చేరడం క్యూ3లో కనిపిస్తున్న కొత్త ట్రెండుగా తెలియజేసింది. తాజా త్రైమాసికంలో దాఖౖ లెన కేసులలో 42 శాతం తయారీ రంగం నుంచికాగా, 18 శాతం రియల్టీ, 13 శాతం రిటైల్, హోల్‌సేల్ వాణిజ్యం, 7 శాతం నిర్మాణం నుంచి నమోదయ్యాయి. ఐబీసీ ప్రాసెస్ తొలి నాళ్లలో భారీ కార్పొరేట్ కేసులు అధికంగా నమోదుకాగా.. ప్రస్తుతం దేశీ కార్పొరేట్ పరిస్థితులు పటిష్ట స్థితికి చేరుతు న్నట్లు విశ్లేషణ పేర్కొంది. కొత్త కేసులలో కరోనా మహమ్మారి ప్రభావంపడిన మధ్య, చిన్నతరహా సంస్థల నుంచి నమోదవుతున్నట్లు తెలియజేసింది. ఐబీసీ ద్వారా మొత్తం రుణ పరిష్కార విలువ రూ. 8.3 లక్షల కోట్లకు చేరగా.. ఫైనాన్షియల్ క్రెడిటర్లు 73 శాతం హెయిర్‌కట్‌ను ఆమోదించాయి. -
దివాలా పరిష్కార ప్రక్రియ సమయం కుదింపు!
న్యూఢిల్లీ: దివాలా ఆస్తుల పరిష్కార ప్రక్రియను పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడం, తద్వారా ఆయా రుణ ఆస్తుల విలువ గణనీయమైన కోతను నిరోధించడం లక్ష్యంగా కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ దిశలో దివాలా చట్టాన్ని సవరించడానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దివాలా ఆస్తుల పరిష్కారానికి 2016లో అమల్లోకి వచ్చిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ)కు సవరణలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. బ్యాంకర్లు, న్యాయవాదులతో సహా సంబంధిత వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, రాబోయే వారాల్లో మార్పులు ఖరారు కావచ్చని తెలిపారు. ప్రస్తుతం ఇలా... ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) నుండి ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు అందిన గణాంకాల ప్రకారం, ఐబీసి కింద మొత్తం 553 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందుకు సగటు సమయం 473 రోజులు. ఒక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 57 కేసులు పరిష్కారం అయితే, ఇందుకు సగటు సమయం 679 రోజులు తీసుకుంది. 2021–22లో 143 కేసులు పరిష్కారం అయితే ఇందుకు పట్టిన సమయం 560 రోజులు. 2020–21లో 120 కేసులకు 468 రోజుల సమయం తీసుకోవడం జరిగింది. నిజానికి రిజల్యూషన్ ప్రాసెస్ కోసం ఐబీసీ కాలపరిమితి 330 రోజులు. లిటిగేషన్లో క్లిష్టతలుసహా పలు కారణాలతో దివాలా పరిష్కార పక్రియ కాలయాపన జరుగుతోంది. ఈ లోపాలు సవరించడానికి కేంద్రం తాజాగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. -
ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు, ‘ట్విటర్ దివాలా తీయొచ్చు..నేడో..రేపో’!
సీఈవో ఎలాన్ మస్క్ అనాలోచిత నిర్ణయాల వల్ల ట్విటర్ చిక్కుల్లో పడనుందా? మస్క్ కొనుగోలు తర్వాత ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్ పెయిడ్ వెరిఫికేషన్, ట్విటర్లో అడ్వటైజ్మెంట్స్ నిలిపివేసే సంస్థల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడం వంటి నిర్ణయాలతో ఆ సంస్థ దివాలా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఉద్యోగులతో మస్క్ చర్చించినట్లు సమాచారం. ఉద్యోగులతో మాట్లాడే సమయంలో ట్విటర్ సంస్థ దివాళా తీసే అవకాశం ఉందనే అంశాన్ని ఎలాన్ మస్క్ సైతం తోసిపుచ్చలేదంటూ బ్లూమ్‌బెర్గ్ సైతం నివేదించింది. అయితే అందుకు కారణం..మస్క్ 44 బిలియన్ డాలర్ల కొనుగోలు చేసిన రెండు వారాల తర్వాత ట్విటర్లో ఆర్ధిక అనిశ్చితి నెలకొందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సంస్థ ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు మస్క్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. బుధవారం ట్విటర్ ఎక్జిగ్యూటీవ్‌లు యోయెల్ రోత్ , రాబిన్ వీలర్‌తో నిర్వహించిన ట్విటర్ స్పేస్ చాట్‌లో మస్క్ ప్రకటనదారుల ఆందోళనలను తగ్గించడానికి ప్రయత్నించారని రాయిటర్స్ హైలెట్ చేసింది. దీనికి తోడు సంస్థ ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించే ట్విటర్ సీనియర్ ఉద్యోగులు ఒక్కొక్కరిగా వైదొలగడం చర్చాంశనీయంగా మారింది. ట్విటర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లీ కిస్నర్, చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కీరన్, చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ మరియాన్ ఫోగార్టీలు రాజీనామా చేయడంతో ట్విటర్ యాజమాన్యం ఆందోళనకు గురైందని, ఇలా ఉద్యోగుల రాజీనామాలతో ట్విటర్ దివాలా తీయడం ఖాయమంటూ మస్క్ ఉద్యోగులతో హెచ్చరించారు. ట్విటర్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే మరింత ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తెలిపింది. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది ఇటీవల కాలంలో ట్విటర్లో జరుగుతున్న వరుస పరిణామాలపై అమెరికా ప్రభుత్వ ఫెడరల్ ట్రేడ్ ఏజెన్సీ కమిషన్ (ఎఫ్‌టీసీ) స్పందించింది. ప్రభుత్వ న్యాయ చట్టాలను ధిక్కరిస్తూ కార్యకలాపాలు నిర్వహించే సంస్థల విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని’ఎఫ్‌టీసీ స్పష్టం చేసింది. ట్విటర్లో జరుగుతున్న పరిణామాల్ని ఎప్పటికపప్పుడు ట్రాక్ చేస్తున్నాం.‘ సీఈవోలు లేదా సంస్థలు చట్టానికి అతీతం కాదు. ఎఫ్‌టీసీ నిబంధనలు లోబడి పనిచేయాలి. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని’ ఎఫ్‌టీసీ పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ డగ్లస్ ఫర్రార్ రాయిటర్స్‌తో అన్నారు. మస్క్‌కి బయపడం మే నెలలో ట్విటర్ యూజర్ల ఫోన్నెంబర్లను దుర్వినియోగం చేసింది. భద్రతా కారణాల కోసం మాత్రమే సమాచారాన్ని సేకరించినట్లు వినియోగదారులకు తెలిపింది.అదే అంశంపై ఎఫ్‌టీసీ ట్విటర్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ట్విటర్ 150 మిలియన్ డాలర్లను ఎఫ్‌టీసీకి చెల్లించడానికి అంగీకరించింది. 150 మిలియన్ డాలర్ల చెల్లించేందుకు కొంత సమయం, సంస్థలోని పరిణామాలపై ఎఫ్‌టీసీ- ట్విటర్ మధ్య జరిగిన ఇంటర్నల్ మెయిల్స్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల ప్రకారం.. ఎలాన్ మస్క్ భారీ ఎత్తున నష్టపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ట్విటర్ లీగల్ చీఫ్ అలెక్స్ స్పిరో ఎఫ్‌టీసీ అటార్నీ జర్నల్ ఆల్డెన్ ఎఫ్ అబాట్ అన్నారు. అందుకు అటార్నీ ఎలాన్ మస్క్ అంతరిక్షంలోకి పంపియొచ్చు. కానీ అతనికి ఎఫ్‌టీసీ బయపడదు’ అని ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. స్పందించని ట్విటర్ గురువారం మధ్యాహ్నం ట్విట్టర్లో ఉద్యోగులందరితో నిర్వహించిన సమావేశంలో.. వచ్చే ఏడాది కంపెనీ బిలియన్ల డాలర్లను కోల్పోవచ్చని మస్క్ హెచ్చరించినట్లు సమాచారం. కాగా, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ట్విటర్ దివాలా తీసే అవకాశం, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ హెచ్చరికలు, ఉద్యోగుల రాజీనామాలపై ట్విటర్ స్పందించలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 మాయదారి ట్విటర్..మంచులా కరిగిపోతున్న ఎలాన్ మస్క్ సంపద! -
దివాలా సంస్థల్లో షేర్ హోల్డర్లకు రక్షణగా సెబీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న లిస్టెడ్ కంపెనీల షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను కాపాడటంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిర్దిష్ట ఫ్రేమ్‌వర్క్‌కు సంబంధించిన చర్చాపత్రాన్ని రూపొందించింది. కంపెనీని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చే రిజల్యూషన్ దరఖాస్తుదారుకు ఇచ్చే అవకాశాలనే మైనారిటీ షేర్హోల్డర్లకు కూడా కల్పించాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం కొత్త సంస్థలో కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ శాతాన్ని (ప్రస్తుతం 25 శాతం) కొనుగోలు చేసేందుకు ప్రస్తుత పబ్లిక్ ఈక్విటీ షేర్హోల్డర్లకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. రిజల్యూషన్ దరఖాస్తుదారు విషయంలో అంగీకరించిన ధరపరమైన నిబంధనలే వారికీ వర్తింపచేయాలని సూచించింది. దీనితో పాటు ఇతరత్రా పలు ప్రతిపాదనలున్న చర్చాపత్రంపై సంబంధిత వర్గాలు నవంబర్ 24లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
గాయత్రి ప్రాజెక్ట్స్‌పై దివాలా పిటిషన్
న్యూఢిల్లీ: భారీగా పేరుకుపోయిన బాకీలను రాబట్టుకునేందుకు ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) సంస్థ గాయత్రి ప్రాజెక్ట్స్‌పై కెనరా బ్యాంక్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తదుపరి విచారణను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అక్టోబర్ 10న (నేడు) చేపట్టనుంది. గాయత్రి ప్రాజెక్ట్స్ సంస్థ బ్యాంకులకు దాదాపు రూ. 6,000 కోట్లు బకాయిపడింది. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) అత్యధికంగా రుణాలిచ్చాయి. -
దివాలా అంచున స్విస్ బ్యాంక్?
2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభానికి ముసలం బ్యాంకింగ్ రంగంలోనే మొదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లేమాన్ బ్రదర్స్ దివాలా తీయడంతో స్టాక్ మార్కెట్లు పేక మేడల్లా కుప్పకూలాయి. ఇప్పుడు సరిగ్గా మళ్లీ అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగానికి అలాంటి షాక్ తగలబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అనేక సమస్యలతో సతమతమవుతున్న స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్విస్... క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ స్వయంగా దాని సీఈఓ వెల్లడించడంతో దివాలా తీయొచ్చంటూ గగ్గోలు మొదలైంది. న్యూయార్క్: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్వీస్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సంస్థ సీఈవో ఉల్రిచ్ కోర్నర్ పేర్కొన్నారు. దీంతో తాజా పునర్వ్యస్థీకరణ చర్యలకు తెరతీయనున్నట్లు సిబ్బందికి రాసిన లేఖలో వెల్లడించారు. తద్వారా తగిన చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే బ్యాంక్ పటిష్టంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. బ్యాంకు షేరు పతనాన్ని చూసి కలత చెందొద్దని కూడా సిబ్బందికి సూచించారు. పటిష్ట స్థాయిలో మూలధన బేస్‌తోపాటు లిక్విడిటీ కూడా బాగానే ఉందని సీఈవో వివరించారు. అయితే, ఒకపక్క బ్యాంకు షేరు రోజుకో ఆల్‌టైమ్ కనిష్టాన్ని తాకుతుండటం... దివాలా వదంతుల నేపథ్యంలో ఉల్రిచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల (అక్టోబర్) 27న బ్యాంక్ చేపట్టనున్న వ్యూహాత్మక సమీక్ష ఫలితాలు వెలువడేవరకూ సిబ్బందికి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేందుకు నిర్ణయించుకున్నట్లు సీఈవో లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మీడియాలో ఊహాగానాలకు స్పందించకుండా క్లయింట్లకు సేవలందించడంపై దృష్టిపెట్టాలని కూడా తమ సిబ్బందికి ఉల్రిచ్ సూచించినట్లు సమాచారం. కాగా, బ్యాంకు ఈ నెల 27న మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనుంది. మూడు ముక్కలు... మూడేళ్లుగా వెలుగుచూస్తున్న రకరకాల స్కామ్‌లు... క్రెడిట్ స్విస్‌ను అతలాకుతం చేశాయి. మరోపక్క, యూరప్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం సెగలు, వడ్డీరేట్ల పెంపు ప్రభావం కూడా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో క్రెడిట్ స్విస్ గ్రూపును మూడు సంస్థలుగా విడదీసేందుకు బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది. లాభదాయకంగా ఉన్న యూనిట్లను విక్రయించాలనేది బ్యాంకు యోచన. ప్రతిపాదనల ప్రకారం అడ్వయిజరీ బిజినెస్, అధిక ఒత్తిడిలోగల ఆస్తుల (హైరిస్క్ రుణాల)తో బ్యాడ్ బ్యాంక్‌లను విడదీయనుంది. వీటిని మినహాయించగా మిగిలిన బిజినెస్‌లతో మరో సంస్థ ఏర్పాటు కానుంది. అయితే ఈ అంశాలపై క్రెడిట్ స్వీస్ స్పందించకపోవడం గమనార్హం! ఇదీ నేపథ్యం... స్విట్జర్లాండ్‌లోని రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన క్రెడిట్ స్విస్ గత మూడేళ్లలో రహస్య (స్పైయింగ్) కార్పొరేట్ కుంభకోణం, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల మూసివేత, రికార్డ్ ట్రేడింగ్ నష్టాలు, న్యాయపరమైన వ్యాజ్యాల పరంపర వంటి పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. దీంతో బ్యాంక్ చైర్మన్ యాక్సెల్ లేమన్ వేసవిలో ఉల్రిచ్ కోర్నర్ను సీఈవోగా ఎంపిక చేసి బ్యాంకును గాడిలోపెట్టే బాధ్యతలు అప్పగించారు. బ్యాంక్ నిర్వహణలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టేందుకు అనుమతించారు. కాగా.. ఈ నెల మొదట్లో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 5,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇన్వెస్టర్లలో వణుకు..! గత కొద్ది నెలలుగా క్రెడిట్ స్విస్ ఎదుర్కొంటున్న సవాళ్లతో బ్యాంకు షేరు కుప్పకూలుతూ వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో 9 డాలర్లుగా ఉన్న షేరు ధర తాజాగా సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి (3.9 డాలర్లు) దిగజారింది. మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కాగా, సీఈఓ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బ్యాంక్ దివాలా తీయనుందంటూ ట్విటర్లో మారుమోగుతోంది. అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను ఎడాపెడా పెంచడంతో మాంద్యం భయాలు వెంటాడుతున్న తరుణంలో క్రెడిట్ స్విస్ దివాలా వార్తలు ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే జరిగితే మార్కెట్ సెంటిమెంట్ మరింత బలహీనపడొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు ఎలా స్పందిస్తాయోన్న ఉత్కంట సర్వత్రా నెలకొంది. -
రియల్ ఎస్టేట్ కంపెనీల దివాలా, కంటిమీద కునుకు లేని చైనా
రుణాల ఎగవేతలో చైనా రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటీలు పడుతున్నాయి. మొత్తం మీద పాతిక్కి పైగా కంపెనీలు తాము జారీ చేసిన బాండ్లకు చెల్లింపులు చేయకుండా చేతులెత్తేసినట్లు సమాచారం. మరి కొన్ని కంపెనీలు అనుకున్న షెడ్యూల్ సమయానికి ఇవ్వకుండా నాన్చి ఆలస్యంగా చెల్లింపులు చేశాయి. దీంతో వినియోగదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. షాంఘైకి చెందిన షిమో గ్రూప్ రియల్ కంపెనీ బిలియన్ డాలర్ల విలువ జేసే బాండ్లకు వడ్డీయే కాదు అసలు కూడా ఎగ్గొట్టింది. (చైనాలో ఇంత దారుణంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది?) చైనాలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన షిమోయే ఇలా ఎగ్గొడితే ఇక చిన్నా చితకా రియల్ కంపెనీల సంగతేంటి? అని ఆర్ధిక రంగ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కంపెనీకు 5.5 బిలియన్ డాలర్ల మేరకు విదేశీ అప్పులూ ఉన్నాయి. ఎవర్ గ్రాండే సంక్షోభం వెలుగులోకి వచ్చిన తర్వాత జింగ్ పింగ్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఆంక్షలను కఠిన తరం చేయడంతో చాలా రియల్ కంపెనీలు దివాళా దిశగా పయనిస్తున్నాయి. జిన్ పింగ్ చైనా అధ్యక్షుడు అయ్యాక దేశంలో రియల్ ఎస్టేట్ రంగం వాయు వేగంతో పెరిగిపోయింది. ఏకంగా 600 శాతం మేరకు పెరిగిపోయింది. దీనికి కారణం మితిమీరిన ప్రమోషన్లే. ఆకర్షణీయమైన వెంచర్లను ప్లాన్ చేస్తూ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆశ్రయించడం ద్వారా పెద్ద మొత్తంలో అప్పులు సమీకరిస్తోన్న రియల్ వ్యాపారులు తమ ఇళ్లు అమ్ముడు పోక తమకు రావల్సిన డబ్బులు చేతికి రాక పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చెల్లించలేక నిర్దాక్షిణ్యంగా బోర్డులు తిప్పేస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ పెట్టుబడి దారులూ నష్టపోవలసి వస్తోంది. నిజానికి 1998 వరకు చైనాలో ఇళ్ల విక్రయాలపై కఠిన నిబంధనలు అమల్లో ఉండేవి. అప్పట్లో మూడింట ఒక వంతు మాత్రమే నగరాల్లో ఉండేవారు. ఆ తర్వాత నిబంధనలు సరళీకృతం చేయడంతో నగరీకరణ వేగం పుంజుకుంది. రియల్ ఎస్టేట్ రంగంలో చోటుచేసుకున్న సంక్షోభం చైనా పాలకులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎందుకంటే రియల్ వ్యాపారం ఢమాల్ మంటే అది చైనా ఆర్ధిక వ్యవస్థనే కుప్పకూల్చే ప్రమాదం ఉంటుంది. (ఇంకా ఉంది..పడిపోతున్న ప్రాపర్టీ మార్కెట్‌ను రక్షించే ప్రయత్నాల్లో "బిల్డ్, పాజ్.. డిమాలిష్..రిపీట్ " విధానాన్ని అవలంబించిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వరస కథనాలు ) -
సీఈఎల్ విక్రయానికి బ్రేక్
న్యూఢిల్లీ: సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(సీఈఎల్) విక్రయాన్ని తాజాగా ప్రభుత్వం రద్దు చేసింది. కంపెనీ కొనుగోలుకి బిడ్ చేసిన నండల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ డిజిన్వెస్ట్‌మెంట్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే దీనికి కారణమని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. నండల్ ఫైనాన్స్‌పై ఎన్సీఎల్టీలో దివాలా కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని బిడ్డర్ తెలియజేయకపోవడంతో రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాఖ(డీఎస్ఐఆర్)కు చెందిన సీఈఎల్‌ను ఢిల్లీ సంస్థ నండల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్‌కు విక్రయించేందుకు అనుమతించింది. డీల్ విలువ రూ. 210 కోట్లుకాగా.. బిడ్డింగ్ సమయంలో ఎన్సీఎల్టీ కేసు వివరాలను నండల్ ఫైనాన్స్ వెల్లడించలేనట్లు ప్రభుత్వ అధికారి తెలియజేశారు. కాగా.. మరోపక్క పవన్ హన్స్లో వ్యూహాత్మక విక్రయ అంశంపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కొనుగోలుకి గెలుపొందిన బిడ్డర్లలో ఒకటైన అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ ఫండ్ ఎస్‌పీసీపై ఎన్సీఎల్టీ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసు వివరాలపై అప్పటికి స్పష్టత రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్
న్యూఢిల్లీ: వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేకపోవడంతో మరో స్టార్టప్ సంస్థ మూత బడింది. టెక్ దిగ్గజం నందన్ నీలేకని ఇన్వెస్ట్ చేసిన షాప్‌ఎక్స్ కార్యకలాపాలు నిలిపి వేసింది. బెంగళూరుకు చెందిన షాప్‌ఎక్స్ ఈ మేరకు దివాలా పిటీషన్ దాఖలు చేసింది. దివాలా (ఐబిసి) కోడ్, 2016 సెక్షన్ 10 ప్రకారం దివాలా కోసం దరఖాస్తు చేసినట్టు కంపెనీ కార్పొరేట్ మంత్రిత్వ శాఖ (MCA) ఫైలింగ్‌లో తెలిపింది. అత్యంత స్వల్ప మార్జిన్ల వల్ల వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ ఏడాది ఇప్పటికే ఎడ్టెక్ స్టార్టప్‌లు క్రెజోడాట్ఫన్, సూపర్లెర్న్, ప్రోటాన్ తదితర స్టార్టప్‌లు మూతబడ్డాయి. కిరాణా స్టోర్స్, ఇతర చిన్న తరహా రిటైలర్లకు లాజిస్టిక్స్, కొనుగోళ్లపరమైన సహకారం అందించేందుకు 2014లో అమిత్ శర్మ, అపూర్వ జోయిస్ కలిసి షాప్‌ఎక్స్ ఏర్పాటు చేశారు. నందన్ నీలేకనితో పాటు ఫంగ్ స్ట్రాటెజిక్ హోల్డింగ్స్, రాజేశ్ రణావత్, కేవల్ నోరియా తదితర ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ 2020 నాటికి 60 మిలియన్ డాలర్లు సమీకరించింది. తీవ్రమైన పోటీతో తరచూ వ్యాపార వ్యూహాలను మార్చుకున్నప్పటికీ మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది. నిధుల కొరత కారణంగా తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైంది. . షాప్‌ఎక్స్ -
మూతబడిన మరో స్టార్టప్.. షాప్‌ఎక్స్
న్యూఢిల్లీ: వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేకపోవడంతో మరో స్టార్టప్ సంస్థ మూతబడింది. టెక్ దిగ్గజం నందన్ నీలేకని ఇన్వెస్ట్ చేసిన షాప్‌ఎక్స్ కార్యకలాపాలు నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నాయి. అత్యంత స్వల్ప మార్జిన్ల వల్ల వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. ఈ ఏడాది ఇప్పటికే ఎడ్టెక్ స్టార్టప్‌లు క్రెజోడాట్ఫన్, సూపర్లెర్న్, ప్రోటాన్ తదితర స్టార్టప్‌లు మూతబడ్డాయి. కిరాణా స్టోర్స్, ఇతర చిన్న తరహా రిటైలర్లకు లాజిస్టిక్స్, కొనుగోళ్లపరమైన సహకారం అందించేందుకు 2014లో అమిత్ శర్మ, అపూర్వ జోయిస్ కలిసి షాప్‌ఎక్స్ ఏర్పాటు చేశారు. నందన్ నీలేకనితో పాటు ఫంగ్ స్ట్రాటెజిక్ హోల్డింగ్స్, రాజేశ్ రణావత్, కేవల్ నోరియా తదితర ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ 2020 నాటికి 60 మిలియన్ డాలర్లు సమీకరించింది. తీవ్రమైన పోటీతో తరచూ వ్యాపార వ్యూహాలను మార్చుకున్నప్పటికీ మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది. నిధుల కొరత కారణంగా తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైంది. -
గ్లోబల్ డ్రీమ్ క్రూయిజ్ షిప్.. టైటానిక్ కంటే దారుణంగా..
వందేళ్ల కిందట టైటానిక్ షిప్ ప్రపంచంలోనే అతి పెద్ద పడవగా రికార్డు సృష్టించింది. కానీ తొలి ప్రయాణం మధ్యలోనే సముద్రంలో ఓ మంచు పర్వతాన్ని ఢీ కొట్టి మునిగిపోయింది. తాజాగా వరల్డ్ రికార్డు సాధించే దిశగా మరో భారీ షిప్‌ను నిర్మించడం మొదలెట్టారు. అయితే తొలి ప్రయాణం చేయడానికి ముందే ఈ భారీ నౌక కూడా అప్పుల భారంలో మునిగి నామ రూపల్లేకుండా కనుమరుగు కానుంది. జర్మనీకి చెందిన వెర్ఫ్‌టెన్ సంస్థ గ్లోబల్ డ్రీమ్ పేరుతో భారీ నౌకలను తయారు చేస్తోంది. ఇందులో గ్లోబల్ డ్రీమ్ 1 పూర్తిగా సిద్ధం అవగా దాన్ని కంటే పెద్దదిగా గ్లోబల్ డ్రీమ్ 2 నిర్మాణ పనులు గత కొన్నేళ్లుగా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పడవలో ఏకకాలంలో 9,000ల మంది ప్రయాణించేంత పెద్దగా దీని నిర్మాణం మొదలు పెట్టారు. ప్రపంచ రికార్డు లక్ష్యంగా ఎక్కడగా వెనక్కి తగ్గలేదు. బ్యాంకుల నుంచి ఎడాపెడా రుణాలు తీసుకున్నారు. కరోనా కాటు షిప్ నిర్మాణం సగం పూర్తైన తర్వాత ప్రపంచాన్ని కరోనా సంక్షోభం చుట్టేసింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడిన తర్వాత షిప్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే కరోనా తెచ్చిన కష్టాల కారణంగా ప్రస్తుతం జనం సాధారణ జీవితానికి అలవాటుపడ్డా ఇంకా జనాల్లో పూర్తిగా కలిసేందుకు జంకుతున్నారు. దీంతో గ్లోబల్ డ్రీమ్ వంటి భారీ క్రూయిజ్షిప్లకు డిమాండ్ అస్సలు లేకుండా పోయింది. దివాళా కరోనాకి ముందు మేం కొంటామంటే మేం కొంటామంటూ ముందుకు వచ్చిన కంపెనీలు ఆ తర్వాత పత్తాలేకుండా మాయం అయ్యాయి. దీంతో వెర్ఫ్‌టెన్ సంస్థ దిక్కు తోచని స్థితిలో పడింది. ఓవైపు నిర్మాణం పూర్తి చేసుకుని అమ్ముడుపోని షిప్ మరోవైపు అప్పులిచ్చిన బ్యాంకుల నుంచి ఒత్తిడి. చివరకు ఒత్తిడి తట్టులోకే తాను దివాళా తీస్తున్నట్టు వెర్ఫ్‌టెన్ కంపెనీ 2022 జనవరిలో ప్రకటించింది. అడ్డుగా డ్రీమ్‌లైనర్ దివాళా ప్రక్రియ మొదలైన తర్వాత వెర్ఫ్‌టెన్‌కి చెందిన నౌకల తయారీ కర్మాగారాన్ని తైసన్క్రూప్ అనే నావల్ యూనిట్ దక్కించుకుంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం యుద్ధ నౌకలకు డిమాండ్ పెరిగింది. దీంతో వెర్ఫ్‌టెన్‌కి చెందిన షిప్‌యార్డులో యుద్ధ నౌకలు 2024 నుంచి తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గ మార్పులు షిప్‌యార్డులో చేయాల్సి వచ్చింది. అయితే అందుకు అడ్డుగా ఆ షిప్‌యార్డులో అమ్ముడుపోని గ్లోబల్ డ్రీమ్ 2 క్రూయిజ్ షిప్ ఉంది. చివరికి తుక్కే దిక్కు వెర్ఫ్‌టెన్‌కి అప్పులిచ్చిన బ్యాంకులు గ్లోబల్ డ్రీమ్ 2ను వేలం పాటలో వేసినా కొనేందుకు ఏ కంపెనీ ముందుకు రాలేదు. మరోవైపు యుద్ధ నౌకల కోసం ఈ షిప్‌యార్డులో మార్పులు చేయాల్సి వస్తోంది. దీంతో అమ్ముడుపోని భారీ క్రూయిజ్ షిప్‌ని కనీసం తుక్కుగా అయినా అమ్మేయాలనే ప్లాన్‌లో ఉన్నాయి బ్యాంకులు. కల్లలైన కలలు వేలకోట్లు పోసి అత్యాధుని సౌకర్యాలతో విలాసవంతంగా తయారైన గ్లోబల్ డ్రీమ్ 2 చివరకు తన కలల ప్రయాణం ప్రారంభించకుండానే అప్పులు ఊబిలో కూరుకుపోయి తుక్కుగా మారనుంది. చదవండి: స్టార్టప్‌లకు గడ్డుకాలం.. ఉద్యోగాలన్నీ హుష్ కాకి.. -
బోరిస్ బెకర్‌కు జైలుశిక్ష
లండన్: దివాలా కేసులో జర్మనీ టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్‌కు రెండున్నరేళ్ల జైలుశిక్ష విధించారు. 54 ఏళ్ల బెకర్ తన దగ్గర రుణ చెల్లింపులకు ఏమీ లేదని, దివాలా తీశానని ప్రకటించి... ఉన్న ఆస్తిపాస్తుల్ని దాచి, అక్రమంగా పెద్దమొత్తంలో నగదు బదిలీ చేశాడు. దీనిపై విచారించిన లండన్ కోర్టు దివాలా చట్టం ప్రకారం శిక్ష విధించింది. మొత్తం నాలుగు కేసులకి సంబంధించి గరిష్టంగా ఏడేళ్లదాకా జైలుశిక్ష విధించే అవకాశముంది. అయితే వాదోపవాదాల అనంతరం రెండున్నరేళ్ల శిక్షను ఖరారు చేసింది. జర్మనీలోని బ్యాంక్‌కు 50 లక్షల డాలర్ల (రూ.38.25 కోట్లు) రుణాన్ని చెల్లించకుండా అనైతిక పద్ధతిలో బోరిస్ బెకర్ దివాలా పిటిషన్‌తో బయటపడాలని చూశాడు. 2012 నుంచి బ్రిటన్‌లో నివసిస్తున్న బెకర్ మొత్తం ఆరు (వింబుల్డన్ –1985, 1986, 1989; ఆస్ట్రేలియన్ ఓపెన్–1991, 1996; యూఎస్ ఓపెన్–1989) గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. -
ఫ్యూచర్ రిటైల్‌పై బీవోఐ దివాలా అస్త్రం
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్‌పై బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) దివాలా అస్త్రం ప్రయోగించింది. దివాలా చర్యలు ప్రారంభించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో పిటిషన్ దాఖలు చేసింది. విజయ్ కుమార్ వీ అయ్యర్‌ను ఫ్యూచర్ రిటైల్ సంస్థ ఐఆర్పీ (మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్/లిక్విడేటర్)గా నియమించాలని ఎన్సీఎల్టీని బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యర్థించింది. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో కొనసాగుతున్న వ్యాజ్యాలు, సంబంధిత ఇతర సమస్యల కారణం గా ఈ నెల ప్రారంభంలో ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్‌ఎల్‌ఆర్) తన రుణదాతలకు రూ. 5,322.32 కోట్లు చెల్లించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో దివాలా కోడ్, 2016లోని 7వ సెక్షన్ కింద రుణ దాతల కన్షార్షియంకు నేతృత్వం వహిస్తున్న బీవోఐ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. తాను పిటిషన్ కాపీని అందుకున్నానని, న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటామని ఫ్యూచర్ గ్రూప్ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. వార్తా పత్రికల్లో ఇప్పటికే నోటీసులు.. బీవోఐ గత నెల వార్తా పత్రికలలో ఒక పబ్లిక్ నోటీసు జారీ చేస్తూ, ఫ్యూచర్ రిటైల్ ఆస్తులపై తన క్లెయిమ్‌ను ప్రకటించింది. కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఆస్తులతో లావాదేవీలు జరపరాదని ఈ ప్రకటన ద్వారా హెచ్చరించింది. 2020 ఆగస్టులో ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించిన రూ.24,713 కోట్ల డీల్‌లో ఫ్యూచర్ రిటైల్ ఒక భాగం. ఈ డీల్‌లో భాగంగా రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 19 కంపెనీలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)కు విక్రయిస్తున్నట్లు గ్రూప్ ప్రకటించింది. ఈ ఒప్పంద ప్రతిపాదన ప్రకారం, 19 కంపెనీలు అన్నీ కలిసి ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక్క ఒక్క కంపెనీగా విలీనమై తదుపరి ఆర్ఆర్వీఎల్లకు బదిలీ అవుతాయి. 20 నుంచి సమావేశాలపై ఉత్కంఠ కాగా, రిలయన్స్‌తో డీల్ ఆమోదం కోసం 2022 ఏప్రిల్ 20–23 తేదీల మధ్య ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలు తమ సంబంధిత వాటాదారులు రుణదాతలతో సమావేశాలను నిర్వహిస్తుండడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఈ డీల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెజాన్ ఈ సమావేశాల నిర్వహణను తీవ్రంగా తప్పు బడుతుండడమే దీనికి కారణం. -
ఎంత దా’రుణ’మో.. నష్టాల ఊబిలో జయలక్ష్మి సొసైటీ
కాకినాడ రూరల్(కాకినాడ జిల్లా): ఆకర్షణీయమైన వడ్డీల మోజులో పడి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పొదుపు చేసుకున్న సొమ్ములను జయలక్ష్మి ఎంఏఎం కో ఆపరేటివ్ సొసైటీలో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) చేసుకున్న సభ్యులు.. నేడు సొసైటీ దివాళా దశకు చేరిందని తెలిసి లబోదిబోమంటున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద ప్రధాన బ్రాంచితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 29 బ్రాంచిలు కలిగిన జయలక్ష్మి సొసైటీ నష్టాల ఊబిలో చిక్కుకున్నట్టు తేటతెల్లమవుతోంది. సుమారు 19,911 మంది సభ్యులు కలిగిన ఈ సొసైటీ అన్ని శాఖల్లో సుమారు 10 వేల మంది వరకూ తమ సొమ్ములను ఎఫ్డీలు గాను, నెలవారీ వడ్డీలకు గాను డిపాజిట్ చేసుకున్నారు. అయితే రెండు నెలలుగా సొమ్ములను డిపాజిట్ చేసుకుంటున్న సొసైటీ ఉద్యోగులు.. గడువు ముగిసినా బాండ్లకు చెల్లింపులు మాత్రం జరపలేదు. దీంతో సుమారు రూ.520 కోట్ల డిపాజిట్ల సొమ్ముల విషయం ప్రశ్నార్థకమైంది. పోలీసులకు ఫిర్యాదు తొలుత పిఠాపురం బ్రాంచి నుంచి ఈ వ్యవహారం బయటకు రాగా, ఇప్పుడు అన్ని బ్రాంచిల పరిధిలోని డిపాజిటర్లు తమ సొమ్ములపై భయాందోళన చెందుతున్నారు. సర్పవరం జంక్షన్‌లోని ప్రధాన బ్రాంచి వద్ద రెండో రోజైన గురువారం కూడా డిపాజిటర్లు భారీగా క్యూ కట్టారు. జయలక్ష్మి సొసైటీ పాలకవర్గం అందుబాటులో లేకపోగా.. మీడియాలో కథనాల నేపథ్యంలో తరలిస్తున్న సభ్యులకు సమాధానం చెప్పేవారు కూడా లేకుండా పోయారు. సొసైటీలో కీలక అధికారిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తుండడంతో తాళాలు కూడా తెరవలేదు. సుమారు 200 మంది డిపాజిటర్లు కాకినాడ టూ టౌన్ పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు సొసైటీ ఉద్యోగి సుధాకర్ ఫిర్యాదు నేపథ్యంలో డీసీఓ ఆదేశాల మేరకు తొలి రోజు రికార్డుల తనిఖీ ప్రారంభించిన ముగ్గురు సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు.. గురువారం ఉదయం నుంచీ తాళాలు తెరకవపోడంతో మూడు గంటల పాటు బయటే వేచి ఉన్నారు. ఆ తరువాత పోలీసులు అదుపులో ఉన్న ఉద్యోగి వచ్చి తాళం తీయడంతో రికార్డులు పరిశీలించారు. తొలి రోజు రికార్డులు పరిశీలించిన అసిస్టెంట్ రిజిస్ట్రార్లు జవహర్, లక్ష్మి, ఉమా శంకర్‌లతో పాటు రెండో రోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన డిప్యూటీ రిజిస్ట్రార్ కృష్ణకాంత్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు రికార్డుల పరిశీలనలో పాల్గొన్నారు. నష్టాలకు అనేక కారణాలు మ్యాక్స్ చట్టం–95 ప్రకారం స్వయంప్రతిపత్తి కలిగిన జయలక్ష్మి సొసైటీని సభ్యులు, పాలకవర్గమే నిర్వహించుకోవాల్సి ఉంది. దీనిలో ఇతరుల జోక్యం లేదు. దాదాపు 23 ఏళ్ల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సొసైటీలో వేలాది మంది సభ్యులు ఉన్నారు. ఆకర్షణీయమైన వడ్డీల పేరుతో డిపాజిట్లు సేకరించడంతో సుమారు 10 వేల మంది వరకూ ఎఫ్డీలు చేశారు. ఆ సొమ్ములకు 12.5 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలంటే అంతకంటే ఎక్కువగా వ్యాపారం చేయాల్సి ఉంది. ఇది అధిక వడ్డీకి రుణాలు ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది. ఇక్కడే సొసైటీ నష్టాలకు బీజం పడినట్టు తెలుస్తోంది. సుమారు రూ.520 కోట్ల వరకూ వివిధ రూపాల్లో రుణాలు ఇవ్వడం, అవి సకాలంలో రికవరీ కాకపోవడం సొసైటీని నష్టాల ఊబిలోకి నెట్టింది. తగిన సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వడంతో వాటి వసూళ్లు కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే చార్టర్డ్ అకౌంటెన్సీ కంపెనీ, కన్సల్టెన్సీ వైఫల్యం సొసైటీని ముంచిందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. రికార్డులు తనిఖీ చేస్తున్న అధికారులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. సొసైటీ పాలకవర్గాన్ని ముందుగా హెచ్చరించి ఉంటే అన్ సెక్యూర్డ్ రుణాలు ఇచ్చేవారు కాదని అంటున్నారు. ఇదిలా ఉండగా జయలక్ష్మి సొసైటీ డిపాజిటర్లకు ఏవిధంగా న్యాయం చేయాలనే అంశాన్ని అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. సొసైటీ ఆస్తులు, నగదును తమ అ«దీనంలోకి తీసుకుని డిపాజిటర్లకు చెల్లించేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఆందోళనగా ఉంది దివాలా తీస్తుందని ప్రచారం ఉండడంతో జయలక్ష్మి సొసైటీలో దాచుకున్న సుమారు రూ.35 లక్షల డిపాజిట్లపై మా కుటుంబం ఆందోళనలో ఉంది. ప్రభుత్వం న్యాయం చేయాలి. – మాదిరెడ్డి ఉమామహేశ్వరరావు, డిపాజిటర్, కాకినాడ వారం క్రితమే గాంధీ నగర్ బ్రాంచిలో డిపాజిట్ ఎక్కువ వడ్డీ వస్తుందని, నెల వారీగా తీసుకునేందుకు మార్చి 29న గాంధీ నగర్ బ్రాంచిలో రూ.1.5 లక్షలు డిపాజిట్ చేశాను. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కూడబెట్టిన సొమ్మును ఆ బ్రాంచి ఉద్యోగులు చెప్పడంతోనే ఎస్బీఐ నుంచి తీసుకుని ఇక్కడ పొదుపు చేశాను. ఇప్పుడు బోర్డు దిప్పే దశలో ఉండడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను. – గన్నవరపు గిరికుమార్, సాఫ్్టవేర్ ఉద్యోగి, కాకినాడ -
‘జీ’పై ఎన్సీఎల్టీకి ఇండస్ఇండ్ బ్యాంక్
న్యూఢిల్లీ: రుణాల డిఫాల్ట్ కేసులో మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)పై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఇండస్ఇండ్ బ్యాంక్ ఆశ్రయించింది. జీఎల్ రూ. 83.08 కోట్లు డిఫాల్ట్ అయినట్లు పేర్కొంది. దీనిపై ముంబైలోని ఎన్సీఎల్టీకి ఇండస్ఇండ్ బ్యాంక్ దరఖాస్తు సమర్పించినట్లు జీల్ వెల్లడించింది. ఎస్సెల్ గ్రూప్ సంస్థ సిటీ నెట్వర్క్స్ పొందిన రుణానికి సంబంధించి బ్యాంకు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వివరించింది. అయితే, ఈ కేసుపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోందని, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా బ్యాంకు చర్యలు ప్రారంభించిందని జీల్ పేర్కొంది. దీనిపై న్యాయపరంగా తగు చర్యలు తీసుకుంటామని వివరించింది. దివాలా కోడ్‌లోని (ఐబీసీ) సెక్షన్ 7 ప్రకారం రూ. 1 కోటికి పైగా రుణాలను ఎగవేసిన సంస్థలపై సీఐఆర్‌పీ కింద చర్యలు తీసుకోవాలంటూ రుణదాతలు .. కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. గతేడాది డిసెంబర్ 22న సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్తో జీల్ విలీనమైన సంగతి తెలిసిందే. -
అనిల్ అగర్వాల్ చేజారిన వీడియోకాన్!
న్యూఢిల్లీ: దివాలా తీసిన వీడియోకాన్ ఇండస్ట్రీస్‌ను ‘అతి తక్కువ ధరకు’ కొనుగోలు చేయాలన్న బిలియనీర్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని ట్విన్ స్టార్ టెక్నాలజీస్ ప్రయత్నం నెరవేరలేదు. ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాఖలు చేసిన బిడ్స్‌ను ఆమోదిస్తూ ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను దివాలా వ్యవహారాల అప్పీల్స్ కోర్టు– ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్) బుధవారం కొట్టివేసింది. దీంతో తాజా బిడ్స్ ఆహ్వానానికి కమిటీ ఆఫ్ క్రెడిటార్స్‌కు (సీఓసీ) తగిన వెసులుబాటు లభించింది. మొదటి నుంచీ అనిశ్చితే..! నిజానికి ట్విన్ స్టార్ టెక్నాలజీస్ బిడ్‌కు తొలుత సరేనన్న క్రెడిటార్స్ కమిటీ (సీఓసీ) తరువాత యూ టర్న్ తీసుకుంది. 13 కంపెనీల వీడియోకాన్ గ్రూప్ కొనుగోలుకు తాజా బిడ్స్‌ను ఆహ్వానించడానికి అనుమతించాలని కోరుతూ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని క్రెడిటార్స్ కమిటీ దివాలా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. ఇందుకు అనుగుణంగా తిరిగి ఈ అంశాన్ని పునఃబిడ్డింగ్‌కు వీలుగా క్రెడిటార్స్ కమిటీకి తిప్పి పంపాలని కోరింది. కన్జూమర్ డ్యూరబుల్ సంస్థ వీడియోకాన్ ఇండస్ట్రీస్ కొనుగోలుకు ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాఖలుచేసిన రిజల్యూషన్ బిడ్ ప్రకారం, మొత్తం రుణాల్లో కేవలం 5 శాతమే తమకు లభిస్తుండడమే తాజా బిడ్స్ కోరడానికి కారణమని అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు తెలిపింది. వీడియోకాన్ చెల్లించాల్సింది దాదాపు రూ.64,839 కోట్లయితే ఆ కంపెనీ కొనుగోలుకు బిలియనీర్ అగర్వాల్‌కు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ కేవలం రూ.2,962 కోట్లు ఆఫర్ చేసింది. వీడియోకాన్‌కు రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని సంస్థలకు 94.98 శాతం వోటింగ్‌కు ప్రాతినిధ్యం ఉంది. ఇందులో ఒక్క ఎస్బీఐ ప్రాతినిధ్య వోటు 18.05 శాతం. ట్విన్ స్టార్ టెక్నాలజీస్ రూ.2,962 కోట్ల బిడ్‌కు జూన్ 9న ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ ఆమోదం సందర్భంగా ఈ బిడ్ అతి తక్కువగా ఉందని, దీనివల్ల క్రెడిటార్‌కు ఒరిగిదేమీ ఉండదని, ట్విన్ స్టార్ టెక్నాలజీస్ చెల్లించేది నామమాత్రమని కూడా ఎన్సీఎల్టీ బెంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ రిజల్యూషన్ ప్రణాళికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇరువురు క్రెడిటార్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (1.97 వోటింగ్ షేర్), ఐఎఫ్సీఐ లిమిటెడ్ (1.03 శాతం వోటింగ్షేర్) గత ఏడాది జూన్ 19న అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనితో ఎన్సీఎల్టీ ఉత్తర్వుపై అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే విధించింది. యథాతథ పరిస్థితి కొనసాగింపునకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే ఎత్తివేయాలని కోరుతూ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆగస్టు 13న ట్విన్‌స్టార్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తన రిజల్యూషన్ ప్రణాళికను తొలత ఆమోదించి తరువాత యూ టార్న్ తీసుకోవడం సమంజసం కాదన్నది ట్విన్‌స్టార్ టెక్నాలజీస్ వాదన. టెలికం శాఖ, ధూత్ నుంచి కూడా వ్యతిరేకత కాగా తమ గ్రూప్ కంపెనీలను కేవలం రూ.2,962 కోట్ల కొనుగోలుకు వీలులేదంటూ వీడియోకాన్ గ్రూప్ చైర్మన్, ఎండీ వేణగోపాల్ ధూత్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారించింది. వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్‌సహా ఆ గ్రూప్‌నకు సంబంధించి 13 కంపెనీలకు ‘ఏకీకృత’ పరిష్కార (రిజల్యూషన్) ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదముద్ర వేయడాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) వ్యతిరేకించింది. ఎన్సీఎల్టీ రూలింగ్ని అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేసింది. తనకు వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ దాదాపు రూ.882 కోట్లు బకాయి పడినట్లు తెలిపింది. ఎన్సీఎల్టీలో కేసు విచారణలో ఉండడం వల్ల తానకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడం సాధ్యంకాదని అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు విన్నవించింది. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్‌ని ప్రారంభించడం ద్వారా డిఫాల్ట్ టెలికం కంపెనీలు ‘తమకు సంబంధించి రుణ బాధ్యతల నుండి బయటపడలేవని’ తన వాదనల్లో పేర్కొంది. మోసపూరిత విధానాలు పాల్పడిన కంపెనీలు ఐబీసీ నిబంధనావళికింద తప్పించుకోలేవని, తద్వారా ప్రభుత్వానికి చెల్లింపులను ఎగ్గొట్టలేవని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమోదించిన రిజల్యూషన్ ప్లాన్ కింద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ద్వారా ఆపరేషనల్ క్రెడిటార్స్‌కు వచ్చేది అత్యంత తక్కువ మొత్తమని పేర్కొంది. తనవరకూ చూస్తే, తాను చేసే క్లెయిమ్‌లో లభించేది కేవలం 0.12 శాతమేనని వివరించింది. సీఓసీ నిర్ణయాలపై విమర్శ రిజల్యూషన్ ప్రణాళిక అమల్లో సీఓసీది కీలకపాత్ర. అయితే రుణాల్లో కూరుకుపోయి దివాల పక్రియలో ఉన్న కంపెనీ అమ్మకాలకు సంబంధించి రిజల్యూషన్ ప్రక్రియలో క్రెడిటార్స్ కమిటీ 95 శాతం వరకూ రాయితీ (హెయిర్‌కట్స్) ఇస్తుండడంపై ఇటీవల తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్ ప్రణాళికలను ఆమోదించడం తగదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్) దివాలా ప్రక్రియలో కీలకమైన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీఓసీ)కి ఒక నియమావళిని జారీ చేసే పనిలో కేంద్రం ఉన్నట్లు కనబడుతోంది. ఈ విషయంలో ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్లతో కార్పొరేట్ వ్యవహారాల శాఖ చర్చిస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మ ఇటీవల తెలిపారు. అయితే అధిక హెయిర్‌కట్స్ విమర్శలపై ఆయన ఈ సందర్భంగా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు, ఆ ప్రస్తావన చేయకపోవడం గమనార్హం. ఐబీసీకి పలు సవరణల ద్వారా దీనిని ఎప్పటికప్పుడు మరింత పటిష్టంగా మార్చడం జరుగుతోంది. ఈ దిశలో ఇప్పటికి ఐబీసీకి ఆరు సవరణలు జరిగాయి. ఐబీసీని మరింత సమర్థవంతంగా పటిష్టంగా మార్చడానికి విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, సంబంధిత ఇతర వర్గాలతో కేంద్రం నిరంతరం చర్చలు జరుపుతుందని, ఆయా సిఫారసులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుందని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో ఇది కీలకమని కూడా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఐబీసీ సెక్షన్ 31 (4) నిబంధనలు పాటించకపోవడమే కారణం! దివాలా కోడ్ (ఐబీసీ) సెక్షన్ 31 (4) ప్రకారం, రిజల్యూషన్ ప్లాన్‌ను సమర్పించడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుండి ముందస్తు అనుమతి అవసరమని, దీనిని అనిల్ అగర్వాల్ సంస్థ పొందలేదని జరత్ కుమార్ జైన్, అశోక్ కుమార్ మిశ్రాలతో కూడిన ఇరువురు సభ్యుల అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. కోడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయడం కోసం ఈ బిడ్స్ వ్యవహారాన్ని తిరిగి సీఓసీకి పంపుతున్నట్లు 213 పేజీల ఉత్తర్వు్యలో తెలిపింది. దీనిప్రకారం, ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసి, అది రద్దయితే తప్ప, సీఓసీ ఇప్పుడు వీడియోకాన్ కోసం తాజా బిడ్లను కోరడానికి సౌలభ్యత ఏర్పడింది. పునర్విచారణ, సమీక్ష కోసం రుణదాతలకు రిజల్యూషన్ ప్లాన్‌ను తిరిగి పంపే అధికారాలు ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీలు రెండింటికి ఉన్నాయని అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొనడం గమనార్హం. సీఓసీకి ఆయా అంశాల్లో ఉన్న అధికారాలను తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది. తగిన చర్యలు తీసుకుంటాం: ట్విన్‌స్టార్ తాము అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల గురించి తెలుసుకున్నట్లు ట్విన్‌స్టార్ తరఫు న్యాయవాది గోపాల్ జైన్ పేర్కొన్నారు. తాజా ఆర్డర్ వల్ల వీడియోకాన్ దివాలా పరిష్కార పక్రియ (రిజల్యూషన్) మరింత ఆలస్యం అవుతుందని అన్నారు. వ్రాతపూర్వక ఉత్తర్వు కోసం ఎదురుచేస్తున్నామని, తీర్పును పూర్తి అధ్యయనం తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. -
దివాలా ముంగిట్లో రఘురామ కంపెనీ
సాక్షి, అమరావతి: బ్యాంకులకు రూ.వెయ్యి కోట్లకుపైగా రుణం ఎగవేత కేసులో ఎంపీ రఘురామ కృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ కంపెనీ దివాలా ముంగిట నిలిచింది. ఆస్తులను విక్రయించో, కంపెనీని ఏకమొత్తంగా విక్రయించో రుణదాతల అప్పులు తీర్చడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు దివాలా పరిష్కార నిపుణుడిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇండ్ భారత్ థర్మల్ పవర్ దివాలా ప్రక్రియకు అనుమతిస్తూ హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దివాలా పరిష్కార నిపుణుడిగా శ్రీకాకుళం వంశీకృష్ణను ని యమించడమే కాకుండా ప్రక్రియకు సంబంధించి న వివరాలను తెలియచేసే ఫారం–2ను మూడు రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. థర్మల్ కేంద్రం పేరుతో... బొగ్గు ఆధారిత విద్యుత్ తయారీ కేంద్రం ఏర్పాటు పేరుతో ఇండ్ భారత్ థర్మల్ పవర్ వివిధ బ్యాంకుల నుంచి రూ.1,383.07 కోట్ల రుణాలను తీసుకొని చెల్లించకుండా ఎగవేసింది. ఈ రుణాలకు తనఖా రూపంలో చూపించిన ఆస్తులు కేవలం రూ.872 కోట్లు మాత్రమే కావడంతో ఈ మొత్తాన్ని నిరర్థక ఆస్తులుగా ప్రకటించిన బ్యాంకులు తనఖా ఆస్తుల స్వాధీన ప్రక్రియను ప్రారంభించాయి. రూ.327 కోట్ల రుణాలను ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియంలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఇండ్ భారత్‌ను దివాలా సంస్థగా ప్రకటించాలంటూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ వివాదం న్యూఢిల్లీలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్‌లో ఉన్నందున ఈ పిటిషన్‌ను కొట్టివేయాలన్న ఇండ్ భారత్ వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్–2016 సెక్షన్ 13 కింద పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దివాలా ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో తెలియచేసే ఫారం–2ను మూడు రోజుల్లోగా దాఖలు చేయాల్సిందిగా స్పష్టం చేశారు. రుణం ఎగ్గొట్టిన సంస్థపై సీఐఆర్‌పీ కింద తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ ఉత్తర్వుల కాపీలను హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు అందించాలని రిజిస్ట్రీని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో ఇండ్ భారత్ తనఖా పెట్టిన ఆస్తులు బ్యాంకుల పరం కానున్నాయి. -
దివాలా కంపెనీలు 421.. కేసుల విలువ రూ. 2.55 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దివాలా చట్టం (ఐబీసీ) కింద సెప్టెంబర్ నాటికి 421 కేసులు పరిష్కారం అయినట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు. ఇలా పరిష్కారమైన కేసుల విలువ దాదాపు రూ.2.55 లక్షల కోట్లని వెల్లడించారు. ఇక దాదాపు రూ.52,036 కోట్ల విలువైన 1,149 కేసులు లిక్విడిటీ పక్రియకు వెళ్లినట్లు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. సెప్టెంబర్ 30వ తేదీనాటికి ఐబీసీ కింద మొత్తం 4,708 కార్పొరేట్ దివాలా పరిష్కార పక్రియను (సీఐఆర్‌పీ) ప్రారంభించినట్లు తెలిపారు. దివాలా అంశంతో పాటు మరిన్ని విషయాలపై పార్లమెంటులో నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. బ్యాంకుల విశ్వసనీయ నిర్ణయాలకు భరోసా! బ్యాంకుల విశ్వసనీయ వాణిజ్య నిర్ణయాల విషయంలో అధికారులకు ఎటువంటి ఇబ్బందీ ఉండబోదని ఆర్థికశాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటున్నట్లు రాజ్యసభలో తెలిపారు. అవినీతి నిరోధక చట్టం (పీసీ చట్టం) 1988కు సవరణలు, ప్రభుత్వ ఉద్యోగిపై దర్యాప్తు ప్రారంభించే ముందు ముందస్తు అనుమతి ఆవశ్యకత, బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మోసాలపై మొదటి స్థాయి పరిశీలన కోసం బ్యాంకింగ్– ఆర్థిక విభాగ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు, కన్సాలిడేటెడ్ స్టాఫ్ అకౌంటబిలిటీ ఫ్రేమ్‌వర్క్ ఖరారు వంటి అంశాలు కేంద్రం తీసుకున్న చర్యల్లో ఉన్నట్లు వెల్లడించారు. స్టాఫ్ అకౌంటబిలిటీ కీలక పాత్ర... కేంద్రం తీసుకువచ్చిన విధానాల్లో స్టాఫ్ అకౌంటబిలిటీ ఫ్రేమ్‌వర్క్ కీలకమైనదని మంత్రి తెలిపారు. రూ.50 కోట్ల వరకు నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ) ఖాతాల విషయంలో చర్యలకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో సంప్రదింపులు జరిపి ఇటీవల కేంద్రం ఏకీకృత స్టాఫ్ అకౌంటబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) తమ బోర్డుల ఆమోదంతో ఈ ఫ్రేమ్‌వర్క్‌కు తగిన విధంగా తమ స్టాఫ్ అకౌంటబిలిటీ పాలసీ, సంబంధిత ఇతర విధానాలను రూపొందించుకోవచ్చని ఆర్థికమంత్రి సూచించారు. ‘ఒకవైపు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తూ మరోవైపు బ్యాంకు అధికారులు, ఉద్యోగుల తీసుకునే విశ్వసనీయ నిర్ణయాలను రక్షించడం లక్ష్యంగా స్టాఫ్ అకౌంటబిలిటీ ఫ్రేమ్‌వర్క్ రూపొందింది. ఇది బ్యాంకు అధికారులు, ఉద్యోగుల ఉద్దేశ్యపూర్వక తప్పులను గుర్తించి, ఇందుకు బాధ్యులైన వారిని మాత్రమే శిక్షించడానికి ఉద్దేశించింది. నిర్దేశించిన వ్యవస్థలు, విధానాలకు అనుగుణంగా లేకపోవటం లేదా దుష్ప్రవర్తన లేదా ’నిర్ధారిత’ నిబంధనలకు కట్టుబడి ఉండకపోవడం వంటి అంశాలపై చర్యలు తప్పవు’’ అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొండిబకాయిలుగా వర్గీకరించిన అకౌంట్లకు వర్తించేలా ఫ్రేమ్‌వర్క్ అమలులోకి వస్తుందని వివరించారు. ఎస్‌యూఐ పథకానికి ప్రాధాన్యత స్టాండ్ అప్ ఇండియా (ఎస్‌యూఐ) పథకానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరో ప్రశ్నకు ఆర్థికమంత్రి తెలిపారు. 2021 నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల ద్వారా స్టాండ్ అప్ ఇండియా పథకం కింద మొత్తం 1,25,575 రుణాలు మంజూరయినట్లు వెల్లడించారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 13,092 మంది లబ్దిదారులకు రూ.940 కోట్లు మంజూరయినట్లు వెల్లడించారు. ఈ పథకం కింద గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ బ్రాంచ్‌లో కనీసం ఒక ఎస్సీ, ఎస్టీ రుణగ్రహీతకు, ఒక మహిళ రుణగ్రహీతకు రూ. 10 లక్షల నుండి రూ. 1 కోటి మధ్య రుణాలను అందించాల్సి ఉంటుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలను అలాగే మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకుగాను ఈ పథకం కిందకు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న కార్యకలాపాలను చేర్చడం, మార్జిన్ మనీ అవసరాన్ని 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడం వంటి చర్యలను కేంద్రం చేపట్టింది. చదవండి: దేశ ఆర్థిక వ్యవస్థపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
స్పేస్ ఎక్స్ దివాళా..! ఉద్యోగులకు ఎలన్ మస్క్ వార్నింగ్..!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. స్పేస్ ఎక్స్ ప్రయోగానికి సంబంధించి ఎలన్ మస్క్ ఉద్యోగులకు మెయిల్ పెట్టారు. ఆ మెయిల్లో "ఇటీవల కాలంలో స్టార్‌షిప్ లాంచ్ వెహికల్‌కు ఉపయోగించే రాప్టార్ ఇంజిన్ తయారీలో చాలా వెనకబడి పోయాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే స్పేస్ఎక్స్ సంస్థకు దివాళా తీసే పరిస్థితి తలెత్తుతుంది" అంటూ పేర్కొన్నారు. ఎలన్ మస్క్ మార్స్పైన మనిషి మనుగడ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. భూమి మీద ఏదైనా ప్రమాదం జరిగి, భూమి మీద మనుగడ అంతరించి పోతే మానవుడు మార్స్ మీద జీవించడానికి తన తన సంపద ఉపయోగ పడాలని ఎలన్ మస్క్ కోరుకుంటున్నాడు. ఆ లక్ష్యంతోనే ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ముందుకు సాగుతుంది. తాను ఊహించినట్లు భవిష్యత్‌లో మార్స్, చంద్రమండలంపై మానువుని మనుగడ కోసం రీయిజబుల్ స్పేస్ క్రాఫ్ట్తో స్టార్ షిప్ స్పేస్ రాకెట్లను తయారు చేస్తున్నారు. దీని కోసం ప్రస్తుతం ఉన్న అన్నీ ఎర్త్ రాకెట్ల కంటే 1000 రెట్లు ఎక్కువ ఉన్న స్టార్ షిప్ రాకెట్ ను మోయాల్సి ఉంటుంది. ఆ స్టార్ షిప్ రాకెట్‌ను మోసేందుకు స్పేస్ఎక్స్ రాఫ్టర్ ఇంజిన్లు ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు ఈ రాప్టర్ ఇంజిన్ తయారీలో స్పేస్ఎక్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆ సమస్యని అధిగమించేందుకు స్పేస్ ఎక్స్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ మెయిల్ పెట్టారు. ఉద్యోగులు వారాంతాల్లో పనిచేయాలని, స్పేస్ ఎక్స్ ప్రయోగం సంక్షోభంలో ఉందని, దానిని త్వరగా పరిష్కరించకపోతే స్పేస్ ఎక్స్ దివాలా తీసే ప్రమాదం ఉందని ఉద్యోగులకు చేసిన మెయిల్స్‌లో ఎలన్ మస్క్ హెచ్చరించినట్లు ది వెర్జ్ తన కథనంలో పేర్కొంది. చదవండి: యాపిల్ పరువు తీసి పడేశాడు.. కొత్తేం కాదుగా! -
దివాలా కోడ్ అమలుతో...కార్పొరేట్ ‘రుణ’ ఫ్యూడలిజానికి ముగింపు!
న్యూఢిల్లీ: దివాలా చట్టం (ఐబీసీ) అమలుతో కార్పొరేట్ రుణ గ్రహీతల ఫ్యూడలిజం రోజులు ముగిసిపోయినట్లయ్యిందని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్ర్‌ప్సీ కోడ్ (ఐబీసీ) అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇండస్ట్రీ సంస్థ– సీఐఐ ‘ఐదేళ్ల ఐబీసీ, 2016 : తదుపరి ముందడుగు’ అన్న అంశంపై నిర్వహించిన ఒక సదస్సులో సుబ్రమణ్యం మాట్లాడారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ఐబీసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒత్తిడిలో, దివాలాలో ఉన్న ఆస్తులకు సంబంధించి మార్కెట్ ఆధారితమైన అలాగే నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన రిజల్యూషన్ పక్రియ ప్రారంభమైంది. ఐబీసీ కింద దివాలా లేదా స్ట్రెస్ కంపెనీ ముందుకు వచ్చినట్లయితే, క్రెడిటార్ల కమిటీ (సీఓసీ) రం గంలోకి వచ్చేస్తుంది. కంపెనీ వ్యవహారాల నిర్వహణ రిజల్యూషన్ ప్రొఫెషనల్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. రిజల్యూషన్ విజయవంతం కాకపోతే, కంపెనీ లిక్విడేషన్ పక్రియకు చేరుకుంటుంది. చదవండి : 3 రోజుల్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి ఐబీసీకి ముందు కార్పొరేట్ రుణ గ్రహీతలు తమ నిర్ణయాలే అంతిమమని భావించేవారు. అంతా తాము చెప్పినట్లే జరగాలని, జరుగక తప్పదన్నది వారి అభిప్రాయంగా ఉండేది. అలాంటి రోజులు ప్రస్తుతం పూర్తిగా పోయాయి. మళ్లీ అలాంటి ఫ్యూడలిజం రోజులు వెనక్కు కూడా రాబోవు. ఫ్యూడలిజం ధోరణి ఎంతమాత్రం సరికాదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఫ్యూడలిజం ధోరణి దారుణమన్నది నా భావన. ఏ వ్యవస్థలోనైనా ధర్మం అనే భావన ముఖ్యం. ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కూడా ఇది ఇమిడి ఉంటుంది. ఈ దిశలో అడుగులను ఐబీసీ వేగవంతం చేసింది. కేసుల సత్వర పరిష్కారం: రాజేష్ వర్మ సమావేశంలో కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మ మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై నాటికి దివాలా చట్టం కింద ‘అడ్మీషన్’ స్థాయికి ముందే 17,837 కేసులు పరిష్కారమయినట్లు తెలిపారు. ఈ కేసుల విలువ దాదాపు రూ.5.5 లక్షల కోట్లని వెల్లడించారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత దివాలా వ్యవహారాలపై నెలకొన్న సానుకూల పరిస్థితిని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ఒక్క ఏడాది జూలై వరకూ చూస్తే, 4,570 కేసులు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ కింద అడ్మిట్ అయ్యాయని, వీటిలో 657 కేసులు అప్పీల్, రివ్యూ ఇతర కారణాలతో ముగిసిపోయాయని తెలిపారు. 466 కేసుల ఉపసంహరణ జరిగిందని పేర్కొన్నారు. 404 కేసుల ద్వారా విలువకు సంబంధించి రూ.2.5 లక్షల కోట్ల మేర పరిష్కారమయ్యాయని తెలిపారు. ఐబీసీకి ఆరు సవరణల ద్వారా వివిధ లొసుగులను తొలగించి దీనిని మరింత పటిష్టంగా మార్చడం జరిగిందని పేర్కొన్నారు. -
ఆదర్శం నుంచి అధోగతికి!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్నో సహకార పరపతి సంఘాల ఆవిర్భావానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ఆసియాలోనే ఉన్నత పొదుపు సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీ సహకార పరపతి సంఘం ప్రస్తుతం పతనం అంచుకు చేరుకుంది. ఆర్టీసీ స్వయంగా ఈ సహకార సంఘం పతనాన్ని లిఖిస్తోంది. ఉద్యోగుల వేతనాల్లోంచి పోగు చేసిన రూ. వేల కోట్ల నిధిని ఆర్టీసీ దిగమింగి తిరిగి కట్టకపోవటమే దీనికి కారణం. అత్యవసరాలకు రుణం అందించే నిధి మాయమవడంతో ఆర్టీసీ ఉద్యోగులు బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇక జీతంలో కోత లేకుండా చూసుకుంటే ఎక్కువ అప్పు పుడుతుందన్న ఉద్దేశంతో ఉద్యోగులు ‘అమ్మ’లాంటి సహకార సంఘంలో సభ్యత్వాన్ని వదులుకుంటున్నారు. 48 వేల మంది సభ్యులున్న ఆ పరపతి సంఘం నుంచి ఇప్పటికే 6 వేల మంది సభ్యత్వాలు ఉపసంహరించుకున్నారు. ప్రతినెలా కొత్తగా వందల సంఖ్యలో ఉపసంహరణ దరఖాస్తులందుతున్నాయి. చివరకు ఆర్టీసీలో అత్యున్నత పోస్టుగా భావించే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కూడా సహకార సంఘం నుంచి వైదొలుగుతున్నారు. ఎందుకీ దుస్థితి? రాష్ట్రం విడిపోయే వేళ ఈ సంఘంలో సాలీనా రూ. 3 వేల కోట్లకు పైచిలుకు నిధి జమయ్యేది. దాన్నుంచి లక్ష మందికి రుణాలు అందించేవారు. విభజన తర్వాత తెలంగాణ ఆర్టీసీ పరిధిలోని సీసీఎస్‌కు రూ. 1,500 కోట్ల వాటా వచ్చింది. ఇప్పుడా విలువ రూ. 2 వేల కోట్లను దాటాల్సి ఉంది. కానీ కొన్నేళ్లుగా దివాలా దిశలో సాగుతున్న ఆర్టీసీ.. సొంత ఖర్చులకు ఈ నిధిని వాడుకొని చేతులెత్తేసింది. అడపాదడపా కొంత మొత్తం తిరిగి చెల్లిస్తూ ప్రతినెలా పోగయ్యే కొత్త నిధిని వాడేసుకోవడం అలవాటు చేసుకుంది. గత రెండేళ్లుగా తిరిగి చెల్లింపు దాదాపు నిలిచిపోయింది. దీంతో సీసీఎస్ బ్యాలెన్స్ సున్నాగా మారిపోయింది. అప్పట్నుంచి రుణాలు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం దాదాపు 10 వేల వరకు దరఖాస్తులు పేరుకుపోయాయి. మధ్యలో కోర్టు ఆదేశం మేరకు రూ. 200 కోట్లు తిరిగి జమ చేసిన ఆర్టీసీ... ఆ తర్వాత మళ్లీ మొహం చాటేసింది. ఆ రూ. 200 కోట్లతో కొంత మందికి లోన్లు అందాయి. మిగతా సుమారు 8 వేల దరఖాస్తులు దుమ్ము కొట్టుకుపోతున్నాయి. తొలిసారి సభ్యత్వాల రద్దు వైపు ఉద్యోగులు.. సీసీఎస్ నుంచి రుణాలు రాకపోవడంతో ఉద్యోగులు గత్యంతరం లేక బ్యాంకుల నుంచో లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచో అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయినా ప్రతి నెలా సీసీఎస్‌కు జమ కట్టే పేరుతో ఆర్టీసీ వారి జీతాల నుంచి 7.5 శాతాన్ని కట్ చేస్తోంది. కానీ ఆ మొత్తాన్ని సీసీఎస్‌కు ఇవ్వకుండా సొంతానికి వాడేసుకుంటోంది. దీంతో వారి జీతం తగ్గి బ్యాంకు రుణం కూడా తక్కువగా ఉంటోంది. అదే ఈ కోత లేకుంటే, అంతమేర రుణం కూడా పెరుగుతుంది. అలాగే తీసుకున్న అప్పు కిస్తీలు కట్టడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఉద్దేశంతో ఉద్యోగులు సీసీఎస్ నుంచి సభ్యత్వాలు రద్దు చేసుకోవడం ప్రారంభించారు. అలా రద్దు చేసుకుంటే అప్పటివరకు దాచుకున్న మొత్తం కూడా పొందే వీలుంటుంది. చిరుద్యోగులకైతే ఆ మొత్తం రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు, పెద్ద ఉద్యోగులకు అంతకంటే ఎక్కువ ఉంటుంది. కానీ ఆ మొత్తం చెల్లించాలంటే కొత్తగా నిధి పోగు కాకపోతుండటంతో అదీ సాధ్యం కావటం లేదు. కానీ చూస్తుండగానే 6 వేల మంది సభ్యత్వం రద్దు చేసుకున్నారు. మరో 4–5 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతినెలా ఆ సంఖ్య పెరుగుతోంది. ఉలుకూపలుకు లేని సంస్థ.. ఆర్టీసీ చరిత్రలో తొలిసారి ఈ విపరీత పరిణామం నెలకొనడంతో సంస్థ షాక్‌కు గురైంది. దీన్ని ఆపాలంటే మళ్లీ సీసీఎస్‌లో కొత్త నిధి ఏర్పడాలి. దానికి ఆర్టీసీ బకాయిపడ్డ రూ. 1800 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. కానీ ప్రతినెలా జీతాలు చెల్లించేందుకు బడ్జెట్ కేటాయింపుల కోసం ఆర్థిక శాఖ వైపు చూసే ఆర్టీసీ... ఇంత భారీ బకాయి చెల్లించడం వల్ల కాక మిన్నకుండిపోయింది. కళ్ల ముందే సభ్యత్వాలు పెద్ద సంఖ్యలో రద్దవుతున్నా మిన్నకుండిపోయింది. ఇప్పటికే ఆర్టీసీ తీరుపై సీసీఎస్ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించింది. గతంలో కోర్టు సూచన మేరకు రూ. 200 కోట్లను కనాకష్టంగా ఆర్టీసీ చెల్లించింది. ఇప్పుడా కేసు ఇంకా కొనసాగుతోంది. ఆర్టీసీలో ఫైనాన్స్ వ్యవహారాలు చూసే విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి, లీగల్ వ్యవహారాలు చూసే మరో ఉన్నతాధికారి, ఈడీలు కూడా సభ్యత్వం రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసిన విషయం గుప్పుమనడంతో ఇక ఇంతకాలం అందులో పోగైన నిధులు కూడా భవిష్యత్తులో తిరిగి రావేమోనన్న భయంతో సాధారణ ఉద్యోగులు సైతం సభ్యత్వాల రద్దు కోసం పోటెత్తుతున్నారు. ఏమిటీ పొదుపు సంఘం? ఆర్టీసీ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెలా 7.5 శాతాన్ని సహకార పరపతి సంఘాని (సీసీఎస్)కి చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని మినహాయించిన తర్వాతే వారికి జీతాలు అందుతాయి. అలా మినహాయించిన మొత్తాన్ని ఆర్టీసీ ఈ సీసీఎస్‌లో జమ చేయాలి. అలా పోగయ్యే మొత్తాన్ని సీసీఎస్ పాలకవర్గం బ్యాంకుల్లో పెట్టి వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందుతుంది. ఆ మొత్తం నుంచి కార్మికుల కుటుంబ అవసరాల కోసం తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తుంది. పిల్లల పెళ్లిళ్లు, ఇళ్లు కట్టుకోవడం, చదువులు, ఆరోగ్యానకి సంబంధిం చిన ఖర్చులకు ఇస్తుంది. ఉద్యోగులు రిటైరైతే అప్పటి దాకా జమ అయిన మొత్తాన్ని బ్యాంకు రేట్ల స్థాయి వడ్డీతో కలిపి చెల్లిస్తుంది. నాడు వైభవం.. ఉత్తరాదికి చెందిన రైల్వే ఉద్యోగుల బృందం ఆ సంస్థ సందర్శనకు వచ్చి అంతర్గతంగా సహకార పరపతి సంఘం ఎలా ఉండాలో అధ్యయనం చేసింది. ఏడాదిలో రూ.3వేల కోట్లను పొదుపు రూపంలో సేకరించి లక్ష మందికి దరఖాస్తు చేసిన 3రోజుల్లోనే రుణాలు అందిస్తున్న తీరు చూసి అచ్చెరువొందింది. ఠంచన్‌గా రుణాల జమ, మళ్లీ కొత్త రుణాలు... నయాపైసా అవినీతి లేకుండా సాగుతున్న ఆ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయింది. నేడు ప్రశ్నార్థకం.. అంత సమున్నత సంస్థ నిలువునా కూలిపోతోంది. దివాలాకు దగ్గరై మూతపడే దిశగా కదులుతోంది. ఆ సంస్థకు వెన్నెముకగా ఉండే సభ్యులు క్రమంగా సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ఇప్పటికే 6 వేల సభ్యత్వాలు రద్దవగా సగటున ప్రతి నెలా 350 మంది ఉససంహరణ దరఖాస్తులు అందజేస్తున్నారు. వెరసి.. ఆసియాలోనే ఉత్తమ సహకార సంఘాల్లో ఒకటిగా వెలుగొందిన ఆ సంస్థ ఉనికే ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. కూతురు పెళ్లి లోన్ కోసం సభ్యత్వం వదులుకున్నా నా కూతురు పెళ్లి కోసం ఏడాది కింద సీసీఎస్‌కు దరఖాస్తు చేశా. నిధులు లేక ఇవ్వలేదు. దీంతో ప్రైవేటుగా అప్పు తెచ్చా. ఇందుకు ప్రతినెలా రూ. 20 వేల కిస్తీ కడుతున్నా. జీతంలో సీసీఎస్ కోత ఉంటే ఇబ్బందిగా ఉంటోందని దాన్ని రద్దు చేసుకున్నా. ఏడు నెలలు గడుస్తున్నా నాకు అందులో ఉన్న నా సొమ్ము ఇవ్వట్లేదు. – వెంకటేశ్వర్లు, కంట్రోలర్, నల్లగొండ అప్పు తీర్చేందుకు సభ్యత్వం రద్దు చేసుకుంటున్నా పిల్లల చదువుకు రూ. లక్షన్నర, ఇంటి కోసం రూ. లక్షన్నర కోసం రెండు దరఖాస్తులు సమర్పించా. ఏడాదిగా అవి పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రూ. 2 లక్షలు బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నా. సకాలంలో జీతం రాక చెక్ బౌన్స్ అవుతుండటంతో కిస్తీల మందం ఉంచేందుకు ప్రైవేటుగా కొంత అప్పు తెచ్చా. అవి కట్టేందుకు జీతం సరిపోక, సీసీఎస్ కటింగ్ లేకుండా ఉండేందుకని సభ్యత్వమే రద్దు చేసుకునేందుకు దరఖాస్తు పెట్టా. – జియాఉద్దీన్, డ్రైవర్ ఇబ్రహీంపట్నం ఇది రైఫీజన్ చిత్రంతో ఉన్న పురస్కారం. సహకార పరపతి సంఘం విధానాలకు ఆద్యుడైన ఈ జర్మనీ మేధావి ఆశయాన్ని సుసంపన్నం చేస్తోందన్న ఉద్దేశంతో ఆర్టీసీ సహకార పరపతి సంఘం ఆయన చిత్రంతో కూడిన ఈ పురస్కారాన్ని పొందింది. ఇప్పుడు సీసీఎస్ గోడకు వేళ్లాడుతూ దాని దయనీయ స్థితికి మూగ సాక్ష్యంగా నిలిచింది. -
‘మహీంద్రా’ శాంగ్యాంగ్ దివాలా
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం మహీంద్రా గ్రూప్‌లో భాగమైన దక్షిణ కొరియా కంపెనీ శాంగ్యాంగ్ మోటార్ (ఎస్‌వైఎంసీ) దివాలా తీసింది. నష్టాలు, భారీ రుణభారంతో కుదేలవడమే ఇందుకు కారణం. దివాలా చట్టం కింద పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు అనుమతించాలంటూ సియోల్ దివాలా కోర్టులో శాంగ్యాంగ్ దరఖాస్తు చేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) వెల్లడించింది. పునర్‌వ్యవస్థీకరణపరమైన మద్దతుకు కోర్టు ఆమోదముద్ర వేసిన పక్షంలో.. బోర్డు పర్యవేక్షణలో రుణదాతలు మొదలైన వర్గాలతో పునరుద్ధరణ ప్యాకేజీపై కంపెనీ చర్చలు జరపగలదని పేర్కొంది. ఎస్‌వైఎంసీ దాఖలు చేసిన పత్రాలు, దరఖాస్తు ఆధారంగా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు అనుమతించాలా లేదా అన్నది సియోల్ దివాలా కోర్టు నిర్ణయం తీసుకుంటుందని ఎంఅండ్ఎం పేర్కొంది. దాదాపు రూ. 408 కోట్ల రుణాన్ని ఇటీవల తిరిగి చెల్లించాల్సి ఉన్నప్పటికీ.. శాంగ్యాంగ్ విఫలమైంది. నష్టాల్లో ఉన్న శాంగ్‌యాంగ్‌ను ఎంఅండ్ఎం 2010లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దాన్ని లాభాల బాట పట్టించేందుకు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యపడలేదు. శాంగ్‌యాంగ్‌లో ఎంఅండ్ఎంకు 75 శాతం వాటా ఉంది. ఇప్పటిదాకా 110 మిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. 2017 నుంచి శాంగ్యాంగ్ నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. వీటితో పాటు రుణ భారం దాదాపు రూ. 680 కోట్లకు పెరిగిపోయింది. మరింతగా పెట్టుబడులు పెట్టాలంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో శాంగ్యాంగ్ ప్రతిపాదించినప్పటికీ.. ఎంఅండ్ఎం తిరస్కరించింది. (చదవండి: 5జీ స్మార్ట్‌ఫోన్ కావాలంటున్నారు) -
దివాళా తీసిన ప్రముఖ యానిమేషన్ కంపెనీ
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రముఖ యానిమేషన్ కంపెనీ డిక్యు ఎంటటైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ తన కార్యాలయాన్ని మూసివేసింది. దివాలా తీసినట్లు కోర్టులో ఆ కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న 1400 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గత ఎనిమిది నెలల నుంచి ఈ సంస్థ తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ పోలీసులు, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. సంస్థపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎండీ తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రూ.14లక్షల వరకు రావాలని ఉద్యోగులు తెలిపారు. తమ వేతనాలు అడిగితే వేధింపులకు , బెదిరింపులకు పాలుపడుతున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: లిఫ్టులో ఇరుక్కుపోయిన మంత్రి -
రూ. 30 వేల కోట్లు కడతాం
న్యూఢిల్లీ: రుణ బాకీలను సెటిల్ చేసుకునేందుకు, 13 గ్రూప్ కంపెనీలపై దివాలా చర్యలను ఆపివేయించుకునేందుకు వీడియోకాన్ గ్రూప్ మాజీ ప్రమోటరు వేణుగోపాల్ ధూత్ కుటుంబం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా రుణదాతలకు రూ. 30,000 కోట్లు కడతామంటూ ఆఫర్ చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను రుణదాతల కమిటీ (సీవోసీ) ముందు ఉంచినట్లు ధూత్ వెల్లడించారు. రుణదాతలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) దీనికి అంగీకరించిన పక్షంలో ఈ ఏడాది ఆఖరు నాటికి సెటిల్మెంట్పై తుది నిర్ణయం రావచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు ఎదుర్కొంటున్న 15 గ్రూప్ కంపెనీలకు గాను 13 సంస్థలకు సంబంధించి ఈ ఆఫర్‌ను ప్రతిపాదించినట్లు ధూత్ చెప్పారు. కేఏఐఎల్, ట్రెండ్ అనే రెండు సంస్థలను ఇందులో చేర్చలేదని వివరించారు. ‘వచ్చే 30 నుంచి 60 రోజుల్లోగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నాను‘ అని ధూత్ పేర్కొన్నారు. దివాలా పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు, మరింత మెరుగైన విలువను రాబట్టేందుకు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ మొత్తం 15 గ్రూప్ కంపెనీల కేసులను కలిపి విచారణ జరుపుతోంది. -
అనిల్ అంబానీకి ‘సుప్రీం’ ఊరట
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్ (అడాగ్)లో భాగమైన ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌టీఐఎల్)కు ఇచ్చిన రూ.1,200 కోట్ల రుణాల రికవరీకి సంబంధించి ఆయనపై వ్యక్తిగత దివాలా చర్యలు చేపట్టడానికి అనుమతించాలని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దాఖలు చేసిన అప్పిలేట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చి న స్టేను తొలగించాలనీ ఎస్బీఐ చేసిన విజ్ఞప్తికి న్యాయమూర్తులు ఎల్ఎన్ రావు, హేమంత్ గుప్తా, ఎస్. రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. అయితే ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా, తదుపరి విచారణలు ఏమీ లేకుండా అక్టోబర్ 6న కేసు విచారణను చేపట్టి తుది తీర్పు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ హై కోర్టుకు సూచించడం ఈ కేసులో మరో కీలకాంశం. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏదైనా మార్పు కోరుకుంటే, సంబంధిత న్యాయస్థానాన్నే ఆశ్రయించవచ్చని కూడా ఎస్బీఐకి ధర్మాసనం సూచించింది. వివరాల్లోకి వెళ్తే..: ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌టీఐఎల్)కు 2016 ఆగస్టులో ఎస్బీఐ రుణం మంజూరు చేసింది. ఆర్‌కామ్‌కు రూ. 565 కోట్లు, ఆర్‌టీఐఎల్‌కు రూ. 635 కోట్లు రుణం అందింది. ఈ రుణం మొండిబకాయిగా మారడంతో, అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును ఎస్బీఐ రుణ బాకీల కింద జప్తు చేసుకోవాలని నిర్ణయించింది. తదుపరి అనిల్ అంబానీకి నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. దీనితో ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్‌ని ఆశ్రయించింది. గ్యారంటర్‌పైనా విచారణ జరపవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉందని తన వాదనల్లో పేర్కొంది. దీంతో ఏకీభవిస్తూ, ఎన్సీఎల్టీ అనిల్ ఆస్తులపై దివాలా ప్రక్రియకు వీలుగా మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమి స్తూ ఆగస్టు 21న ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు అదేనెల 27న స్టే ఇస్తూ, తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. ఈ స్టే ఉత్తర్వు్యను ఎస్బీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
అంబానీపై దివాలా చర్యలు : సుప్రీంకు ఎస్బీఐ
సాక్షి, ముంబై: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీ దాదాపు రూ. 1,200 కోట్ల రుణాల ఎగవేతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పును అమల్లోకి తెస్తే తనకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని ఎస్బిఐ తన పిటిషన్లో పేర్కొంది. (అనిల్ అంబానీపై దివాలా చర్యల నిలుపుదల) కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి హైకోర్టు తమకు అవకాశం ఇవ్వలేదని ఎస్బీఐ వాదించింది. సుమారు 1707 కోట్లు ప్రజాధనం బ్యాంకుకు రుణపడి ఉన్న అంబానీకి వ్యతిరేకంగా దివాలా తీర్పును నిలిపివేయడాన్ని సమర్థించలేమని తెలిపింది. ఆగస్టు 27 న జస్టిస్ విపిన్ సంఘీ, రజ్నీష్లతో కూడిన త్రిసభ్య ధర్మానసం మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తమ వాదనలు తెలియజేయాలని ఇన్సా ల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), ఎస్బీఐలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదావేసింది. -
మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాల్సిందే!
లండన్: తమను కోట్లాది రూపాయలమేర మోసగించి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ వ్యాపారస్తుడు విజయ్‌మాల్యాను భారత్ బ్యాంకులు వదలడంలేదు. ఆయనను దివాలాకోరుగా ప్రకటించాల్సిందేనని మరోసారి ఇంగ్లాండ్‌లోని హైకోర్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వం లోని 13 బ్యాంకుల కన్సార్షియం పటిష్టమైన వాదనలను వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ బ్రిగ్స్ తీర్పును రిజర్వ్ చేసుకున్నారు. మాల్యాను దివాలాకోరుగా ప్రకటిస్తే... రుణాలు రాబట్టుకునే విషయంలో భారత్ బ్యాంకింగ్ తదుపరి చర్యలు తీసుకోగలుగుతుంది. కేసు వివరాలు క్లుప్తంగా... ► భారత్ నుంచి బ్రిటన్ పారిపోయిన మాల్యా నుంచి 114.5 కోట్ల పౌండ్ల (రూ.10 వేల కోట్లపైన) వసూలు చేసుకునే క్రమంలో బ్యాంకింగ్ కన్సార్షియం 2018లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో మాల్యా తన వాదనలు వినిపిస్తూ... భారత్‌లోని పలు కోర్టుల్లో తనపై కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. ఆ కేసుల్లో తాను విజయం సాధించే అవకాశాలూ ఉన్నాయన్నారు. పైగా తనకు ఇచ్చిన రుణాల విషయంలో బ్యాం కులకు పూర్తి గ్యారంటీ (సెక్యూర్డ్ క్రెడిటార్స్) ఉందన్నారు. రుణ చెల్లింపుల పరిష్కారానికి తాను ఇచ్చిన ఆఫర్లను బ్యాంకింగ్ పట్టించుకోవడంలేదని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న లండన్ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ బ్రిగ్స్ మాల్యాపై పిటిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 10న కొట్టివేశారు. ► అయితే ఈ తీర్పుపై భారత్ బ్యాంకింగ్ కన్సార్షియం ఇటీవలే తాజాగా అమెండెడ్ పిటిషన్ దాఖలు చేసింది. మాల్యా చెబుతున్న అంశాల్లో నిజాలు లేవని ఈ పిటిషన్లో వివరించింది. మాల్యా ప్రతిపాదించిన సెటిల్మెంట్ ఆఫర్ యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్ (యూబీహెచ్ఎల్) ఆస్తులను బ్యాంకులు హైకోర్టులో ప్రస్తావిస్తూ, ‘‘ఈ ఆస్తులు అధికారిక లిక్విడేటర్ కింద ఉన్నాయి. మాల్యాకుగానీ లేదా ఒకప్పటి యూబీహెచ్ఎల్ యాజమాన్యానికి ఇవి అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సెటిల్మెంట్ ఆఫర్‌కు మాల్యా ఆయా ఆస్తులపై ఆధారపడజాలరు. ఆయన సెటిల్మెంట్ ఆఫర్ అమలుకు సాధ్యం కాదు. మాల్యా పేర్కొన్నట్లు బ్యాంకులు సెక్యూర్డ్ క్రెడిటార్స్ కాదు’’ అని మంగళవారంనాటి తన వాదనల్లో బ్యాంకింగ్ కన్సార్షియం తరఫు బారిష్టర్ షేక్‌డీమియన్ పేర్కొన్నారు. భారత్‌కు తనను అప్పగించరాదంటూ మాల్యా చేసిన వాదనలూ బ్రిటన్ న్యాయస్థానాల్లో వీగిపోయిన విషయాలను బ్యాంకింగ్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ► బారిష్టర్ ఫిలిప్ మార్షల్ నేతృత్వంలోని మాల్యా తరఫు లీగల్ టీమ్ మాత్రం బ్యాంకులు ‘సెక్యూర్ట్ క్రెడిటార్స్’ అనీ, బ్యాంకింగ్ తాజా పిటిషన్‌నూ కొట్టేయాలని తన వాదనల్లో వినిపించింది. -
దివాలా అంచున ఎయిర్‌లైన్స్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బకు విమానయాన రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ఫ్లయిట్ సర్వీసులు నిల్చిపోయి.. అటు టికెట్ల క్యాన్సిలేషన్లతో ఎయిర్‌లైన్స్ నిధుల కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో పలు విమానయాన సంస్థలు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం తగు సహాయక చర్యలు ప్రకటించి పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురికి ఫిక్కీ ఏవియేషన్ కమిటీ చైర్మన్ ఆనంద్ స్టాన్లీ లేఖ రాశారు. దేశీ ఎయిర్‌లైన్స్ ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలు రుణదాతలు జప్తు చేసుకోకుండా 90 రోజుల వెసులుబాటు కల్పించాలని కోరారు. అలాగే, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు విధించే వడ్డీలు,పెనాల్టీలు, ఇతర చార్జీల నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘గడిచిన కొద్ది రోజులుగా విమాన సేవలు నిల్చిపోవడంతో ఏవియేషన్ పరిశ్రమ దగ్గరున్న నిధుల నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి. ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంటున్న పెను సవాళ్లలో ఇదీ ఒకటి’ అన్నారు. -
జెట్ ఎయిర్వేస్ దివాలా
ముంబై: జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార గడువును 90 రోజుల పాటు పొడిగించేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతించింది. దక్షిణాఫ్రికాకు చెందిన సినర్జీ గ్రూపు మరింత సమయం కోరుతుండడం, మరో ఇద్దరు ఇన్వెస్టర్లు ఆసక్తి వ్యక్తీకరిస్తున్న నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ రుణ దాతల కమిటీ (సీవోసీ) దివాలా పరిష్కార గడువును పొడిగించాలంటూ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్‌ను కోరింది. జెట్ ఎయిర్వేస్కు కార్పొరేట్ దివాలా పరిష్కార గడువు (180 రోజులు) ఈ నెల 16న ముగియగా, ఈ గడువును మరో 90 రోజులు పాటు పొడిగిస్తూ ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది. జెట్ ఎయిర్వేస్కు సినర్జీ గ్రూపు ఒక్కటే బిడ్ దాఖలు చేయగా, వాటాదారుల ప్రయోజనం దృష్ట్యా పెట్టుబడులపై సరైన నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కోరుతుండడం గమనార్హం. -
బార్ట్రానిక్స్ దివాలాకు ఓకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ సర్వీసులు, బిజినెస్ సొల్యూషన్స్ కంపెనీ బార్ట్రానిక్స్ దివాలా పరిష్కార ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ అనుమతి ఇచ్చింది. ఇటీవల బీజేపీలో చేరిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి చెందిన కంపెనీగా గతంలో పలుమార్లు ఈ కంపెనీపై ఆరోపణలొచ్చాయి. ఆయన బినామీలే నడిపిస్తున్నారనే వ్యాఖ్యలూ వచ్చాయి. సుజనా చౌదరికి చెందిన కంపెనీలు సుజనా టవర్స్, సుజనా యూనివర్సల్, సుజనా స్టీల్స్ ఇప్పటికే వేల కోట్ల రూపాయలు బకాయిల్ని బ్యాంకులకు తిరిగి చెల్లించటంలో డిఫాల్ట్ అయ్యాయి. బార్ట్రానిక్స్ సైతం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంకు ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. బ్యాంకుకు బార్ట్రానిక్స్ అసలు, వడ్డీతో కలిపి రూ.39.96 కోట్లు బాకీ పడింది. మధ్యంతర పరిష్కార నిపుణుడిగా చిన్నం పూర్ణచంద్ర రావును ఎన్సీఎల్టీ నియమించింది. -
డీహెచ్ఎఫ్ఎల్ దివాలా దరఖాస్తుకు ఎన్సీఎల్టీ ఓకే
ముంబై: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై (డీహెచ్ఎఫ్ఎల్) దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతూ ఆర్బీఐ దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సోమవారం అనుమతించింది. ఈ పిటిషన్ ప్రవేశానికి అర్హమైనదని ఎన్సీఎల్టీ బెంచ్ స్పష్టం చేసింది. గృహ, ప్రాపర్టీ తనఖా రుణాల్లో డీహెచ్ఎఫ్ఎల్ దేశంలోనే మూడో అతిపెద్ద సంస్థ కావడం గమనార్హం. ఈ సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద ఆర్బీఐ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు ధర బీఎస్ఈలో 5 శాతం క్షీణించింది. రూ.19.70 వద్ద లోయర్ సర్క్యూట్ (ఒక రోజులో స్టాక్ ధర క్షీణించేందుకు గరిష్టంగా అనుమతించిన మేర) వద్దే క్లోజయింది. అటు ఎన్ఎస్ఈలోనూ ఇంతే మొత్తం క్షీణించి రూ.19.75 వద్ద ముగిసింది. -
డీహెచ్ఎఫ్ఎల్ పరిష్కార ప్రక్రియ వేగవంతం
ముంబై: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) దివాలా పరిష్కార ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ వేగవంతం చేసింది. ఈ విషయంలో అడ్మినిస్ట్రేటర్‌కు సలహాలు, సూచనలు చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీవ్ లాల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో ఎన్ఎస్ కణ్ణన్, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేష్ సభ్యులుగా ఉన్నారు. అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మాజీ ఎండీ సుబ్రమణియకుమార్‌కు ఈ కమిటీ తగు విధంగా తోడ్పాటు అందిస్తుందని ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంకులకు సుమారు రూ. 83,873 కోట్ల మేర బాకీ పడిన డీహెచ్ఎఫ్ఎల్ .. దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న తొలి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్/హౌసింగ్ సంస్థ. దివాలా స్మృతికి సంబంధించి ఇటీవల నోటిఫై చేసిన సెక్షన్ 227 ప్రకారం డీహెచ్ఎఫ్ఎల్ బోర్డును ఆర్బీఐ తన అజమాయిషీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
డీహెచ్ఎఫ్ఎల్ సత్వర పరిష్కారంపై ఎస్బీఐ ఆశలు
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ కింద చర్యలు ఎదుర్కోబోతున్న డీహెచ్ఎఫ్ఎల్ కేసు.. నిర్దిష్ట గడువులోగా పరిష్కారం కాగలదని బ్యాంకు లు ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. ‘ఇది ఇప్పుడే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు చేరింది. ఎన్సీఎల్టీ అమలు చేసే ప్రక్రియే దీనికీ వర్తిస్తుంది. సాధారణంగా పొడిగింపును కూడా పరిగణనలోకి తీసుకుంటే 330 రోజుల గడువు ఉంటుంది. లేకపోతే 180 రోజుల్లోనే పరిష్కార ప్రక్రియ పూర్తి కావాలి. దివాలా కోడ్(ఐబీసీ) ప్రక్రియ ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. నిర్దిష్ట కాలావధులకు లోబడే డీహెచ్ఎఫ్ఎల్ కేసు సత్వరం పరిష్కారం కాగలదని ఆశిస్తున్నాం’ అన్నారు. బ్యాంకులు మినహా ఇతరత్రా ఆర్థిక సంస్థల దివాలాకు సంబంధించి ఐబీసీలో సెక్షన్ 227ను చేరుస్తూ కేంద్రం గత శుక్రవారమే నిర్ణయం తీసుకుంది. దాని కింద ఎన్సీఎల్టీకి చేరిన తొలి కేసు డీహెచ్ఎఫ్ఎల్దే. గృహ రుణాల సంస్థ అయిన డీహెచ్ఎఫ్ఎల్.. 2019 జూలై ఆఖరు నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్‌హోల్డర్లకు ఏకంగా రూ. 83,873 కోట్లు బాకీ పడింది. -
దివాలా చర్యల్లో రూ.4.6 లక్షల కోట్ల గృహ ప్రాజెక్టులు: జేఎల్ఎల్
ముంబై: రియల్ ఎస్టేట్ మార్కెట్లో మందగమనం, నిధుల లభ్యత సమస్యలతో 66 బిలియన్ డాలర్ల విలువైన (రూ.4.6 లక్షల కోట్లు) నివాసిత గృహ ప్రాజెక్టులు దివాలా చర్యలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని స్థిరాస్థి కన్సల్టెన్సీ జేఎల్ఎల్ తెలిపింది. ఎన్నో కారణాలతో 4.52 లక్షల యూనిట్లు గడువు దాటిపోయినా పూర్తి కాకుండా కొనసాగుతున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో నివాసిత రియల్ ఎస్టేట్ విభాగంలోనే సమస్యలను ఎదుర్కొంటున్న ఆస్తులు (స్ట్రెస్డ్ అసెట్స్) ఎక్కువగా ఉన్నాయి. ఆలస్యమైన, నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో 4.54 లక్షల యూనిట్లు గడువు దాటినా కానీ పూర్తి కాకుండా ఉన్నాయి’’ అని జేఎల్ఎల్ తెలిపింది. వీటిల్లో కొన్ని ఇప్పటికే దివాలా చర్యల పరిధిలో ఉన్నాయని, వీటి విలువ 66 బిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. -
దివాలా వార్తలపై క్లారిటీ ఇచ్చిన లింగమనేని
సాక్షి, హైదరాబాద్: ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు వచ్చిన కథనాలపై ఆ కంపెనీ అధినేత లింగమనేని రమేశ్ క్లారిటీ ఇచ్చారు. లింగమనేని ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు ప్రకటించాలని తాము కోరలేదని తెలిపారు. జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఎయిర్ కోస్తా ఒప్పందంలో కొన్ని సమస్యలొచ్చాయని, వాటిని పరిష్కరించుకునేలోపే సదరు సంస్థ.. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసిందని లింగమనేని రమేశ్ చెప్పుకొచ్చారు. జర్మన్ సంస్థ పిటిషన్ ఆధారంగా కంపెనీ లా ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ వ్యవహారంతో ఎల్ఈపీఎల్లోని ఇతర కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తమ ఆర్ధిక పరిస్థితులు బాగాలేవంటూ వచ్చిన కథనాలను తోసిపుచ్చిన ఆయన.. ఆర్థికంగా తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు. గతంలో తమ రుణదాతలకు చెల్లింపులు చేయలేని పరిస్ధితి ఎప్పుడూ లేదని అన్నారు. 1996లో విజయవాడలో రిజిస్టరైన లింగమనేని రమేశ్‌కు చెందిన ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు ఈ నెల 14న కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు పిటిషన్ దాఖలైంది. తీసుకున్న రుణాలు చెల్లించలేనంటూ లింగమనేని కంపెనీ చేతులెత్తేయడంతో రుణాలు ఇచ్చిన కంపెనీలకు ఈ నెల 29 వరకు ఎన్సీఎల్టీ అనుమతి ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. లింగమనేనికి చెందిన ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దివాలాకు సంబంధించి దినపత్రికల్లో ప్రచురితమైన బహిరంగ ప్రకటన ఇది -
విసిగిపోయాం..సొంత పేరు పెట్టుకుంటాం!
సాక్షి. న్యూఢిల్లీ: బ్రిటన్ ట్రావెల్ దిగ్గజం థామస్‌కుక్ దివాలా తీయడం దేశీయంగా సేవలు నిర్వహిస్తున్న థామస్‌కుక్ ఇండియాకు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 2012 నుంచి దేశీయంగా స్వతంత్ర సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న థామస్ కుక్ ఇండియా పేరు మార్చుకోవాలని యోచిస్తోంది. ఎందుకంటే దివాలా తీసిన బ్రిటిన్ సంస్థకు చెందిన 22వేల ఉద్యోగాలు (ప్రపంచవ్యాప్తంగా) ప్రమాదంలో పడనున్నాయి. అలాగే అకస్మాత్తుగా పలు విమానల సర్వీసులను నిలిపి వేయడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడిక్కడ చిక్కుక పోయారన్న వార్త ఆందోళనకు దారితీసింది. స్టాక్మార్కెట్లో ఈ కౌంటర్లో అమ్మకాల వెల్లువ ఈ రోజు (మంగళవారం) కూడా కొనసాగుతోంది. దీంతో ఈ పరిణామాంలపై స్పందించిన థామస్‌కుక్ (ఇండియా) లిమిటెడ్ (బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ)కి యుకెసంస్థతో ఎటువంటి సంబంధం లేదని పునరుద్ఘాటించింది. అలాగే తమకు, ప్రస్తుత సంక్షోభానికి ఎలాంటి సంబంధమూ లేదని ప్రకటించింది. నిర్వహణ, లాభాల పరంగా తాము చాలా పటిష్టంగా ఉన్నామని స్పష్టం చేసింది. 2012 నాటికి ఒప్పందం ప్రకారం 2024 వరకు 'థామస్ కుక్' బ్రాండ్ పేరును ఉపయోగించుకునే హక్కు కంపెనీకి ఉందని కంపెనీ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ మాధవన్ మీనన్ వెల్లడించారు. అయితే సంస్థ సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున సంస్థలో సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున రాబోయే రోజుల్లో కూడా దీనిని సమీక్షించే అవకాశం ఉందనీ, దాదాపు రెండు వారాల్లో వివరణాత్మక పరివర్తన ప్రణాళిక అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. . కాగా థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్‌లో మేజర్ వాటాను(77 శాతం) ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ 2012లో కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్ (మారిషస్) లిమిటెడ్ - ఫెయిర్‌ఫాక్స్ కంపెనీ దాదాపు 67 శాతం వాటాను కలిగి ఉంది. చదవండి: కుప్పకూలిన దిగ్గజం, 22 వేల ఉద్యోగాలు ప్రమాదంలో చదవండి : ‘థామస్ కుక్’ దివాలా... -
‘థామస్ కుక్’ దివాలా...
లండన్: ప్రముఖ బ్రిటిష్ పర్యాటక సంస్థ.. 178 ఏళ్ల చరిత్ర ఉన్న థామస్ కుక్ దివాలా తీసింది. దీంతో దాదపు 6 లక్షల మంది పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్‌కు చెందిన లక్షన్నరకు పైగా యాత్రికులు వివిధ దేశాల్లో చిక్కుకు పోయారు. వీరందరినీ స్వదేశానికి తరలించడానికి ఇంగ్లాండ్ ప్రభుత్వానికి భారీగానే వ్యయం కానున్నది. బల్గేరియా, క్యూబా, అమెరికా, టర్కీ తదితర దేశాల నుంచి ఈ యాత్రీకుల తరలింపునకు ఇప్పటికే ఇంగ్లాండ్ ప్రభుత్వం అత్యవసర ప్రణాళికలను ప్రకటించింది. ఆపరేషన్ మ్యాటర్‌హార్న్ పేరుతో ఈ తరలింపును తక్షణం ప్రారంభించింది. దీని కోసం డజన్ల కొద్దీ చార్టర్ విమానాలను ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక సంఖ్యలో బ్రిటీషర్లను స్వదేశానికి తీసుకురావడం ఇదే మొదటిసారి. మరోవైపు ఇంగ్లాండ్‌లో 9,000 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 22 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. వేరే దారి లేక దివాలా.. 178 ఏళ్ల చరిత్ర గల ఈ కంపెనీ భారీ రుణ భారంలోకి కూరుకుపోయింది. ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణ యత్నాలు విఫలమవడంతో దివాలా తీసినట్లుగా సోమవారం ప్రకటించింది. కంపెనీ వాటాదారులకు, కొత్తగా రుణాలివ్వడానికి ముందుకు వచ్చిన సంస్థలకు మధ్య అవగాహన ఒప్పందం కుదర్చడంలో శతథా ప్రయత్నాలు చేశామని, అవన్నీ విఫలమయ్యాయని పేర్కొంది. వేరే దారి లేక తక్షణం దివాలా తీసినట్లుగా ప్రకటిస్తున్నామని వెల్లడించింది. ఆన్లైన్ సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవడం, బ్రెగ్జిట్ అనిశ్చితి కారణంగా హాలిడే ట్రిప్పులు, ప్యాకేజీల బుకింగ్స్ పడిపోవడం థామస్ కుక్ కష్టాలను మరింతగా పెంచింది. 2007లో మై ట్రావెల్ సంస్థను థామస్ కుక్ విలీనం చేసుకోవడం ఆ కంపెనీ పుట్టి మునగడానికి గల కారణాల్లో ఒకటి. వ్యయాలు తడిసి మోపెడై భారీ రుణ ఊబిలోకి కూరుకుపోయింది. 1841 నుంచి కార్యకలాపాలు.. 1841లో థామస్ కుక్ తన పేరు మీదనే ఈ పర్యాటక సంస్థను స్థాపించాడు. ఆరంభంలో ఇంగ్లాండ్‌లోని రైల్వే ప్రయాణికులకు పర్యాటక సేవలందించిన ఈ సంస్థ, ఆ తర్వాత విదేశీ యాత్రలను నిర్వహించడం మొదలు పెట్టింది. . పర్యాటకానికి సంబంధించి వివిధ రంగాల్లోకి విస్తరించింది. వార్షిక టర్నోవర్ 1,000 కోట్ల పౌండ్లు, ప్రపంచవ్యాప్తంగా 2కోట్ల మందికి పర్యాటక సేవలందించే ఘనతలున్నప్పటికీ, భారీ రుణ ఊబిలోకి కూరుకుపోయింది. ఒకప్పుడు లండన్ స్టాక్ మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన ఈ కంపెనీ షేరును ఇటీవలే తొలగించారు. గోవా పర్యాటకంపై దెబ్బ థామస్ కుక్ దివాలా ప్రకటన గోవా పర్యాటకంపై తీవ్ర ప్రభావమే చూపించనున్నది. గత టూరిస్ట్ సీజన్లో దాదాపు 30 వేలమంది బ్రిటీషర్లు గోవా వచ్చారు. వీరంతా థామస్ కుక్ ఏర్పాటు చేసిన చార్టర్డ్ విమానాల ద్వారా వచ్చిన వాళ్లే, రోజుకు 300 మందిని ఇంగ్లాండ్ నుంచి గోవాకు థామస్ కుక్ తీసుకువచ్చేది. ఒక్కో బ్రిటీషర్ గోవాలో సగటున రెండు వారాలు పాటు ఉంటారని అంచనా. ఇక థామస్ కుక్ దివాలా తీయడంతో ఇంగ్లాండ్ నుంచి వచ్చే పర్యాటకులు సగం మేర తగ్గుతారని విశ్లేషకులంటున్నారు. కాగా థామస్ కుక్ భారత కార్యకలాపాలను 2012లో కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కొనుగోలు చేసింది. థామస్ కుక్ యూకేకు, థామస్ కుక్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదిన థామస్ కుక్ ఇండియా స్పష్టం చేసింది. -
దివాలా అంచుల్లో థామస్ కుక్
లండన్: బ్రిటిష్ పర్యాటక సంస్థ, థామస్ కుక్ దివాలా స్థితికి చేరింది. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ దొరకడం దుర్లభం కావడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తోంది. ఫలితంగా ఈ కంపెనీ ద్వారా వివిధ దేశాల్లో పర్యటిస్తున్న లక్షన్నర మంది బ్రిటిష్ పర్యాటకులు ఇబ్బందులు పడనుండగా, వేలాదిమంది ఉద్యోగులు వీధినపడే అవకాశాలున్నాయి. థామస్ కుక్కు తగిన నిధులు అందకపోతే, ఈ లక్షన్నర మంది పర్యాటకులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి భారీగానే ఖర్చు కానున్నది. తక్షణం 25 కోట్ల డాలర్లు అవసరం... కార్యకలాపాలు కొనసాగించడానికి 25 కోట్ల డాలర్ల నిధులు అవసరమని థామస్ కుక్ గత శుక్రవారం వెల్లడించింది. నిధుల కోసం ఈ కంపెనీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రభుత్వం ఆదుకోకపోతే, థామస్ కుక్ కంపెనీ మూతపడక తప్పదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అయితే దీర్ఘకాలంలో ఈ కంపెనీ మనుగడపై సందేహాలున్న ప్రభుత్వ వర్గాలు ఎలాంటి తోడ్పాటు నందించేందుకు సుముఖంగా లేవని ది టైమ్స్ పత్రిక పేర్కొంది. రెండు రోజుల్లో ఈ విషయమై స్పష్టత రావచ్చని ఆ పత్రిక వెల్లడించింది. ఈ కంపెనీ మూతపడితే వేలాది మంది ఉద్యోగులు వీధులపాలవుతారని, కంపెనీని ప్రభుత్వమే ఆదుకోవాలని కంపెనీ ఉద్యోగుల సంఘం, టీఎస్ఎస్ఏ(ట్రాన్స్పోర్ట్ శాలరీడ్ స్టాఫ్స్ అసోసియేషన్) కోరుతోంది. మోనార్క్ ఎయిర్‌లైన్స్ మునిగిపోయినప్పుడు.. ప్రస్తుతం థామస్ కుక్ ఎదుర్కొంటున్న విషమ పరిస్థితినే రెండేళ్ల క్రితం మోనార్క్ ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంది. ఈ కంపెనీ మునిగిపోయినప్పుడు లక్షా పదివేల మంది ప్రయాణికులు వివిధ చోట్ల చిక్కుకు పోయారు. వీరిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి బ్రిటన్ ప్రభుత్వానికి 6 కోట్ల పౌండ్ల ప్రభుత్వ సొమ్ములు ఖర్చు చేయాల్సి వచ్చింది. అంతే కాకుండా బ్రిటన్‌లో 9,000 మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా 22,000 ఉద్యోగాలు పోయాయి. బ్రెగ్జిట్, ఆన్లైన్ పోటీతో భారీగా నష్టాలు... ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టాలు భారీగా పెరగనున్నాయని ఈ ఏడాది మేలోనే థామస్ కుక్ వెల్లడించింది. బ్రెగ్జిట్ అనిశ్చితి కారణంగా సమ్మర్ హాలిడే బుకింగ్స్ ఆలస్యం కావడంతో నష్టాలు పెరిగాయి. -
జీసీఎక్స్ దివాలా పిటిషన్
అనిల్ అంబానీకి చెందిన మరో కంపెనీ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. అనిల్ అంబానీ టెలికాం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కు చెందిన యూనిట్ దివాలా రక్షణ కోసం దాఖలు చేసింది. ప్రపంచలోనే అతిపెద్ద అండర్ వాటర్ కేబుల్ నెట్‌వర్క్‌కు యజమాని జీసీఎక్స్ లిమిటెడ్ 350 మిలియన్ డాలర్లు విలువైన బాండ్ల చెల్లింపులు చేయడంలో విఫలం అయింది. ఈ బాండ్లకు ఆగస్టు 1 మెచ్యూర్ తేదీగా ఉంది. మరోవైపు అంబానీ నియంత్రణలో ఉన్న అడాగ్‌కు చెందిన రిలయన్స్ నావెల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ కూడా తీవ్రమైన నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. దీనికితోడు బాండ్లకు చెల్లింపులు చేసేందుకు జీసీఎక్స్ చేసిన ప్రయత్నాలు మొత్తం విఫలం అయ్యాయి. దీంతో రుణాన్ని వాటాలుగా మార్చే అంశాన్ని కూడా పరిశీలించారు. చివరకు అదీ విఫలం కావడంతో డెలావర్ కోర్టులో దివాలాకు సంబంధించి చాప్టర్ 11 పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా అనిల్ అంబానీ అప్పుల సంక్షోభంలో కొ ట్టుమిట్టాడుతున్నసంగతి తెలిసిందే. ఆస్తుల విక్రయం ద్వారా 3.1బిలియన్ డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. -
బ్రిటీష్ స్టీల్ దివాలా
లండన్: రుణభారం పేరుకుపోయిన బ్రిటిష్ స్టీల్ సంస్థ దివాలా ఎట్టకేలకు ఖరారైంది. ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావటంతో దివాలా ఖరారయింది. బ్రిటిష్ స్టీల్ లిమిటెడ్‌ను మూసివేయాలని హైకోర్టు నిర్ణయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఆస్తులు విక్రయించి రుణాలను తీర్చాల్సి రానుంది. సంక్షోభ పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా బ్రిటిష్ స్టీల్‌కు కొంత మేర నిధులు సమకూర్చింది. అలాగే, బ్రిటిష్ స్టీల్, దాని యాజమాన్య సంస్థ గ్రేబుల్ క్యాపిటల్‌తో సుదీర్ఘ చర్చలు జరిపింది. కానీ చివరికి చర్చలు విఫలం కావడంతో దివాలా తప్పలేదు. బ్రిటిష్ స్టీల్ దివాలాతో 5,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. అలాగే, సంస్థ సరఫరా వ్యవస్థతో ముడిపడి ఉన్న మరో 20,000 మందిపై కూడా ప్రతికూల ప్రభావం పడనుంది. ఒకవేళ డీల్ గానీ సాకారమై ఉంటే బ్రిటన్‌లోని వేల్స్లో టాటా స్టీల్‌కు చెందిన టాల్బోట్ ప్లాంటు విషయంలోనూ కొంత ఆశలు సజీవంగా ఉండేవి. సంక్షోభంలో ఉన్న దీన్ని జర్మనీకి చెందిన థిస్సెన్క్రప్లో విలీనం చేయాలని టాటా స్టీల్ ప్రయత్నించినప్పటికీ.. డీల్ కుదరలేదు. -
ఆర్‌కాం దివాలా ప్రక్రియ షురూ
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కాం) నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. అలాగే దివాలా ప్రక్రియనుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను ఎన్సీఎల్టీ గురువారం అంగీకరించింది. దివాలా ప్రక్రియలో 357రోజుల (మే 30, 2018 నంచి ఏప్రిల్ 30 2019) కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్‌కామ్ కోరగా ట్రైబ్యునల్ ఇందుకు సమ్మతించింది. అనంతరం తదుపరి విచారణను మే30వ తేదీకి వాయిదా వేసింది. ఎస్బీఐతో పాటు వివిధ బ్యాంకులకు ఆర్‌కామ్ రూ.50వేల కోట్ల వరకు అప్పు ఉంది. ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చెల్లించని పరిస్థితికి దిగజారింది. దీంతో దివాలా పెట్టేందుకు కంపెనీ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. గురువారం మరోసారి విచారణ జరిపిన ట్రైబ్యునల్ కంపెనీ దివాలా ప్రక్రియకు అనుమతి ఇస్తూ సంస్థ బోర్డును రద్దు చేసింది. కొత్త రిసొల్యూషన్ ప్రొఫెషనల్‌ను అపాయింట్ చేసింది. అంతేకాకుండా ఎస్బీఐ నేతృత్వంలోని 31 బ్యాంకు కన్సార్షియానికి క్రెడిటర్స్ కమిటీ ఏర్పాటుకు అనుమతిచ్చింది. ఇప్పటికే దాఖలైన దివాలా పిటిషన్ పైన నేషనల్ కంపెనీ లా అప్పెలట్ ట్రైబ్యునల్, సుప్రీం కోర్టు స్టే విధించాయి. ఈ నేపథ్యంలో ఈ 357 రోజుల కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్‌కాం కోరింది. ఇందుకు ట్రైబ్యునల్ ఒప్పుకుంది. ఈ కేసులో తదుపరి విచారణను మే 30 నాటికి వాయిదా వేసింది. అప్పటి లోగా కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని రిసొల్యూషన్ ప్రొఫెషనల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఆర్‌కాం గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. రెండేళ్ల క్రితం కార్యకలాపాలు నిలిపేసింది. దీంతో ఆర్.కామ్ స్పెక్ట్రంను జియోకు విక్రయించేందుకు సిద్ధపడింది. కానీ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అనుమతులు అందలేదు. -
కొనసాగుతున్న ‘ల్యాంకో’ దివాలా పరంపర
సాక్షి, హైదరాబాద్: ల్యాంకో గ్రూపు కంపెనీల దివాలా పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో కంపెనీ దివాలా ప్రక్రియ జాబితాలో చేరింది. ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ దివాలాకు అనుమతినిస్తూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ ఉత్తర్వులు జారీ చేసింది. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో యాక్సిస్ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్సీఎల్టీ సభ్యులు అనంతపద్మనాభస్వామి ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కోల్‌కతాకు చెందిన పంకజ్ దనుఖాను తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడు (ఐఆర్పీ)గా నియమించారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో గ్యాస్, నాఫ్తా ఆధారిత విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. కార్యకలాపాల నిమిత్తం వివిధ బ్యాంకుల నుంచి కంపెనీ పెద్దఎత్తున రుణాలు తీసుకుంది. ఈ విధంగా యాక్సిస్ బ్యాంకుకు 2018 ఆగస్ట్ 31 నాటికి రూ. 657.41 కోట్లు బకాయి పడింది. రుణాలు చెల్లించకపోవడంతో యాక్సిస్ బ్యాంకు ఎన్సీఎల్ టీని ఆశ్రయించి, ల్యాంకో కొండపల్లి దివాలాను ప్రారంభించాలని పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై ఎన్సీఎల్టీ సభ్యులు అనంతపద్మనాభస్వామి విచారణ జరిపారు. ల్యాంకో తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అదుపులో లేని పరిస్థితుల వల్ల కంపెనీకి ఇబ్బందులు వచ్చాయన్నారు. గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, గ్యాస్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో దివాలా ప్రక్రియ ప్రారంభించరాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. తరువాత యాక్సిస్ బ్యాంకు వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ల్యాంకో కొండపల్లికి ఏ సంబంధం లేదని తెలిపింది. రుణం చెల్లించాలని ఎన్నిసార్లు కోరినా ల్యాంకో కొండపల్లి స్పందించలేదన్నారు. వాదనలు విన్న ట్రిబ్యునల్, ల్యాంకో కొండపల్లి దివాలా ప్రక్రియకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కంపెనీల ఆస్తుల క్రయ, విక్రయాలు, బదలాయింపులపై నిషేధం విధించింది. ఈ దివాలా ప్రక్రియకు పూర్తిగా సహకరించాలని కంపెనీ డైరెక్టర్లను ఆదేశించింది. -
షేర్ల తాకట్టులో టాప్ అనిల్ అంబానీ
ముంబై: అనిల్ అంబానీ తన గ్రూపులోని రెండు కంపెనీల్లో తనకున్న వాటాల్లో 95 శాతానికి పైగా వాటాల్ని తాకట్టు పెట్టేశారు. సుభాష్‌చంద్ర ఆధ్వర్యంలోని ఎస్సెల్ గ్రూపు ప్రమోటర్లు సైతం జీ ఎంటర్టైన్మెంట్, డిష్‌టీవీ కంపెనీల్లో 66.2 శాతం నుంచి 94.6 శాతం మధ్య వాటాలను లెండింగ్ సంస్థల వద్ద కుదువ పెట్టారు. మార్చి త్రైమాసికం నాటికి లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన ప్రమోటర్ల వాటాల తనఖా వివరాలను కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. బీఎస్ఈలోని టాప్ 500 కంపెనీల డేటాను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం... ►డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మార్చి క్వార్టర్లో తనఖా వాటాల విలువ తగ్గింది. డిసెంబర్ నాటికి ప్రమోటర్ల తనఖా మొత్తంమీద 2.98శాతంగా ఉండగా, మార్చి త్రైమాసికం నాటికి 2.83 శాతానికి తగ్గింది. ►కుదువ పెట్టిన వాటాల విలువ రూ.1.95 లక్షల కోట్లు. బీఎస్ఈ 500 సూచీ మార్కెట్ క్యాప్‌లో ఇది 1.38 శాతానికి సమానం. ►రిలయన్స్ ఇన్ఫ్రాలో 98.3 శాతం, రిలయన్స్ క్యాపిటల్‌లో 96.9 శాతం మేర ప్రమోటర్ల వాటాలు తాకట్టు కిందకు వెళ్లాయి. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మార్చి త్రైమాసికంలో ఈ రెండు కంపెనీల్లో తాకట్టు వాటాలు పతాక స్థాయికి చేరాయి. ►అనిల్ అంబానీకే చెందిన మరో కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో తాకట్టు వాటాల పరిమాణం తగ్గింది. ►95 శాతానికి పైగా ప్రమోటర్ల వాటాలు తనఖాలో ఉన్న కంపెనీల్లో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్, స్టెరిలైట్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. ► మార్చి త్రైమాసికంలో ప్రమోటర్ల తనఖా వాటాలు అనూహ్యంగా పెరిగిన కంపెనీల్లో జేకే టైర్, డిష్‌టీవీ, వాటెక్ వాబాగ్ సైతం ఉన్నాయి. ► బీఎస్ఈ 500లో 116 కంపెనీల ప్రమోటర్లు తమ వాటాలను తాకట్టు పెట్టారు. -
జెట్ క్రాష్‌లో ఎతిహాద్ కుట్ర!
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయి సేవలను నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ ఉదంతంలో భారీ కుట్ర చోటుచేసుకుందా? తాజాగా జెట్ పైలట్ల ఆరోపణలతో ఇప్పుడు పెద్ద దుమారమే చెలరేగుతోంది. కంపెనీలో ప్రధాన వాటాదారు అయిన ఎతిహాద్ ఎయిర్వేస్, ఎస్బీఐ కలిసి ఈ కుట్రకు తెరతీసాయని... దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని జెట్ ఎయిర్వేస్ పైలట్లు కోరారు. కంపెనీ షేరు ధరను స్టాక్ మార్కెట్లో కుప్పకూల్చడం ద్వారా ఎతిహాద్ జెట్‌లో మరో 25 శాతం వాటాను చేజిక్కించుకోవాలనుకుందని, అందుకే ఈ కుట్రకు తెరతీశారని పైలట్లు ఆరోపించారు. తద్వారా కంపెనీని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకోవాలనేది ఆ కంపెనీ వ్యూహమన్నారు. జెట్ ఎయిర్వేస్లో యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్కు ప్రస్తుతం 24 శాతం వాటా ఉంది. రోజువారీ కార్యకలాపాలకు కూడా నిధులు లేకపోవడంతో జెట్ సేవలను ఇటీవలే తాత్కాలికంగా నిలిపివేశారు. జెట్ ప్రమోటర్ నరేశ్ గోయల్ తన వాటా షేర్లను తనఖా పెట్టి రూ.1,500 కోట్ల తాజా నిధులను అందించేందుకు సిద్ధపడినా.. ఎస్బీఐ ముందుకు రాలేదని, ఎతిహాద్ కూడా ఈ కష్టకాలంలో కావాలనే సహాయ నిరాకరణకు పాల్పడిందని పైలట్లు పేర్కొన్నారు. జెట్ పతనం వెనుక ఎతిహాద్ పాత్రను దర్యాప్తు చేసి నిగ్గుతేల్చాలని ప్రధానిని అభ్యర్థించారు.గురువారం బీఎస్ఈలో మరో 20 శాతం మేర దిగజారి రూ.122కు పడిపోయింది. చివర్లో కాస్త కోలుకుని 12% నష్టంతో రూ.135 వద్ద ముగిసింది. -
ఆర్‌కామ్ దివాలాకు.. తొలగిన అడ్డంకులు
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) దివాలా ప్రక్రియను ఎదుర్కోనుంది. కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలు చేపట్టేందుకు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) అనుమతించింది. ఎరిక్సన్ పిటిషన్ మేరకు కంపెనీకి వ్యతిరేకంగా దివాలా ప్రక్రియకు ఎన్సీఎల్టీ లోగడ ఆదేశించగా.., దీన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌కామ్ గతేడాది జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్‌కామ్, ఆ సంస్థ అనుబంధ కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రాటెల్, రిలయన్స్ టెలికాంకు వ్యతిరేకంగా ఎరిక్సన్ దివాలా పిటిషన్ వేయడంతో ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ 2018 మే 15న తీర్పు జారీ చేసింది. తాత్కాలిక పరిష్కార నిపుణుడిని సైతం నియమించింది. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తాజాగా వెనక్కి తీసుకుంది. సంస్థ పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో దివాలా ప్రక్రియ మెరుగైనదిగా కంపెనీ బోర్డు భావించింది. దీంతో ఎన్సీఎల్టీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని ఆర్‌కామ్ కోరడంతో అందుకు ఎన్సీఎల్ఏటీ అనుమతించింది. -
పుంజులాయిడ్ దివాలాకు ఎన్సీఎల్టీ ఓకే!
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, నిర్మాణ రంగం కంపెనీ పుంజ్‌లాయిడ్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీకి వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంకు దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను ఎన్సీఎల్టీ ఆమోదించింది. రూ.853.83 కోట్ల రుణ బకాయిలను పుంజ్‌లాయిడ్ చెల్లించకపోవడంతో, ఐసీఐసీఐ బ్యాంకు ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్టీ ఢిల్లీ బెంచ్ అనుమతించింది. ఎన్సీఎల్టీ పూర్తి ఆదేశాల కాపీ తమకు అందాల్సి ఉందని, ఆ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పుంజ్‌లాయిడ్ స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. వాస్తవానికి ఐసీఐసీఐ బ్యాంకు గతేడాది జూన్‌లోనే పుంజ్‌లాయిడ్‌కు వ్యతిరేకంగా ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసింది. అయితే, కంపెనీ నిర్వహణలో పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, రుణాల పునరుద్ధరణకు అనుకూలంగా ఉన్నట్టు ఎస్బీఐ, ఇతర రుణదాతలు ఐసీఐసీఐ పిటిషన్‌ను వ్యతిరేకించారు. పుంజ్‌లాయిడ్‌కు రూ.6,000 కోట్ల రుణ భారం ఉంది. ఇందు లో ఐసీఐసీఐ బకాయి మొత్తం రూ.854 కోట్లు. -
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ దివాలా ప్రక్రియ ప్రారంభించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ నిర్మాణ కంపెనీ బీజీ షిర్కే కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించింది. 2018 నాటికి తమకు రూ.334.76 కోట్లు చెల్లించాల్సి ఉందని, అయితే ఈ డబ్బు చెల్లించే పరిస్థితుల్లో స్వగృహ కార్పొరేషన్ లేనందున ఆ సంస్థ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఎన్సీఎల్టీ సభ్యులు కె.అనంత పద్మనాభస్వామి విచారణ జరిపారు. షిర్కే కంపెనీ తరఫున న్యాయవాది డి.వి.సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జవహర్‌నగర్‌లో రూ.786 కోట్లతో 6,216 ప్లాట్లతో 37 బ్లాకులు నిర్మించేందుకు తమ కంపెనీతో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ 2009లో ఒప్పందం చేసుకుందని తెలిపారు. కొంతకాలం బిల్లులు చెల్లించిన కార్పొరేషన్ ఆ తర్వాత బిల్లులు చెల్లించడం మానేసిందన్నారు. అనంతరం 37 బ్లాకులను 17 బ్లాకులకు పరిమితం చేసిందని వివరించారు. 2016లో ఈ ప్రాజెక్ట్ పూర్తయిందని, 2018 మార్చి 31 నాటికి తమకు రూ.334.76 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదని వివరించారు. స్వగృహ కార్పొరేషన్ తరఫు న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. షిర్కే కంపెనీ ఫిబ్రవరి 22న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చైర్మన్‌కు లేఖ రాసిందన్నారు. చెల్లింపులకు సంబంధించి వివిధ శాఖలతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికారుల సమావేశం జరగలేదని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని, ఇందుకు కొంతసమయం పడుతుందని తెలిపారు. వాదనలు విన్న ట్రిబ్యునల్, అధికారులు సమావేశం నిర్వహించుకోవాలని, ఆ సమావేశం వివరాలను, అందులో తీసుకున్న నిర్ణయాలను తమ ముందుంచాలని స్పష్టంచేసింది. విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. -
అమెజాన్‌కూ ఆ గతి పట్టొచ్చు..
న్యూయార్క్ : ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ కుప్పకూలుతుందని, దివాళా బాట పడుతుందని ఇప్పట్లో ఎవరూ ఊహించరు. అయితే అమెజాన్ ఏదో ఒక రోజు పతనమవుతుందని, దివాళా తీస్తుందనీ సాక్షాత్తూ సంస్థ వ్యవస్ధాపకులు జెఫ్ బెజోస్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సీటెల్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులతో జరిగిన ప్రత్యేక భేటీలో ఓ ఉద్యోగి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ బెజోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. రిటైల్ రంగంలో నెలకొన్న సంక్షోభంతో పాటు అమెరికన్ డిపార్ట్మెంట్ స్టోర్ చైన్ సియర్స్ దివాళా తీయడం నుంచి మీరు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకున్నారని ఓ ఉద్యోగి అమెజాన్ అధినేతను ప్రశ్నించారు. అమెజాన్ సైతం పడిపోకుండా ఉండేంత దిగ్గజమేమీ కాదని బెజోస్ బదులిచ్చి ఉద్యోగులను విస్మయంలో ముంచెత్తారని సీఎన్‌బీసీ న్యూస్ పేర్కొంది. దిగ్గజ కంపెనీలను పరిశీలిస్తే అవి మూడు దశాబ్ధాలకు పైబడి వాటి జీవితకాలం సాగిందని, వందేళ్లకు పైగా మనుగడ కొనసాగించినవి లేవని ప్రస్తావించినట్టు తెలిపింది. అమెజాన్‌లో ఉన్న ప్రతి ఉద్యోగి సంస్థ మనుగడ ముగిసిపోకుండా వీలైనంత పొడిగించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని బెజోస్ పిలుపు ఇచ్చారు. మనం కస్టమర్లపై కాకుండా మనపైనే దృష్టి కేంద్రీకరిస్తే అదే పతనానికి ప్రారంభమవుతుందని హెచ్చరించారు. అలాంటి రోజు రాకుండా దాన్ని నివారించడానికి మనం శక్తివంచన లేకుండా ప్రయత్నించాలన్నారు. కాగా న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ సిటీ ప్రాంతంతో పాటు వాషింగ్టన్ డీసీల్లో తమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని గతవారం అమెజాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు కేంద్రాలతో రెండు నగరాల్లో 25,000కు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. -
మరో ల్యాంకో గ్రూపు కంపెనీపై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్...
సాక్షి, హైదరాబాద్: ల్యాంకో గ్రూపునకు చెందిన మరో కంపెనీ దివాలా కోసం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. తమకు చెల్లించాల్సిన రుణ బకాయి రూ.786.74 కోట్లను చెల్లించడంలో ల్యాంకో విదర్భ థర్మల్ పవర్ లిమిటెడ్ విఫలమైందని, అందువల్ల ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ ల్యాంకో విదర్భ థర్మల్ పవర్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ సభ్యులు రాతకొండ మురళీ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరఫు న్యాయవాది రాజశేఖర్ రావు సల్వాజీ వాదనలు వినిపిస్తూ, మహారాష్ట్ర, వార్ధా జిల్లా, మాండవలో 1320 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు కోసం ల్యాంకో విదర్భ థర్మల్ పవర లిమిటెడ్ 2010లో పలు బ్యాంకుల కన్సార్టియం నుంచి మొదట రూ.5549 కోట్ల రుణం తీసుకుందని, ఇందులో పీఎన్బీ వాటా రూ.750 కోట్లని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం పెరగడంతో కన్సార్టియం నుంచి ల్యాంకో విదర్భ అదనపు రుణం తీసుకుందని, దీంతో మొత్తం రుణం రూ.9613 కోట్లకు చేరిందన్నారు. అదనపు రుణంతో పీఎన్బీ నుంచి తీసుకున్న అప్పు రూ.1340 కోట్లకు చేరిందని వివరించారు. ఈ రుణానికి ల్యాంకో యజమానులైన ఎల్.మధుసూధన్‌రావు, ఎల్.రామలక్ష్మమ్మలు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించారని, అలాగే మహరాష్ట్రలో ఉన్న పలు ఆస్తులను తాకట్టు పెట్టారని తెలిపారు. తీసుకున్న రుణాన్ని చెల్లించడంలో ల్యాంకో విదర్భ విలఫమైందని, పలు నోటీసులు పంపినా స్పందించడం లేదన్నారు. కన్సార్టియంకు రూ.4784.77 కోట్లు బకాయి ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 786.74 కోట్ల చెల్లించాల్సి ఉందన్నారు. 2017 నాటికి పూచీకత్తుగా ఉంచిన భూమి, భవనాలు, ప్లాంట్, యంత్రాల విలువ రూ.4083.71 కోట్లుగా విలువ కట్టడం జరిగిందన్నారు. నోటీసులకు స్పందన లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక ల్యాంకో విదర్భ థర్మల్ పవర్ లిమిటెడ్ దివాలా ప్రక్రియ నిమిత్తం ఈ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని రాజశేఖరరావు వివరించారు. తమ బకాయిని రాబట్టుకునేందుకు ల్యాంకో విదర్భ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని, ఇందుకోసం దివాలా పరిష్కార నిపుణుడిగా హర్యానాకు చెందిన విజయకుమార్ గార్గ్‌ను నియమించాలని ఆయన ట్రిబ్యునల్‌ను కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్యునల్ సభ్యులు మురళీ ల్యాంకో విదర్భకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేశారు. ల్యాంకో గ్రూపునకు చెందిన కంపెనీల్లో ల్యాంకో ఇన్ఫ్రా, ల్యాంకో బబంధ్, ల్యాంకో తీస్తా హైడ్రో, ల్యాంకో అమర్‌కంఠక్, ల్యాంకో సోలార్, ల్యాంకో థర్మల్, ల్యాంకో హిల్స్ కంపెనీలు దివాలా చర్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడు కంపెనీల్లో ల్యాంక్ ఇన్ఫ్రా మూసివేతకు ఎన్సీఎల్టీ ఆదేశాలిచ్చింది. అలాగే ల్యాంకో తీస్తా హైడ్రో, ల్యాంకో బబంధ్ల దివాలా పరిష్కార ప్రక్రియకు ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. మిగిలిన నాలుగు కంపెనీలపై ఎన్సీఎల్టీలో విచారణ కొనసాగుతోంది. ఈ ఏడు కంపెనీలు కూడా ఆయా బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగవేసినవే కావడం విశేషం. -
దివాలా తీసిన ప్రియాంక చోప్రా కాబోయే మామగారు
నిక్ జోనస్ తండ్రి, ప్రియాంక చోప్రా కాబోయే మామగారు.. పౌల్ జోనస్ దివాలా తీశారంటా. పాపం అన్ని అప్పులున్నాయా అంటూ జాలి పడకండి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయన కోటిశ్వరుడే. మరి దివాలా తీయడం ఏంటంటే.. పౌల్ జోనస్‌కు ‘న్యూజెర్సి’ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. అయితే ఆ కంపెనీ మీద ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ (మన కరెన్సీలో దాదాపు 7 కోట్ల రూపాయలు ) అప్పుతో పాటు కేసు ఉందంట. ప్రస్తుతం కోర్టు తీర్పు అనంతరం మరికొంత సొమ్ము జరిమానాగా చెల్లించాల్సి వస్తున్నట్లు సమాచారం. అందువల్ల పౌల్ జోనస్ ‘న్యూ జెర్సీ’ కంపెనీకి సంభందించిన ఆస్తులను అమ్మడమే కాక దివాలా దస్తావేజు దాఖలు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే పౌల్ జోనస్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే ఆయన కుమారులు మాత్రం సంగీత ప్రపంచంలో దూసుకుపోతున్నారు. నిక్ జోనస్ తన సోదరులు జో, కెవిన్‌లతో కలిసి ‘జోనస్ బ్రదర్స్’ అనే మ్యూజిక్ బ్యాండ్‌ని ప్రారంభించారు. కానీ 2013లో విడిపోయి ఎవరికి వారు సొంత విభాగాలను ప్రారంభించి సంపాదించడం మొదలుపెట్టారు. ‘జోనస్ బ్రదర్స్’ నుంచి విడిపోయిన అనంతరం నిక్ సోలో ఆర్టిస్ట్‌గా బాగానే సంపాదించారు. అంతేకాక కేవలం మ్యూజిక్కే పరిమితమవ్వకుండా నటన వైపు కూడా దృష్టి సారించారు. ప్రస్తుతం నిక్ ‘జ్యుమాంజీ’ రీమేక్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిక్ ఆస్తి 25 మిలియన్ డాలర్లు మన కరెన్సీ ప్రకారం చెప్పాలంటే 1,76,93,75, 000 రూపాయలు. నిక్ తండ్రి పౌల్ జోనస్ ఆస్తి సుమారు 28 మిలియన్ డాలర్లు అంటే 1,98,14,20,000 రూపాయలు. -
‘ఇండ్ భారత్’ దివాలా ప్రక్రియకు ఓకే
సాక్షి, హైదరాబాద్: ఇండ్ భారత్ ఇన్ఫ్రా పవర్ లిమిటెడ్ అనుబంధ కంపెనీ అయిన ఇండ్ భారత్ ఎనర్జీ (ఉత్కళ్) లిమిటెడ్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు (సీఐఆర్‌పీ) హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతినిచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకున్న రూ.167 కోట్ల రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు ఎన్సీఎల్టీ ఈ మేర నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) ముంబాయికి చెందిన ఉదయ్‌రాజ్ పట్వర్థన్ను నియమించింది. ఇండ్ భారత్ ఎనర్జీ (ఉత్కల్) ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం (మారటోరియం) విధించింది. ఈ ఆస్తులపై న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేయడం, కోర్టు తీర్పులను అమలు చేయడం తదితరాలను చేయరాదంది. అంతేకాక ఆస్తులను విక్రయించడానికి గానీ, తాకట్టు పెట్టడానికి వీల్లేదని ఇండ్ భారత్ ఎనర్జీ (ఉత్కల్) లిమిటెడ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. దివాలా ప్రక్రియకు సంబంధించి పత్రికా ప్రకటన జారీ చేయాలని ఐఆర్‌పీని ఆదేశించింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ జుడీషియల్ సభ్యులు బిక్కి రవీంద్రబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఇండ్ భారత్ ఎనర్జీ (ఉత్కల్) లిమిటెడ్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు సింగపూర్‌కు చెందిన ఎంఏఐఎఫ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. తమకు ఇండ్ భారత్ ఎనర్జీ (ఉత్కల్) లిమిటెడ్ రూ.134 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి ఉందని, అయితే ఇది తిరిగి చెల్లించడం లేదని, అందువల్ల ఆ కంపెనీ సీఐఆర్‌పీకి అనుమతించాలంటూ ఎంఏఐఎఫ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ సభ్యులు రవీంద్రబాబు, ఇండ్ భారత్ ఎనర్జీలో 99 శాతం వాటాతో మొత్తం కంపెనీపై ఎంఏఐఎఫ్ అజమాయిషీ సంపాదించిందని, అందువల్ల ఆ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బకాయిల విషయంలో ఐఆర్పీ ముందు దరఖాస్తు చేసుకోవాలని ఎంఏఐఎఫ్‌కు స్పష్టం చేశారు. -
ఏఆర్సీ ఏర్పాటు ఒక్కటే పరిష్కారం
ముంబై: విద్యుత్ రంగానికి సంబంధించి రూ.1.74 లక్షల కోట్ల మొండి బకాయిల (ఎన్పీఏలు) విషయంలో బ్యాంకులు ఆర్బీఐ నిబంధనల మేరకు దివాలా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఎదురుకావడంతో... పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ఓ అస్సెట్ రీకన్స్ట్రక్షన్/ మేనేజ్మెంట్ కంపెనీని (ఏఆర్సీ/ఏఎంసీ) ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ (బీవోఏఎంఎల్) పేర్కొంది. మార్చి 1 నాటికి ఎన్పీఏలుగా మారిన రుణ ఖాతాలకు ఆర్బీఐ ఇచ్చిన 180 రోజుల పరిష్కార గడువు ఆగస్ట్ 27తో ముగిసిన విషయం తెలిసిందే. తమకు మరింత గడువు కావాలంటూ విద్యుత్ కంపెనీలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, మధ్యంతర ఆదేశాలు జారీ చేయటానికి కోర్టు నిరాకరించింది. దీంతో బ్యాంకులు ఆయా కంపెనీల రుణ ఖాతాలను దివాలా చర్యల కోసం ఎన్సీఎల్టీకి నివేదించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే, అదనపు గడువు కోసం ఆర్బీఐతో కేంద్రం సంప్రతించాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ రంగానికి సంబంధించిన ఎన్పీఏలను నేరుగా నిర్వహించేందుకు లేదా ఎన్సీఎల్టీ వేలంలో బిడ్డింగ్ వేసేందుకు ఏఆర్సీ/ఏఎంసీ ఏర్పాటు ఒక్కటే మార్గమని బీవోఏఎంఎల్ విశ్లేషకులు సూచించారు. ఏఆర్సీ ఏర్పాటు ఆలోచనను ఇప్పటికే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య, సునీల్ మెహతా కమిటీలు సైతం సూచించిన విషయాన్ని బీవోఏఎంఎల్ పేర్కొంది. 9 బిలియన్ డాలర్లు అవసరం ప్రతిపాదిత విద్యుత్ రంగ ఏఆర్సీ/ఏఎంసీకి 9 బిలియన్ డాలర్ల సీడ్ క్యాపిటల్ అవసరమని, బ్యాంకులకు కేంద్రం ఇవ్వదలిచిన 20 బిలియన్ డాలర్ల రీక్యాపిటలైజేషన్‌లో ఇది భాగంగా ఉండాలని సూచించింది. 2019–20లో 14 శాతం రుణ వృద్ధికి గాను ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం 26.5 బిలియన్ డాలర్లు అందించాల్సి ఉంటుందని, ఇందులో విద్యుత్ రంగ ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాలపై 75 శాతం హేర్‌కట్ (రుణాలపై నష్టాలు) కోసం 19.4 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని బీవోఏఎంల్ తెలిపింది. విద్యుత్ రంగ 60 ఎన్పీఏలు ఎన్సీఎల్టీకి వెళ్లినట్టయితే బ్యాంకులు అదనంగా రూ.లక్ష కోట్ల మేర కేటాయింపులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. -
రుణాలు ఎగ్గొట్టిన విద్యుత్ కంపెనీలకు చుక్కెదురు!
న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలను ఎగవేసిన విద్యుత్ కంపెనీలపై దివాలా చర్యలు చేపట్టేందుకు బ్యాంకులకు మార్గం సుగమం అయింది. మొండి బకాయిలుగా (ఎన్పీఏ) మారి 180 రోజుల్లోపు పరిష్కారం లభించని ఖాతాలను బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించాలని ఆర్బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 12న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. మార్చి 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రాగా, దీనికి వ్యతిరేకంగా విద్యుత్ కంపెనీలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. అయితే, ఈ దశలో మధ్యంతర ఆదేశాల జారీ కుదరదని కోర్టు సోమవారం స్పష్టం చేసింది. వాస్తవాలను నమోదు చేసిన తర్వాత ఈ అంశంలో ప్రత్యేకంగా కోర్టును ఆశ్రయించొచ్చని పిటిషన్లకు అవకాశం ఇచ్చింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)లోని సెక్షన్ 7 కింద రుణదాతలు చర్యలు చేపట్టకుండా ఈ ఆదేశాలు నిరోధించవని కూడా కోర్టు స్పష్టం చేసింది. మార్చి 1 నాటికి మొండి బకాయిలుగా మారి పరిష్కారం లభించని ఖాతాలను ఎన్సీఎల్టీకి నివేదించాల్సిన గడువు ఆగస్ట్ 27తో ముగిసింది. అయితే, చట్టంలోని సెక్షన్ 7 కింద ఆర్బీఐతో సంప్రదింపులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు కోరింది. ఈ సెక్షన్ కింద ప్రజాప్రయోజనాల కోణంలో ఆర్బీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేయగలదు. విద్యుత్ రంగానికి సంబంధించి ఎన్పీఏలు, రుణ ఎగవేతలు మార్చి నాటికి రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్నాయని విద్యుత్ రంగానికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక తెలియజేస్తోంది. అయితే, విద్యుత్ కంపెనీల రుణ భారం వెనుక డిస్కమ్‌ల చెల్లింపులు ఆలస్యం కావడం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల లేమి, బొగ్గు సరఫరా సక్రమంగా లేకపోవడం తదితర కారణాలుగా కంపెనీలు, విద్యుత్ శాఖ పేర్కొంటుండడం గమనార్హం. ఈ కారణాల నేపథ్యంలో 180 రోజుల గడువును పొడిగించాలన్నది విద్యుత్ కంపెనీల డిమాండ్. కాగా, కోర్టు ఆదేశాల పట్ల నిరాశ చెందామని ప్రభుత్వరంగ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పీవీ రమేష్ పేర్కొన్నారు. త్వరలో ఆర్బీఐతో కేంద్రం సంప్రదింపులు అలహాబాద్ హైకోర్టు సూచన మేరకు కేంద్ర విద్యుత్ శాఖ త్వరలోనే విద్యుత్ కంపెనీల ఎన్పీఏల విషయమై ఆర్బీఐతో సంప్రదింపులు జరపనుంది. ఎన్పీఏ ఖాతాలకు 180రోజుల్లోగా పరిష్కారం కొనుగొనాలని లేని పక్షంలో ఎన్సీఎల్టీకి నివేదించాలన్న ఆర్బీఐ ఆదేశాలను సవరించాలని కోరే అవకాశం ఉందని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ప్రొవిజనింగ్‌పై ప్రభావమేమీ ఉండదు: ఎస్బీఐ దాదాపు 70 భారీ మొండిపద్దుల పరిష్కారంపై ఆర్బీఐ విధించిన డెడ్‌లైన్ ముగిసినప్పటికీ.. బ్యాంకుల ప్రొవిజనింగ్‌పై పెద్ద ప్రభావమేమీ ఉండదని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. బ్యాంకులు ఇప్పటికే ఆయా ఖాతాలకు సంబంధించి తగినంత కేటాయిం పులు చేశాయని, పరిష్కార ప్రక్రియ కొనసాగిస్తున్నాయని ఐబీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. దాదాపు రూ.1.74 లక్షల కోట్లు బాకీ పడిన 34 మొండిపద్దుల్లో .. 16 ఖాతాలను ఇప్పటికే ఎన్సీఎల్టీకి నివేదించినట్లు, మరో ఏడు పద్దుల పరిష్కార ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు రజనీష్ చెప్పారు. -
దివాలా అంచున దిగ్గజాలు..
న్యూఢిల్లీ: మొండిపద్దుల పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ విధించిన డెడ్‌లైన్ దగ్గరపడుతుండటంతో .. భారీగా రుణాలు పేరుకుపోయిన సంస్థలపై దివాలా చర్యలకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు 60 పైచిలుకు కంపెనీలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి రావొచ్చని తెలుస్తోంది. ఇందులో పంజ్‌లాయిడ్, రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజినీరింగ్, బజాజ్ హిందుస్తాన్ వంటి కంపెనీలు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ సర్క్యులర్ ప్రభావం..: రుణాల చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా మొండిపద్దుల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులను ఆదేశిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 12న రిజర్వ్ బ్యాంకు సర్క్యులర్ జారీ చేసింది. రూ. 2,000 కోట్ల పైబడిన రుణఖాతాల పరిష్కారానికి 180 రోజుల డెడ్‌లైన్ విధించింది. ఈ గడువు దాటితే ఆయా పద్దులపై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించాలని సూచించింది. ప్రస్తుతం దాని ప్రభావంతోనే పలు కంపెనీలు దివాలా చట్టం చర్యల ముంగిట్లో ఉన్నాయి. ఆర్బీఐ విధించిన 180 రోజుల వ్యవధి మార్చి 1తో మొదలై ఆగస్టుతో ముగుస్తుంది. దీంతో సెప్టెంబర్ ప్రారంభం కాగానే బ్యాంకులు సదరు మొండి ఖాతాలపై దివాలా చట్టం కింద చర్యలు మొదలుపెట్టాల్సి రానుంది. మార్చి 1 నాటికి ఒక్క రోజు పైగా రుణాలు డిఫాల్ట్ అయిన దాదాపు 70–75 ఖాతాల పరిష్కారానికి బ్యాంకులు కసరత్తు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ, వీటిలో చాలా మటుకు ఖాతాలు ఒక కొలిక్కి రాలేదని, దీంతో వచ్చే రెండు వారాల్లో ఆయా సంస్థలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి రానుందని సమాచారం. 60 ఖాతాల్లో కొన్ని.. దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి ఉన్న సంస్థల్లో .. పంజ్ లాయిడ్, రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజినీరింగ్, బజాజ్ హిందుస్తాన్, పటేల్ ఇంజినీరింగ్, బాంబే రేయాన్, జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోల్టా ఇండియా, శ్రీరామ్ ఈపీసీ, గీతాంజలి జెమ్స్ మొదలైనవి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్ని సంస్థలు గతంలో కూడా బ్యాంకింగ్పరమైన చర్యలు ఎదుర్కొన్నాయి. దాదాపు రూ. 14,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో గీతాంజలి జెమ్స్ కూడా విచారణ ఎదుర్కొంటోంది. -
ఉక్కు రంగానికి దివాలా జోష్
న్యూఢిల్లీ: ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ).. భారత ఉక్కు రంగంలో ఏకీకరణను వేగవంతం చేస్తోందని ఎర్నస్ట్ అండ్ యంగ్(ఈవై) తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా భారత ఉక్కు రంగంలోకి ప్రవేశించడానికి పలు అడ్డంకులు ఎదుర్కొంటున్న విదేశీ కంపెనీలకు మార్గం సుగమం అవుతోందని ఈ నివేదిక పేర్కొంది. ఇక్కడ జరిగిన ఇండియా మినరల్స్ అండ్ మెటల్స్ ఫోరమ్ సమావేశంలో ఈవై పార్ట్నర్, ఉక్కు రంగానికి చెందిన అంజనీ అగర్వాల్ ఈ నివేదిక వివరాలను వెల్లడించారు. భారత ఉక్కు రంగంపై ఐబీసీ ప్రభావం, సంబంధిత అంశాలపై ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు... ►దివాలా ప్రక్రియ కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు వస్తున్న కేసుల్లో అధిక భాగం ఉక్కు రంగానికి చెందినవే ఉన్నాయి. ► కొత్త దివాలా చట్టం కారణంగా దివాలా ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఫలితంగా ఉక్కు రంగంలో సమూల మార్పులు రానున్నాయి. ► దివాలా తీసిన కంపెనీల రుణ భార సమస్య ఐబీసీ కారణంగా వేగవంతంగా పరిష్కారమవుతుంది. కొద్దో, గొప్పో ఉన్న రుణం రెన్యువల్ కావడం సులభమవుతుంది. ►దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న కంపెనీలను కొనుగోలు చేయడానికి పోటీ తీవ్రంగా ఉండటంతో ఆ కంపెనీలకు మంచి విలువే దక్కనున్నది. ►భారత్‌లో భవిష్యత్ డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తుల తయారీకి అనువుగా పలు కంపెనీలు ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. దీనికి కావలసిన భారీ పెట్టుబడులను బ్యాంకింగ్ రంగం సమకూర్చగలదు. ►ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉక్కు రంగంలో ఏకీకరణ జోరుగా సాగుతోంది. ఇది భారత్‌పై ఇంకా ప్రభావం చూపలేదు. అయితే ఐబీసీ కారణంగా భారత్‌లో కూడా ఉక్కు రంగంలో ఏకీకరణ మరింత వేగవంతం కానున్నది. ఇప్పటికే టాటా స్టీల్ ఒక కంపెనీని, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ మరొక కంపెనీని కొనుగోలు చేయడం దీనికి నిదర్శనం. ►ఏడాదిలోపు దివాలా ప్రక్రియ కిందకు మరిన్ని కంపెనీలు రానున్నాయి. ► పునర్వ్యవస్థీకరణ అనంతరం ఏర్పడే కంపెనీల కారణంగా బలమైన లోహ పరిశ్రమ భారత్‌లో నెలకొంటుంది. ► ఈ రంగంలో ఇప్పటికే బలంగా ఉన్న కంపెనీలు తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి. మరో వైపు ఇతర రంగాల్లోని కంపెనీలు కొత్తగా ఈ రంగంలోకి వస్తుండటంతో ఈ రంగం విస్తృతి మరింతగా పెరగనున్నది. ►దేశంలో గవర్నెన్స్ ప్రమాణాలు ముఖ్యంగా లోహ, ఉక్కు రంగాల్లో మరింతగా మెరుగుపడనున్నాయి. ► ఉక్కు రంగానికి సంబంధించి భారత్‌లో అపార అవకాశాలు ఉండటంతో దీర్ఘకాలంలో డిమాండ్‌కు ఢోకా ఉండదని పలు కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీలు వెనకాడ్డం లేదు. ► మౌలిక రంగంపై ప్రభుత్వం దృష్టి పెడుతుండటంతో ఏడాదికి 30 కోట్ల టన్నుల ఉక్కు వినియోగించాలన్న లక్ష్యం సాకారం కానున్నది. -
రుచి సోయా రేసులో టాప్ బిడ్డర్‌గా అదానీ
న్యూఢిల్లీ: దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న వంట నూనెల కంపెనీ రుచి సోయాను దక్కించుకునే రేసులో అదానీ గ్రూప్ టాప్ బిడ్డర్‌గా నిలిచిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ.6,000 కోట్లకు బిడ్ వేసిన అదానీ విల్మర్ అత్యధిక బిడ్ వేసిన కంపెనీగా నిలిచిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రుచి సోయాను దక్కించుకోవడానికి పోటీ పడిన మరో కంపెనీ పతంజలి గ్రూప్ రూ.5,700 కోట్లకు బిడ్‌ను దాఖలు చేసింది. అయితే స్విస్ చాలెంజ్ పద్థతిలో పతంజలి గ్రూప్‌కు తన ఆఫర్‌ను మరింతగా పెంచే హక్కు ఉంటుంది. రుచి సోయా రుణ దాతల కమిటీ మంగళవారం బిడ్లను ఓపెన్ చేసింది. రుచి సోయా మొత్తం రూ.12,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. -
దివాలా చట్టంతో ఫలితాలొస్తాయ్
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి నూతన చట్టంతో ఎదురయ్యే సవాళ్లు లక్ష్యానికి అడ్డంకి కాబోవని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. ఇది కొత్త చట్టమని, ఫలితాలు రావాల్సి ఉందని చెప్పిన రజనీష్... ఇది నిరాశపరచబోదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తుది నిర్ణయం మాత్రం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) పరిధిలోనే ఉందన్నారు. భారీ రుణ ఎగవేత కేసులను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద పరిష్కరించడానికి ఎన్సీఎల్టీకి ప్రతిపాదించించేందుకు ఆర్బీఐ గతేడాది అనుమతించిన విషయం తెలిసిందే. ఐబీసీ కింద రుణదాతల కమిటీ ఆమోదించిన పరిష్కార ప్రణాళికే తుది నిర్ణయం కాదన్న రజనీష్‌కుమార్... అంతిమంగా ఇది న్యాయపరమైన ప్రక్రియగా పేర్కొన్నారు. ఆర్బీఐ రెండు జాబితాల్లో చర్యల కోసం సూచించిన కేసుల నుంచి 40 శాతం బకాయిలు వసూలు కావచ్చని చెప్పారు. వసూళ్లకు సంబంధించి కచ్చితమైన అంచనాలేవీ ఉండవన్నారు. రూ.8 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిల భారాన్ని దేశీయ బ్యాంకులు మోస్తున్న విషయం తెలిసిందే. దీంతో సమస్యాత్మక రుణాన్ని 180 రోజుల్లోగా పరిష్కరించుకోని పక్షంలో ఎన్సీఎల్టీకి ప్రతిపాదించాలని ఆర్బీఐ గత నెలలోనే బ్యాంకులను ఆదేశించింది. విద్యుత్ రంగానికి పునర్వైభవం... విద్యుత్ రంగానికి ఇచ్చిన రుణాల వసూళ్లలో ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరిస్తామని రజనీష్ కుమార్ చెప్పారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు రుణదాతలు సమష్టిగా వ్యవహరిస్తారని చెప్పారు. వచ్చే రెండేళ్ల కాలంలో విద్యుత్‌కు కొరత ఏర్పడుతుందని, దీంతో ఉన్న ప్లాంట్లకు మెరుగైన విలువ సమకూరుతుందని పేర్కొన్నారు. తద్వారా విద్యుత్ రంగానికి ఇచ్చిన రుణాలు సమస్యాత్మకం కాబోవన్న సంకేతమిచ్చారు. మార్చి త్రైమాసికంలో ఎన్పీఏలు డిసెంబర్ క్వార్టర్ కంటే తక్కువే ఉంటాయని చెప్పారు. ప్రభుత్వరంగంలో ఎక్కువ బ్యాంకులు అవసరం లేదన్న దానితో ఏకీభవిస్తున్నట్టు రజనీష్ కుమార్ చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య తగ్గితే వినియోగదారులకు నష్టం జరగదంటూనే... ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య స్థిరీకరణకు ఇది సరైన తరుణం కాదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే చాలా వరకు ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేదని గుర్తు చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కస్టమర్ల సేవల అనుభవం, పరిపాలన మెరుగుపడేందుకు ఎంతో అవకాశం ఉందని చెప్పారు. -
ఫైర్‌స్టార్ డైమాండ్ దివాలా..?
భారత్‌లో అతిపెద్ద బ్యాంకు కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ ఫ్లాగ్షిప్ కంపెనీ ఫైర్‌స్టార్ డైమాండ్ ఇంక్ దివాలా తీయబోతుంది. ఫైర్‌స్టార్ డైమాండ్ అమెరికాలో దివాలా కోసం పిటిషన్‌ను దాఖలు చేసింది. కంపెనీకి లిస్టెడ్ ఆస్తులు, అప్పులు 50 మిలియన్ డాలర్ల నుంచి 100 మిలియన్ డాలర్ల రేంజ్లో ఉన్నాయని న్యూయార్క్‌లో దక్షిణ జిల్లాలో కోర్టు ఫైలింగ్‌లో తెలిపింది. కాగ, పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న రూ.12,636 కోట్ల కుంభకోణంలో ఈ ఫైర్‌స్టార్ డైమాండ్‌కు చెందిన నీరవ్ మోదీనే ప్రధాన పాత్రదారుడిగా ఉన్నారు. తొలుత ఈ కుంభకోణం రూ.11,400 కోట్లని లెక్కించగా.. అనంతరం ఈ అక్రమ లావాదేవీలు మరింత పెరిగినట్టు పీఎన్బీ వెల్లడించింది. ఈ కుంభకోణంలో నీరవ్ మోదీతో పాటు ఆయన అంకుల్ మెహుల్ చౌక్సి, కుటుంబసభ్యులు, బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. ఫైర్‌స్టార్ డైమాండ్‌కు మోదీ వ్యవస్థాపకుడు కాగ, మెహుల్ చౌక్సి గీతాంజలి జెమ్స్ లిమిటెడ్‌కు అధిపతి. ఇద్దరు ఉద్యోగులను ఉపయోగించుకుని వీరు పీఎన్బీలో ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. భారత్‌లో వీరి కంపెనీలపై భారీ ఎత్తున్న దాడులు జరిగాయి. గీతాంజలి జెమ్స్ స్టోర్లు కొన్నింటిన్నీ సీజ్ కూడా చేశారు. వీరిపై దర్యాప్తును ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మమ్మురం చేశాయి. నీరవ్, చౌక్సిలను తిరిగి ఇండియా రప్పించడానికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుంభకోణానికి పాల్పడిన అనంతరం నీరవ్, చౌక్సిలు విదేశాలకు చెక్కేశారు. -
‘ల్యాంకో’ దివాలా..!
♦ ఈ నెల్లోనే ‘కంపెనీ లా ట్రైబ్యునల్’ చర్యలు ♦ సబ్‌కాంట్రాక్టర్ల బ్యాంక్ గ్యారెంటీలను వాడేసుకున్న తీరు ♦ దీనిపై కోర్టుకెళ్లనున్న సబ్‌కాంట్రాక్టర్లు సాక్షి, అమరావతి: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ల్యాంకో ఇన్ఫ్రాపై దివాలా చర్యలు ప్రారంభంకానున్నాయి. భారీగా అప్పులున్న 12 కంపెనీలపై దివాలా చర్యలు తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ల్యాంకో ఇన్ఫ్రాకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఐడీబీఐ బ్యాంక్ నేతృత్వంలో కన్సార్టియంగా ఏర్పడ్డాయి. ల్యాంకో ఇన్ఫ్రా మొత్తం అప్పుల విలువ రూ.44,365 కోట్లు ఉండగా, అందులో ఐడీబీఐ బ్యాంక్‌కే రూ.11,367 కోట్లు బాకీపడింది. దేశీయ దివాలా చట్టం ప్రకారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో ల్యాంక్ఇన్ఫ్రాపై దివాలా పిటీషన్‌ను దాఖలు చేయాలని ఈ కన్సార్షియం నిర్ణయించింది. ఈ కేసును ఈ నెలాఖరులోగా ట్రైబ్యునల్ విచారణకు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే 6–9 నెలల్లో కంపెనీ ఆస్తులను విక్రయించడం ద్వారా బకాయిలు రాబట్టుకునే అవకాశం ఉంది. 2015లో కంపెనీ విలువ రూ. 25,000 కోట్లుగా ఉన్నట్లు ల్యాంకో ఇన్ఫ్రా స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియచేసింది. కోర్టుకు వెళ్లనున్న సబ్‌కాంట్రాక్టర్లు ల్యాంక్ ఇన్ఫ్రా నుంచి సబ్ కాంట్రాక్టులు తీసుకున్న సంస్థలు కంపెనీపై కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నాయి. ఒకవంక పనులు చేపట్టడానికి అడ్వాన్స్‌లు మంజూరు చేయకుండా... మరోవంక పనులు ఆలస్యమయ్యాయనే సాకుతో తామిచ్చిన బ్యాంక్ గ్యారెంటీలను నగదుగా మార్చేసుకుని తమను మోసం చేసిందంటూ ల్యాంకోపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాంక్ ఇన్ఫ్రా అడ్వాన్స్‌లు ఇవ్వకపోవడంతో ఆర్థిక సమస్యలతో పనులు ఆలస్యమయ్యాయని, కానీ దీనికి భిన్నంగా కంపెనీ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం పని పూర్తి కాలేదంటూ బ్యాంక్ గ్యారెంటీలను వాడేసుకుందని వీరు చెబుతున్నారు. ఈ విషయంపై కెల్వియన్ ఇండియా, పెంటైర్ వాల్వ్స్ అండ్ కంట్రోల్స్, వాస్ ఆటోమేషన్, ఎమర్సెన్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇండియా వంటి సబ్ కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. మరోవంక హిందుస్థాన్ పవర్ ప్రాజెక్ట్స్ సంస్థ 2,520 మెగావాట్ల అనప్పుర్ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయనందుకు ల్యాంకో ఇన్ఫ్రా ఇచ్చిన రూ.500 కోట్లను నగదుగా మార్చేసుకుంది. దీనిపై ల్యాంకో ఇన్ఫ్రా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. -
రూ.30.60 లక్షలకు ఐపీ
ఖమ్మం లీగల్, న్యూస్‌లైన్: ఖమ్మం నగరంలోని బుర్హాన్‌పురానికి చెందిన ప్రయివేటు వాహన డ్రైవర్ మద్దినేని వెంకటేశ్వర్లు అలియాస్ బొబ్బా 30.60లక్షల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం దివాళ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం ఆరుగురు రుణదాతలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మద్దినేని వెంకటేశ్వర్లు తన కుటుంబ అవసరాలకు ఆదాయం చాలకపోవడంతో భార్య ద్వారా ఇంటి వద్దనే చీరల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆమె కొందరి (పతివాదులు) వద్ద చిట్టీలలో సభ్యురాలిగా చేరింది. ఆ చిట్టీలను ఆమె పాడి నగదు తీసుకుంది. ఈ చిట్టీల వాయిదాలు చెల్లించేందుకు మరోచోట (చిట్టీలు) పాడుకుంది. ఇంతలో, చీరల వ్యాపారంలో ఒడుదుడుకులతో నష్టపోయింది. అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడడం, రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో మద్దినేని వెంకటేశ్వర్లు అలియాస్ బొబ్బా.. 30.60లక్షల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం దివాళ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం ఆరుగురు రుణదాతలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాదిగా కిలారు లక్ష్మీనరసింహారావు వ్యవహరిస్తున్నారు.