అలా ఎలా రుణాలిచ్చేశారు? | SEBI likely to seek RBI probe into role of banks, NBFCs | Sakshi
Sakshi News home page

అలా ఎలా రుణాలిచ్చేశారు?

Published Thu, Dec 12 2019 3:37 AM | Last Updated on Thu, Dec 12 2019 3:37 AM

SEBI likely to seek RBI probe into role of banks, NBFCs - Sakshi

ముంబై: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) వివాదం... తాజాగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మెడకు కూడా చుట్టుకుంటోంది. తనఖా పెట్టిన షేర్ల గురించి పూర్తిగా మదింపు చేయకుండా అవి కార్వీకి ఎలా రుణాలిచ్చాయన్న అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. దీనికి సంబంధించి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై విచారణ జరపాలంటూ రిజర్వ్‌ బ్యాంక్‌కు సెబీ లేఖ రాసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అక్రమంగా క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నప్పుడే బ్యాంకులు అప్రమత్తం కావాల్సిందని సెబీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కార్వీ తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించాలంటూ డిసెంబర్‌ 2న సెబీ ఆదేశించటంతో నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డీఎల్‌) దాదాపు 90 శాతం మంది క్లయింట్లకు షేర్లను బదలాయించడం తెలిసిందే. అయితే, తమకు పూచీకత్తుగా ఉంచిన షేర్లను క్లయింట్లకెలా బదలాయిస్తారంటూ బ్యాంకులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ‘ఆ షేర్లపై కార్వీకే అధికారాల్లేనప్పుడు.. వాటిని తనఖా పెట్టుకుని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలెలా ఇచ్చాయి? వాటిని క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించొద్దంటూ ఎలా చెబుతాయి?‘ అని సెబీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.  

షేర్లన్నింటికీ రిస్కు..
భారీ ఆస్తులను తనఖా పెట్టి స్వల్ప మొత్తంలో రుణాలు తీసుకుంటున్నప్పుడే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు అనుమానం రావాల్సిందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. దాదాపు రూ.5,000 కోట్ల విలువ చేసే ప్రమోటర్‌ అసెట్స్‌కు ప్రతిగా కార్వీకి బ్యాంకులు రూ.1,200 కోట్లు రుణమిచ్చాయి. అలాగే రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి కార్వీ మరో రూ.600 కోట్లు రుణం తీసుకుంది. కార్వీ తీసుకున్న రుణాల్లో ఏ కొంచెం ఎగ్గొట్టినా.. ఇంత భారీ స్థాయిలో తనఖా పెట్టిన షేర్లన్నింటినీ బ్యాంకులు అమ్మేసే ప్రమాదం ఉంటుంది.

పైపెచ్చు కార్వీ సొంత బ్యాలెన్స్‌ షీట్‌లో రూ.27 లక్షల విలువ చేసే షేర్లు మాత్రమే ఉండటం చూసైనా.. ఏదో పొరపాటు జరుగుతోందని బ్యాంకులు మేల్కొని ఉండాల్సిందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కచ్చితంగా తప్పు చేశాయని ఇలాంటి ఉదంతాలు రుజువు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కోటక్‌ మహీంద్రా బ్యాంకులతో పాటు బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి సంస్థలు షేర్లను తనఖా పెట్టుకుని కార్వీకి దాదాపు రూ.1,800 కోట్ల మేర రుణాలిచ్చాయి.

ఈవోడబ్ల్యూకీ సెబీ ఫిర్యాదు..?
కార్వీ కేసుకు సంబంధించి ముంబై పోలీస్‌లో భాగమైన ఆర్థిక నేరాల విభాగానికి (ఈవోడబ్ల్యూ) కూడా సెబీ ఫిర్యాదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ‘కార్వీ కేసు కేవలం సెక్యూరిటీస్‌ చట్టానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇది సివిల్‌ కేసు కూడా కనక సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు (శాట్‌) ఆదేశాలిచ్చే అధికారాల్లేవు. కాబట్టి క్లయింట్ల షేర్లను దొంగిలించిందంటూ కార్వీపై ఈవోడబ్ల్యూకి సెబీ ఫిర్యాదు చేయొచ్చు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్న ఇతర బ్రోకరేజీ సంస్థలపైనా సెబీ దృష్టి సారించింది. సెక్యూరిటీలను తనఖా పెట్టి రూ.50 కోట్ల పైగా రుణాలు తీసుకున్న సంస్థలు నాలుగే ఉన్నాయని, మిగతా సంస్థలన్నీ సొంత షేర్లనే పూచీకత్తుగా పెట్టాయని తేలినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement