కోదాడటౌన్, న్యూస్‌లైన్: చిన్న, సన్నకారు రైతులకు పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు అందించి వారికి చేదోడువాదోడుగా నిలుస్తున్న సహకార సంఘాలు ఇక కనుమరుగు కానున్నాయా..? దీనికోసం పైస్థాయిలో ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇదే జరిగితే సహకార సంఘాలు మూసివేయటమేనా...? అనే ప్రశ్నలకు అవును అనే సమాధానమే వినిపిస్తుంది.
జిల్లాలోని 107 సహకార సంఘాల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మున్ముందు ఈ సంఘాలు కేవలం కమీషన్‌పై రుణాలు వసూలు చేసేందుకు ఏజెన్సీలుగా మారనున్నాయని ఆ సంఘాల్లో పని చేస్తున్న ఉద్యోగులే అంటున్నారు. సహకార సంఘాల పనితీరుపై రిజర్వు బ్యాంక్, నాబార్డులు నియమించిన ప్రకాశ్‌భక్షి కమిటీ చేసిన సిఫారసులు త్వరలో అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రప్రభుత్వం పైస్థాయిలో నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అదే జరిగితే సహకార సంఘాలు ఇక రైతులకు దూరమైనట్లే.
కమిటీ ఏం చె ప్పిందంటే....
రైతులకు దీర్ఘ, స్వల్పకాలిక పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు అందించేందుకు ఏర్పాటుచేసిన సహకార సంఘాలు రకరకాల కారణాలతో ఆ రుణాలను తిరిగి సకాలంలో వసూలు చేయక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. దీంతో రిజర్వుబ్యాంక్, నాబార్డు ఈ సమస్యను పరిష్కరించేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ప్రకాశ్‌భక్షి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇటీవలే తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇప్పటివరకు మూడంచెల వ్యవస్థ ఉండేది. నాబార్డు నుంచి ఆప్కాబ్‌లకు, అక్కడి నుంచి డీసీసీబీలకు నిధులు వచ్చేవి. డీసీసీబీలు జిల్లాలోని అన్ని సంఘాలకు సమానంగా నిధులు పంపిణీ చేసేవి. సంఘాల అధ్యక్షులు తమ పరిధిలోని రైతులకు రుణాలను అందజేసేవారు.
కానీ, ఇక నుంచి జిల్లా కేంద్రబ్యాంకు నేరుగా రైతులకు రుణాలు ఇస్తుంది. ఈ రుణాలను వసూలు చేసే బాధ్యత సహకార సంఘాల సిబ్బందికి అప్పగిస్తారు. దీనికోసం వారికి కొంత కమీషన్ ఇస్తారు. దీంతో తమ సంఘ పరిధిలో ఏ రైతులకు ఏలాంటి రుణాలు ఇవ్వాలనే అధికారం సహకార సంఘాల అధ్యక్షులు కోల్పోతారు. అంతిమంగా సంఘాలు నామమాత్రంగా మారతాయి. అప్పుడు వీటిని సులువుగా మూసివేయవచ్చునని ఉన్నతస్థాయిలో భావిస్తున్నారని సంఘాల సిబ్బంది అంటున్నారు. కమిటీలో సభ్యునిగా ఉన్న జిల్లాకు చెందిన అప్కాబ్ చైర్మన్ విజయేందర్‌రెడ్డితో సహ పలువురు దీనిని వ్యతిరేకించినా ప్రభుత్వం త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం.
చిరు వ్యాపారులకు చేయూత ఎలా...
జిల్లాలోని చిరువ్యాపారులకు సొసైటీల ద్వారా రుణాలను అందిస్తారనే సంతోషం మరెన్నో రోజులు నిలిచేటట్లు లేదు. ఏకంగా సొసైటీలకే మంగళం పాడుతుండడంతో చిరు వ్యాపారస్తుల సాయంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వచ్చేనెల నుంచి 5 వేల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10వేల రూపాయల చొప్పున 12 శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలని భావించారు.
ఈ వ్యాపారులు నెలకు వేయి రూపాయల చొప్పున 12నెలలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.10వేలకు సంవత్సరానికి రూ.రెండు వేల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ సంఘాలకు చెందటంతో అవి ఆర్థికంగా బలోపేతం అవుతాయని భావించినప్పటికీ ఈ సాయం రానున్న రోజుల్లో సంఘాల మనుగడపైనే ఆధారపడి ఉంటుంది. సంఘాలను ఎత్తివేస్తే ఈ సాయం కూడా చిరువ్యాపారులకు అందకుండా పోతుంది.
ఇక సంఘాలకు నూకలు చెల్లినట్టే
ప్రకాశ్‌భక్షి కమిటీ సిఫారసులు అమల్లోకి వస్తే సొసైటీలకు నూకలు చెల్లినట్టే. రైతులకు ఎంతో ఉపయోగపడే సహకార సంఘాల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం మంచిది కాదు. ఇప్పటికే అష్టకష్టాలు పడుతున్న రైతులకు అందుతున్న కొద్దిపాటిసాయం కూడా అందకుండా పోతుంది. ఈ ఖరీఫ్‌లో మా ఆకుపాముల సొసైటీకి రూ.8 లక్షలు ఇచ్చారు. రైతులు 1500 మంది ఉన్నారు. వీరికి ఈ రూ.8 లక్షలు ఎలా ఇవ్వాలి. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు. ప్రభుత్వం సంఘాల విషయంలో పునరాలోచించాలి.
- పందిరి నాగిరెడ్డి, ఆకుపాముల సొసైటీ చైర్మన్
సహకార సంఘాలకు..మరణశాసనం
Published Thu, Aug 29 2013 12:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
Advertisement