దివాలా అంచున దిగ్గజాలు.. | Banking industry to see write-backs: Official | Sakshi
Sakshi News home page

దివాలా అంచున దిగ్గజాలు..

Published Sat, Aug 25 2018 12:52 AM | Last Updated on Sat, Aug 25 2018 9:29 AM

Banking industry to see write-backs: Official - Sakshi

న్యూఢిల్లీ: మొండిపద్దుల పరిష్కారానికి రిజర్వ్‌ బ్యాంక్‌ విధించిన డెడ్‌లైన్‌ దగ్గరపడుతుండటంతో .. భారీగా రుణాలు పేరుకుపోయిన సంస్థలపై దివాలా చర్యలకు రంగం సిద్ధమవుతోంది.  దాదాపు 60 పైచిలుకు కంపెనీలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి రావొచ్చని తెలుస్తోంది. ఇందులో పంజ్‌లాయిడ్, రిలయన్స్‌ డిఫెన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, బజాజ్‌ హిందుస్తాన్‌ వంటి కంపెనీలు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.  

ఆర్‌బీఐ సర్క్యులర్‌ ప్రభావం..: రుణాల చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా మొండిపద్దుల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులను ఆదేశిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 12న రిజర్వ్‌ బ్యాంకు సర్క్యులర్‌ జారీ చేసింది. రూ. 2,000 కోట్ల పైబడిన రుణఖాతాల పరిష్కారానికి 180 రోజుల డెడ్‌లైన్‌ విధించింది. ఈ గడువు దాటితే ఆయా పద్దులపై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించాలని సూచించింది. ప్రస్తుతం దాని ప్రభావంతోనే పలు కంపెనీలు దివాలా చట్టం చర్యల ముంగిట్లో ఉన్నాయి.

ఆర్‌బీఐ విధించిన 180 రోజుల వ్యవధి మార్చి 1తో మొదలై ఆగస్టుతో ముగుస్తుంది. దీంతో సెప్టెంబర్‌ ప్రారంభం కాగానే బ్యాంకులు సదరు మొండి ఖాతాలపై దివాలా చట్టం కింద చర్యలు మొదలుపెట్టాల్సి రానుంది. మార్చి 1 నాటికి ఒక్క రోజు పైగా రుణాలు డిఫాల్ట్‌ అయిన దాదాపు 70–75 ఖాతాల పరిష్కారానికి బ్యాంకులు కసరత్తు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ, వీటిలో చాలా మటుకు ఖాతాలు ఒక కొలిక్కి రాలేదని, దీంతో వచ్చే రెండు వారాల్లో ఆయా సంస్థలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి రానుందని సమాచారం.  

60 ఖాతాల్లో కొన్ని..
దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి ఉన్న సంస్థల్లో .. పంజ్‌ లాయిడ్, రిలయన్స్‌ డిఫెన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, బజాజ్‌ హిందుస్తాన్, పటేల్‌ ఇంజినీరింగ్, బాంబే రేయాన్, జీటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోల్టా ఇండియా, శ్రీరామ్‌ ఈపీసీ, గీతాంజలి జెమ్స్‌ మొదలైనవి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్ని సంస్థలు గతంలో కూడా బ్యాంకింగ్‌పరమైన చర్యలు ఎదుర్కొన్నాయి. దాదాపు రూ. 14,000 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ స్కామ్‌లో గీతాంజలి జెమ్స్‌ కూడా విచారణ ఎదుర్కొంటోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement